Skip to main content

ఐఐటీ- గువహటిలో మౌలిక వసతులు, భోధన విధానం...

ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలనేది ఎంతోమంది విద్యార్థుల కల.
పిల్లలను పాఠశాల స్థాయి నుంచే అందుకు సన్నద్ధం చేస్తుంటారు తల్లిదండ్రులు. ఎంతో కష్టపడి శిక్షణ తీసుకుని.. సీటు సంపాదించి.. ఉన్నత జీవితాన్ని ఆశిస్తూ చేరే ఐఐటీల్లో క్యాంపస్, హాస్టల్, బోధన ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు ఐఐటీ- గువహటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న పేరూరు రాంసంతోష్‌రెడ్డి.

మాది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. నాన్న రఘునాథ్‌రెడ్డి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో డైటీషియన్. అమ్మ సుజాత గృహిణి. అన్న పురంధర్‌రెడ్డి జనరల్ సర్జన్. నాకు 2014 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 2164 ర్యాంకు వచ్చింది. ఐఐటీ- గువహటిలో మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీటు లభించే అవకాశం ఉంటే.. మెకానికల్‌లో చేరాను.

తెలుగు విద్యార్థులే ఎక్కువ..
ఐఐటీ-గువహటి 1994లో ఏర్పాటైంది. ఇక్కడ ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటారు. 30 శాతం నుంచి 40 శాతం వరకు వారే కనిపిస్తారు. కళాశాల ఎన్నికల్లోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. నేను మొదట్లో కాసింత భయంగానే అడుగుపెట్టినా.. తెలుగు విద్యార్థులు ఎక్కువగా కనిపించడంతో ధైర్యం వచ్చింది. ఎంతోమంది స్నేహితులయ్యారు. సీనియర్లు, జూనియర్లు, పూర్వ విద్యార్థులు.. ఇలా పెద్ద నెట్‌వర్క్ ఏర్పడింది. ఐఐటీల్లో.. చదువు కంటే నెట్‌వర్క్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సీనియర్ ప్రొఫెసర్ల క్లాసులు ఎన్‌పీటీఈఎల్‌లో వినే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది. కాబట్టి బోధన విషయంలో అన్ని ఐఐటీలు ఒకటే అని చెప్పొచ్చు. నెట్‌వర్క్ ఏర్పడటంలో, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో, స్టార్టప్ ఫండింగ్ మొదలైనవాటిల్లోనే వ్యత్యాసం కనిపిస్తుంది.

అందమైన ప్రాంగణం...
ఐఐటీ-గువహటి నగరానికి దూరంగా ఉంటుంది. కాలుష్య రహితంగా పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. మా క్యాంపస్ దేశంలోనే సుందరమైనదని చెప్పొచ్చు. ఇక్కడి ప్రదేశాలు, సరస్సులు, చెరువులు, కొండలు, బ్రహ్మపుత్ర నది, ప్రకృతి చూపరులను కట్టిపడేస్తాయి. స్థానికులు కూడా చాలా మర్యాదగా, సోదర భావంతో మెలుగుతారు. విద్యార్థులు తప్పనిసరిగా షిల్లాంగ్, కామక్ష్య ఆలయాలను సందర్శిస్తారు.

మౌలిక వసతులకు కొదవ లేదు...
నేను ఉండేది కమెంగ్ హాస్టల్‌లో. క్యాంపస్‌లో మౌలిక వసతులకు కొదవ లేదు. లైబ్రరీతో పాటు, క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ మైదానాలు ఉంటాయి. ప్రతి విద్యార్థికి ప్రత్యేక గదితో హాస్టల్ నిర్వహణ చక్కగా ఉంటుంది. ఫలానా ఆహారం మాత్రమే అని కాక.. అన్ని రకాలు దొరుకుతాయి. విద్యార్థులు తమకు నచ్చినదాన్ని ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. ఇక హాస్టల్ జిమ్, కామన్ జిమ్స్, రకరకాల క్లబ్స్ (కల్చరల్, మ్యూజిక్, డ్రామా, ఆర్ట్స్, రోబోటిక్స్, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్, నేచర్ క్లబ్ తదితర) ఉంటాయి. నిత్యం ఏవో కార్యకలాపాలు పరిపాటి. విద్యార్థులు ఆసక్తుల మేరకు నచ్చినవాటిలోపాల్గొంటుంటారు. నేను ‘స్టూడెంట్స్ అలుమ్ని ఇంటరాక్షన్ లింకేజ్’లో చురుగ్గా ఉన్నా. దీనిద్వారా గతంలో చదువుకున్న సీనియర్ విద్యార్థులను ఒక తాటిపైకి తీసుకువచ్చి కళాశాలతో అనుబంధం ఏర్పడేలా చేస్తుంటాం. వీరిలో చాలామంది ఇన్‌స్టిట్యూట్‌కు నిధులిస్తుంటారు. ఇక్కడి విద్యార్థులు ఎవరైనా స్టార్టప్స్ నెలకొల్పితే సలహాలు, సూచనలు, నిధులివ్వడం, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేయడం మొదలైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. మా కళాశాల పూర్వ విద్యార్థుల్లో ఫ్లిప్‌కార్ట్‌కు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన అంకిత్ నగోరి లాంటి వారున్నారు.

