Skip to main content

GPAT‌ 2022: ఫార్మా పీజీకి మార్గం.. ప్రతి నెల రూ.12,400 స్కాలర్‌షిప్‌..

జీప్యాట్‌.. గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ అప్టిట్యూడ్‌ టెస్ట్‌! జాతీయ స్థాయిలో.. నిర్వహించే ఈ ఎంట్రన్స్‌లో మంచి స్కోర్‌ సాధిస్తే.. దేశంలోని బెస్ట్‌ ఫార్మసీ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంఫార్మసీలో సీటు సొంతం చేసుకోవచ్చు! కోర్సు సమయంలో.. స్కాలర్‌షిప్‌ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాన్ని కూడా అందుకోవచ్చు!! ఇంతటి ప్రాధాన్యమున్న.. జీప్యాట్‌–2022కు నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో.. జీప్యాట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశ ప్రక్రియ, విజయానికి అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై విశ్లేషణ...
GPAT-2022 Notification Released
GPAT-2022 Notification Released
  • జీప్యాట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదల
  • బీఫార్మసీ విద్యార్థులకు చక్కటి కెరీర్‌ మార్గంæ
  • జీప్యాట్‌ స్కోర్‌తో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంఫార్మసీ ప్రవేశాలు
  • అడ్మిషన్‌ లభిస్తే నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్‌

బీఫార్మసీ విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలపై కొంత ఆందోళనతో ఉంటారు.ఎంఫార్మసీకి సంబం ధించి సీట్లు పరిమితంగా ఉన్నాయని భావిస్తుంటారు.కాని జీప్యాట్‌ స్కోర్‌తో దేశంలోని ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. జీప్యాట్‌కు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. గత రెండేళ్లుగా ఏటా దాదాపు యాభై వేల మందికిపైగా విద్యార్థులు జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

  • అర్హతలు: బీఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి. 2022లో బీఫార్మసీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు.

900కు పైగా కళాశాలలు

  • ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 900కు పైగా ఫార్మసీ కళాశాలల్లో జీప్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. వీటితోపాటు ఫార్మసీ ఉన్నత విద్యకు కేరాఫ్‌గా నిలుçస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌) క్యాంపస్‌ల్లో పీజీ కోర్సుల్లో చేరేందుకు జీప్యాట్‌లో అర్హత తప్పనిసరి. నైపర్‌ క్యాంపస్‌లలో ప్రవేశానికి జీప్యాట్‌ స్కోర్‌ అర్హతగా..నిర్వహించే నైపర్‌–జేఈఈ ఎంట్రన్స్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 
  • రాష్ట్రాల స్థాయిలో ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీ సీట్ల భర్తీలో ముందుగా జీప్యాట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ స్కోర్‌ ద్వారా సీట్లు భర్తీ అయిన తర్వాత మిగిలిన సీట్లనే పీజీఈసెట్‌లో ర్యాంకు సాధించిన వారికి కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయిస్తారు.

స్కాలర్‌షిప్‌ సదుపాయం

జీప్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంఫార్మసీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు రెండేళ్ల కోర్సు కాలంలో నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు. విద్యార్థులు పుస్తకాలు, ట్యూషన్‌ ఫీజు, విద్యాభ్యాసానికి సంబంధించిన ఇతర వనరులు సమకూర్చుకునే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

నాలుగు విభాగాల్లో జీప్యాట్‌

జీప్యాట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తున్నారు. పరీక్షలో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. 

జీప్యాట్‌ పరీక్ష విధానం

విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు
ఫార్మాస్యుటికల్‌ కెమిస్ట్రీ 38 152
ఫార్మాస్యుటిక్స్‌ 38 152
ఫార్మకోగ్నసీ 10 40
ఫార్మకాలజీ 28 112
ఇతర సబ్జెక్టులు 11 44
మొత్తం 125 500

విజయానికి కదలండిలా

జీప్యాట్‌లో విజయానికి అభ్యర్థులు ఆయా విభాగాలకు సంబంధించి బీఫార్మసీ స్థాయిలోని అకడమిక్స్‌ను, జీప్యాట్‌ సిలబస్‌తో అన్వయం చేసుకుంటూ చదవాలి. తద్వారా మంచి స్కోర్‌ సాధించే అవకాశం ఉంది.

