Infosys Sudha Murthy : ఈ పని చేయడం అనుకున్నంత సులువు కాదు..కానీ
ఐటీ రంగంలో భారత్‌కు బలమైన పునాదులు పడటానికి సహాకరించారు. అలాంటి నారాయణమూర్తికి అర్థాంగిగా తన వంతు సహాకారం అందిస్తూనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సుధా మూర్తి. ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మందికి అండగా నిలిచారు. పాతికేళ్ల సేవాకార్యక్రమాల నుంచి త్వరలో ఆమె పక్కకు తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఐటీ రంగం నుంచి వచ్చిన సుధామూర్తి మురికివాడలకు ఎలా వెళ్లారు. అక్కడి ప్రజల అక్కరలు తీర్చే క్రమంలో తనని తాను ఎలా మార్చుకున్నారు? ఈ దేశ ప్రజల పట్ల ఆమె అభిప్రాయాలు ఏంటీ అనే వివరాలను సుధా మూర్తి మాటల్లోనే తెలుసుకుందాం..
అనుకున్నంత సులువు కాదు..
1996 డిసెంబరు 6న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించాం. అప్పుడు ఈ ఫౌండేషన్‌కి రూ. 36 లక్షలు కేటాయించారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో చాలా సహాయ కార్యక్రమాలు చేయోచ్చు అనుకున్నాను. అనుకున్నదే తడవుగా మా టీమ్‌తో కలిసి రంగంలోకి దిగాను. కానీ ఆ తర్వాతే తెలిసింది... ఈ పని నేను అనుకున్నంత సులువు కాదని.
అప్పట్లో జీన్స్, టీషర్ట్స్‌లో వెళ్లేదాన్ని..కానీ ఆ తర్వాత..
ఇప్పుడంటే చీరకట్టు సంప్రదాయ బొట్టుతో సాధారణ గృహిణిలా కనిపిస్తున్నాను. కానీ ఫౌండేషన్ స్టార్ చేసిన కొత్తలో నేను జీన్స్, టీ షర్ట్స్ షూస్‌లో ఎక్కువగా ఉండేదాన్ని. ఫౌండేషన్ తరఫున ఏదైనా పని చేసేందుకు స్లమ్ ఏరియాలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు నా దగ్గరికి వచ్చే వారు కాదు. వాళ్ల కోసమే నేను వచ్చానని నమ్మేవాళ్లు కాదు. నా దగ్గర డబ్బున్నా అది సరైన విధంగా ఖర్చు చేయాలేని పరిస్థితి ఉండేది. ఒక వేళ చేసిన మనీ ఖర్చు పెట్టగలిగేదాన్ని కానీ. వాళ్ల బాధలు స్వయంగా విని అర్థం చేసుకునే అవకాశం రాకపోయేది. అందుకే సేవా కార్యక్రమాల్లో మనసు పెట్టి పని చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే వారిలో ఒకరిగా కలిసిపోవాలని నిర్ణయించుకున్నాను. దీంతో జీన్స్, టీ షర్ట్స్ పక్కన పెట్టి సంప్రదాయ చీర కట్టు, బొట్టులోకి మారిపోయాను. నేను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య హోదాలో కాకుండా ఓ సాధారణ స్కూలు టీచరు తరహాలో ప్రజలతో కలిసి పోయాను.
సమస్యని సహనంతోనే..
డబ్బులు చాలు సమస్యలు పరిష్కరించవచ్చు అనుకున్నాను. కానీ ఆ అభిప్రాయం తప్పని త్వరలోనే అర్థమైంది. ఫౌండేషన్ ద్వారా నేను చేయాల్సిన పనులు మనుషులుతో కంప్యూటర్లతో కాదని తెలిసింది. కంప్యూటర్ అయితే కమాండ్ ఇచ్చి ఎంటర్ కొడితే కావాల్సిన పని జరుగుతుంది. కానీ మనుషులు అలా కాదు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలు ఉంటాయి. వాటి ఆధారంగా వారి ప్రతిస్పందన ఉంటుంది. మనం చెప్పగానే వాళ్లు వెంటనే మారిపోరు. దానికి సమయం పడుతుంది. అన్నింటికీ మించి ఎదుటి వారు చెప్పే సమస్యని సహనంతో వినడం.. ఆ తర్వాత దానికి తగ్గ పరిష్కారం ఎలా అని ఆలోచించడం అలవాటు చేసుకున్నాను. దాతృత్వం అనేది డబ్బు కాదు మనసుతో చేసే పని అర్థం చేసుకున్నాను. అందుకే మనఃస్ఫూర్తిగా ఇన్ఫోసిస్ బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయం తీసుకున్నాను.
