Gurukulam School Admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఇవే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు దరఖాస్తులను కోరుతోంది. మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి ఇంగ్ల్లిష్ మీడియంలో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
గురుకుల ప్రవేశాలకు మార్చి 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సీటు పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా వసతి సౌకర్యంతో పాటు చదువుకునే అవకాశం లభిస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనతో పాటు నీట్, ఐఐటీలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. విద్యార్థులు ఏప్రిల్ 27వ తేదీ నిర్వహించే కామన్ టాలెంట్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ప్రతిభ చూపి ప్రవేశాలు పొందొచ్చు.
అర్హతలు ఇవే..
ఓసీ, బీసీ, కన్వర్టెడ్ క్రిస్టియన్ (బీసీసీ) విద్యార్థులు 1.09.2013 నుంచి 31.08.2015 మధ్యన జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1.9.2010 నుంచి 31.08.2015 మధ్యన జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలో 2022– 23, 2023–24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4 తరగతులు చదివి ఉండాలి. తల్లిదండ్రులు, సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించి ఉండరాదు.
Half day Schools 2024 : స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఒంటిపూట బడులు ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..?
దరఖాస్తు విధానం..
విద్యార్థులుhttps://mjpapbc wris.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ.100 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
సీట్ల కేటాయింపు ఇలా..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దొరవారిపత్రంలో బాలురు 80, కోటలో బాలురు 120, గొలగమూడిలో మత్స్యకార బాలికలు 80, గూడూరులో బాలికలు 40, నార్త్ ఆములూరులో బాలికలు 40, మహ్మదాపురం, వెంకటాచలంలో బాలురు 40, ఆత్మకూరులో బాలికలు 40 సీట్లు కలవు. ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగా ఆయా గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు..
బీసీ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం. 2024–2025 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డీ కొండలరావు, జిల్లా కన్వీనర్, బీసీ గురుకుల పాఠశాలలు