Telugu Topper IFS Success Story: కరెంట్ అఫైర్స్ కోసం వీటినే ఫాలో అయ్యా... యూట్యాబ్ సాయంతో కోచింగ్ లేకుండానే ఫస్ట్ ర్యాంకు సాధించానిలా...
కుటుంబ నేపథ్యం ఇలా...
నాది ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల. మా నాన్న రిటైర్డ్ ఎస్బీఐ ఉద్యోగి. మా అమ్మ గృహిణి. నాకు ఒక సోదరుడు. మా అన్న యూపీఎస్సీకి సన్నద్ధమయ్యేవాడు. అయితే అతని అన్ని ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో ప్రస్తుతం.. స్టేట్ సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గుంటూరులో 12వ తరగతి వరకు చదువుకున్నా. 2019లో నోయిడాలోని శివ్ నాడార్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో గ్రాడ్యుయేషన్ (B.Tech) పూర్తి చేశా.
ప్రిపరేషన్ ఇలా...
బీటెక్ పూర్తయిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. నాకు చిన్ననాటి నుంచి ప్రకృతి, పర్యావరణం అంటే చాలా ఇష్టం. ఈ మక్కువతోనే నేనే ఐఎఫ్ఎస్ అవ్వాలనుకున్నా. కానీ, నా తొలి ప్రయత్నం నుంచి నేను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కేవలం టెలీగ్రామ్, యూ ట్యూబ్ మాత్రమే వాడేవాణ్ని.
యూ ట్యూబ్‌లో సీనియర్ల సలహాలు, సూచనలు ... అలాగే టాప్ ర్యాంకర్ల ఇంటర్వ్యూలు ఎక్కువగా వినేవాణ్ని. వారి ప్రిపరేషన్ ప్లాన్ ఉన్న వీడియోలు చూసేవాణ్ని. దాంతో నాకు ఒక అవగాహన వచ్చింది. సొంతంగానే ప్రిపరేషన్ ప్రారంభించా.
తొలి ప్రయత్నంలో...
మొదటిసారిగా 2020లో సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ పాసయ్యా. కానీ, మెయిన్స్ దాటలేకపోయా. రెండోసారి 2021లో మళ్లీ ప్రయత్నించినప్పుడు ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయా. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా పకడ్బందీగా ప్రిపేరయ్యా.
2022 పరీక్ష సమయానికి నాకు ఐఎఫ్‌ఎస్ నచ్చుతుందని అర్థమైంది. అందుకే ఇక పూర్తిగా దానిపైనే దృష్టిపెట్టా. ఇదివరకటివి కాకుండా పూర్తిగా వేరే ఆప్షనల్స్ తీసుకుని బాగా ప్రిపేరయ్యా. మంచి ర్యాంకు వస్తుందని తెలుసుగానీ మొదటి ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఫలితాలు రాగానే ఆనందంతోపాటు ఆశ్చర్యం కలిగింది.
ఉదయం 8గంటలకు లేచేవాడిని...
రోజూ పొద్దున్న 8 గంటలకు లేచేవాడిని. ఏ టైమ్‌కి లేచినా కచ్చితంగా ఓ అరగంట ధ్యానం చేస్తా. టిఫిన్ చేశాక మధ్యాహ్న భోజనం వరకూ కదలకుండా చదివేవాడిని. భోజనం సమయం తర్వాత ఓ గంట రిలాక్స్ అయ్యేందుకు సమయం తీసుకునేవాడిని. మళ్లీ 3 గంటలకు చదవడానికి కూర్చుంటే సాయంత్రం 6, 7 గంటల వరకూ చదివేవాడిని.
☛ IAS Success Story: వరుసగా మూడు సార్లు ఫెయిల్.. తర్వాత ఐఆర్ఎస్..ఐఎఫ్ఎస్.. ఐఏఎస్ సాధించిన సూర్యభాన్ సక్సెస్ స్టోరీ
ఆ తర్వాత జాగింగ్‌కి వెళ్లడం, అలా నాకు నచ్చిన ఏదో ఒక రకం కసరత్తులు ఉండేవి. డిన్నర్ తర్వాత ఓ గంటా రెండు గంటలు చదివినా... తర్వాత రాత్రి 10, 11 గంటల వరకూ యూట్యూబ్ అదీ చూస్తూ రిలాక్స్ అయ్యేవాడిని. ఇంతే.. ఇంతకుమించి సాధారణ రోజుల్లో ఎక్కువ చదువు కోసం కేటాయించింది లేదు.
కరెంట్ అఫైర్స్ కోసం...
కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువగా మ్యాగజీన్లు, రోజూ రాత్రి పడుకునే ముందు ఆరోజు ముఖ్యమైన విషయాలు ఏం ఉన్నాయనేది ఇన్‌సైట్స్ చూసుకునేవాడిని. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఫాలో అయ్యా. టెస్ట్ సిరీస్‌లు రాస్తూ బిట్ల ద్వారానే ప్రాక్టీస్ చేసేవాడిని. టాపిక్స్ మర్చిపోకుండా, చదివించి ఎక్కువ జ్ఞాపకం ఉండేందుకు ఎక్కువసార్లు చదివేవాడిని.
Success Story: వరుసగా నాలుగు సార్లు ఫెయిల్...ఏడేళ్ల నిరీక్షణ.. చివరికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...
ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవే...
చాలామంది విద్యార్థులు ‘ప్రిలిమ్స్ దాటితే మెయిన్స్ చూసుకోవచ్చులే’ అనుకుంటారు. కానీ ఐఎఫ్‌ఎస్ వరకూ మెయిన్స్ కంటే ప్రిలిమ్స్ కష్టం. దాన్ని దాటితే మెయిన్స్ సులభంగానే ఎదుర్కోవచ్చు. నా ఆప్షనల్ సబ్జెక్టులు జియాలజీ, ఫారెస్ట్రీ. వీటిని దాదాపు 8 నెలలపాటు క్షుణ్నంగా అధ్యయనం చేశా. నాకు ఫస్ట్ ర్యాంక్ రావడానికి వీటిలో వచ్చిన మార్కులే కారణం కావొచ్చు.
ఇంటర్వ్యూ కోసం ఇలా...
ఇంటర్వ్యూకు వెళ్లేముందు నాలుగైదు మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. విద్యార్థులంతా కచ్చితంగా వీటికి వెళ్తేనే మన లోపాలు మనం తెలుసుకోవచ్చు. మాట్లాడే తీరు, జవాబు చెప్పే విధానం, అన్నీ సాధన చేయాలి. ఎంత బాగా సాధన చేస్తే అంత ధైర్యంగా జవాబులు ఇవ్వగలము.
CA Exam: సీఏలో దుమ్మురేపిన హైదరాబాద్ కుర్రాడు.. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన శ్రీకర్
ప్లాన్ బీ కూడా...
యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే సీఏపీఎఫ్ ఎగ్జామ్ రాశా. అందులో కూడా 74 ర్యాంకు వచ్చింది. ఇది నా ప్లాన్ బీ అనుకున్నా. కానీ, ప్లాన్ ఏ లోనే స్థిరపడుతున్నా.
వచ్చిన మార్కులు...
మెయిన్స్ లో 819 మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో 300 మార్కులకు 174 మార్కులు వచ్చాయి. మొత్తం 993 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించా.