Telugu Grammar for DSC Exams : డీఎస్సీ పోటీ పరీక్షలకు తెలుగు సంధులు, వ్యాకరణ పరిభాషలు..
సంధులు
1. పడ్వాది సంధి: పడ్వాదులు పరమైనప్పుడు ‘ము’ వర్ణమునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు. (పడు + ఆదులు = పడు, పాటు, పెట్టు, పరచు మొదలైనవి పడ్వాదులు. ఇవి పరమైనప్పుడు పూర్వపదంలోని ము వర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషగా వస్తాయి)
ఉదా: భయము + పడు = భయపడు, భయంపడు, భయముపడు. మూడు రూ΄ాలు వచ్చాయి. అవి.. ము వర్ణలోపం; పూర్ణ బిందువు; స్వత్వ రూపం.
2. ప్రాఁతాధి సంధి:
i. ప్రాఁతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు (ప్రాఁతాదులు,ప్రాఁత, లేత, కొత్త మొదలైనవి)
ఉదా:ప్రాఁత + ఇల్లు=ప్రాయిల్లు. లోపం బహుళమైనందున లోపించిన రూపం, లోపించని రూపం రెండూ వచ్చాయి.
ii. లుప్త శేషమునకు పరుషములు పరమైనప్పుడు నుగాగమంబగు. ఉదా: చెను +తొవ. ద్రుత ప్రకృతికం మీది పరుషం సరళమవుతుంది.
ఉదా: చె + న్ + దొవ = చెందొవ
ద్రుత సరళాదేశ సూత్రాలు వర్తించి చెందొవ రూపం వస్తుంది.
మీదు+కడ=మీఁగడ రూపంప్రాఁతాది సూత్రాలు, ద్రుత సరళాదేశ సూత్రాల వల్ల వస్తుంది.
iii. కొత్త శబ్దాల ఆద్యక్షర శేషమున కొన్ని యెడల నుగాగంబును. కొన్ని యెడల మీద హల్లునకు ద్విత్వంబునగు.
ఉదా: క్రొత్త + పసిడి = క్రొంబసిడి రూపం.
నుగాగమం వచ్చి సరళాదేశ సంధి చేత క్రొంబసిడి రూపం వస్తుంది.
క్రొత్త + క్కారు = క్రొక్కారు
(ద్విత్వ రూపం) (త్తకారం లోపం)
iv. అన్యంబులకు సహిత ఐక్కార్యంబు కొండొకచో కానంబడియెడు
ఉదా: పది + తొమ్మిది = పందొమ్మిది
పాత, కొత్త, లేత వంటి ప్రాఁతాది కార్యాలకే కాకుండా ఇతరమైన వాటికి కూడా ఈ సూత్రాలు వర్తిస్తాయని చెప్పడానికి ఈ సూత్రాన్ని చెప్పారు.
పది + తొమ్మిది అనే దానికి ప్రాఁతాది సూత్రాలు, సరళాదేశా సంధి సూత్రాలు వర్తించి పందొమ్మిది రూపం వచ్చింది.
3. లు, ల, నల సంధి: లు, ల, నలు పరమగు నప్పుడు ఒకానొకచో ‘ము’వర్ణానికి లోపం, తత్పూర్య స్వరానికి దీర్ఘం విభాషనగు.
ఉదా: వజ్రము+లు=వజ్రాలు, వజ్రములు
ముఖము + న = ముఖాన, ముఖమున
మీసము + ల = మీసాల, మీసముల
వ్యాకరణ పరిభాషలు
చిన్నయసూరి తెలుగు భాషకు ప్రామాణిక మైన బాల వ్యాకరణాన్ని రచించారు. బాల వ్యా కరణ పరిచ్ఛేదాల్లో కొన్ని వ్యాకరణ పరిభాషలు ప్రయోగించారు. పరిభాషలనే ΄ారిభాషిక పదా లంటారు. పారిభాషిక పదాలు తెలిస్తేనే బాల వ్యాకరణం అర్థమవుతుంది. డీఎస్సీ, టెట్ పరీక్ష లకు కూడా వ్యాకరణ పరిభాషలు ముఖ్యం. గత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్‌లో ఐదు ప్రశ్నలు అడిగారు. కొన్ని ముఖ్యమైన వ్యాకరణ పరిభాషలను పరిశీలిద్దాం.
1. సంధి: పూర్వ, పర స్వరాలకు పరస్పరం ఏకాదేశమవడాన్ని సంధి అంటారు.
