Skip to main content

Temple History: పురాతనమైన దేవాలయ చరిత్ర.. బయటపడ్డ ఆధారాలు ఇవే..

కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు.. శాయపునాయుడి వంశస్తుల పాలనలో ఎందరో చక్రవర్తులు, మహారాజులు నడయాడిన నేల పశ్చిమ ప్రకాశం.
Vijayanagara Kings, historical rulers in the land of western Prakasha.  History of Temples in Prakasam District  Kothippi Chalukyas, rulers of western Prakasha during ancient times.
మొదటి దేవరాయల కాలంనాటి శాసనం

గతమెంతో ఘనమైన చరిత్రను నింపుకుంది ఈ ప్రాంతం. దట్టమైన అటవీ ప్రాంతం.. కొండలు.. కోనలు.. లోయలు.. ఇరుకైన రహదార్లు ఉన్న నల్లమల అటవీ ప్రాంతం ఆనాడు రక్షణ కవచంగా ఉండేది. చరిత్రకారుల పరిశోధనల్లో లభ్యమవుతున్న పలు శాసనాలు వీటిని ధ్రువీకరిస్తున్నాయి. 5 వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగానికి చెందిన పురాతన మానవుల సమాధులు సైతం ఇక్కడ బయటపడ్డాయి. ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతంలోని ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి వివ‌రాలు ఇవే.. 

యర్రగొండపాలెం మండలం రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తురిమెళ్ల శ్రీనివాస్‌ చేసిన పలు పరిశోధనల్లో శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే శాసనాలు లభ్యమయ్యాయి. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి ధ్రువీకరించారు.

Telangana Election Results: అతి చిన్న వ‌య‌సులోనే ఎమ్మెల్యే అయిన వారు వీరే..

పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు పురాతన, చారిత్రక నేపథ్యముంది. ఈ ప్రాంతాన్ని కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు, అలాగే శాయపునాయుడి వంశస్తులు పాలించారని తెలియజేసే ఎన్నో ఆధారాలు పదిలంగా ఉన్నాయి. 11వ శతాబ్దం ప్రారంభానికి చెందిన కొత్తిపి చాళుక్యుల సామ్రాజ్యానికి చెందిన శాసనం పుల్లలచెరువు మండలం శతకోడులో లభ్యమైంది.

కొచ్చెర్లకోట రామలింగేశ్వరస్వామి ఆలయంలో లభ్యమైన కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలం నాటి శాసనం 

కొచ్చెర్లకోట రామలింగేశ్వరస్వామి ఆలయంలో లభ్యమైన కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలం నాటి శాసనం

విజయనగర సామ్రాజ్యంలో రెండో బుక్కరాయల కుమారుడు మొదటి దేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చివెళ్లారు. ఇందుకు సంబంధించి యర్రగొండపాలెం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతమైన పొన్నలబైలు వద్ద శాసనం లభ్యమైంది. 12, 13వ శతాబ్దాల్లో పాలించిన కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ప్రతాపరుద్రుని శాసనం దొనకొండ మండలం కొచ్చెర్లకోట శివాలయం సమీపంలో బయటపడింది. ఈ ప్రాంతానికి రుద్రమదేవి, అంబదేవుడు, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు వచ్చి వెళ్లినట్టు శాసనం ద్వారా తెలుస్తోంది.

దూపాడు పరగణా, కొచ్చెర్లపాడు సీమ పేరుతో కాకతీయులు పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక విజయనగర రాజులు పాలన మొదలైంది. శాయపునాయుడి వంశస్తులు(కమ్మరాజులు) శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యంలో దూపాడు పరగణా సంస్థానాధీశులు. వీరు దట్టమైన అటవీ ప్రాంతంలో దద్దనాల వద్ద కోట నిర్మించుకున్నారు. పెద్ద పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Amrapali IAS : తెలంగాణ‌లో స్మితా సబర్వాల్ ప్లేస్‌లో.. ఆమ్రపాలి.. ఈమె స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

1512లో కృష్ణదేవరాయలు శాయపునాయుడి వంశస్తులను పాలించమని అవకాశమిచ్చారు. ఆ తర్వాత తురుష్కుల దాడిలో మొత్తం పట్టణంతోపాటు, కోట ధ్వంసమైంది. తర్వాత వారు యర్రగొండపాలెం వచ్చారు. ఇందుకు సంబంధించి బోయలపల్లి వద్ద శాసనం లభ్యమైంది. దద్దణాల కోటలో పెద్ద కోనేరు ఉంది. ఇక్కడ రోళ్లు ఇప్పటికీ ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన గజపతి రాజు తెలుగు రాయుడు పెద్ద చెరువు కట్టించారు.