డైనమిక్ టీచింగ్ మెథడాలజీ :
తరగతుల వేళలు ఒకేలా కాక.. సెమిస్టర్‌వారీ మారుతుంటాయి. కొన్ని సార్లు ఉదయం తరగతులు.. మధ్యాహ్నం ల్యాబ్‌లు ఉంటాయి. ఒక్కోసారి ఇందుకు భిన్నంగా కూడా జరుగుతుంది. తరగతులు సాధారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు. కోర్సు స్ట్రక్చర్‌ను బట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వారానికి ఒకటి, రెండు, మూడు ల్యాబ్స్ జరుగుతాయి. తర్వాత విద్యార్థులు క్లబ్ సంబంధిత పనుల్లో, చదువులో, పరిశోధనాంశాల్లో నిమగ్నమవుతారు. పరీక్షల సమయంలో ఇతరత్రా కార్యకలాపాలు తగ్గించుకుని.. చదువు మీదే దృష్టిపెడతారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా సమయపాలన అలవర్చుకుంటారు. ఇక్కడ బోధన.. పరిశ్రమ, పరిశోధనా దృక్పథంతో సాగుతుంది.

యువ అధ్యాపక బృందం..
ఐఐటీ-గువాహటిలో యువ ప్రొఫెసర్లు ఎక్కువగా కనిపిస్తారు. విద్యార్థి, ఫ్యాకల్టీ రేషియో కూడా బ్రాంచ్‌ను బట్టి మారుతుంది. మెకానికల్ బ్రాంచిలో 1:15 నిష్పత్తిలో బోధన సిబ్బంది ఉన్నారు. వీరి సగటు వయసు 41 ఏళ్లు. ఇది ఇతర ఐఐటీల వారితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇది మాకొక సానుకూలాంశం. మేం అధ్యాపకులతో కలివిడిగా ఉంటాం. కమ్యూనికేషన్ కూడా చక్కగా ఉంటుంది. ఇది సందేహ నివృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపకరిస్తుంది.

సీఎస్‌ఈకి డిమాండ్ ఎక్కువ...
అన్నిచోట్లలానే మా ఐఐటీలోనూ సీఎస్‌ఈ వారికి ప్లేస్‌మెంట్స్ ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. సగటు సీఎస్‌ఈ విద్యార్థి వార్షిక వేతనం రూ.15 లక్షల వరకు, మెకానికల్ వారికి రూ.10-12 లక్షలుగా ఉంటోంది. ప్లేస్‌మెంట్స్ బాధ్యతలు సెంటర్ ఫర్ కేరీర్ డెవలప్‌మెంట్ చూస్తుంది. ఏటా డిసెంబర్ మొదటి వారంలో ప్లేస్‌మెంట్స్ ప్రారంభమవుతాయి. అప్పటికే దాదాపు 50 శాతం విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తారు. ప్లేస్‌మెంట్స్ చివరి సెమిస్టర్ వరకు కొనసాగుతాయి. 7-8 శాతం విద్యార్థులు మాత్రం ఇంటర్న్‌షిప్స్‌లోనే ఉద్యోగాలు పొందుతారు.

ఉద్యోగాల సృష్టి నా లక్ష్యం...
నేను ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలనుకుంటున్నా. ప్లేస్‌మెంట్స్‌ను బట్టి నిర్ణయించుకుంటా. ఐఐఎం- బెంగళూరులో ఎంబీఏలో చేరాలనే ఆలోచన కూడా ఉంది. దేశంలో ఏటా 1.2 కోట్ల మంది వర్స్‌ఫోర్స్‌లోకి వస్తున్నా.. ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన లేదు. నా వంతుగా ఉద్యోగ సృష్టి చేయాలనుకుంటున్నా. ఇందుకోసం ఉద్యోగానుభవం, ఎంబీఏ పట్టా, నైపుణ్యాలు అందిపుచ్చుకోవడం.. తర్వాత సొంతంగా కంపెనీ స్థాపన ఇలా చాలా నేర్చుకోవాల్సి ఉంది.

ఆ ఐఐటీలకు ఎక్కువ నిధులు...
మొదట ఏర్పడిన ఐఐటీల పూర్వ విద్యార్థులు చాలామంది కంపెనీలు స్థాపించారు. కొందరు కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు చదివిన ఐఐటీలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు అక్కడి విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌లోనూ ప్రాధాన్యతనిస్తున్నారు.
Published date : 03 Oct 2017 03:14PM

Photo Stories