Skip to main content

National Olympiads: ఇందులో ప్రతిభ చూపిన వారికి... స్కాలర్‌షిప్స్, ప్రవేశాల్లో ప్రాధాన్యం

Science and Mathematics Olympiads(2021–22)
Science and Mathematics Olympiads(2021–22)

సైన్స్, మ్యాథమెటిక్స్‌లపై ఆసక్తి ఉన్న హైస్కూల్, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చూపేందుకు మార్గం.. నేషనల్‌ ఒలింపియాడ్స్‌!! దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థ.. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో పనిచేసే హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌.. ప్రతి ఏటా ఈ ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తోంది. తాజాగా 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి సైన్స్, మ్యాథమెటిక్స్‌ ఒలింపియాడ్స్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఒలింపియాడ్స్‌తో ప్రయోజనాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియపై ప్రత్యేక కథనం...

 

  • 8–12 తరగతుల విద్యార్థులకు నేషనల్‌ ఒలింపియాడ్స్‌ ప్రోగ్రామ్‌
  • హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ
  • పరీక్షల్లో ప్రతిభతో అంతర్జాతీయ వేదికల్లో పాల్గొనే అవకాశం
  • నగదు, స్కాలర్‌షిప్స్, ప్రవేశాల్లో ప్రాధాన్యం తదితర ప్రోత్సాహకాలు
  • ఒలింపియాడ్స్‌ 2021–2022కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

సైన్స్,మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహించాలి. ఫలితంగా వారు భవిష్యత్తులో పరిశోధనల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఇందుకు మార్గం వేసేవే.. ఒలింపియాడ్స్‌. దేశంలో నేషనల్‌ ఒలింపియాడ్స్‌ను హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తోంది.8,9,10,11,12 తరగతుల విద్యార్థు లకు పలు దశలుగా ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 

ఒలింపియాడ్స్‌.. ప్రయోజనాలు

  • ఒలింపియాడ్స్‌ విజేతలకు స్కాలర్‌షిప్‌ ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుంది.
  • వీటితోపాటు నగదు బహుమతులూ అందుతాయి.
  • మ్యాథ్స్, ఫిజిక్స్‌లో జాతీయ స్థాయి ఒలింపియాడ్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేరుగా బీఎస్సీలో ప్రవేశం కల్పిస్తారు.
  • ఐఎన్‌ఎంఓ(ఇండియన్‌ నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌) విజేతలు ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో..బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్,బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ల్లో ప్రవేశానికి నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

చక్కటి అవకాశం

సైన్స్, మ్యాథ్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఒలింపియాడ్స్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. స్కూల్‌ స్థాయి నుంచే ఇన్నోవేషన్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు అలవడతాయి. ఒలింపియాడ్స్‌ విజేతలకు ఉన్నత విద్య ప్రవేశాల్లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ప్రాధాన్యం ఇస్తున్నాయి. హోమీబాబా సెంటర్‌లో నిర్వహించే ఓరియెంటేషన్, ట్రైనిం గ్‌ క్యాంపుల సమయంలో విద్యార్థులు పరిశోధనల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కూడా లభిస్తోంది. 
–ప్రొ‘‘ ఎస్‌.శ్రీనాథ్, ఐఏపీటీ సభ్యులు, స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

ముందుగా.. ఐఓక్యూ
జాతీయ స్థాయిలో సైన్స్, మ్యాథమెటిక్స్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు ముందుగా.. ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌(ఐఓక్యూ) పరీక్ష నిర్వహిస్తారు. వాస్తవానికి గతంలో రీజనల్‌ ఒలింపియాడ్స్‌ నిర్వహించి.. అందులో ప్రతిభ చూపితే ఐఓక్యూకు ఎంపిక చేసేవారు. కరోనా పరిణామాల కారణంగా గతేడాది నుంచి నేరుగా ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు.

