Skip to main content

Telugu Material for TET and DSC : టెట్‌/డీఎస్సీ పరీక్షల్లో అత్యంత కీలకం.. అర్థ వ్యాకోచానికి ఉదాహరణలు?

DSC and TET exams for teacher posts based exams material

అర్థ పరిణామం
భాషలోని వర్ణాలు,ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం మారినట్లుగానే అర్థాలు కూడా మారడం సహజం. నన్నయ భారతంలో ‘కంపు’ అనే పదాన్ని వాసన అనే అర్థంలో వాడారు. నేటి భాషలో అది చెడు వాసన అనే అర్థంగా మారింది. ప్రతి పదానికీ చరిత్ర ఉంది. ఒక మాటకు ఒకే అర్థం కాకుండా అనేకార్థాలుంటాయి. కొత్త కొత్త భావాలు, ఆలోచనలు, అవసరాలు వచ్చినప్పుడు ఉన్న పదాలనే కొత్త సందర్భాల్లో వాడటం వల్ల కొత్త అర్థాలు ఏర్పడటం సహజం. పాతకాలంలో ఇల్లు అంటే పూరిల్లు అనే అర్థం ఉండేది. ఆధునిక కాలంలో ఇల్లు అంటే పెంకుటిల్లు, డాబా, మేడ, అపార్ట్‌మెంట్‌ అనే అర్థాల్లో రూఢమైంది.

అర్థ పరిణామానికి హేతువులు
అర్థ పరిణామానికి స్థూలంగా ప్రధానమైన ఐదు కారణాలను పేర్కొనవచ్చు. అవి..
● నాగరికతలో మార్పు రావడం 
చారిత్రక కారణాల వల్ల కొన్ని పదాలు
   ప్రసిద్ధిలోకి వచ్చి అర్ధాంతరంలో ఉపయో
   గించడం వల్ల
అలంకారిక ప్రయోగం 
పరిసరాల్లో మార్పు రావడం 
భావాభివ్యక్తిలో మార్పు
ఇవేకాకుండా ప్రకరణార్థాలు, నానార్థాలు, శ్లేషార్థాలు, పలుకుబడులు, జాతీయాలు, వ్యాకరణార్థాలు, పర్యాయపదాల వల్ల అర్థాల్లో మార్పు వస్తుంది.

అర్థ పరిణామ భేదాలు
భాషావేత్తలు.. అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం, అర్థ సౌమ్యత లేదా అర్థ గౌరవం, అర్థ గ్రామ్యత లేదా అర్థాపకర్ష, లక్ష్యార్థాలు, కేవల సంకేతార్థాలు, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగం, లోక నిరుక్తి వంటి బేధాలను పేర్కొన్నారు. వాటిని పరిశీలిద్దాం..

అర్థ వ్యాకోచం లేదా అర్థ విస్తృతి
ఒక పదం పాతకాలంలో పరిమితార్థంలో ఉండి, తర్వాత కాలంలో విశాలార్థంలో విస్తృతం కావడాన్ని అర్థ వ్యాకోచం లేదా అర్థ విస్తృతిగా పేర్కొనవచ్చు. ఆంగ్లంలో దీన్ని Extention of the meaning అంటారు. అర్థ వ్యాకోచానికి కొన్ని ఉదాహరణలు..
● చెంబు: రాగి లోహంతో చేసిన దాన్నే ప్రాచీన కాలంలో చెంబు అనేవారు. నేడు ఏ లోహంతో చేసినా చెంబు అంటున్నారు. ప్రత్యేకార్థం నుంచి విస్తృతార్థంలో ఇత్తడి చెంబు, ప్లాస్టిక్‌ చెంబు, వెండి చెంబు అని వ్యవహరిస్తున్నారు.
● నూనె: ప్రాచీన కాలంలో నువ్వుల నుంచి తీసినదాన్నే నూనెగా పరిమితార్థంలో వ్యవహరించేవారు. ప్రస్తుతం  వేరుశెనగ, కొబ్బరి, సన్‌ఫ్లవర్‌ నుంచి తీసిన వాటిని కూడా నూనెగానే సామాన్య అర్థంలో వాడుతున్నారు. 
● అష్టకష్టాలు: ప్రాచీన కాలంలో ఎనిమిది రకాలైన కష్టాలను పేర్కొన్నారు. అవి.. 1) దేశాంతర గమనం (విదేశాలకు వెళ్లడం) 2) భార్యా వియోగం 3) ఆపదల్లో బంధు దర్శనం 4) శత్రుస్నేహం 5) నీచ ఉచ్ఛిష్ట భోజనం 6) పరాన్న భోజన ప్రతీక్షణం 7) అప్రతిష్ట 8) దారిద్య్రం. నేడు వీటినే అసంఖ్యాకమైన కష్టాలు అనే అర్థంలో వాడుతున్నారు.
● అవధాని: ప్రాచీన కాలంలో అవధానం చేసే వ్యక్తినే అవధాని అనేవారు. నేడు బ్రాహ్మణుల పేర్ల చివర అవధాని చేరుతోంది. ఇక్కడ అర్థ విస్తృతి జరిగింది.
● కమ్మలు: ప్రాచీన కాలంలో తాటి ఆకులతో చేసి చెవులకు ధరించే ఆభరణాలనే కమ్మలనేవారు. నేడు చెవులకు ధరించే బంగారం, వెండి, ప్లాస్టిక్‌ ఆభరణాలన్నింటినీ విస్తృతార్థంలో కమ్మలంటున్నారు.

అర్థ సంకోచం
ప్రాచీన కాలంలో విస్తృతార్థంలో ఉండి నేడు పరి­మితార్థానికి వచ్చిన పదాలను అర్థ సంకోచం అంటారు.అర్థం కుంచించుకుపోవడమే అర్థ సంకోచం. 
ఉదాహరణ:
 ప్రాచీన కాలంలో స్త్రీ, పురుషులిద్దరూ ధరించే వస్త్రాలను చీర, కోక అనేవారు. ఇప్పుడు కేవలం స్త్రీలు ధరించే వస్త్రాలు అనే అర్థంలో  పరిమితమయ్యాయి.
● పూర్వం అవ్వ అనే పదాన్ని స్త్రీ అనే సామాన్య అర్థంలో వాడేవారు. ఇప్పుడు కేవలం వృద్ధ స్త్రీ అనే అర్థానికే పరిమితమైంది.
● పని, ప్రయత్నం అనే అర్థంలో ప్రాచీనకాలంలో ఉద్యోగం అనే పదం వాడేవారు. నేడు కేవలం ప్రభుత్వ, ప్రైవేటు, పారిశ్రామిక సంబంధమైన సంస్థల్లో చేసే ఉద్యోగం అనే అర్థంలో పరిమితమైంది. 
● శ్రాద్ధం: దీనికి పూర్వం శ్రద్ధతో చేసే పని అనే అర్థం ఉండేది. ఇప్పుడు చనిపోయిన వారికి నిర్వహించే కర్మకాండగా రూఢమైంది.
● అర్థ సంకోచం జరిగిన కొన్ని పదాలు: వ్యవసాయం, మృగం, ఆరాధ్యుడు, సంభావన, నెయ్యి, సాహెబ్, జంగమ, కర్మ.

అర్థ సౌమ్యత లేదా అర్థ గౌరవం లేదా అర్థోత్కర్ష
పూర్వకాలంలో నిందార్థంలో వాడిన పదాలు కాలక్రమంలో విశిష్టార్థ బోధకాలై వాటికి అర్థ గౌరవం కలిగినప్పుడు వాటిని అర్థ సౌమ్యత లేదా అర్థ్ధోత్కర్ష అంటారు.
ఉదాహరణలు:
● సభికులు: ప్రాచీన కాలంలో జూదగాళ్లు అనే అర్థంలో వాడేవారు. నేడు సభలోని వారు అనే గౌరవార్థంలో వాడుతున్నారు.
● వైతాళికులు: పూర్వం రాజును నిద్రలేపే వారు అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం సంస్కర్తలు, మూఢాచారాలపై అవగాహన కలిగించేవారు అనే గౌరవార్థంలో వాడుతున్నారు.
● ముహూర్తం: గతంలో నిమిష కాలం, అల్పకాలం అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం పవిత్రమైన శుభకార్యాలు నిర్వహించే కాలం అనే అర్థంలో రూఢమైంది.
● మర్యాద: ‘హద్దు’ అనే అర్థంలో ఉండేది. నేడు గౌరవం అనే అర్థంలో వాడుతున్నారు.
● అదృష్టం: కనిపించనిది అనే అర్థం ఉండేది. నేడు సంపద, భాగ్యం అనే అర్థంలో ఉంది.
● అంతస్తు: మేడ పై భాగం అనే అర్థంలో పూర్వం వాడేవారు. ప్రస్తుతం పరువు, ప్రతిష్ట అనే అర్థ గౌరవాన్ని సంతరించుకుంది. 
● ఆంగ్లంలో Knight అనే పదం Servant అనే అర్థంలో పాతకాలంలో ఉండేది. ప్రస్తుతం ప్రజ్ఞాశాలి అనే అర్థంలో వాడుతున్నారు. 
● nice అనే పదం stupid అనే అర్థంలో ఉండేది. నేడు అందమైన అనే అర్థంలో వాడుతున్నారు. 