ఉదా: రాముడు + అతడు= రాముడతడు
(డ్ + ఉ పూర్వ స్వరం + ‘అ’ పరస్వరం, పూర్వ, పర స్వరాలు రెండింటికి లోపం వచ్చి పరస్పరమైన ‘అ’ కారం ఏకాదేశంగా
వచ్చింది)
2. ఆగమం: ఒక అక్షరం అదనంగా మిత్రుడిలా వచ్చి చేరడాన్ని ఆగమం అంటారు.
ఉదా: పేద + ఆలు = పేదరాలు. ఇందులో ‘ర్’ కారం ఆగమంగా వచ్చింది.
3. ఆదేశం: ఉన్న ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో వేరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు.
ఉదా: తల్లి + తండ్రి = తల్లిదండ్రులు.
‘త’ కారం స్థానంలో ‘ద’ కారం ఆదేశమైంది.
4. మహద్వాచకం: పురుషులను సంబోధించే పదాలు, వాటి విశేషాలను తెలియజేసేవి మహద్వాచకాలు.
ఉదా: కృష్ణుడు, రాముడు, భాగ్యవంతుడు, గుణవంతుడు.
5. మహతీవాచకం: స్త్రీలను, వారి విశేషాలను తెలియజేసేవి మహతీవాచకాలు.
ఉదా: రమ, ధీరురాలు
6. అమహద్వాచకం: పశుపక్ష్యాదులు, జడా దులు వాటి విశేషాలను తెలియజేసేవి అమహద్వాచకాలు.
ఉదా: గోవు, పర్వతం మొదలైనవి.
7. శబ్ద పల్లవం: రెండు ధాతువులు కలిసి కొత్త అర్థాన్ని ఇస్తే దాన్ని శబ్ద పల్లవం అంటారు.
ఉదా: మేలు + కొను= మేలుకొను
8. భావార్థకం: క్రియ అర్థాన్ని తెలియజేసేది భావార్థకం. ఇందులో క్రియకు ‘ట’ ప్రత్యయం చేరుతుంది.
ఉదా: వచ్చుట, చూచుట.
9. వ్యతిరేక భావార్థకం: క్రియ వ్యతిరేకార్థాన్ని తెలిపేది వ్యతిరేక భావార్థకం. ఇందులో క్రియకు ‘అమి’ చేరుతుంది.
ఉదా: వండు + అమి = వండమి
వ్రాయు + అమి = వ్రాయమి
10. అవ్యయం: లింగ, విభక్తి, వచనరహిత మైంది అవ్యయం.
ఉదా: అయ్యో!, కాబట్టి, కావున మొదలైనవి.
11. ఉపధ: ఒక పదంలో చివరి అక్షరానికి ముందున్న వర్ణాన్ని ‘ఉపధ’ అంటారు.
ఉదా: అర్చి (అర్ + చ్ + ఇ) ‘చ్’ కారం ఉపధ.
12. ఉత్తమం: మూడు లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదంలో చివరి అక్షరాన్ని ఉత్తమం అంటారు.
ఉదా: పందిరి (రి) ఉత్తమం.
13. ఉపోత్తమం: మూడు లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదంలో చివరి అక్షరానికి ముందున్న అక్షరం ఉపోత్తమం.
ఉదా: పందిరి. ‘ది’ ఉపోత్తమం.
14. కారకం: క్రియతో అన్వయాన్ని కలిగించేది కారకం. కారకాన్ని అనుసరించి విభక్తులు చేరతాయి. కారకాలు ఆరు విధాలు.
15. తద్ధితాంతం: కొన్ని నామవాచకాలకు అర్థ విశేషాలు తెలిపేందుకు చేరే ప్రత్యయాలను తద్ధితాలంటారు.
ఉదా: తనం (తద్ధితం).
మంచితనం (తద్ధితాంతం)
16. వర్ణం: కొన్ని ధ్వనుల సముదాయం వర్ణం, అర్థబేధక శక్తి కలిగిన కనిష్ట భాషాంశం వర్ణం.
ఉదా: క–గ–న–త
17. పదం: అర్థ భేదక వర్ణాల సమూహమే పదం.
ఉదా: పలక, అలక, నలక, గిలక మొదలైనవి.
18. పదాంశం: భాషలో అర్థవంతమైన కనిష్ట రూపం పదాంశం.
ఉదా: బొమ్మ+లు = బొమ్మలు
బొమ్మలు అనే దాంట్లో బొమ్మ+లు
రెండు పదాంశాలున్నాయి.
