Skip to main content

Infosys: విశాఖకు ఇన్ఫోసిస్‌

దేశంలో అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో భారీ క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది.
Infosys
విశాఖకు ఇన్ఫోసిస్‌

ప్రారంభంలో సుమారు 1,000 సీటింగ్‌ సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి Infosys ముందుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ‘Sakshi’కి చెప్పారు. దాదాపు 1,000 సీట్లతో ప్రారంభించి రానున్న కాలంలో మరింతగా విస్తరించి మూడువేల సీట్లకు పెంచే విధంగా ఇన్ఫోసిస్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. విశాఖలో క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి ఆ సంస్థ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హెడ్‌ నీలాద్రిప్రసాద్‌ మిశ్రా, రీజనల్‌ హెడ్‌ అమోల్‌ కులకర్ణి మంత్రి అమర్‌నాథ్‌తో పాటు అధికారులతో సమావేశమయ్యారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌ కోసం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానానికి మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సొంత భవనాన్ని సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు. ఐటీ రాజధానిగా విశాఖ ఎదగడానికి అన్ని రకాల అవకాశాలున్నాయని, Infosys రాకతో మరిన్ని దిగ్గజ కంపెనీలు తరలివస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పనిచేస్తున్న ఐటీ నిపుణుల్లో 25 శాతం మంది తెలుగువారే ఉన్నారని, ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే మధురవాడ సమీపంలో అదానీ రూ.14,500 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని నిర్మాణ పనులను సీఎం YS Jagan Mohan Reddy చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు చిన్న ఐటీ కంపెనీలకు పరిమితమైన విశాఖ Infosys, Adani రాకతో మరిన్ని బహుళజాతి కంపెనీలను ఆకర్షిస్తుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: 

Sudha Murty: పేరెంటింగ్‌.. ఇది ఒక మహాయజ్ఞంతో సమానం

Infosys Sudha Murthy : ఈ ప‌ని చేయ‌డం అనుకున్నంత సులువు కాదు..కానీ

ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ శాస్త్రవేత్త?

Published date : 20 Jun 2022 01:04PM

Photo Stories