JEE Advanced 2022: ఇంటర్‌తోపాటు అటు అడ్వాన్స్‌డ్‌కూ... నిపుణుల సలహాలు, సూచనలు....
జేఈఈ–అడ్వాన్స్‌డ్.. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) క్యాంపస్‌లలో.. బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఇందులో ర్యాంకు సాధించి..ఐఐటీల్లో అడుగుపెడితే.. ఉజ్వల భవిష్యత్తు ఖాయం అనే భరోసా! ఇందుకోసం పదో తరగతి, ఇంటర్ నుంచే అహర్నిశలూ కృషిచేస్తుంటారు. అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపి ఐఐటీ కల నిజం చేసుకోవాలని ప్రతి ఏటా లక్షల మంది ప్రిపరేషన్ సాగిస్తుంటారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి జూలైలో అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022 వెబ్‌సైట్ సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో..త్వరలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు.. ఇటు ఇంటర్‌తోపాటు అటు అడ్వాన్స్‌డ్‌కూ సన్నద్ధత పొందడంపై నిపుణుల సలహాలు, సూచనలు....
- జూలైలో జేఈఈ–అడ్వాన్స్‌డ్ 2022 నిర్వహించే అవకాశం
- 2020, 2021లో హాజరు కాని అభ్యర్థులకు పరీక్ష రాసే వెసులుబాటు
- వచ్చే ఏడాది నుంచి అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో మార్పులు
- అందుబాటులోకి జేఈఈ–అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్
- ఐఐటీ–ముంబై ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ
జేఈఈ–అడ్వాన్స్‌డ్ పరీక్షను జూలైలో నిర్వహించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి జేఈఈ–మెయిన్‌లో అర్హత ఆధారంగానే అడ్వాన్స్‌డ్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాని ఇప్పటివరకు జేఈఈ–మెయిన్ 2022కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు జూలైలో అడ్వాన్స్‌డ్ పరీక్ష జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ 2022 నిర్వహణను ఐఐటీ–ముంబై చేపట్టనుంది. వెబ్‌సైట్ సైతం అందుబాటులోకి వచ్చింది.అంతేకాకుండా జేఈఈ అడ్వాన్స్‌డ్ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ఇటీవల సమావేశమైంది. కోవిడ్ పరిస్థితులు, ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని.. అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు పలు మినహాయింపులు ప్రకటించింది.
చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్ సొంతం
అడ్వాన్స్‌డ్.. మినహాయింపులు
- జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022కు కూడా గతేడాది మాదిరిగానే పలు మినహాయింపులు ఇచ్చారు.
- 2020, 2021లో +2 తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి.. ఆ రెండేళ్లు అడ్వాన్స్‌డ్‌కు హాజరుకాని విద్యార్థులు.. ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం కల్పించారు.
- 2021లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్ చేసుకుని పరీక్ష రాయని విద్యార్థులు.. ఈ ఏడాది నేరుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్ 2022కు హాజరు కావచ్చు. వీరు తప్పనిసరిగా జేఈఈ –అడ్వాన్స్‌డ్–2022కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జేఈఈ–మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసే క్రమంలో.. ఈ అభ్యర్థులతో ప్రత్యేక జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
- 2020లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు..2020 లేదా 2021.. ఈ రెండేళ్లలో ఏదో ఒక సంవత్సరంలో మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరై ఉండాలి. ఈ రెండేళ్లలోనూ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన అభ్యర్థులు జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022కు నేరుగా హాజరయ్యే అవకాశం ఉండదు. వీరు జేఈఈ–మెయిన్ 2022లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
- ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉండాలనే నిబంధన నుంచి ఈ ఏడాది కూడా మినహాయింపునిచ్చారు. ఆన్‌లైన్ క్లాస్‌లు, గతేడాది కొన్ని రాష్ట్రాల్లో పదకొండో తరగతి పరీక్షలను నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో.. ఈ మినహాయింపును ఈ ఏడాది కూడా కొనసాగించారని సమాచారం.
ఆ నిబంధనలు యధాతథం
అర్హత నిబంధనలు, హాజరు విషయంలో మినహాయింపులు ఇచ్చినప్పటికీ.. ఇతర నిబంధనలు యధావిధిగా కొనసాగనున్నాయి. అభ్యర్థులు జేఈఈ–మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి.. తప్పనిసరిగా 2.5 లక్షల మంది జాబితాలో నిలవాల్సిందే. అదే విధంగా సీట్ల కేటాయింపు, తుది ఎంపికలో టాప్–20 పర్సంటైల్ నిబంధన కూడా యధాతథంగా కొనసాగనుందని సమాచారం.
ప్రిపరేషన్ సాగించండిలా
- జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022 పరీక్ష తేదీకి సంబంధించి ఒక అంచనా వచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- బోర్డ్, అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను సమన్వయం చేసుకుంటూ: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుత సమయంలో బోర్డ్ వార్షిక పరీక్షలు, అడ్వాన్స్‌డ్ పరీక్ష సిలబస్ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోర్డ్ పరీక్షలు మే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
- జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022 జూలైలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. అంటే.. అభ్యర్థులు ఇప్పటి నుంచి మే వరకు బోర్డ్ పరీక్షలు, అడ్వాన్స్‌డ్ రెండింటీ సమాంతర ప్రిపరేషన్ కొనసాగించొచ్చు.
