Skip to main content

సంప్రదాయ కోర్సులు ఎత్తేయండి.. కంప్యూటర్‌ కోర్సులివ్వండి

ఇంజనీరింగ్‌లో సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లనుందా? డిమాండ్‌ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించడం ఈ అనుమానాలకు తావిస్తోంది.
AICTE
సంప్రదాయ కోర్సులు ఎత్తేయండి.. కంప్యూటర్‌ కోర్సులివ్వండి

గత మూడేళ్లుగా కంప్యూటర్‌ కోర్సుల్లో వచ్చిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో 95 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. మరోవైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు వందకుపైగా కాలేజీలు తమ సంస్థల్లో సివిల్, మెకానికల్‌ కోర్సులను ఎత్తివేసేందుకు హైదరాబాద్‌ జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు మే 30 నుంచి విచారణ జరపనున్నారు. మూడేళ్లుగా 30 శాతం సీట్లు భర్తీ కాలేదని కాలేజీలు సరైన ఆధారాలు చూపిస్తే జేఎన్‌టీయూహెచ్‌ ఆ కోర్సులు ఎత్తివేసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇస్తుంది. దీని ఆధారంగా కాలేజీలు సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్, కంప్యూటర్‌ సంబంధిత సీట్లు తెచ్చుకునే వీలుంది. 

చదవండి: 

జిల్లాలకు విస్తరించని ఆధునిక కోర్సులు

ఏకకాలంలో రెండు డిగ్రీ, పీజీ కోర్సులు.. నష్టమా?.. లాభమా?

10 వేలకు పైగా సీట్లకు ఎసరు

రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటా కింద 79 వేల సీట్లు ఉంటాయి. వీటిల్లో కూడా 38,796 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులే ఉన్నాయి. ఈసీఈ 13,935, ఈఈఈ 7,019 ఉంటే, సివిల్‌ 6,221, మెకానికల్‌ 5,881 సీట్లున్నాయి. ఇతర కోర్సుల సీట్లు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్‌ డిగ్రీ ముగిసిన వెంటనే తక్షణ ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ను ఎంచుకుంటున్నారు. కొంతమంది అమెరికా వంటి విదేశాలకు వెళ్లేందుకు కూడా కంప్యూటర్‌ కోర్సుల బాట పడుతున్నారు. కంప్యూటర్‌ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకున్నా విద్యార్థులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవానికి ఈ కోర్సులు చేసినప్పటికీ కేవలం 8 శాతం మాత్రమే స్కిల్డ్‌ ఉద్యోగాలు పొందుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది. కానీ విద్యార్థుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్‌ కోర్సుల సీట్లు వీలైనంత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో డిమాండ్‌ లేని మెకానికల్, సివిల్‌ కోర్సుల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశాయి. వర్సిటీ ఎన్‌వోసీ ఇస్తే వందకుపైగా కాలేజీల్లో 10 వేలకు పైగా మెకానికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ సీట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. 2021లో ఈ రెండు కోర్సుల్లోనూ సగటున 30 శాతానికి పైగానే సీట్లు భర్తీ కావడం గమనార్హం.

పాలిటెక్నిక్‌ విద్యార్థుల మాటేమిటి?

సంప్రదాయ కోర్సులు కనుమరుగు కావడం భవిష్యత్‌లో దుష్పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్‌ కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే వీలుంది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లన్నీ ఎత్తేస్తే వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. పాలిటెక్నిక్‌లో కేవలం సివిల్, మెకానికల్‌ వంటి కోర్సులు మినహా కంప్యూటర్‌ కోర్సులు లేకపోవడం గమనార్హం. అలాగే రియల్‌ ఎస్టేట్, ఆటోమొబైల్‌ రంగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో సివిల్, మెకానికల్‌ కోర్సుల ఎత్తివేత వల్ల భవిష్యత్తులో సంబంధిత నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

2021లో ఏ కోర్సులో ఎన్ని సీట్లు భర్తీ (శాతంలో)

సీఎస్‌ఈ సంబంధిత

95.56

ఈసీఈ

88.32

ఈఈఈ

57.49

సివిల్‌

41.87

మెకానికల్‌

32.57

ఆ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం. ముఖ్యంగా పాలి టెక్నిక్‌ విద్యార్థులకు భవిష్యత్‌ ఉండదు. అందువల్ల సంప్రదాయ కోర్సు లు వందకు వంద శాతం రద్దుకు అనుమతించే ప్రసక్తే లేదు. కాలేజీలతో సంప్రదింపులు జరిపి సా ధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు రద్దవ్వకుండా చూస్తాం. 
– ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ

ఆ కోర్సుల రద్దుకు అనుమతించకూడదు

సంప్రదాయ కోర్సుల రద్దుకు యూనివర్సిటీ అనుమతించకూడదు. కంప్యూటర్‌ కోర్సులు చేసిన వారందరికీ ఉపాధి లభిస్తోందనేది అవాస్తవం. కంప్యూటర్‌ సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాలేజీలు అనేకం ఆయా కోర్సులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కంప్యూటర్‌ కోర్సుల కోసం ఎగబాకే ప్రైవేటు కాలేజీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎంటెక్‌ చేసిన వాళ్లకు నెలకు కేవలం రూ.35 వేల వేతనం ఇస్తూ నాణ్యతలేని విద్యను అందిస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులు గ్రహించాలి. 
– డాక్టర్‌ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

చదవండి:

Published date : 30 May 2022 03:37PM

Photo Stories