ఫార్మకోగ్నసీ

ఇది పూర్తిగా థియరీతో కూడిన విభాగం. అభ్యర్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదివి షార్ట్‌ నోట్స్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చివరి దశ ప్రిపరేషన్‌లో ప్రయోజనం ఉంటుంది. ఆయా ఔషధాలకు సంబంధించిన భావనలు, విధానాలు, ప్రభావాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయాలి. ముఖ్యంగా.. గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, వాలటైల్‌ ఆయిల్స్, రెసిన్స్, టానిన్స్, కార్బొహైడ్రేట్స్, టిష్యూ కల్చర్, హెర్బల్‌ డ్రగ్స్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

ఫార్మకాలజీ

అభ్యర్థుల్లో ఎక్కువ మందికి ఫార్మకాలజీ విభాగంపై ఆసక్తి ఉంటుంది. జీప్యాట్‌లో దీనికి అధిక వెయిటేజీ లభిస్తుంది. ఇందులో డ్రగ్‌ ఇంటరాక్షన్, మెకానిజమ్స్, డ్రగ్స్‌–సైడ్‌ ఎఫెక్ట్స్‌(బాడీ పెయిన్స్‌ వంటి సాధారణ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కాకుండా)ను అధ్యయనం చేయాలి. డ్రగ్స్‌ను సంక్షిప్త నామాల్లో గుర్తుంచుకొనేందుకు డ్రగ్స్‌ వర్గీకరణ పాఠ్యాంశం ఉపయోగపడుతుంది. ఆంకాలజీ(కీమోథెరపీ డ్రగ్స్, నూతన టెక్నాలజీలు తదితరం),న్యూరో ఫార్మకాలజీ,అ రుదైన వ్యాధులు,కార్డియోవస్కులర్‌ అండ్‌ బ్లడ్‌ ప్రొడక్ట్స్‌ తదితర ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. 

ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్‌

జీప్యాట్‌లో కొంత సులభంగా ఉండే విభాగం.. ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్‌. దీనికి సంబంధించి భావనలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వీలైనన్ని ఎక్కువ సమస్యలు సాధించాలి. ఫార్ములాలను నోట్‌ చేసుకోవాలి. యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్, మాస్‌ స్పెక్టోస్క్రోపీ, క్రొమాటోగ్రఫీ, పోలరోగ్రఫీ అండ్‌ పొలారిమెట్రీ, ఫ్లేమ్‌ ఫోటోమీటర్, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పొటెన్షిమోమెట్రీ అంశాలపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి.

చ‌ద‌వండి: ఫార్మసీ విద్యార్థులకు ఎగ్జిట్ పరీక్ష

ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ

ఈ విభాగంలో ప్రశ్నలు ప్రాథమికంగా ఉంటాయి. కాన్సెప్టులపై అవగాహనతో సదరు ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా ఇందులో కర్బన రసాయన శాస్త్రంపై దృష్టిపెట్టాలి. ఎలక్టోఫ్రిలిక్, న్యూక్టోఫ్రిలిక్‌ రియాక్షన్స్, ఇంటర్మీడియెట్‌ రియాక్షన్స్‌ను అధ్యయనం చేయాలి. ఎస్‌ఏఆర్‌ ఆఫ్‌ స్టెరాయిడ్స్, నామ్‌నిక్లేచర్‌ అండ్‌ కెమికల్‌ మొయిటీ ఆఫ్‌ ది మెడికల్‌ డ్రగ్స్‌ గురించి అధ్యయనం చేయాలి.

ఫార్మాస్యుటిక్స్‌

జీప్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఈ విభాగం అత్యంత కీలకం. దీని అధ్యయనాన్ని రసాయనాలు, టాబ్లెట్ల సూత్రీకరణతో మొదలుపెట్టాలి. సూక్ష్మజీవులను హతమార్చే(స్టెరిలైజేషన్‌) నైపుణ్యాలు, న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. సర్ఫేస్‌ అండ్‌ ఇంటర్‌ ఫేషియల్‌ ఫినామినా, రియాలజీ, కైనటిక్స్‌ అండ్‌ డ్రగ్స్‌ స్టెబిలిటీ, బయోఫార్మాటిక్స్‌ అండ్‌ ఫార్మకోకైనటిక్స్‌ అంశాలను ప్రత్యేక దృష్టితో చదవాలి.

  • వీటితోపాటు స్పెక్ట్రోస్కోపీ–మాస్‌ స్పెక్ట్రోస్కోపీ, యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్‌ స్పెక్ట్రోస్కోపీ చాప్టర్లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. 
  • క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ డ్రగ్స్, షెడ్యూల్స్‌ ఆఫ్‌ డ్రగ్స్‌ చాప్టర్లకు వేర్వేరు నోట్సు రాసుకోవాలి. 
  • జీప్యాట్‌లో న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌ సంఖ్య పెరుగుతున్న విషయాన్ని గుర్తించి ఈ తరహా ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. ముఖ్యంగా బయో ఫార్మాస్యుటిక్స్, డిప్రెషన్‌ ఇన్‌ ఫ్రీజింగ్‌ పాయింట్, అలిగేషన్‌ మెథడ్, డోస్‌ ఆన్‌ ది బేసిస్‌ ఆఫ్‌ బాడీ వెయిట్‌ అండ్‌ ఏజ్‌ టాపిక్స్‌పై ప్రాబ్లమ్స్‌ ఎక్కువగా అడుగుతున్నారు.
  • గత ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులకు హాజరవ్వడం ద్వారా జీప్యాట్‌ ప్యాట్రన్‌పై అవగాహన ఏర్పడుతుంది. వెయిటేజీ, ప్రశ్నల తీరు తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

జీప్యాట్‌ తర్వాత

  • జీప్యాట్‌ స్కోర్‌కు మూడేళ్లపాటు గుర్తింపు ఉంటుందని జీప్యాట్‌ నిర్వాహక సంస్థ ఎన్‌టీఏ తెలుపుతోంది. అంటే.. ఇదే స్కోర్‌ ఆధారంగా.. రెండేళ్లపాటు ఎంఫార్మసీ అభ్యసించి ఆ తర్వాత పీహెచ్‌డీకి కూడా దరఖాస్తుకు చేసుకునే అవకాశం ఉంది. 
  • జీప్యాట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు సదరు స్కోర్‌ ఆధారంగా ఎంఫార్మసీలో ప్రవేశానికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఈ స్కోర్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి నేరుగా సీట్ల భర్తీ చేస్తున్నాయి. మరికొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నాయి. వాటిలోనూ చూపిన ప్రతిభ ఆధారంగా జీప్యాట్‌ స్కోర్‌కు వెయిటేజీ కల్పిస్తూ సీట్లు కల్పిస్తున్నాయి.

350కు పైగా స్కోర్‌

మొత్తం 500 మార్కులకు నిర్వహించే జీప్యాట్‌లో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 350కు పైగా స్కోర్‌తో బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకోవచ్చు. గత మూడు, నాలుగేళ్లుగా ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు ఖరారు చేసుకున్న అభ్యర్థుల కటాఫ్‌లే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇతర కేటగిరీ అభ్యర్థులు 125 నుంచి 200 మధ్యలో మార్కులు సాధించేలా కృషి చేస్తే ప్రవేశం లభిస్తుంది.

ఎంఫార్మసీ.. స్పెషలైజేషన్లు

జీప్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంఫార్మసీలో పలు స్పెషలైజేషన్లలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. పీజీలో ఫార్మకాలజీ, ఫార్మాస్యుటిక్స్, టాక్సికాలజీ, ఫార్మా మేనేజ్‌మెంట్, ఫార్మకోగ్నసీ స్పెషలైజేషన్‌లు పూర్తి చేస్తే అత్యున్నత అవకాశాలు అందుకోవచ్చు. ఎంఫార్మసీ పూర్తి చేసుకున్నాక.. డ్రగ్‌ డిస్కవరీ సంస్థలు, డ్రగ్‌ ఫార్ములేషన్‌ సంస్థలు, బల్క్‌ డ్రగ్‌ ప్రొడక్షన్‌ సంస్థల్లో సీనియర్‌ లెవల్‌లో అవకాశాలు లభిస్తాయి. జీప్యాట్‌తో పీజీ పూర్తి చేసిన తర్వాత పీహెచ్‌డీ వైపు అడుగులు వేస్తే భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది.
 

జీప్యాట్‌–2022 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 17, 2022
  • దరఖాస్తు సవరణకు అవకాశం: మార్చి 19 – మార్చి 21
  • జీప్యాట్‌ పరీక్ష తేదీ: మే నెలలో జరిగే అవకాశం
  • వెబ్‌సైట్‌: https://gpat.nta.nic.in, www.nta.ac.in


​​​​​​​విశ్లేషణ నైపుణ్యంతో విజయం

జీప్యాట్‌ అభ్యర్థులు విశ్లేషణ నైపుణ్యంతో తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలి. ముఖ్యంగా వెట్‌ కెమిస్ట్రీ, జనరల్‌ ఫార్మకాలజీ, టాక్సికాలజీ వంటి సబ్జెక్ట్‌ల విషయంలో విశ్లేషణాత్మక నైపుణ్యం ఎంతో మేలు చేస్తుంది. గత ప్రశ్న పత్రాల అధ్యయనం ద్వారా అభ్యర్థులకు ప్రశ్నల శైలిపై అవగాహన పెంచుకోవచ్చు. ఫార్మా విద్యార్థులకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. నైపుణ్యాలకు అనుగుణంగా ఫార్మా సంస్థలు, హాస్పిటల్స్, హెల్త్‌కేర్‌ అనుబంధ సంస్థలు, రీసెర్చ్‌ ల్యాబ్స్‌లో ఉద్యోగాలు లభించడం ఖాయం. 
–ప్రొ‘‘ ఎస్‌.జ్ఞానధాము, హెచ్‌ఓడీ, ఫార్మాస్యుటికల్‌ అనాలిసిస్, నైపర్‌


​​​​​​​చ‌ద‌వండి: 
NTA-GPAT 2022: ఎంఫార్మా/తత్సమాన కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
NTA-CMAT-2022: మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

Published date : 28 Feb 2022 05:17PM

Photo Stories