Skip to main content

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి..

Four Year Integrated BEd Programme will be available from next academic year
Four Year Integrated BEd Programme will be available from next academic year

టీచింగ్‌ ఎడ్యుకేషన్‌.. ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి మార్గం! ఇందుకోసం ప్రధానంగా రెండేళ్ల బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) పూర్తి చేసుకోవాలి! ఈ కోర్సులో చేరేందుకు అర్హత.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ తర్వాత ఎంట్రెన్స్‌లో ర్యాంకు సాధిస్తే.. బీఈడీలో ప్రవేశం లభిస్తుంది. అంటే.. ఇంటర్‌ తర్వాత మొత్తం అయిదేళ్లు చదవాలి! తాజాగా కేంద్ర విద్యాశాఖ.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌కు అనుమతిచ్చింది! ఇది వచ్చే విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌ విధి విధానాలు, ప్రవేశ ప్రక్రియ తదితర అంశాలపై విశ్లేషణ... 

  • నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుకు అనుమతి
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి!
  • జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక
  • మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్‌సీటీఈ

ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఇంటర్‌తోనే బీఈడీలో చేరే అవకాశం కల్పించింది! దీనికి సంబంధించి.. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచింగ్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) తాజాగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అంటే.. ఇంటర్‌ తర్వాత నాలుగేళ్లలోనే ఉపాధ్యాయ వృత్తిలో చేరొచ్చు. అలా కెరీర్‌లో ఒక ఏడాది కలిసొచ్చినట్లే! వాస్తవానికి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి ఇంటర్‌ తర్వాత ఇప్పుడున్న అవకాశం.. డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌. డిప్లొమా కోర్సు పూర్తిచేసినా.. కెరీర్‌లో ముందుకెళ్లాలంటే.. బీఈడీ ఉత్తీర్ణులవ్వాల్సిందే. అందుకే ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే బీఈడీ చదివే అవకాశం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం అంటున్నారు నిపుణులు.

చ‌ద‌వండి: Common Admission Test(CAT): ఐఐఎంల నుంచి ఇంటర్వ్యూ కాల్‌ అందుకోవాలంటే..

ఎప్పటి నుంచో కసరత్తు

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది. 2012లోనే జస్టిస్‌ వర్మ కమిటీ నాలుగేళ్ల బీఈడీని ప్రవేశ పెట్టాలని సిఫార్సు చేసింది. దాంతో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచింగ్‌ ఎడ్యుకేషన్‌.. ఈ రంగానికి చెందిన నిపుణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించి.. కరిక్యులం, ఇతర బోధన పద్ధతులపై విధి విధానాలు ఖరారు చేసింది. ఈ మేరకు తాజాగా.. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (రికగ్నిషన్, నార్మ్స్‌ అండ్‌ ప్రొసీజర్‌) అమెండ్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌–2021ను ప్రకటించింది. ఇందులో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రవేశం మొదలు కోర్సు కరిక్యులం వరకూ.. అన్ని అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉన్నత విద్యా సంస్థలు, టీచింగ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. 2030 నాటికి పూర్తిగా నాలుగేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌నే బోధించేలా అడుగులు వేయాలని స్పష్టం చేసింది. 

ఇంటర్‌తో.. రెండు డిగ్రీలు

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలో చేరేందుకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణత శాతంలో సడలింపు లభిస్తుంది. ఇలా ఈ కోర్సులో అడుగుపెట్టిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా.. సంప్రదాయ డిగ్రీ కోర్సుల(బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం) పాఠ్యాంశాలతోపాటు బీఈడీ కరిక్యులం కూడా బోధిస్తారు. ఫలితంగా ఏకకాలంలో రెండు డిగ్రీలు చదివినట్లు అవుతుంది. 

చ‌ద‌వండి: NID DAT 2022: ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌...

