Degree: డిగ్రీలో ‘ఆనర్స్’
హిందూపురం టౌన్: సాధారణంగా డిగ్రీ కోర్సులకు ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే. వేలాది మంది డిగ్రీ పట్టా చేతపట్టుకుని బయటకు వస్తుండడంతో వారిలో నైపుణ్యమున్న కొద్ది మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు దక్కేవి. ఈ నేపథ్యంలో డిగ్రీ చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన విద్యా విధానం అమలులో భాగంగా డిగ్రీ పూర్తయ్యేలోపు ఉద్యోగం, ఉపాధి అందించే దిశగా విద్యాప్రణాళికను అమలు చేస్తుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి యూజీసీ సూచనలతో నాలుగేళ్ల వ్యవధి ఉన్న ఆనర్స్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు..
డిగ్రీ ఆనర్స్, ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమైంది. జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, కదిరి, బుక్కపట్నంలో మొత్తం 6 ప్రభుత్వ మహిళా, పురుషుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల మేరకు వసతులు ఉన్న కళాశాలల్లో వాటికి అనుగుణంగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు. తద్వారా జిల్లాలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు ఈ కోర్సులు ఉపయుక్తం కానున్నాయి.
విద్యార్థులకు అవగాహన సదస్సులు..
నూతనంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీ విధానంపై పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆనర్స్ కోర్సుల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. కోర్సు పూర్తి చేస్తే దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులువుగా దక్కుతాయని చెబుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ పూర్తి చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్ల తర్వాత సాధారణ డిగ్రీతో వైదొలిగే అవకాశమూ ఉంటుంది.
ఆనర్స్ డిగ్రీతో ఉద్యోగం గ్యారెంటీ..
విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసి కళాశాలల నుంచి కొలువు దక్కేలా ప్రత్యేకంగా ఆనర్స్ కోర్సులకు రూపకల్పన చేశారు. ఐటీ, పారిశ్రామిక సంస్థలు, ఇతర డిమాండ్ ఉన్న రంగాల్లో మానవ వనరుల అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టారు. సింగల్ మేజర్ సబ్జెక్ట్‌తో పాటు మల్టీడిసిప్లినరీ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి అంశాలను చేర్చారు. ఇందు కోసం తప్పనిసరిగా 8 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆనర్స్ డిగ్రీ పూర్తి చేస్తే కొలువులు దక్కేలా ప్రత్యేకంగా సిలబస్‌ను రూపకల్పన చేశారు.
కొత్త కోర్సుల వివరాలు ఇలా..
హిందూపురంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు 9 సింగల్ మేజర్ కోర్సులు, కదిరిలో ప్రభుత్వ కళాశాలకు 11, పెనుకొండ కళాశాలకు 5, మడకశిరలో కళాశాలకు 5, ధర్మవరంలో కళాశాలకు 4, బుక్కపట్నంలో కళాశాలకు 3 కోర్సులను కేటాయించారు.
బీఏ ఆనర్స్ : పొలిటికల్ సైన్సు, స్పెషల్ ఉర్దూ, హిస్టరీ, స్పెషల్ తెలుగు, ఎకనామిక్స్‌లు ఉన్నాయి. హిస్టరీ తదితర సబ్జెక్టులు మైనర్ సబ్జెక్టులుగా ఉన్నాయి.
బీకాం ఆనర్స్ : బీకాం జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ మైనర్ సబ్జెక్టుగా ఉంది.
బీఎస్సీ ఆనర్స్ : కంప్యూటర్ సైన్స్, మాథమెటిక్స్, బోటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సెరికల్చర్ ఉన్నాయి. మైనర్ సబ్జెక్టులలోనూ కంప్యూటర్ సైన్స్, బోటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉన్నాయి.