ఐఐటీలో బీటెక్ డేటాసైన్స్ !
ఈ నేపథ్యంలో డేటాసైన్స్ కోర్సు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం...
అకడమిక్ ప్రాధాన్యం :
జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వ్యాపారాలు, సంస్థల నిర్వహణలో డేటాసైన్స్ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో ఐఐటీలు సైతం బీటెక్‌లో డేటాసైన్స్ స్పెషలైజేషన్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా ఇండియాలో నిర్వహించిన ఓ సర్వేలో డేటాసైన్స్ విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు వెల్లడైంది. డేటాసైన్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో ఐఐటీ మండి అందించే బీటెక్ డేటాసైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా.. కంప్యూటర్‌సైన్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది.
అన్ని రంగాల్లో కీలకంగా డేటా..
ఐటీ, ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, రిటైల్, టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, ఎయిర్‌లైన్, ఇ–కామర్స్.. ఇలా అన్ని రంగాల్లోని సంస్థల నిర్వహణలో డేటా అత్యంత కీలకంగా మారుతోంది. డేటా విశ్లేషణ ఆధారంగానే కంపెనీలు కీలక వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆ క్రమంలో సదరు కంపెనీలు డేటాసైంటిస్ట్‌లను నియమించుకోవడంపై దృష్టిసారించాయి. ప్రస్తుతం డేటాసైన్స్ విభాగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన దేశంలో కోడింగ్ పరిజ్ఞానం కలిగిన యువత పెద్దసంఖ్యలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో యువతకు డేటాసైన్స్ ఆకర్షణీయ కెరీర్‌గా నిలుస్తోంది.
కెరీర్ స్టార్ట్ :
డేటాసైన్స్‌లో కెరీర్‌ను ప్రారంభించేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండింటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అవి.. ఒకటి, డేటాసైన్స్‌లో మాస్టర్స్ చేయడం, రెండోది, మూక్స్ విధానంలో డేటాసైన్స్‌పై అవగాహన పెంచుకోవడం. మాస్టర్స్‡స్థాయి కోర్సు పూర్తిచేసి.. డేటాసైన్స్ విభాగంలో సమున్నత కెరీర్‌ను అందుకోవచ్చు. అదేవిధంగా మూక్స్ కోర్సుల ద్వారా డేటాసైన్స్ సంబంధిత అంశాల్లో నైపుణ్యం సా«ధించి..ఈ విభాగంలో అవకాశాలను అందుకునే వీలుంది. ఈ దిశగా కోర్సెరా, ఈడీఎక్స్, ఉడేమీ తదితర వేదికలు అందుబాటులో ఉన్నాయి.
కావల్సిన లక్షణాలు :
డేటాసైన్స్ ఔత్సాహికులకు తెలుసుకోవాలనే తృష్ణ, కష్టపడే తత్వం ఉండాలి. అకడెమిక్స్ పరంగా ఆయా సబ్జెక్టులపై పట్టుండాలి. నూతన టెక్నాలజీ, అల్గారిథమ్స్‌పై నిత్యం ఆసక్తిని ప్రదర్శించి..కొత్త విషయాలు తెలుసుçకునే తపన తప్పనిసరి. మ్యాథ్స్‌లో పట్టు, కోడింగ్‌పై అవగాహన ఉన్న వారు డేటాసైన్స్‌లో ప్రవేశించి రాణించే వీలుంది. అలాగే డేటాసైన్స్ రంగంలో.. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్నవారు, ఇంజనీర్లు మాత్రమే రాణించగలరనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. చాలామంది నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు సైతం డేటాసైన్స్‌లో ముందంజలో నిలుస్తున్నారు. డొమైన్ నాలెడ్జ్ ఉన్నవారెవరైనా ఆయా రంగంలో రాణించగలరు.
సవాళ్లు :
- డొమైన్ నాలెడ్జ్‌తోపాటు అనుబంధ నైపుణ్యాలైన మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పైథాన్, ఎస్‌క్యూఎల్, ఎస్‌ఏఎస్, బిగ్‌డేటా టూల్స్‌పై పట్టున్న వారికి జాబ్ మార్కెట్‌లో డిమాండ్ నెలకొంది.
- అభ్యర్థులు ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే.. నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవరచుకోవాలి. తరగతిగదిలో థియరీపై అవగాహన కలిగేలా బోధన ఉంటుంది. కానీ, వాస్తవ పని అనుభవంతోనే డొమైన్, బిజినెస్‌పై అవగాహన ఏర్పడుతుంది.
- డేటా సైంటిస్టులకు డిమాండ్ వేగంగా పెరుగుతున్నా..దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లు ఆ స్థాయిలో కోర్సులు నిర్వహించడం లేదు. దీంతోపాటు ఈ డొమైన్‌లో అర్హత కలిగిన ఫ్యాకల్టీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఫలితంగా డేటాసైన్స్ నిపుణుల కొరత నెలకొంది.
- ప్రస్తుతం డేటాసైన్స్ ఔత్సాహికుల్లో కనిపిస్తున్న ప్రధాన లోపం.. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ను సరిగా అనువర్తించలేకపోవడం! సింటాక్స్ స్థాయిలో మెషిన్ లెర్నింగ్ నేర్చుకొని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌పై దృష్టిసారించకపోవడంతో ఈ సమస్య వస్తోంది. కాబట్టి ఔత్సాహికులు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌పై పట్టుసాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొలువులకు వేదికలు..
డేటాసైన్స్ నిపుణులకు ప్రముఖ కంపెనీలు కొలువులు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని..
- యాక్సెంచెర్
- ఆటోస్
- ఏంజెల్ బ్రోకింగ్
- హెచ్‌డీఎఫ్‌సీ
- డెలాయిట్
- క్రెడిట్ విద్య
- ఐబీఎం
- ఆదిత్య బిర్లా
- ఈగెన్ టెక్నాలజీస్
- డేటాఫార్చూన్
- విజ్‌మైండ్స్
- ఇన్ఫోటెక్
- వాల్యూడైరెక్ట్.