Common Admission Test(CAT): ఐఐఎంల నుంచి ఇంటర్వ్యూ కాల్ అందుకోవాలంటే..
కామన్ అడ్మిషన్ టెస్ట్.. క్యాట్! దేశంలో ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు)ల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష! క్యాట్‌లో టాప్ స్కోర్ సాధించి.. ఐఐఎంల నుంచి ఇంటర్వ్యూ కాల్ అందుకోవాలని ఎంతో మంది నెలలుగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. రెండున్నర లక్షల మందికిపైగా రాసే క్యాట్‌ను దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షగా భావిస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పరీక్ష ఈనెల(నవంబర్) 28న జరుగనుంది. అంటే.. పరీక్షకు ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో.. క్యాట్‌లో టాప్ స్కోర్ సాధించేందుకు ప్రిపరేషన్ టిప్స్...
- ఈ నెల(నవంబర్) 28వ తేదీన క్యాట్–2021
- జాతీయ స్థాయిలో 2.5 లక్షల వరకు దరఖాస్తులు
- అందుబాటులో క్యాట్ అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్
క్యాట్ అభ్యర్థులు ఇప్పటికే పిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారు. ఇప్పుడు పరీక్ష తేదీ సమీపిస్తున్న వేళ.. తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విలువైన సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. ప్రిపరేషన్ పరంగా వైవిధ్యం చూపించాలి. పరీక్ష రోజు ఉత్తమ ప్రతిభ చూపాలంటే.. ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఆలోచించాలి. అందుబాటులో ఉన్న ఈ 20 రోజుల సమయంలో పూర్తిగా రివిజన్‌కు కేటాయించడం మేలు అంటున్నారు నిపుణులు. ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవడం, వాటిలో క్లిష్టంగా ఉన్న వాటిని చూసి ఆందోళన చెందడం వంటివి పరీక్ష ముందు ఒత్తిడికి గురి చేస్తాయి.
చదవండి: NID DAT 2022: ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్...
సొంత నోట్స్
క్యాట్ తుది దశ ప్రిపరేషన్‌లో భాగంగా.. అభ్యర్థులు ఇప్పటికే ఆయా అంశాలపై తాము రాసుకున్న సొంత నోట్స్‌ను మళ్లీ మళ్లీ చదవాలి. ఇందులోని ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. తద్వారా సమయం ఆదా అవడమే కాకుండా.. ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. క్యాట్‌లో ప్రధానంగా వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లపై పట్టు సాధించాలి.
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్
ఈ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వెర్బల్ ఎబిలిటీకి సంబంధించి.. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్ గ్రామర్ అంశాలను మరోసారి తిరగేయాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్
ఇందులో ఇప్పటికే తాము చదివిన టాపిక్స్‌కు సంబంధించిన టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను మరోసారి ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్ విషయంలో క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటì వాటి పునశ్చరణ ఎంతో కీలకమని గుర్తించాలి.
చదవండి: JOSAA 2021: ఐఐటీలు, నిట్‌లు, జీఎఫ్‌ఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. ఇది తప్పనిసరి
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగానికి సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్ అండ్ టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీకి తాము రాసుకున్న షార్ట్ నోట్స్ ఆధారంగా పునశ్చరణ చేయాలి. ఇలా సెక్షన్‌ల వారీగా, సబ్జెక్ట్ వారీగా ఎక్కువ సమయం రివిజన్‌కు కేటాయించాలి. కొంత సమయం సెక్షన్‌ల వారీగా నమూనా ప్రశ్నలను సాధన చేయాలి.
మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్స్
ప్రస్తుత సమయంలో మోడల్ పేపర్లను, గత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. కనీసం నాలుగు ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. వాటిని మూల్యాంకన చేసుకొని.. ఇప్పటికీ క్లిష్టంగా భావిస్తున్న అంశాలను గుర్తించాలి. ఇలాంటి వాటిపై పట్టు సాధించేందుకు కొంత సమయం కేటాయించాలి.
మాక్ టెస్ట్‌లు
ఇప్పటి నుంచి పరీక్షకు వారం రోజుల ముందు వరకూ ప్రతి రోజూ మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ముఖ్యంగా సెక్షన్ వారీగా మాక్ టెస్ట్‌లకు హాజరయ్యే విధానాన్ని అనుసరించాలి. ఇలా సెక్షన్ వారీగా, మొత్తం పేపర్ వారీగా మాక్ టెస్ట్‌లకు హాజరయ్యాక..తమ ప్రదర్శన స్థాయిపై స్పష్టత తెచ్చుకోవాలి.
వారం రోజుల ముందు
పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా పునశ్చరణకే కేటాయించాలి. ఓ వైపు పునశ్చరణ చేస్తూనే.. క్లిష్టమైన అంశాలకు సంబంధించి కాన్సెప్ట్‌లు, ఫార్ములాలపై షార్ట్ నోట్స్ ఆధారంగా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు కూడా అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని.. ప్రతి రోజు ఒక మాక్ టెస్ట్ రాసేందుకు సమయం కేటాయించుకోవచ్చు.