శ్రీశైలం వయా త్రిపురాంతకం
పూర్వం ఎందరో మహరాజులు, వర్తకులు త్రిపురాంతకం మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. త్రిపురాంతకం నుంచి అమానిగుడిపాడు, దద్దనాల, పాలంక మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. వీరు తమ సైన్యం, గుర్రాలు, ఏనుగులు సేదతీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. సైనికుల కోసం సానికవరం, గుర్రాలు కట్టేసేందుకు గుర్రపుశాల, ఏనుగుల కోసం ఏనుగులదిన్నెపాడు ప్రాంతాలు ఉండేవి. దోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండలాల్లో ఇప్పటికీ అదే పేర్లతో గ్రామాలు ఉన్నాయి.

చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు
చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు

కొత్త రాతియుగం ఆనవాళ్లు 
పుల్లలచెరువు మండలంలోని చక్రాలబోడు వద్ద కొత్త రాతియుగానికి చెందిన ఐదు వేల ఏళ్లనాటి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇక్కడ పురాతన మానవుల సమాధులను ఇటీవల గుర్తించారు. కొండ రాళ్లపై ఆనాటి మానవులు చెక్కిన ఎద్దులు, మేకలు, మనుషుల ఆకృతులు వెలుగుచూశాయి. అలాగే త్రిపురాంతకం మండలం బొంకురవారిపాలెం వద్ద ఒకటో శతాబ్దం నాటి బౌద్ద శిల్పం లభ్యమైంది. 

శత్రుజాడ కనిపెట్టేలా.. 
ఇరుకుదారులు.. కొండాకోనలు ఉండటంతో శత్రువుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు చక్రవర్తులు ఆనాడు ఈ ప్రాంతాన్ని రక్షణ కవచంగా వినియోగించుకున్నారు. ఇక్కడ అనేక బురుజులు సైతం నిర్మించుకున్నారు. మొదటి దేవరాయలు తరుచూ ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుండేవారని తెలుస్తోంది.

TSPSC Reforms 2023 : మొత్తానికి TSPSC ప్రక్షాళన.. ఎలా అంటే..?

ఈ దట్టమైన కీకారణ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు తమ ప్రాంతంగా నిర్ధారించుకున్నారు కూడా. నల్లమల శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి దేవరాయలు కాలనికి చెందిన ఒక శాసనం లభ్యమవడంతో ఈ విషయాలు అవగతమవుతున్నాయి.  

నలురుగురు శిల్పులు చెక్కిన త్రిపురాంతకేశ్వరాలయం  
13వ శతాబ్దానికి చెందిన శాసనం త్రిపురాంతకం కొండపైన బయటపడింది. దీని ఆధారంగా ఇక్కడ త్రిపురాంతకేశ్వరుని ఆలయ నిర్మాణానికి ఆనాడు ప్రముఖ శిల్పులుగా పేరొందిన హరిజేతి, రామజేతి, ధగజేతి, సింఘన కృషి చేశారు. ఇందుకు సంబంధించి తెలుగు, సంస్కృతంలో వీరి పేర్లతో ఉన్న చిత్రాలు లభ్యమయ్యాయి. 

ఆసక్తితోనే చారిత్రక పరిశోధన
కురిచేడు మండలంలో ఒక దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్న సమయంలో సత్రం నిర్మిస్తుండగా కొన్ని పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి చారిత్రక పరిశోధనపై ఆసక్తి పెరిగింది. గుంటూరుకు చెందిన చరిత్రకారుడు మనిమేల శివశంకర్‌ ప్రోత్సాహంతో చరిత్రపై పరిశోధన కొనసాగించా.

చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు


మర్రి చెన్నారెడ్డి హ్యూమన్‌ రిసోర్స్‌ సెంటర్‌ ప్రచురించిన ఎపిగ్రాఫికా–తెలంగాణికా అనే పుస్తకంలో నేను కనుగొన్న కాకతీయ కాలం నాటి శాసనాన్ని ముద్రించారు. అలాగే మొదటి దేవరాయలు కాలానికి చెందిన శాసనానికి కరెంట్‌ అఫైర్స్‌లో స్థానం దక్కింది. తాను గుర్తించిన శాసనాలన్నీ భారత ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డికి పంపగా ధ్రువీకరించి పరిశోధన దిశగా ప్రోత్సహించారు.  – తురిమెళ్ల శ్రీనివాస్‌, చరిత్రకారుడు, రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్‌, యర్రగొండపాలెం

Published date : 15 Dec 2023 02:55PM

Photo Stories