నాలుగేళ్లు.. ఎనిమిది సెమిస్టర్లు

ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం–నాలుగేళ్ల బీఈడీని ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌గా పేర్కొన్నారు. ప్రతి సంవతర్సం రెండు సెమిస్టర్లు చొప్పున మొత్తం ఎనిమిది సెమిస్టర్లుగా కోర్సు ఉంటుంది. ప్రతి సెమిస్టర్‌ చివర్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా నాలుగో ఏడాది చివరి సెమిస్టర్‌ పరీక్షలు కూడా పూర్తి చేసుకొని.. ఉత్తీర్ణత సాధించిన వారికి బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ/బీకాం బీఈడీ పట్టా అందిస్తారు.

ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి

టీచింగ్‌ ఎడ్యుకేషన్‌లో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అత్యంత కీలకం. అందుకే కొత్తగా ప్రవేశ పెట్టిన ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలో 18 వారాల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఈ ఇంటర్న్‌షిప్‌ కూడా వీలైనంత మేరకు సదరు ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేలా చూడాలని ఎన్‌సీటీఈ పేర్కొంది. మొత్తం ప్రోగ్రామ్‌ వ్యవధిలో ప్రతి సంవత్సరం కనీసం ఆరు వారాలు విద్యార్థులు ఫీల్డ్‌ వర్క్‌లో పాల్గొనాలని స్పష్టం చేసింది.

ఉమ్మడి ప్రవేశ పరీక్ష

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలో ప్రవేశం కల్పించేందుకు నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌సీటీఈ పేర్కొంది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చేపడుతుందని కూడా ఎన్‌సీటీఈ పేర్కొంది. ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రాథమ్యం ఆధారంగా

ఉమ్మడి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తాము ఏ డిగ్రీ కోర్సు చదవాలనుకుంటాన్నారో తెలియజేయాల్సి ఉంటుంది. అంటే.. బీఏ చదవాలనుకుంటున్న అభ్యర్థులు బీఏ బీఈడీని; బీఎస్సీ చదవాలనుకుంటున్న వారు బీఎస్సీ బీఈడీని, బీకాం చదవాలనుకున్న వారు బీకాం బీఈడీని తమ కోర్సు ప్రాథమ్యంగా పేర్కొనాలి.

చ‌ద‌వండి: Demanding‌ Job ‌Profiles‌: వీరికి రూ.8లక్షలు–రూ.20లక్షల వరకు వార్షిక వేతనం

పరీక్ష విధానం

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఎన్‌టీఏ నిర్వహించే పరీక్ష.. ప్రస్తుతం సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఎన్‌టీఏ నిర్వహిస్తున్న సీయూ–సెట్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌/ఇంటిగ్రేటెడ్‌) మాదిరిగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని ప్రకారం–పరీక్ష నాలుగు వందల మార్కులకు రెండు పార్ట్‌లు(పార్ట్‌–ఎ, పార్ట్‌–బి)గా ఉంటుంది. పార్ట్‌–ఎలో ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు, పార్ట్‌–బిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీల నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. అభ్యర్థులు మ్యాథ్స్, బయాలజీలలో తమ ఇంటర్‌ గ్రూప్‌ ఆధారంగా ఏదో ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. బీఏ బీఈడీ, బీకాం బీఈడీ అభ్యర్థులకు ఇంగ్లిష్, న్యూమరికల్‌ అప్టిట్యూడ్‌/డేటా ఇంటర్‌ప్రిటేషన్, అనలిటికల్‌ స్కిల్స్, రీజనింగ్, జనరల్‌ అప్టిట్యూడ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి 100 ప్రశ్నలకు పరీక్ష జరుగుతోంది. కొత్తగా నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రవేశ పరీక్ష కూడా ఇదే తరహాలో ఉంటుందని చెబుతున్నారు.

కామన్‌ సిలబస్‌

  • ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌ కరిక్యులం, సిలబస్‌ జాతీయ స్థాయిలో ఒకే విధంగా ఉంటుందని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. రాష్ట్రాల స్థాయిలోని ఇన్‌స్టిట్యూట్‌లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోర్సులో 30 శాతం మేరకు మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. అంటే.. 70 శాతం మేర ఉమ్మడి సిలబస్, 30 శాతం ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు నెలకొన్న ప్రాంతాలకు సంబంధించిన అంశాల సమ్మిళితంగా సిలబస్‌ ఉంటుంది. ఈ కోర్సును ప్రారంభించే యూనివర్సిటీలు గరిష్టంగా బ్యాచ్‌కు యాభై మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ ప్రమాణాలు ఉన్నతంగా ఉన్న సంస్థలు రెండు బ్యాచ్‌లుగా వంద మందికి ప్రవేశం కల్పించొచ్చని పేర్కొంది. 