25 ఏళ్లుగా..
ప్రజల్లో కలిసిపోయేందుకు వారితో పాటు కలిసి తిన్నాను, వారి భాషలోనే మాట్లాడాను అలా చేస్తున్న క్రమంలో వారి కష్టాలు, బాధలు మరింతగా అర్థం అయ్యాయి. వారితో పోల్చుకుంటే దేవుడు నాకు ఏ లోటు రానివ్వలేదు. దేశంలో నూటికి తొంభైశాతం మందికి లేని సౌకర్యాలు, అవకాశాలు నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడే సృష్టించిన ఈ ప్రజలకి నేను కూడా ఏదైనా చేయాలని గట్టినా అనుకున్నాను అంతే ! అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 25 ఏళ్లుగా ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.
అహం వద్దు..
దాతృత్వ కార్యక్రమాలు చేసేప్పుడు.. మనం ఇచ్చే వాళ్లం.. వాళ్లు తీసుకునే వాళ్లు అనే ఫీలింగ్ చాలా మందికి తెలియకుండానే ఏర్పడుతుంది. వాళ్లకు ఏం కావాలో పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఏం ఇవ్వాలని అనుకుంటున్నామో అదే ఇస్తాం. చాలా సార్లు సాయం తీసుకునే వాళ్ల అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోం. వారిని తక్కువ అంచనా వేస్తాం. ఇది సరికాదు. ఆహార కొరత, విద్య, వైద్యం వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు కుటుంబాలకు అవసరాలు వేరేగా ఉంటాయి. వాటిని వారి మాటల్లో విని మన మనసుతో అర్థం చేసుకోవాలి.. అప్పుడు సాయం చేస్తే వాళ్లకి ఫలితం.. మన మనసుకి తృప్తి దక్కుతుంది.
ఇప్పుడు రూ. 400 కోట్ల రూపాయల ఫండ్..
పాతికేళ్ల కిందట రూ. 36 లక్షల రూపాయలతో ఎన్నో మంచి పనులు చేయోచ్చని ఫౌండేషన్ స్థాపించాం. ఇప్పుడు రూ. 400 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. అయితే మా కళ్ల ముందు కనిపిస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ ఫండ్ ఏ మూలకు సరిపోదు. ఐనప్పటికీ ప్రాధాన్యత క్రమం ఆధారంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. కోవిడ్‌తో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఆహారలేమి, నిరుద్యోగం, హెల్త్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దేశ జనాభా అందరికీ రెండు పూటల తిండి, ఇంటర్ వరకు ఆటంకం లేని విద్య, ధరించేందుకు మంచి దుస్తులు కొనుక్కునే దశ వచ్చే వరకు మన దేశం అభివృద్ధి చెందనట్టే లెక్క.
అలా ఉండటం తప్పేమి కాదు..
గడిచిన 25 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి త్వరలో తప్పుకోబోతున్నాను. నా తర్వాత ఈ బాధ్యతలు చూసుకునే వారికి ప్రాధాన్యతలు వేరేగా ఉండొచ్చు.వారి లక్ష్యాలు భిన్నంగా ఉండొచ్చు. అలా ఉండటం తప్పేమి కాదు. నిజానికి అలా ఉంటడం వల్ల విభిన్న రంగాల్లో సేవా కార్యక్రమాలు విస్తరిస్తాయి కూడా. అయితే ఎదుటి వారి కష్టాలను చూసి మనసు లోతుల్లోంచి స్పందించే గుణం మాత్రం తప్పకుండా ఉండాలి.