చదవండి: Demanding Job Profiles: వీరికి రూ.8లక్షలు–రూ.20లక్షల వరకు వార్షిక వేతనం
పరీక్ష రోజు.. పకడ్బందీగా
- పరీక్ష రోజున అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష హాల్లో.. ప్రశ్న పత్రం విండో ఓపెన్ కాగానే.. మొత్తం ప్రశ్న పత్రాన్ని చదవడానికి కనీసం పది నిమిషాలు కేటాయించాలి. ఫలితంగా తమకు సులభమైన, క్లిష్టమైన ప్రశ్నలు, విభాగాల గురించి అవగాహన వస్తుంది. దాని ఆధారంగా ముందుగా సులువైన ప్రశ్నలు, తర్వాత ఓ మోస్తరు క్లిష్టమైన ప్రశ్నలు, చివరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలపై దృష్టిపెట్టాలి. దీనికి భిన్నంగా ప్రశ్న పత్రం మొత్తం పరిశీలించకుండానే.. సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమిస్తే.. మొదట్లోనే ఒకట్రెండు క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైతే.. ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. ఇది మిగతా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సులభమైన ప్రశ్నలు ఉన్నా..సమయాభావం సమస్య తలెత్తుంది. అందుకే కచ్చితంగా పరీక్ష పత్రం మొత్తాన్ని కొంతసేపు పరిశీలించాకే.. సమాధానాలు ఇచ్చేందుకు సన్నద్ధమవ్వాలని నిపుణులు, టాపర్స్ సూచిస్తున్నారు.
వేగం, కచ్చితత్వం
క్యాట్‌లో విజయానికి వేగం, కచ్చితత్వం చాలా కీలకం. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌ల సాధన సందర్భంగా.. సులువుగా భావించిన విభాగాలను వేగంగా పూర్తి చేసి.. మిగిలిన సమయాన్ని క్లిష్టమైన వాటికి కేటాయించేలా ప్రాక్టీస్ చేయాలి. ఈ వ్యూహం పరీక్ష రోజున ఉపయోగపడుతుంది.
షార్ట్ కట్ మెథడ్స్
క్యాట్ అభ్యర్థులు షార్ట్ కట్ మెథడ్స్‌ను అనుసరించడం మేలు చేస్తుంది. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల్లో షార్ట్ కట్ మెథడ్స్‌ను అనుసరించాలి. పాయింటర్ అప్రోచ్, విజువలైజేషన్ టెక్నిక్స్‌ను పాటించాలి.
సెక్షనల్ కటాఫ్స్ పొందేలా
క్యాట్‌లో సెక్షనల్ కటాఫ్స్ నిబంధన కూడా అమలవుతోంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ కనీస కటాఫ్ పర్సంటైల్ సాధించేలా కృషి చేయాలి. ఇందుకోసం సెక్షన్ వారీగా మోడల్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆయా సెక్షన్‌లలో పట్టు లభించడమే కాకుండా.. ఓవరాల్ కటాఫ్ మెరుగుపరచుకోవడంలోనూ ముందంజలో నిలిచే అవకాశం ఉంది.
ఆరోగ్యం ముఖ్యం
క్యాట్ పరీక్షకు ముందు ప్రిపరేషన్ వ్యూహాలను అనుసరిస్తూనే.. ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. ప్రతిరోజు గంటల కొద్దీ ప్రిపరేషన్ సాగిస్తూ.. ఆరోగ్యాన్ని విస్మరిస్తే.. పరీక్ష రోజున అలసటకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకుంటూ.. సరైన నిద్ర, వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.
ఎగ్జామ్ డే టిప్స్
- పరీక్ష తేది: నవంబర్ 28, 2021.
- ఈ 20 రోజులు పూర్తిగా రివిజన్‌కే కేటాయించడం మేలు.
- కనీసం నాలుగు లేదా అయిదు మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
- సెక్షన్ వారీగా ప్రతి రోజు ప్రాక్టీస్‌కు సమయం కేటాయించాలి.
- షార్ట్ నోట్స్, షార్ట్ కట్ మెథడ్స్‌తో రివిజన్‌ను వేగవంతం చేసుకోవాలి.
- పరీక్ష హాల్లో.. ప్రశ్న పత్రం పరిశీలనకు సమయం కేటాయించాలి.
- ఈజీ టు డిఫికల్ట్ విధానంలో సమాధానాలు ఇవ్వాలి.
ఫలితంపై ఆందోళన వద్దు
క్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులు.. ముందుగా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఫలితం గురించి ఆలోచిస్తూ.. ఒత్తిడికి గురవుతారు. ఇది పరీక్ష రోజు ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రస్తుత సమయంలో ప్రశాంతంగా ఉంటూ.. రివిజన్, మాక్ టెస్ట్‌లు, సెల్ఫ్ అనాలిసిస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
– రామ్‌నాథ్ కనకదండి, క్యాట్ కోర్స్ డైరెక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్
చదవండి: Industry 4.0: బ్రాంచ్ ఏదైనా.. ఈ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే అవకాశాలు