Skip to main content

Sudha Murty: పేరెంటింగ్‌.. ఇది ఒక మహాయజ్ఞంతో సమానం

పేరెంటింగ్‌ తల్లిదండ్రులకు పరీక్ష అంటే చాలా చిన్న మాట. పరీక్షకు ఒకసారి తప్పితే మరోసారి రాసుకునే అవకాశం ఉంటుంది. పేరెంటింగ్‌కి ఆ అవకాశం ఉండదు. ఉన్నది ఒక్కటే ఆప్షన్, ఆ ఒక్క అవకాశంలోనే ఉత్తీర్ణత సాధించాలి. అందుకే ఇది ఒక మహాయజ్ఞంతో సమానం. 
Sudha Murty
ఇన్ఫోసిస్‌ సుధామూర్తి

పేరెంటింగ్‌ మహాయజ్ఞంలో తల్లిదండ్రులను ఉత్తీర్ణులను చేయడానికి ఉపయోగపడే విషయాలను చెప్పారు ఇన్ఫోసిస్‌ సుధామూర్తి. ఆమె పేరెంటింగ్‌ అంశంగా రెండు రచనలు, ఒక వీడియో చేశారు. ఆమె చెప్పిన పేరెంటింగ్‌ టిప్స్‌ ఆలోచింపచేస్తున్నాయి.

Parenting

మాటలే మార్గదర్శనం!

  • ఎవరి కలలు వారివే. తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలు ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటిని తల్లిదండ్రులు గౌరవించాలి.
  • వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి డబ్బు ప్రామాణికం కాదు. క్లాసులోని పిల్లల్లో కొందరు ఎక్కువ డబ్బు ఉన్న ఇంటి వాళ్లు ఉంటారు. కొందరు తక్కువ డబ్బు ఉన్న వాళ్లు ఉంటారు. అందరితో ఒకేరకంగా స్నేహంగా మెలగాలని పిల్లలకు నేరి్పంచాలి.
  • పిల్లలు ఏదైనా కావాలని అడిగితే వారి మాట పూర్తి కాకముందే కొనివ్వడానికి సిద్ధం కాకూడదు. వాళ్లు అడిగిన వస్తువు అవసరం ఏంటో వారినే అడగాలి. నిజంగా అది తక్షణ అవసరమైనదే అయితే వెంటనే కొనివ్వచ్చు. కొన్ని అప్పుడే కొని తీరాల్సిన అవసరాలు కాకపోవచ్చు. వాటిని వాయిదా వేయడమే కరెక్ట్‌.
  • మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. ఇన్నిసార్లు చెప్పడం ఎందుకంటే... పిల్లలతో తల్లిదండ్రులు ఎంత ఎక్కువ సమయం గడిపితే, ఆ సమయంలో పిల్లలతో ఎంత స్నేహంగా మాట్లాడితే అంత మంచిది. పిల్లల ఆలోచనలను తల్లిదండ్రుల అర్థం చేసుకునే సమయం ఆ మాటల ద్వారానే. మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠంలా కాకుండా మాటల్లో మాటగా చెప్పగలిగేది కూడా అప్పుడే.
  • ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేరి్పంచాలి. ఒక వ్యక్తి వృత్తిని బట్టి, సమాజంలో ఆ వ్యక్తికి దక్కుతున్న హోదాను బట్టి గౌరవాలు పెరగడం తగ్గడం తప్పు. ఒక వ్యక్తి పెద్ద ప్రొఫెసర్‌ కావచ్చు, అతడి కారు డ్రైవర్‌ కావచ్చు, తోటమాలి కావచ్చు, ఇంటి ముందు చెత్త తీసుకువెళ్లే వ్యక్తి కావచ్చు... ఎవరి జీవితం వారిది. వారి పనులను బట్టి గౌరవాల్లో హెచ్చుతగ్గులు ఉండరాదు. అన్ని పనులూ గౌరవప్రదమైనవేనని తెలియచేయాలి.
  • పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, వారిని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీరు అలా ఉండడానికి ప్రయతి్నంచండి. పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు తప్పుల తడకలా ఉంటూ పిల్లలు ఒప్పుల కుప్పలా పెరగాలంటే సాధ్యం కాదు. 
  • పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకూడదు. ఎవరి బలాలు వారివే, ఎవరి బలహీనతలు వారివే. 
    సుధామూర్తి జీవితాన్ని పలుకోణాల్లో పరిశీలించి, తన అనుభవాలతో విశ్లేషించి, ఆమె తన పిల్లల పెంపకంలో పాటించి చెప్పిన విషయాలివి. అలాగే పేరెంట్స్‌ ధోరణి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేవిధంగా ఉండకూడదని మరో విషయాన్ని జత చేశారు చైల్డ్‌ సైకాలజిస్ట్‌ సుదర్శిని. ‘‘మరొకరి పిల్లలతో కానీ ఇంట్లో తమ ఇద్దరు పిల్లల మధ్య కానీ కంపారిజన్ చేయకూడదు. అలాగే పిల్లల మీద ఓవర్‌ ఎక్స్‌పెక్టేషన్ కూడా పెట్టుకోకూడదు. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో ఒకరి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఒకరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంత ఘోరమైన తప్పు మరొకటి ఉండదు’’ అన్నారామె.
    పేరెంటింగ్‌ అత్యంత కేర్‌ఫుల్‌గా సాగాల్సిన యజ్ఞం. అమ్మానాన్నల భుజాల మీద కనిపించని బాధ్యత. అయితే ఈ బాధ్యత బరువుగా అనిపించదు. సంతోషంగా మోసే ఈ బాధ్యత అంతే సంతోషకరమైన ఫలితాలనివ్వడానికి నిపుణులు చెప్పిన సూచనలు తప్పకుండా ఉపయోగపడతాయి.

ఎవరికి వారు ప్రత్యేకం

ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకలా ఉండరు. అలాగే ఒక తల్లికి పుట్టిన పిల్లలిద్దరూ ఒకలా ఉండాలని కూడా లేదు. సన్నగా– కొంచెం బొద్దుగా, మేని ఛాయలో తేడా, ఎత్తులో తేడా, తెలివితేటల్లో తేడాగా ఉంటారు. అలాగే వారి ఇష్టాయిష్టాలు కూడా భిన్నంగా ఉండచ్చు. ఈ తేడాల రీత్యా ఒకరిని ప్రత్యేకంగా, మరొకరి పట్ల నిరాసక్తంగా ఉంటూ పక్షపాతం చూపించడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం ఆ ఇద్దరు పిల్లలకూ నష్టమే. పిల్లల్లో ప్రతి ఒక్కరిలో తమకంటూ ‘ది బెస్ట్‌ క్వాలిటీ ఒకటి ఉంటుంది. పేరెంట్స్‌ ఆ క్వాలిటీని గుర్తించాలి తప్ప తమ అభిరుచులను రుద్దకూడదు.
– డాక్టర్‌ సుదర్శిని, చైల్డ్‌ సైకాలజిస్ట్‌

Sakshi Education Mobile App
Published date : 11 May 2022 04:19PM

Photo Stories