Skip to main content

కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు ‘ప్రైవేటు’ చెక్‌?

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుమతి రాకుండా ఒక ప్రైవేటు కాలేజీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Government Medical College
కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు ‘ప్రైవేటు’ చెక్‌?

ఇప్పటికే అక్కడ రెండు ప్రైవేటు కాలేజీలు ఉండటంతో అందులో ఒక కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ కాలేజీకి అనుమతి రాకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. 2023–24 వైద్య విద్యాసంవత్సరంలో 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల సాధనకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో 8 కాలేజీలకు ఇప్పటికే జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు ఇచ్చింది. కానీ కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీకి మాత్రం ఇప్పటివరకు అనుమతి రాలేదు. పైగా ఇటీవల నీట్‌ పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఫలితాలు కూడా రానున్నాయి. అనంతరం ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఇప్పటికీ కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీకి అనుమతులు రాకపోవడంతో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం టెన్షన్‌లో ఉంది. ఆ కాలేజీకి అనుమతి కోసం వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ) కార్యాలయం తీవ్రంగా కృషిచేస్తుంది. కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీకి అనుమతి విషయంలో ఎన్‌ఎంసీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. వర్చువల్‌ పద్ధతిలో తనిఖీలు జరిగినా దీనిపై ఎన్‌ఎంసీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని తెలిసింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, దానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం. 

చదవండి: Transfers: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు మార్గదర్శకాలు

రోగులు తమ ఆస్పత్రికి రారనే ఉద్దేశంతోనే

కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటికితోడు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వస్తే తమకు వైద్య సిబ్బంది కొరత వెంటాడే అవకాశముందని, రోగులు ప్రైవేటు బోధనాసుపత్రులకు బదులుగా ప్రభుత్వ బోధనాసుపత్రికి వెళ్లే అవకాశం ఉందన్న భయం ఆయా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాల్లో నెలకొందన్న చర్చ జరుగుతోంది. పైగా ప్రైవేటు కాలేజీల కంటే ప్రభుత్వంలోనే వైద్య, మౌలిక సదుపాయాలు, సిబ్బంది, అధ్యాపకులు సరిపడా ఉంటారు. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలోనూ ప్రభుత్వ కాలేజీకే విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి భయాలతోనే ఒక ప్రైవేటు కాలేజీ యాజమాన్యం అడ్డుకట్ట వేస్తోందన్న చర్చ నడుస్తోంది. కాగా, ఎలాగైనా కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీకి అనుమతి తెస్తామని డీఎంఈ డాక్టర్‌ రమేష్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎన్‌ఎంసీకీ తాము విన్నవించామన్నారు. 

చదవండి: Medical Department: ఆ పోస్టులకు ఏజ్‌ భారమైంది!

కొనసాగుతున్న భవనాల నిర్మాణం

ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ కల తుది దశకు చేరింది. ఈ ఏడాదితో రాష్ట్రంలో 75 శాతం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు రాబోతున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలే ఉండేవి. తర్వాత ప్రభుత్వం మొదటి దశలో 4, రెండో దశలో 8 కాలేజీలు నెలకొల్పింది. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ఏర్పాటు జరుగుతోంది. దీంతో కాలేజీల సంఖ్య 26కు చేరనుంది. ఇప్పటికే కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, వికారాబాద్, నిర్మల్, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, రాజన్న సిరిసిల్లలో మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతులు వచ్చాయి. కానీ కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీకి మాత్రం అనుమతి రాలేదు. వాస్తవానికి ఇప్పటికే అన్ని కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల భవనాల నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఇతరచోట్ల మాదిరిగానే కరీంనగర్‌లోనూ నిర్మాణం జరుగుతోంది. మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ఒక్క కాలేజీకి ఎన్‌ఎంసీ అనుమతి రాకపోవడంపై డీఎంఈ కార్యాలయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: IIT Madras: పీఎస్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు.. దేశంలోనే తొలిసారిగా..

Published date : 30 May 2023 01:35PM

Photo Stories