High Court: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్దు
ఆ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సంస్థలో 177 పోస్టుల కోసం 90,928 మంది పరీక్ష రాశారు. అభ్యర్థుల ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టును కూడా యాజమాన్యం విడుదల చేసింది. అభ్యర్థుల తుది నియామక ఉత్తర్వులు అందాల్సి ఉంది.
ఈ క్రమంలో ఓ అభ్యర్థి సింగరేణి నిర్వహించిన ఈ పరీక్షలో లోపాలు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపి, ఈనెల 28న పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో ఎంతో శ్రమించి చదివి పరీక్ష రాసి, అర్హత సాధించిన వారంతా ఆందోళన చెందుతున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? లేక తీర్పుపై అప్పీల్‌కు వెళ్తరా? అనేదానిపై స్పష్టత లేదు.
చదవండి: Singareni: సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి నిధులు
సింగరేణి కొలువుకు డిమాండ్
సింగరేణిలో కొలువు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగా ల కంటే జీత, భత్యాలు, సౌకర్యాలు మెరుగ్గా ఉంటా యి. ఇప్పుడున్న వేతన సవరణతో ఎగ్జిక్యూటివ్ స్థా యిలో కనీసం రూ.40 వేలపైనే జీతం ఉంటుంది. కంపెనీ క్వార్టరు, ఉచిత విద్యుత్, గ్యాస్, వైద్యారోగ్య సదుపాయాలు, బీమా, వారసత్వ ఉద్యోగ కల్పన, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో ఈ ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉంది.
చదవండి: Singareni Record Profits: సింగరేణి ఆల్‌టైం రికార్డ్ లాభాలు
తెలంగాణ ఆవిర్భావం త ర్వాత సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి నా లుగు జిల్లాల స్థానికులకే 60 శాతం, ఓపెన్ కేటగిరీ లో 40 శాతం పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే సంస్థలో కొలువు దక్కించుకునేందకు కొందరు అడ్డదారులు వెతికి అర్హులకు అన్యాయం చేస్తున్నారు. గతంలో కొత్తగూడెంలో జరిగిన ఓ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో రద్దు చేశారు.
అంతకుముందు జరిగిన జూనియర్ అసిస్టెంట్ ప్రశ్నాపత్రం లీకై ందని, ఒకే ఇంటి నుంచి ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఫిర్యాదులు వెళ్లాయి. అయితే సంస్థ పకడ్బందీగా నియామకాలు చెబుతున్నా నిరుద్యోగులకు ఉద్యోగంలో చేరే వరకు నమ్మకం లేకుండాపోతోంది.
చదవండి: Medical Health Department: ఈ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
లక్షకుపైగా దరఖాస్తులు..
సింగరేణి యాజమాన్యం 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రకటన ఇస్తే, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 98,882 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. ఇందులో 90,928 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే 11 వేల మంది పరీక్ష రాశారు. పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే సింగరేణి ‘కీ’ విడుదల చేసింది. నెల రోజుల్లోనే మెరిట్ జాబితా విడుదలైంది. కేసు కారణంగా తుది ఎంపిక నిలిచిపోయింది.
తీవ్ర నిరాశకు లోనయ్యా
ఉద్యోగానికి ఎంపికై నట్లు మెరిట్ జాబితాలో రాష్ట్ర స్థాయిలోనే మొదటి ర్యాంక్ రావడంతో ఆనందం కలిగింది. మా కుటుంబ సభ్యులతోపాటు అందరూ ఉద్యోగం వచ్చిందని అనుకున్నారు. కానీ పరీక్షనే రద్దుచేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో తీవ్ర నిరాశకు లోనయ్యా.
– కాసం శివప్రసాద్, మొదటి ర్యాంకర్, తిర్యాణి, కుమురంభీం జిల్లా
పరీక్షపై ఆది నుంచి ఆరోపణలే...
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రకటన వెలువడినప్పటి నుంచే పైరవీలు, దళారులతో ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సంస్థ ఎక్కడైనా అక్రమాలు జరిగితే సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పలుమార్లు ప్రకటించింది.
అయితే పరీక్ష రాశాక, ప్రశ్నపత్రం అభ్యర్థులకు ఇవ్వకపోవడంపై అభ్యంతరం చెబుతూ కోర్టు వెళ్లడంతో తిరిగి ఇచ్చేలా ఉత్తర్వులు వచ్చాయి. అయితే హాల్‌టికెట్లలో ‘తెలంగాణ’ ‘ఆంధ్రప్రదేశ్’ ‘బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ ‘డిగ్రీ’ వంటి పేర్లతో అభ్యర్థులు పరీక్ష రాయడంతో అభ్యంతరాలు వెల్లువత్తాయి.
దీనిపైనే కేసు వేయగా, పరీక్ష పూర్తయి, మెరిట్ జాబితా వెలువడ్డాక తీర్పు రావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.