ఐఓక్యూ ఇలా
జాతీయ స్థాయిలో నిర్వహించే ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ పరీక్ష రెండు పార్ట్‌లుగా(పార్ట్‌–1, పార్ట్‌–2)గా ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం అయిదు సబ్జెక్ట్‌లో నిర్వహిస్తారు. అవి..ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జూనియర్‌ సైన్స్, ఫిజిక్స్‌. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్‌లలో పరీక్ష రాయాలనుకుంటే.. దరఖాస్తు సమయంలోనే తమ సబ్జెక్ట్‌ ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. 

పార్ట్‌–1 ఎన్‌ఎస్‌ఈ ఇలా
ఐఓక్యూ పార్ట్‌–1నే నేషనల్‌ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌ఎస్‌ఈ)గా పిలుస్తున్నారు. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం 75 నిమిషాలు. ప్రశ్నలు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది.

పార్ట్‌–2.. ఐఎన్‌ఓ
ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌లో భాగంగా.. పార్ట్‌–2గా.. ఇండియన్‌ నేషనల్‌ ఒలింపియాడ్‌(ఐఎన్‌ఓ)నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఈ పరీక్ష సబ్జెక్ట్‌ వారీగా పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఆయా సబ్జెక్ట్‌లపై విద్యార్థుల నైపుణ్యం, సునిశిత పరిశీలన, విశ్లేషణ, అప్లికేషన్‌ అప్రోచ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ను పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. ఇలా..మొత్తం అయిదు సబ్జెక్ట్‌లలో(ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జూనియర్‌ సైన్స్, ఫిజిక్స్‌) పార్ట్‌–2 పరీక్ష ఉంటుంది. 

ప్రశ్నల సంఖ్యలో మార్పులు

  • పార్ట్‌–2లో ప్రతి ఏటా ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించిన మార్కులు, ప్రశ్నల సంఖ్యలో మార్పులు చేస్తుంటారు.
  • గత ఏడాది ఫిజిక్స్‌లో 11 ప్రశ్నలు–75 మార్కులకు పరీక్ష నిర్వహించారు. 
  • కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ను 5 ప్రశ్నలతో 79 మార్కులకు జరిపారు. 
  • బయాలజీని రెండు సెక్షన్లుగా నిర్వహించి.. సెక్షన్‌–ఎలో ఒక మార్కు ప్రశ్నలు 30, సెక్షన్‌–బిలో 50 మార్కులకు 22 ప్రశ్నలు అడిగారు. 
  • ఆస్ట్రానమీకి సంబంధించి మొత్తం 5 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష నిర్వహించారు. 
  • జూనియర్‌ సైన్స్‌ను 100 మార్కులకు రెండు సెక్షన్లుగా నిర్వహించారు. సెక్షన్‌–1లో 12 ప్రశ్నలు, సెక్షన్‌–2లో 9 ప్రశ్నలు అడిగారు. nఅంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ ప్రశ్నల సంఖ్య, మార్కుల్లో మార్పు స్పష్టమవుతోంది.

ఐఓక్యూలో ప్రతిభ
ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ పరీక్షలోని పార్ట్‌–2లో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఆయా సబ్జెక్ట్‌లకు నిర్వహించే అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు అర్హులైన విద్యార్థులను గుర్తిస్తారు. బయాలజీ, కెమిస్ట్రీ, జూనియర్‌ సైన్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ల నుంచి 35 మంది చొప్పున, ఆస్ట్రానమీ నుంచి 50 మందిని అర్హులుగా పేర్కొంటారు. 

ఓఎస్‌ఎస్‌సీ
ప్రతి సబ్జెక్ట్‌ నుంచి నిర్దేశిత సంఖ్యలో అర్హులను గుర్తించి.. వారికి హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో.. ఓరియెంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌ (ఓఎస్‌ఎస్‌సీ)కు ఎంపిక చేస్తారు. ఈ సమయంలో హోమీబాబా రీసెర్చ్‌ సెంటర్‌లో థియరీ, ప్రాక్టికల్‌ తరగతుల్లో శిక్షణనిస్తారు. 

ప్రీ డిపార్చర్‌ క్యాంప్‌
ఓరియెంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ క్యాంప్‌లో ఆయా సబ్జెక్ట్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా.. అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణనిస్తారు. సబ్జెక్టుకు నాలుగు నుంచి ఆరుమంది విద్యార్థులకు ప్రీ డిపార్చర్‌ క్యాంప్‌ పేరుతో ఈ ట్రైనింగ్‌ ఉంటుంది. 

ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌
క్వాలిఫయర్‌ ఒలింపియాడ్‌ నుంచి ప్రీ డిపార్చర్‌ వరకూ.. ప్రతిభ చూపిన వారికి ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సైన్స్‌ ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌లో విజేతలను నిర్ణయించే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. నాలుగైదు గంటల వ్యవధిలో అభ్యర్థులకు థియరీ,ప్రాక్టికల్‌ ఆధారిత సమస్యలు ఇస్తారు. వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరించిన వారే విజేతలుగా నిలుస్తారు. 


మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ ప్రత్యేకంగా

  • హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌.. మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌లో వివిధ దశలు ఉంటాయి. 
  • మొదటి దశలో ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌(ఐఓక్యూఎం)పేరుతో మూడు గంటల వ్యవధిలో 30 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు.
  • రెండో దశలో ఇండియన్‌ నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌(ఐఎన్‌ఎంఓ)ను నిర్వహిస్తారు. ఆరు ప్రశ్నలతో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం నాలుగు గంటలు. 
  • ఐఎన్‌ఎంఓలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మెరిట్‌ జాబితాను అనుసరించి 30 నుంచి 35మంది విద్యార్థులకు ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌ నిర్వహిస్తారు. ఈ శిక్షణ సమయంలో అత్యున్నత ప్రతిభ చూపిన అయిదుగురు విద్యార్థులను ఇంటర్నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ ఒలింపియాడ్‌కు ఎంపిక చేస్తారు.
  • ఇంటర్నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ ఒలింపియాడ్‌ పరీక్ష రెండు దశల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తారు. ఇది నాలుగున్నర గంటల పాటు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది.

 
2021–22కు దరఖాస్తు ప్రక్రియ

  • సైన్స్, మ్యాథమెటిక్స్‌ నేషనల్‌ ఒలింపియాడ్‌కు సంబంధించి 2021–22 సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఎన్‌రోల్‌మెంట్‌: సెప్టెంబర్‌ 25–అక్టోబర్‌ 31,2021.
  • అర్హత: ఈ విద్యా సంవత్సరంలో 8 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 
  • వయసు: జూలై 1, 2002–జూన్‌ 30, 2007 మధ్య జన్మించి ఉండాలి.
  • జూనియర్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో 8, 9,10 తరగతులు చదువుతూ.. జనవరి1, 2007, డిసెంబర్‌ 31,2008 మధ్యలో జన్మించి ఉండాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు వెబ్‌సైట్‌: https://reg.ioqexam.in
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://olympiads.hbsce.tifr.res.in

ఒలింపియాడ్స్‌.. పరీక్ష తేదీలు

  • ఐఓక్యూ ఇన్‌ జూనియర్‌ సైన్స్‌: జనవరి 9, 2022(మధ్యాహ్నం 2:30 నుంచి 6 గంటల వరకు)
  • ఐఓక్యూ ఇన్‌ ఫిజిక్స్‌: జనవరి 16,2022 (ఉదయం 9 నుంచి 12:30 వరకు)
  • ఐఓక్యూ ఇన్‌ బయాలజీ: జనవరి 16,2022 (మధ్యాహ్నం 2:30 నుంచి 6 వరకు)
  • ఐఓక్యూ ఇన్‌ ఆస్ట్రానమీ: జనవరి 23,2022(ఉదయం 9 నుంచి 12 వరకు)
  • ఐఓక్యూ ఇన్‌ కెమిస్ట్రీ: జనవరి 23,2022 (మధ్యాహ్నం 2:30 నుంచి 6 వరకు)
  • ఇఓక్యూ ఇన్‌ మ్యాథమెటిక్స్‌: జనవరి 9, 2022
  • ఇండియన్‌ నేషనల్‌ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌(ఐఎన్‌ఎంఓ): ఫిబ్రవరి 27, 2022


చ‌ద‌వండి: NID DAT 2022: ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌...

Published date : 26 Oct 2021 06:56PM

Photo Stories