అర్థ గ్రామ్యత లేదా అర్థాపకర్ష లేదా అర్థ న్యూనత 
ప్రాచీనకాలంలో గౌరవార్థంలో ఉండి కాలక్రమంలో నిందార్థంలో ప్రయోగిస్తున్న పదాలను అర్థ గ్రామ్యత లేదా అర్థాపకర్ష అంటారు.
● కంపు: ఒకనాడు సువాసన అనే అర్థం ఉండేది. ప్ర స్తుతం దుర్వాసన అనే అర్థంలో వాడుతున్నారు.
● ఛాందసుడు: పూర్వకాలంలో వేద పండితుడు అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం అమాయకుడు, లోకజ్ఞానం లేనివాడు అనే నిందార్థంలో వాడుతున్నారు.
● కర్మ: పూర్వం పని అనే అర్థంలో వాడేవారు. ప్రస్తుతం పితృకర్మ అనే అర్థానికి పరిమితమైంది.
● దేవదాసి: ఒకప్పడు దేవాలయాల్లో నృత్య గానాదులు నిర్వహించే స్త్రీ అనే అర్థం ఉండేది. ప్రస్తుతం వేశ్యకు పర్యాయపదంగా మారింది.
● సాని: పూర్వం రాణి, దొరసాని అనే గౌరవార్థంలో వాడేవారు. ప్రస్తుతం వేశ్య, వ్యభిచారిణి అనే అర్థంలో వాడుతున్నారు.
 అర్థాపకర్ష జరిగిన కొన్ని పదాలు: కళావంతులు, కైంకర్యం, పూజ్యం, ఘటం మొదలైనవి.

లక్ష్యార్థ సిద్ధి
పదాలకు అసలు అర్థాలతోపాటు కొన్ని లక్ష్యార్థాలు ఏర్పడి రూఢికెక్కాయి. లక్ష్యార్థాలకు అనేక మూలాలుంటాయి. లక్ష్యార్థాలు ఏర్పడేందుకు 1) ఆధార ఆదేయ సంబంధం 2) కార్యకారణ సంబంధం 3) అశాంశి  సంబంధం ఉంటుంది. 
1.    ఆధార ఆదేయ సంబంధం: ప్రాచీనార్థం, ముష్టి – పిడికిలి, నేడు భిక్ష, భిక్షం ఆధారమైంది. పిడికిలి కాబట్టి భిక్ష అనే లక్ష్యార్థం ఏర్పడింది.
2.    కార్యకారణ సంబంధం: పూర్వం దాహం అనే పదానికి దహించడం, తపించడం అనే అర్థా లు ఉన్నాయి. కార్యకారణ సంబంధం వల్ల దప్పిక, దాహం అనే లక్ష్యార్థాలు ఏర్పడ్డాయి.
3.    లక్ష్యలక్షణ సంబంధం: ప్రాచీనార్థంలో  సూది.. వస్త్రాలు కుట్టేందుకు ఉపకరించేది. ప్రస్తుతం డాక్టర్లు వాడే ఇంజక్షన్‌ అనే లక్ష్యార్థంలో సూది వాడుతున్నారు.

కేవలం సంకేతార్థాలు
ఒక పదానికి జన వ్యవహారంలో ఒక అర్థం ఉండగా, ఒక వృత్తి, విజ్ఞాన శాస్త్రపరంగా ఆ పదాన్ని ప్రత్యేక అర్థంలో వాడతారు. ఇలాంటి వాటిని సంకేతార్థాలు అంటారు.
1.    వాయువు: సామాన్యార్థం గాలి (ప్రాచీ నకా­లం), నేడు పశువైద్యులు, పశువులకు వచ్చే వ్యాధిని గాలి అంటున్నారు. ఇది సంకేతార్థం.
2.    ద్రవ్యం: ప్రాచీనార్థం.. ధనం, డబ్బు. నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు, పదార్థం అనే సంకేతార్థంలో వాడుతున్నారు.
3.    ఇంధనం: ఇంతకుముందు వంట చెరకు, చిదు­కులు, పెట్రోలు వంటి అర్థాల్లో వాడేవారు. నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఉష్ణశక్తినిచ్చే చమురు, బొగ్గు వంటి వాటికి సంకేతార్థంగా వాడుతున్నారు.

