జిల్లాలకు విస్తరించని ఆధునిక కోర్సులు
జిల్లా ల్లోని డిగ్రీ కాలేజీలు సంప్రదాయ కోర్సులే ఎక్కువగా నిర్వహిస్తుండటం, ప్రత్యేక ఉపాధి డిగ్రీ కోర్సులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో గ్రామీణ ప్రాంత యువత హైదరాబాద్ బాట పడుతున్నారు. రాజదానిలో ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో పలు ఆధునిక కోర్సులు అందిస్తుండటం, వీటితో ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో గ్రామీణ విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకోవడానికే సుముఖత చూపుతున్నారు. మరికొందరు వ్యయభారాల రీత్యా ఈ కొత్త కోర్సుల్లో చేరలేకపోతున్నారు.
120 కొత్త కోర్సులన్నీ హైదరాబాద్‌లోనే...
ఈ మధ్య కాలంలో డిగ్రీలో వివిధ రకాల కాంబినేషన్లతో దాదాపు 120 కోర్సులు వచ్చాయి. ఆనర్స్‌తో సహా కొన్ని ప్రత్యేక కోర్సులను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రవేశపెట్టింది. బీఏ ఆనర్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులను హైదరాబాద్ పరిధి లోని కోఠి ఉమెన్స్, నిజాం కాలేజీల్లో ప్రవేశపెట్టారు. బేగంపేట డిగ్రీ కాలేజీలో బోటనీ, జువాలజీ, అప్లయిడ్ న్యూట్రిషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదే కాలేజీలో బీఏలో మూడు కాంబినేషన్స్ తో సైకాలజీ అందిస్తున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఇతర కాంబినేషన్స్ తో పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ కోర్సు అందిస్తున్నారు. ఇక్కడ ఈ కోర్సుతోపాటు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రభుత్వ కాలేజీల్లో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఫిలాసఫీ కాంబినేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు జిల్లా పరిధికి ఇంకా విస్తరించలేదు. జిల్లా కేంద్రాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరాలంటే.. ఆధునిక ఉపాధి కోర్సులను జిల్లా పరిధికి విస్తరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
భవిష్యత్‌లో ప్రయత్నిస్తాం...
బీఏ ఆనర్స్ వంటి కోర్సులకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కాలేజీలనే ఎంపిక చేశాం. వీటిని గ్రామస్థాయిలో తీసుకెళ్ళాలంటే ఉపాధి ఇచ్చే కోర్సుల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి. డేటా సైన్స్ ఇతర కొన్ని కోర్సులు అన్ని యూనివర్సిటీలకు అనుమతించాం. అయితే, మండల స్థాయి కాలేజీల్లో ప్రారంభించాలంటే ఆ కాలేజీలు చొరవ చూపాలి. అందుకు తగ్గ మౌలిక వసతులూ ముఖ్యం. మున్ముందు ఈ దిశగా ప్రయత్నం చేస్తాం.
– ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్