Career Trends: 40 లక్షల మంది అమెరికన్లు ఉద్యోగాలకు రాజీనామా.. సొంత వ్యాపారాలకు ప్రాధాన్యం
రాజీనామాలకు కారణాలతో పాటు ఏం చేస్తే ఉద్యోగం మానకుండా ఉంటారో తెలుసుకోవడం దీని ఉద్దేశం. కనీసం 40 శాతం మంది తమ ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తేలింది. వీరంతా మూడు నుంచి ఆర్నెల్లలో రాజీనామా యోచనలో ఉన్నారట. చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన, మరింత తృప్తినిచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నారట. ఎదుగుదలకు అవకాశాల్లేక మానేసినట్టు 41 శాతం మంది చెప్పారు. మొత్తమ్మీద ఆశించిన వేతనం, ఇతరత్రా తగినన్ని లాభాలు లేకపోవడం రాజీనామాలకు ప్రధాన కారణమని సర్వే తేలి్చంది. ఈ ఏడాదిలో ఒక్క అమెరికాలోనే ఇప్పటిదాకా దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాలు మానేసినట్లు తేలింది. 2022 అంతా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చన్నది నిపుణుల అంచనా. ఇందుకు కరోనా కొంతవరకే కారణమని మెకిన్సే నివేదికను సిద్ధం చేసిన వారిలో ఒకరైన బోనీ డౌలింగ్ అన్నారు. ‘‘ఉద్యోగమనే భావనే సమూలంగా మారుతున్న వైనం కొన్నాళ్లుగా స్పష్టంగా కన్పిస్తోంది. జీవితంలో ప్రాథమ్యాల విషయంలో ఆలోచనా శైలిలోనే మార్పు కనిపిస్తోంది. ఏ ఉద్యోగం చేసినా తమకు నచ్చినట్లు ఉండాలని ఆశిస్తున్నారు’’ అని వివరించారు. ఉద్యోగుల మార్కెట్ ఇప్పుడిప్పుడే కరోనా ముందునాటి స్థితికి చేరుకోవడం కష్టమేనన్నారు.
Also read: IT Job Resume : ఐటీ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా..? అయితే మీ రెజ్యూమ్‌లో ఈ 5 తప్పులు చేయకండిలా..!
నచ్చని రంగాలకు గుడ్‌బై...
కరోనా తరువాత రాజీనామా చేసిన వాళ్లలో సగం ఇతర రంగాలకు మళ్లుతున్నట్లు మెకిన్సే చెబుతోంది. సర్వేలో భాగంగా గత రెండేళ్లలో ఉద్యోగాలు మానేసిన ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాలకు చెందిన 2,800 మందిని ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నించింది. వీరిలో 48 శాతం ఇతర రంగాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నట్లు తేలింది. ‘‘కరోనా వేళ విపరీతమైన ఒత్తిడికి గురై శక్తివిహీనంగా మారిపోయిన భావన తట్టుకోలేక పలువురు ఉద్యోగాలు మానేశారు. ఉన్న రంగంలో మెరుగైన ఆదాయం కష్టమని కొందరు ఇతర రంగాల వైపు మళ్లారు. రిటైల్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో మానేసిన వారిలో ఏకంగా 60 శాతం రంగం మారడమో, పూర్తిగా మానేయడమో చేశార’’ని తేల్చింది.
Also read: TSPSC : టీఎస్‌పీఎస్సీ 833 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
భారత్‌లోనూ...
భారత ఐటీ కంపెనీల్లో ఈ ఏడాది వేలకొద్ది రాజీనామాలు జరిగాయి. గత ఏప్రిల్– జూన్ మధ్య కాలంలో ఇన్ఫోసిస్‌కు ఏకంగా 28.4 శాతం మంది రాజీనామా చేశారు. తర్వాత స్థానాల్లో విప్రో (23.3), టెక్ మహీంద్రా (22), టీసీఎస్ (19.7) ఉన్నాయి. ‘‘ఒకే కంపెనీలో మూడేళ్ల కంటే ఎక్కువ ఉంటే ఎదుగుదలకు అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. కెరీర్ కోసం అవసరమైతే ఏడాదిలో రెండు ఉద్యోగాలు కూడా మారతాం’’ అని ఓ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ రఘురామ మంచినేని అన్నారు. భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు భారీగా ఉండటమూ రాజీనామాలకు ఓ కారణమని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘వాళ్లంతా పెద్ద కంపెనీల్లో చేరి కెరీర్‌ను నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు’’అని సాక్షి ప్రతినిధితో అన్నారు.
Also read: Success Story : పెట్టుబడి రూ.2 లక్షలే.. టర్నోవర్ మాత్రం కోట్లలో.. ఇదే మా విజయ రహస్యం..
స్వయం ఉపాధే బెటర్...
మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేసిన వారిలో 29 శాతమే మళ్లీ సంప్రదాయ కొలువుల్లో చేరారు. మిగతా వారిలో చాలామంది సొంత వ్యాపారాలకు మొగ్గారు. కొందరు పార్ట్‌టైం కొలువులకు జై కొట్టారు. కరోనా సమయంలో అమెరికాలో సొంత వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 30 శాతం పెరిగిందట. 2021లోనే 54 లక్షల దరఖాస్తులు వచ్చాయని వైట్‌హౌస్ వెల్లడించింది.
Also read: Inspiration Story: భర్త కానిస్టేబుల్.. భార్య ఐపీఎస్.. 10వ తరగతి కూడా చదవని భార్యను..
మనోళ్లు అక్కడలా...
అమెరికాలోని భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం కాసులు కురిపించింది. ఓవైపు వేలాది మంది రాజీనామాలు చేస్తుంటే మనవాళ్లేమో ఫుల్ టైం కొలువుకు తోడు రెండు, మూడు కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా చేశారు. ఇది వారికీ, అటు ఉద్యోగుల కొరతతో అల్లాడిన పలు కంపెనీలకూ కలిసొచ్చింది. కానీ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇకపై వారానికి కనీసం 3 రోజులు విధిగా ఆఫీసుకు రావడం తప్పనిసరి చేయడంతో చాలామంది పార్ట్ టైం కొలువులకు స్వస్తి పలకాల్సి వస్తోంది.
Also read: Council for Social Development Report: అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు!