Skip to main content

Self confidence in girls: చదువుతో అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం

Self confidence in girls through education   Promoting equality in education for girls and boys for a confident future.
Self confidence in girls through education

అబ్బాయిలతోపాటు అమ్మాయిలను సమానంగా చదివించాలని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన సూచించారు. చదువుతో ఆడపిల్లలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. బుధవారం స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఆడపిల్ల అంటే కేవలం బానిసత్వం, బరువుగా చూసే మనస్తత్వం నుంచి బయటకు వచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలన్నారు. సమాజంలో భద్రత లేదని, కుటుంబం మీద ఆర్థిక భారం పడుతుందేమో అనే ఆలోచనతో భ్రూణ హత్యలు చేయిస్తున్నారని, ఇది నేరమని పేర్కొన్నారు.

అమ్మా యిలు చదువుకుని తమ కాళ్ల మీద తాము నిలబడి రానున్న తరాలకు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ జుబేదా మాట్లాడుతూ.. జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి నిర్వహిస్తున్నప్పటికీ సమాజంలో అనుకున్న స్థాయిలో మార్పు రాలేదన్నారు. ప్రతి రోజూ మహిళా దేవతలకు పూజిస్తారని, అయితే ఇంట్లో ఉన్న సీ్త్రలకు మాత్రం ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉందన్నారు.

పాఠశాలల్లో ప్రైమరీ లెవల్‌ వరకు ఆడపిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌హెచ్‌సీ చైర్మన్‌ మాధవీ శ్యామల మాట్లాడుతూ.. ఆడపిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత హోదాలో ఉండాలన్నారు.

దిశ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ కుమారులకు అమ్మాయిలతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఏఏ అలవాట్లకు దూరంగా ఉండాలనే విషయాలను నేర్పాలన్నారు. అనంతరం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలు అందించారు.

తదనంతరం ‘నేటి ఆడపిల్ల.. రేపటి అమ్మ’ అనే బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ వెంకటలక్ష్మమ్మ, పీసీ పీఎన్‌డీటీ నోడల్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌, డెమో ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Published date : 27 Jan 2024 08:05AM

Photo Stories