New Medical Colleges: కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు.. అనుమతుల ప్రక్రియ ఇలా..
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం 112, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు 58 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించింది. కాగా, ఏపీలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఐదు దరఖాస్తులు అందినట్టు తెలిపింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభించింది.
చదవండి: జూన్‌లో జాబ్‌ల జాతర.. ఈసారి అన్ని నియామకాలు ఈ బోర్డు ద్వారానే...
ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. కాగా వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరుల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య శాఖ దరఖాస్తు చేసింది. అలాగే మరో ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వీలుగా బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
మొత్తం 17 వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. తద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను వారికి చేరువ చేస్తోంది.
చదవండి: Students Health: చదువుతోపాటు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ కూడా ముఖ్యం
ఐదు దశల్లో అనుమతుల ప్రక్రియ
కొత్త కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను ఎన్‌ఎంసీ ఐదు దశల్లో చేపడుతోంది. తొలి దశలో దరఖాస్తుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు సమర్పించని, బోధనాస్పత్రుల్లో పడకలు, ఫ్యాకల్టీ, ఇతర అంశాల్లో లోటుపాట్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేస్తోంది.
వివరణ ఇవ్వడానికి కళాశాలలకు గడువు విధించింది. ఈ ప్రక్రియ ముగిశాక రెండో దశలో ఫ్యాకల్టీ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్) నమోదు చేపట్టనుంది. ఈ రెండు దశల ప్రక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది.
అనంతరం మూడో దశలో కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు చేపట్టనుంది. నాలుగో దశలో కళాశాలలపై సమీక్ష చేపడుతుంది. ఐదో దశలో అనుమతులు జారీ చేస్తుంది.