ఫ్యాకల్టీ నిబంధనలివే

  • ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌ను అందించే ఇన్‌స్టిట్యూట్‌లు తప్పనిసరిగా.. నిర్ణీత సంఖ్యలో ఫ్యాకల్టీని కలిగుండాలని ఎన్‌సీటీఈ పేర్కొంది. సైన్స్, హ్యుమానిటీస్, కామర్స్‌ విభాగాల్లో ప్రతి విభాగానికి ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ స్థాయి కలిగిన వ్యక్తిని హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌గా నియమించాలి.
  • మూడు విభాగాల్లో ఒక్కో విభాగంలో తొమ్మిది మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు ఎడ్యుకేషనల్‌ స్టడీస్‌కు సంబంధించిన వారై ఉండాలి. ఒకవేళ ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌ రెండు బ్యాచ్‌లను నిర్వహిస్తే.. ఎడ్యుకేషనల్‌ స్టడీస్‌కు సంబంధించి ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించాలి. హెల్త్‌ అండ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్, కెరీర్‌ గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ విభాగాలకు సంబంధించి ఒక్కో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను నియమించుకోవాలి. ఈ మూడు విభాగాల విషయంలో పార్ట్‌–టైమ్‌ విధానంలోనూ ఫ్యాకల్టీని రిక్రూట్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

చ‌ద‌వండి: Industry 4.0: బ్రాంచ్‌ ఏదైనా.. ఈ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే అవకాశాలు

80 శాతం హాజరు

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో భాగంగా నిర్వహించాల్సిన కనీస తరగతుల సంఖ్యను కూడా ఎన్‌సీటీఈ పేర్కొంది. ప్రతి విద్యా సంవత్సరంలో 125 రోజులు, ప్రతి వారంలో కనీసం 40 గంటలు బోధన ఉండాలి. విద్యార్థులు 80 శాతం తరగతి గది హాజరు, ఫీల్డ్‌ వర్క్‌ విషయంలో 90 శాతం హాజరు కలిగుండాలి. ఇలాంటి వారికే వార్షిక పరీక్షలు/సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతి ఇస్తారు.

మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌

విద్యార్థుల్లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌ను పెంచేందుకే బీఈడీలో నాలుగేళ్ల విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న విధానంలో డిగ్రీ తర్వాత బీఈడీ కోర్సులో చేరే అభ్యర్థులు తాము ఎంచుకున్న మెథడాలజీనే చదువుతున్నారు. దీనివల్ల వీరికి ఇతర అంశాల గురించి అవగాహన ఉండట్లేదు. దీంతో వీరు వృత్తిలో ప్రవేశించాక విద్యార్థులకు వివిధ అంశాలను బోధించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యకు పరిష్కారంగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌తో ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశ పెడుతున్నారు. 

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ.. ముఖ్యాంశాలు

  • ఇంటర్‌తోనే బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ/బీకాం బీఈడీలో చేరే అవకాశం.
  • జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు ప్రవేశం.
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం.
  • ఒకే సమయంలో డిగ్రీ, బీఈడీ అంశాల బోధన.

ఉపాధ్యాయ వృత్తికి దారి

నాలుగేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌లో రెగ్యులర్‌ డిగ్రీ, టీచింగ్‌ ఎడ్యుకేషన్‌ సంబంధిత అంశాలు బోధించే విధంగా కరిక్యులం ఉంటుంది. దీనివల్ల టీచింగ్‌ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలపై మరింత అవగాహన వస్తుంది. ఫలితంగా చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిలో చేరి.. రాణించే అవకాశం ఉంటుంది.
–ప్రొ‘‘ వై.శ్రీకాంత్, ప్రిన్సిపాల్, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, మైసూర్‌

Published date : 09 Nov 2021 06:08PM

Photo Stories