TS Mega DSC 2024: రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ ప్రక్రియ.. ప్రశ్నల తయారీ ఇలా.. పాస్‌వర్డ్స్ అన్నీ వీరి పర్యవేక్షణలో..
మార్చి 4వ తేదీన పూర్తి సమాచారం వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల విభజన జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, భాషా పండితులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే టీచర్ల ఖాళీలను వెల్లడించారు.
చదవండి: డీఎస్సీ - టెట్ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్
ఈ ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే జరిగింది. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్ర ఉండనుంది. కానీ పరీక్ష విధివిధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రీకృత వ్యవస్థతోనే డీఎస్సీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర విద్యాశాఖ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది. వారికి జిల్లా అధికారులు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని విధివిధానాల్లో పేర్కొననున్నారు.
ఎక్కడా పొరపాట్లు జరగకుండా..
డీఎస్సీ సిలబస్‌పై అధికారులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరుగుతుంది. ప్రశ్నపత్రం ఎక్కడా లీక్ అవ్వకుండా సాంకేతిక విభాగాన్ని పటిష్ట పరుస్తున్నారు. అవసరమైన కీలక పాస్‌వర్డ్స్ అన్నీ రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. దీంతో ఎలాంటి ఫిర్యాదులు లేని వ్యక్తులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.