వస్తు పరిణామం
ఒక పదం ప్రాచీన కాలంలో సూచించే వస్తురూపం, నిర్మాణం మొదలైన వాటిలో కాలక్రమంలో వచ్చిన భేదాన్ని సూచించే విస్తృతిని వస్తు పరిణామం అంటారు.
1.    లక్కపిడతలు అంటే పూర్వం పిల్లలు ఆడుకొనే లక్కతో చేసిన బొమ్మలు. ప్రస్తుతం లక్కబొమ్మలే కాకుండా కర్ర, లోహంతో చేసిన బొమ్మలను కూడా లక్కపిడతలు అంటున్నారు. ఇది వస్తు పరిణామం.
2.    ఆయుధం: ప్రాచీన కాలంలో విల్లు, గద, కత్తి వంటివి ఆయుధాలు. నేడు తుపాకీ, రైఫిల్, ఫిరంగి, అణ్వస్త్రాలు వంటి వాటిని ఆయుధాలుగా పిలుస్తున్నారు. ఇది వస్తు పరిణామం.

అలంకారిక ప్రయోగం
అలంకారికమైన పోలికను చెప్పడం వల్ల జరిగే అర్థ పరిణామాన్ని అలంకారిక ప్రయోగం అంటారు.
    ఉదా‘‘ ఆమె రంభ, వాడు మన్మథుడు
1.    రంభ, మన్మథుడు వంటి ఉపమానాల ద్వారా వారు సౌందర్యవంతులనే అర్థం స్ఫురిస్తుంది.
2.    ఎండ నిప్పులు చెరుగుతోంది – ఎండ తీవ్రతను సూచించేందుకు నిప్పు ఉపమానాన్ని జోడించినందున ఇది అలంకారిక ప్రయోగం.
3.    చూపుల వెన్నెలలు: చూపుల చల్లదనాన్ని సూచించేందుకు వెన్నెల ఉపమానాన్ని ప్రయోగించినందున ఇది అలంకారిక ప్రయోగం.
   తీపి మాటలు, చేదు నిజం, పచ్చి అబద్ధం, వంటివి అలంకారిక ప్రయోగాలు.

లోక నిరుక్తి
కొందరు తమకు పరిచయమున్న పదాలను తమకు పరిచయం లేని పదాలస్థానంలో వాడతా­రు. కాలక్రమేణా అవి జన వ్యవహారంలో బహుళ ప్రాచుర్యం పొందుతాయి. అలాంటి  పదాల మార్పును లోక నిరుక్తి అంటారు.
1.    నారద సింహాచలం: జన వ్యవహారంలో నార్త్‌ సింహాచలం నారద సింహాచలంగా మారింది. నార్త్‌ సింహాచలం ఒక రైల్వే స్టేషన్‌ పేరు. అది తెలియనివారు నారద సింహాచలంగా పిలవడంతో అలాగే ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా బోరన్‌ మిఠాయి, మొక్కజొన్న, చక్రకేళి, మధురవాడ వంటి పదాలు లోక నిరుక్తికి ప్రసిద్ధాలు.

గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1.    కిందివాటిలో అర్థ సంకోచం జరిగిన పదాలు? (టెట్, జనవరి 2012)
    1) చందమామ, వస్తాదు, కోక
    2) ఛాందసుడు, కైంకర్యం, పత్రం 
    3) సీసా, నూనె, ముష్టి
    4) ఆరాధ్యుడు, సీసా, పత్రం
2.    దివంగతులగు, శివైక్యం చెందు మాటల్లో జరి గిన అర ్థ పరిణామం? (టెట్, జనవరి 2012)
    1) అర్థ సంకోచం    2) లోక నిరుక్తి
    3) లక్ష్యార్థ సిద్ధి     4) సభ్యోక్తి
సమాధానాలు:  1) 4      2) 4

మాదిరి ప్రశ్నలు
1.    పదజాలానికి అర్థంలో జరిగే మార్పును ఏమంటారు?
    1) ధ్వని పరిణామం    2) శబ్ద పరిణామం
    3) అర్థ పరిణామం    4) వ్యాకరణ పరిణామం
2.    నన్నయ భారతంలో వాడిన కంపు పదంలో  ప్రస్తుతం జరిగిన అర్థ పరిణామం?
    1) అర్థ న్యూనత    2) అర్థాపకర్ష
    3) అర్థ గ్రామ్యత    4) పైవన్నీ
3.    తెలుగులో అర్థ పరిణామాన్ని గురించి మొట్టమొదట పరిశోధన చేసిన భాషావేత్త?
    1) ఆచార్య దొణప్ప
    2) ఆచార్య జి.ఎన్‌.రెడ్డి
    3) ఆచార్య యల్‌.చక్రధరరావు
    4) ఆచార్య చేకూరి రామారావు
4.    కింది పదాల్లో అర్థ వ్యాకోచానికి ఉదాహరణలు?
    1) కంపు, సంభావన, మృగం
    2) ధర్మరాజు, కమ్మ, పత్రం
    3) చెంబు, నూనె, ధర్మరాజు
    4) ఛాందసుడు, సాని, కమ్మ
5.  ప్రాచీనకాలంలో విస్తృతార్థంలో ఉండి ఇప్పుడు పరిమితార్థానికి పరిమితమైతే అది ఏ అర్థ­పరిణామం?
    1) అర్థ వ్యాకోచం    2) అర్థ సంకోచం
    3) అర్థ గ్రామ్యత    4) లోక నిరుక్తి
6.   ప్రాచీన కాలంలో గౌరవార్థంలో ఉండి ప్రస్తుతం నిందార్థానికి దిగజారితే దాన్ని ఏ అర్థ పరిణామం అంటారు?
    1) అర్థ సౌమ్యత    2) వస్తు పరిణామం
    3) అర్థోత్కర్ష    4) అర్థ సంకోచం
7.    సాని, కైంకర్యం, కర్మ, దేవదాసి వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామం?
    1) అర్థ సంకోచం    2) అర్థ న్యూనత
    3) సభ్యోక్తి               4) మృదూక్తి
8.    తుపాకీ, రైఫిల్, ఫిరంగి వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామం?
    1) లోక నిరుక్తి    2) అలంకార ప్రయోగం
    3) వస్తు పరిణామం      4) అర్థ సంకోచం
9.    వాచ్యం చేయకూడని పదాల అర్థాన్ని నూతన పద బంధాలతో చెప్పడాన్ని ఏ అర్థ పరిణామం అంటారు?
    1) అర్థ గ్రామ్యత    2) సభ్యోక్తి
    3) మృదూక్తి    4) అర్థోత్కర్ష
10.    సభికులు, అంతస్తు, అదృష్టం పదాల్లో జరిగిన అర్థ పరిణామం ఏది?
    1) అర్థ సంకోచం    2) అర్థ వ్యాకోచం
    3) అర్థోత్కర్ష    4) లోక నిరుక్తి
11.    ముష్టి – ఇంజక్షన్, దాహం వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామాన్ని ఏమంటారు?
    1) వస్తు పరిణామం     2) లక్ష్యార్థ సిద్ధి
    3) లోక నిరుక్తి              4) అర్థ సంకోచం
12.    చనిపోవు, కులాల పేర్లు, గర్భవతి వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామం ఏది?
    1) అర్థ గౌరవం    2) అర్థ గ్రామ్యత
    3) సభ్యోక్తి    4) మృదూక్తి
13.    దీపం కొండెక్కింది, నల్లపూసలు పెరిగి΄ో­యాయి వంటి పదాలు ఏ అర్థ పరిణామానికి ఉదాహరణలు?
    1) సభ్యోక్తి    2) మృదూక్తి
    3) అర్థ గౌరవత    4) అర్థ సంకోచం
14.    మొక్కజొన్న, నారద సింహాచలం,చక్రకేళి,వంటి పదాలు ఏ అర్థ పరిణామానికి ఉదాహరణలు?
    1) సభ్యోక్తి     2) లక్ష్యార్థ సిద్ధి
    3) లోక నిరుక్తి    4) అర్థ గౌరవం

సమాధానాలు
    1) 3    2) 4    3) 2    4) 3    5) 2
    6) 3    7) 2    8) 3    9) 2    10) 3
    11) 2    12) 3    13) 2    14) 3 

Published date : 21 Sep 2024 11:57AM

Photo Stories