Education News: ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు ....డిసెంబర్‌లో ట్యాబ్‌లు అందక విద్యార్థులు డీలా
అమరావతి: డిసెంబర్ 21 వచ్చిందంటే చేతుల్లో ట్యాబ్‌లతో లక్షల మంది పిల్లల మొహాల్లో సంతోషం తొణికిసలాడేది! అంతులేని సందేహాలను వాటి ద్వారా నివృత్తి చేసుకుంటూ పోటీ ప్రపంచంలో రాణించాలనే ఉత్సాహంతో ఉరకలు వేసేవారు! డిజిటల్ తరగతులు, సాంకేతిక బోధన, సకల సదుపాయాలతో సర్కారు స్కూళ్లు కళకళలాడేవి!! మరి ఈ ఏడాది ట్యాబ్‌లు ఎక్కడ? మాపై ఎందుకంత కక్ష? అని లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. 9.52 లక్షల మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా అందించిన ట్యాబ్స్ పంపిణీని కూటమి సర్కారు ఈ ఏడాది నిలిపివేసింది.
అదే జగన్ మామయ్య ప్రభుత్వం ఉంటే ఈ పాటికి ట్యాబ్‌లు వచ్చేవని 8వ తరగతి పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన జగన్ మామను ప్రతి విద్యార్థీ తలచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే తమకు ఠంఛన్‌గా అమ్మ ఒడి వచ్చేదని తల్లులు గుర్తు చేసుకోని రోజు ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేద కుటుంబాల తలరాతలను మార్చేవి చదువులేనని గట్టిగా నమ్మి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా అడుగులు వేశారు.
ఇదీ చదవండి: CBSE Schools Breaking News: సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీల్లో దొరికిన డమ్మీ విద్యార్థులు!
ఏటా జూన్‌లో అమ్మ ఒడితో తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా భరోసా కల్పించారు. నాడు నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దిన సర్కారు స్కూళ్ల ప్రయాణం ఇంగ్లీష్ మీడియం చదువుల నుంచి టోఫెల్ శిక్షణ, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్ స్థాయికి చేరుకుంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టిక విలువలతో గోరుముద్ద అందించి పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
యూనిఫామ్ నుంచి పుస్తకాల దాకా అన్నీ ఉచితంగా అందిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా బోధన కోసం ఐదేళ్లలో ఏకంగా దాదాపు రూ.73 వేల కోట్లు వ్యయం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసి పిల్లల చదువులకు తోడ్పాటు అందించారు. ప్రభుత్వ విద్యా రంగానికి బలమైన పునాది వేశారు. ఇప్పుడు వాటిని సమూలంగా పెకిలించే దిశగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది.
పేద విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ స్కూళ్లపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. విద్యా రంగ పథకాలను ఇంకా అద్భుతంగా అమలు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి రాగానే అన్నింటినీ నిలిపివేసింది. ఆర్నెల్ల పాలనలో ఒక్కటైనా కొత్త పథకాన్ని అందించకపోగా గత సర్కారు అమలు చేసిన వాటిని కక్షపూరితంగా ఆపేసింది. ఇందుకు నాడు నేడు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి.
ఇదీ చదవండి: Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 28న జాబ్ మేళా.. ఈ జిల్లాలోనే!
ఏఐ టెక్నాలజీ యాప్‌తో ట్యాబ్స్..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు ప్రతి పాఠ్యాంశాన్ని విశ్లేషణాత్మకంగా, ఇంటి వద్ద కూడా చదువుకునే అవకాశం దక్కింది. విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ట్యాబ్స్‌లో ‘డ్యులింగో’ యాప్ అప్‌లోడ్ చేశారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది.
సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్ రద్దు
వైఎస్ జగన్ దేశమంతా ప్రశంసించే విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధనను అంచెలంచెలుగా అమలు చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది.
2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను గత ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే కూటమి సర్కారు ఈ ఏడాది రద్దు చేసింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు 2023–24 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
గతేడాది రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఈ సదుపాయం లభించగా ఈ ఏడాది ఒక్కరికీ అవకాశం లేకుండా చేసింది. గతేడాది 16 లక్షల మంది టోఫెల్ పరీక్ష రాయగా కనీసం ఆ ఫలితాలను కూడా ప్రకటించలేదు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.
కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఐబీ బోధన 2025 జూన్ నుంచి రాష్ట్రంలోని 38 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించేందుకు గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే దాన్ని రద్దు చేసి కక్షపూరితంగా వ్యవహరించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
‘వందనం’ లేదు.. వంటా లేదు..!
ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు చేతులెత్తేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా సీఎం చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడంతో 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర నిస్పృహ చెందుతున్నారు. ఇక నాడు–నేడు పనులను మధ్యలో నిలిపి వేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు.
గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. ఇటీవల ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మెగా పీటీఎంలో తల్లిదండ్రులకు ఇదే భోజనాన్ని పెట్టడంతో అధికారులు, నాయకులను పలుచోట్ల నిలదీశారు. టీడీపీ హయాంలో గతంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నంతో సరిపెట్టగా వైఎస్ జగన్ నాణ్యమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టారు.
రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో మధ్యాహ్నం రుచి, శుచితో పోషకాహారాన్ని అందించారు. పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వంటలో మార్పుచేర్పులు చేశారు. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.7,244.6 కోట్లు ఖర్చు చేసింది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అటకెక్కిన సబ్జెక్టు టీచర్ల బోధన
విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను వైఎస్ జగన్ అమల్లోకి తెస్తే ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. గత ప్రభుత్వం దాదాపు 6 వేల మంది ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించి, 3–5 తరగతులను హైస్కూళ్లకు మార్చి నాణ్యమైన బోధన అందిస్తే ఈ విద్యా సంవత్సరంలో కూటమి సర్కారు సబ్జెక్టు టీచర్లను కేవలం ఉన్నత తరగతులకే పరిమితం చేసి విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందకుండా చేసింది.
మండలానికి రెండు కాలేజీలు రద్దు
రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఏర్పాటుతో పాటు వాటిలో ఒకటి బాలికల కోసం కేటాయించిన గత ప్రభుత్వం 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటై బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 504 హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఇవి ఉండవని ఇటీవలే ప్రకటించింది.
‘ఆణిముత్యాల’ ఆశలు ఆవిరి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2022–23లో టెన్త్, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించింది. ‘జగనన్న ఆణిముత్యాలు–స్టేట్ బ్రిలియన్స్’ అవార్డులతో వెన్నుతట్టి అభినందించింది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికే దక్కాయి. ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో చదివి ఉత్తమంగా రాణించిన 10 మంది నిరుపేద విద్యార్థులను గత ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది.
2023–24లో కూడా ఇదే విధానం కొనసాగుతుందనే ఉత్సాహంతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిన దాదాపు 32 వేల మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను మించి ఫలితాలు సాధించారు. అయితే జూన్‌లో నిర్వహించాల్సిన సత్కారాన్ని కూటమి సర్కారు నిలిపివేసి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల పట్ల అన్యాయంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆరు నెలల్లో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది.
ఇదీ చదవండి: November 2024 Top 100 Current Affairs Quiz in Telugu
విద్యా సంస్కరణలు
వైఎస్ జగన్ చేపట్టిన చదువుల యజ్ఞంతో సర్కారు బడులు సమున్నతంగా మారాయి. 2019 నుంచి వివిధ విద్యా, సంక్షేమ పథకాలను అమలు చేశారు. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే జగనన్న విద్యాకానుక ఇవ్వడంతో తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫారం భారం లేకుండా పోయింది. బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఏటా సగటున 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేసింది.
పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ‘మన బడి నాడు–నేడు’ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా మారాయి. కొత్త భవనాలు, డబుల్ డెస్క్ బెంచీల నుంచి కాంపౌండ్ వాల్ వరకు దాదాపు 11 రకాల సదుపాయాలు సమకూరాయి. నాడు – నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధన ప్రవేశపెట్టారు.
మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద కింద వారానికి 16 రకాల వంటకాలతో నాణ్యమైన పోషకాల భోజనం అందించారు. దేశంలో ఈ తరహా భోజనాన్ని పిల్లలకు అందించిన రాష్ట్రం మరొకటి లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. ఇక 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో డిజిటల్ బోధన అందించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగాయి.
ఇంగ్లిష్ మీడియం బోధనతో 2022–23 విద్యా సంవత్సరంలో 84 శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాగా 2023–24లో అది ఏకంగా 93 శాతానికి పెరిగింది. 2024 మార్చి పదో తరగతి పరీక్షల్లో 4.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థుల్లో 2.25 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయగా 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైన ‘స్టేట్ టాపర్స్’ గత రెండు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల నుంచి రావడం గమనార్హం. టాపర్స్‌గా నిలిచిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి ఏపీలో విద్యా సంస్కరణల గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ఆ పథకాలు, సదుపాయాలు, ప్రోత్సాహం లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు తరలిపోయారు.