- బోర్డ్ పరీక్షలు ముగిశాక దాదాపు 40 రోజుల నుంచి 50 రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌కే పూర్తిగా సమయం కేటాయించుకోవాలి. బోర్డ్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి.
చదవండి: జేఈఈ మెయిన్..ముందస్తు ప్రణాళికలతో సక్సెస్ సునాయసమే
సిలబస్‌ను సరిచూసుకుంటూ
ప్రస్తుత సమయంలో విద్యార్థులు బోర్డ్, అడ్వాన్స్‌డ్ సిలబస్‌లను సరిచూసుకుంటూ.. ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో సిలబస్‌ను అందుబాటులో ఉంచారు. దాన్ని పరిశీలించి.. బోర్డ్ సిలబస్‌లో ఉన్న అంశాలతో సమన్వయం చేసుకుంటూ చదవాలి.
ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే ఒక ప్రాబ్లమ్ లేదా ప్రశ్నను అంచెల వారీగా సాధించడంపై దృష్టి పెట్టాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది పరీక్షలో మూడు సబ్జెక్ట్‌ల నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతోపాటు, ఇంటిగ్రల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. కాబట్టి కేవలం బిట్స్ సాధనకు పరిమితం కాకుండా.. ప్రాబ్లమ్స్‌ను స్టెప్ వైజ్‌గా పరిష్కరించే విధంగా కృషి చేయాలంటున్నారు.
బోర్డ్ పరీక్షల తర్వాత రివిజన్‌కే
అభ్యర్థులు ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షల తర్వాత అధిక శాతం పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సమయంలో కొత్త అంశాల సాధనకు బదులు.. అప్పటికే పూర్తి చేసిన టాపిక్స్ రివిజన్‌కు, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌ల హాజరుకు కేటాయించాలని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఇప్పటి నుంచే కృషి చేస్తే.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో మంచి మార్కుల సాధనకు ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు.
అడ్వాన్స్‌డ్–2023 నుంచి సిలబస్‌లో మార్పు
జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022 పరీక్ష, సిలబస్ విషయంలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ.. అడ్వాన్స్‌డ్–2023 నుంచి సిలబస్ మారనుంది. ఈ మేరకు మారిన సిలబస్‌కు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో సైతం పొందుపరిచారు. ఈ సిలబస్‌ను పరిశీలిస్తే.. ప్రస్తుత సిలబస్ కంటే ఎక్కువ అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందని, ఇది విద్యార్థులకు భారంగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ సిలబస్‌ను ఎన్‌సీఈఆర్‌టీ కరిక్యులానికి అనుగుణంగా రూపొందించినట్లు కనిపిస్తోందని, దీనివల్ల విద్యార్థులకు కాన్సెప్ట్‌లపై అవగాహన పెరుగుతుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. అడ్వాన్స్‌డ్–2023 కొత్త సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే... జేఈఈ–మెయిన్,అడ్వాన్స్‌డ్, బోర్డ్ పరీక్షలు మూడింటికి ఒకే సమయంలో సన్నద్ధత పొందే వీలు లభిస్తుందని పేర్కొంటున్నారు.
జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022 ముఖ్య సమాచారం
- జూలైలో అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించే అవకాశం.
- రెండు పేపర్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష.
- జేఈఈ–మెయిన్ నుంచి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత.
- 2020, 2021లో అడ్వాన్స్‌డ్ రాయని వారు ఈ ఏడాది నేరుగా హాజరయ్యే అవకాశం.
- అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత ఆధారంగా 23 ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశం.
- వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in
చదవండి: జేఈఈ మెయిన్ పేపర్-2 విజయానికి వ్యూహం...
సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్ ఇలా
మ్యాథమెటిక్స్
- కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌పై పట్టు సాధించాలి. వీటితోపాటు 3–డి జామెట్రీ; కోఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్;క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్; బైనామియల్ థీరమ్; లోకస్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి.
- అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాన్సెప్ట్స్‌పై అవగాహన పెంచుకోవడానికి, దీంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా తులనాత్మక అధ్యయనం చేయాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే ప్రాక్టీస్ సమయంలోనే అప్లికేషన్ అప్రోచ్‌తో సాధన చేస్తే.. పరీక్షలో ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
–ఆర్.కేదారేశ్వర్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నిపుణులు
ఫిజిక్స్
- ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
- ఫిజిక్స్‌లో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా ఇంటర్ రిలేటెడ్‌గా ఉండే టాపిక్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దు. బోర్డ్ పరీక్షల తర్వాత కొత్త అంశాలు చదువుదాం అనే ధోరణి కూడా సరికాదు. ఇప్పటి నుంచే సిలబస్, గత ప్రశ్న పత్రాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించడం వల్ల మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.బోర్డ్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి.
–రవీంద్ర, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు
కెమిస్ట్రీ
- కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డీ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
- ఈ సబ్జెక్ట్ విషయంలో అభ్యర్థులు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
–డి.కె.ఝా, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు