Jee Mains: తెలుగు విద్యార్థుల హవా
100 NTA స్కోరును సాధించిన విద్యార్థులు దేశం మొత్తమ్మీద 14 మంది ఉండగా అందులో ఏడుగురు తెలుగువారే ఉండడం విశేషం. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వారు కాగా మిగతా నలుగురు తెలంగాణ వారు. ఈ స్కోరు ఫలితాల్లో 1, 3, 4, 5, 10, 11, 14 స్థానాల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. ఏపీకి చెందిన కొయ్యాన సుహాస్ అయిదో స్థానంలో ఉండగా తెలంగాణకు చెందిన జాస్తి యశ్వంత్ వీవీఎస్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఏపీకే చెందిన పెనికలపాటి రవికిషోర్ 10, పోలిశెట్టి కార్తికేయ 11 స్థానాల్లో, తెలంగాణకు చెందిన అంకిత్ ఛటోపాధ్యాయ, ధీరజ్ కురుకుంద, రూపేష్ బియానీలు వరుసగా 3, 4, 14 స్థానాల్లో ఉన్నారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 100 ఎన్‌టీఏ స్కోరు సాధించిన వాటిలో ఏపీ, తెలంగాణ, అస్సోం, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మాత్రమే ఉన్నాయి. JEE Mains తొలివిడత పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షలను జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూలై 10 రాత్రి స్కోరు ఫలితాలను ప్రకటించింది.
చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్ సొంతం
7.69 లక్షల మంది పరీక్షకు హాజరు
ఇక తొలివిడత పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షలకు 8,72,432 మంది దరఖాస్తు చేయగా 7,69,589 మంది హాజరయ్యారు. దేశ, విదేశాల్లో 407 పట్టణాల్లోని 588 పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను కంప్యూటరాధారితంగా నిర్వహించారు. విదేశాల్లో 17 చోట్ల పరీక్ష నిర్వహించారు. ఇంగ్లీషుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పరీక్షను నిర్వహించగా బాలికలు 2,21,719 మంది, బాలురు 5,47,867 మంది పరీక్ష రాశారు.
చదవండి: ఐఐటీ- గువహటిలో మౌలిక వసతులు, భోధన విధానం...
పరీక్షకు హాజరైన వివిధ కేటగిరీల అభ్యర్థుల సంఖ్య ఇలా..
జనరల్ |
3,19,937 |
ఈడబ్ల్యూఎస్ |
74,370 |
ఓబీసీ |
2,75,416 |
ఎస్సీ |
71,458 |
ఎస్టీ |
26,330 |
పీడబ్ల్యూడీ |
2,078 |
మొత్తం |
7,69,589 |
చదవండి: ఎన్‌ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు (జేఈఈ మెయిన్ 2015)
నార్మలైజేషన్ అనంతరం స్కోరు నిర్ణయం
ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఆన్‌లైన్‌లో 8 రోజులపాటు 16 సెషన్లలో జరిగిన నేపథ్యంలో నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం ఈ ఎన్‌టీఏ స్కోరును నిర్ణయించినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. కనుక ఆయా విద్యార్థులు సాధించిన మార్కుల శాతంతో ఈ ఎన్‌టీఏ స్కోరు సమానంగా ఉండదని స్పష్టంచేసింది. ఇక ఈనెల 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్ సెకండ్ సెషన్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ పరీక్షల్లో కూడా మొదటి సెషన్లో పాల్గొన్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవకాశమిచ్చారు. ఆ ఫలితాల అనంతరం విద్యార్థులు ఏ సెషన్‌లో ఎక్కువ స్కోరు సాధించారో దాన్నే పరిగణనలోకి తీసుకుని తుది విడత ఫలితాలను, ర్యాంకులను ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్స్ పేపర్–2ఏ (బీఆర్క్), పేపర్–2బీ (బి.ప్లానింగ్) ఎన్‌టీఏ స్కోరును త్వరలోనే ప్రకటించనున్నట్లు ఎన్‌టీఏ సీనియర్ డైరక్టర్ డాక్టర్ సాధనా పరషార్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ విధివిధానాలు...
12 వరకు సెకండ్ సెషన్ దరఖాస్తుకు గడువు
జేఈఈ సెకండ్ సెషన్ దరఖాస్తు గడువును జూలై 12 వరకు పొడిగిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జేఈఈ మొదటి విడత పరీక్షల స్కోరును ఆదివారం రాత్రి ఎన్‌టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 21 నుంచి జరగనున్న రెండో విడత పరీక్షలకు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు గడువును ఎన్‌టీఏ పొడిగించింది. మరోసారి పొడిగిస్తూ 11, 12వ తేదీల్లో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది. తొలి సెషన్ జేఈఈ మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఆ అప్లికేషన్ నెంబర్‌తోనే తిరిగి రెండో సెషన్‌కు అప్లయ్ చేయవచ్చని పేర్కొంది. వారు పేపర్, మీడియం, పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకుని రెండో సెషన్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
చదవండి: అన్వయ నైపుణ్యంతో జేఈఈని జయించండిలా..
బాలికల కన్నా బాలురదే పైచేయి
ఈ ఫలితాల్లో బాలికల కన్నా బాలురు ఆధిక్యంలో ఉన్నారు. 100 స్కోరు పాయింట్లు సాధించిన 14 మందిలో ఒకేఒక్క బాలిక ఉండగా తక్కిన వారంతా బాలురే. అలాగే, 100 స్కోరు పాయింట్లు సాధించిన ఏపీ అభ్యర్థులందరూ బాలురే. బాలికల్లో టాప్–10 స్కోరర్లలో ఆంధ్రప్రదేశ్ బాలికలు ఇతర రాష్ట్రాల బాలికల కన్నా ముందంజలో ఉన్నారు. 100 స్కోరు సాధించకున్నా తదుపరి టాప్–10లో దర్శిపూడి శరణ్య, భోగి సిరి, జనపతి సాయిచరిత, నక్కా సాయిదీపిక, పిల్లి జలజాక్షి ఉన్నారు.