Skip to main content

Preparation Tips For JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. సమన్వయంతోనే సక్సెస్‌!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) క్యాంపస్‌ల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌.. కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ తొలిరోజు నుంచే ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న పరిస్థితి! ఒకవైపు జేఈఈ మెయిన్స్‌.. మరోవైపు బోర్డ్‌ పరీక్షలు.. ఇంకోవైపు అడ్వాన్స్‌డ్‌.. ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగిస్తేనే విజయం వరిస్తుంది! తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ –2024 పరీక్ష తేదీలను నిర్వాహక సంస్థ ఐఐటీ చెన్నై ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, టాప్‌ స్కోర్‌కు మార్గాలపై ప్రత్యేక కథనం..
Key Tips for Topping JEE Advanced-2024  Preparing for Success in JEE Advanced  JEE Advanced-2024 Exam Dates Announcement  How to prepare for JEE Advanced   Syllabus Analysis for JEE Advanced-2024
  • జేఈఈ మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా అర్హత
  • అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో ఐఐటీల్లో ప్రవేశం
  • జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2024 తేదీ విడుదల
  • 2024, మే 26న పరీక్ష నిర్వహణ
  • అందుబాటులో దాదాపు 17 వేల సీట్లు

ఈ ఏడాది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా ని­ర్దేశించిన జేఈఈ మెయిన్స్‌ సిలబస్‌లో పలు అంశాలను తొలగించారు. కానీ అడ్వాన్స్‌డ్‌లో మాత్రం గ­త ఏడాది మాదిరిగానే సిలబస్‌ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో.. విద్యార్థులు ఈ రెండు పరీక్షల ప్రి­పరేషన్‌ విషయంలో నిర్దిష్ట వ్యూహాలు అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండింటి సమన్వయంతో సక్సెస్‌ సాధించొచ్చని పేర్కొంటున్నారు.

అర్హతలు

  • 2023లో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ ఉత్తీర్ణులు లేదా 2024లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. 
  • వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు అక్టోబర్‌ 1,1999 తర్వాత; ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థు లు అక్టోబర్‌ 1,1994 తర్వాత జన్మించి ఉండాలి.

మెయిన్‌ నుంచి 2.5 లక్షల మంది
ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు.. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్‌ 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. అదే విధంగా ఐఐటీల్లో సీట్ల కేటాయింపులో అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణతతోపాటు బోర్డ్‌ పరీక్షల్లో టాప్‌–20 పర్సంటైల్‌లో నిలవాలనే నిబంధనను కూడా కొనసాగించనున్నారు.

చ‌ద‌వండి: JEE (Adv.) Syllabus

మే 26న అడ్వాన్స్‌డ్‌
అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మే 26న జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఒకేరోజు రెండు పేపర్లు నిర్వహిస్తారు. పేపర్‌–1 ఉదయం, పేపర్‌–2ను మధ్యా­హ్నం ఉంటుంది.

పరీక్ష ఇలా
జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2024 పరీక్షను రెండు పేపర్లుగా (పేపర్‌ 1, పేపర్‌ 2) కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌లో మూడు సెక్షన్‌లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం మూడు గంటలు. నెగిటివ్‌ మార్కుల నిబంధన ఉంది.

మారని సిలబస్‌
జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2024 సిలబస్‌ గతేడాది మాదిరిగానే ఉంటుందని నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌ ఐఐటీ–చెన్నై వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అడ్వాన్స్‌డ్‌ కోసం విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ అంశాలను సంపూర్ణంగా చదవాల్సి ఉంటుంది. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 2024, ఏప్రిల్‌ 21– ఏప్రిల్‌ 30
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: 2024, మే 6
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: 2024, మే 17 – మే 26
  • అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ: మే 26 (పేపర్‌–1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్‌–2 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు)
  • ఫలితాల వెల్లడి: 2024, జూన్‌ 9
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jeeadv.ac.in/index.html

చ‌ద‌వండి: JEE (Adv.) Previous Papers


రివిజన్‌+ ప్రాక్టీస్‌
మ్యాథమెటిక్స్‌
పరీక్షలో ఎంతో కీలకంగా భావించే మ్యాథ్స్‌లో రాణించడానికి కోఆర్డినేట్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, మాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ముఖ్యంగా 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌; థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌; బైనామియల్‌ థీరమ్‌; లోకస్‌ అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి.

ఫిజిక్స్‌
న్యూమరికల్‌ టైప్‌ కొశ్చన్స్‌ కూడా ఉండే ఈ విభాగంలో మంచి స్కోర్‌ కోసం ఎలక్ట్రో డైనమిక్స్‌; మెకానిక్స్‌; హీట్‌ అండ్‌ థర్మో డైనమిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై అవగాహన పెంచుకోవాలి.

కెమిస్ట్రీ
అభ్యర్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్‌.. కెమిస్ట్రీ. ఇందులో మంచి మార్కుల కోసం కెమికల్‌ బాండింగ్, ఆల్కైల్‌ హలైడ్‌; ఆల్కహారల్‌ అండ్‌ ఈథర్, కార్బొనైల్‌ కాంపౌడ్స్, అటామిక్‌ స్ట్రక్చర్‌ అండ్‌ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్‌ అండ్‌ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.

అన్వయ దృక్పథం
అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌ను అనుసరించాలి. కాన్సెప్ట్‌లను వాస్తవ పరిస్థితుల్లో అన్వయం చేసే వి«ధంగా సాధన చేయాలి. తద్వారా పరీక్షలో అడిగే మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్, మ్యాచింగ్‌ టైప్‌ కొశ్చన్స్‌ వంటి వాటికి సులభంగా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

బోర్డ్‌ పరీక్షలు, మెయిన్‌తో సమన్వయం
అభ్యర్థులు బోర్డ్‌ పరీక్షలు, జేఈఈ–మెయిన్‌ పరీక్షతో సమన్వయం చేసుకుంటూ అడ్వాన్స్‌డ్‌ దిశగా అడుగులు వేయాలి. మెయిన్‌ తొలి సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్‌ సిలబస్‌పైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డ్‌ పరీక్షలకు సమయం కేటాయించాలి. బోర్డ్‌ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌ సాగించాలి. జేఈఈ–మెయిన్‌ రెండో సెషన్‌కు కూడా హాజరయ్యే అభ్యర్థులు ఆ సమయంలో అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి.

పునశ్చరణ
బోర్డు పరీక్షలు, జేఈఈ–మెయిన్‌ రెండో సెషన్‌ ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు పూర్తి స్థాయి ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. అధిక శాతం సమయాన్ని రివిజన్‌కు కేటాయించాలి. అప్పటికే తాము పూర్తి చేసుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ వాటికి సంబంధించి ప్రాక్టీస్‌ కొశ్చన్స్, ప్రీవియస్‌ కొశ్చన్స్‌ను సాధన చేయాలి. ప్రతి వారం వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్‌ టెస్ట్‌లకు హాజరవుతూ లోటుపాట్లు సరిచూసుకోవాలి. ప్రిపరేషన్‌ తుది దశలో రివిజన్, ప్రాక్టీస్‌కు పెద్దపీట వేయాలి.

Published date : 23 Dec 2023 10:19AM

Photo Stories