19. స్వర భక్తి లేదా విప్రకర్ష: భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడాన్ని స్వరభక్తి అంటారు. దీన్నే ‘విప్రకర్ష’ లేదా ‘వికర్ష’ అంటారు. ఉదా: మర్యాద – మరియాద,
తర్వాత – తరువాత
20. వర్ణ వ్యత్యయం: ఉచ్ఛారణ వేగం, అశ్రద్ధ, అజ్ఞానం, తడబాటు, తొట్రుపాటు వల్ల అక్షరాలు తారుమారు కావడాన్ని వర్ణ వ్యత్యయం అంటారు.
ఉదా: నవ్వులాట – నవ్వుటాల
పావురం – రువం
1. చెందొవను విడదీస్తే? (ఎస్‌ఏ – 2012)
1) చెన్ను + తొవ 2) చెందు + ఒవ
3) చెంగు + తొవ 4) తొవ + తొవ
2. జయంతి + ఉత్సవం = ? (ఎల్‌పీ – 2012)
1) జయంతోత్సవం
2) జయంత్యుత్సవం
3) జయంత్యోత్సవం
4) జయంతుత్సోవం
3. అయోమయం అనే పదాన్ని విడదీసి రాస్తే? (టెట్ 2012 – జనవరి)
1) అయమ్ + మయం
2) అయ + మయం
3) అయో + మయం
4) అయః + మయం
4. భానూదయం అనే మాటలో సంధి? (టెట్ 2012 – జూన్)
1) సవర్ణదీర్ఘసంధి 2) ఉత్వ సంధి
3) గుణ సంధి 4)యణాదేశ సంధి
5. కులాంతకుడు పదంలోని సంధి? (టెట్ – 2014)
1)గుణ సంధి 2) అకార సంధి
3) సవర్ణదీర్ఘ సంధి 4) ఉత్వ సంధి
6. తూగుటుయ్యేల – పదాన్ని విడదీస్తే? (టెట్ – 2014)
1) తూగుటు + ఉయ్యేల
2) తూగు + ఉయ్యేల
3) తూగుటుయ్య + ఏల
4) తూగుట + ఏల
7. స్వర విభక్తికి ఉదాహరణలు? (ఎస్‌ఏ – 2012)
1) నిత్తెము– సత్తెము
2) గోధుమ, వదిన
3) చందురుడు– అలుపము
4) ఉవిద, కస్తూరి
8. ‘మేలుకొను, విజయం చేయు’ అను పద బంధాలు? (ఎస్‌ఏ – 2012)
1) ధాతువులు 2) నామవాచకాలు
3) శబ్దపల్లవాలు 4) సమాసాలు
9. ‘సంప్రదానము’ అనే వ్యాకరణ పరిభాషకు అర్థం? (ఎస్‌ఏ – 2012)
1) గ్రహణము 2) అపాయము
3) ఉపయోగము 4) త్యాగోద్దేశ్యము
10. ప్రత్యయాలు తెలుగులో ఎలా చేరతాయి? (ఎల్‌పీ – 2012)
1) ధాతువుకు ముందు చేరతాయి
2) ధాతువుకు తర్వాత చేరతాయి
3) ధాతువునే తమలో చేర్చుకుంటాయి
4) ధాతువుకు మధ్యలో చేరతాయి
11. ప్రత్యయానికి నిబద్ధమైన రూపం? (ఎల్‌పీ – 2012)
1) పదం 2) ప్రాతిపదిక
3) సపదాంశం 4) పదాంశం
12. ఉపధకు ముందున్న వర్ణం? (ఎల్‌పీ – 2012)
1) ఉత్తమం 2) ఉ΄ోత్తమం
3) ప్రాతిపదిక 4) ఉపధ
13. ఒకే వర్ణానికి సంబంధించిన సన్నిహిత ధ్వనులు? (ఎల్‌పీ – 2012)
1) భిన్న వర్ణాలు 2) సవర్ణాలు
3) సధ్వనులు 4) వర్ణాలు
సమాధానాలు
1) 1; 2) 2; 3) 4; 4) 1; 5) 3;
6) 2; 7) 3; 8) 3; 9) 4; 10) 2;
11) 2; 12) 2; 13) 2.
Tags
- Telugu grammar
- DSC exam
- competitive exams preparation
- grammatical terms in dsc exam
- telugu grammar preparation
- telugu subject in dsc exam
- dsc exam preparation
- telugu grammar topics for dsc exams
- Telugu SA and SGT
- DSC SGT
- dsc sa and sgt
- teacher posts
- Education News
- Sakshi Education News
- previous questions for telugu grammar
- telugu grammar previous questions for dsc exam
- preparatory questions for telugu grammar in for dsc exams