Skip to main content

AP CM YS Jagan Mohan Reddy : విద్యారంగంలో అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ విస్తృత వినియోగించుకోవాలి.. ఈ సర్టిఫికెట్‌ల‌కు ప్రపంచంలో ఎక్కడైనా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విద్యాసంస్థల్లో మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, అందుకోసం అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ (Artificial intelligence)ని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖను ఆదేశించారు.
AP CM YS Jagan Mohan Reddy Latest Education News, AI
AP CM YS Jagan Mohan Reddy

ఆగ‌స్టు 14వ తేదీన (సోమవారం) తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ సమీక్ష జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో ప్రముఖంగా చర్చ సాగింది. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం జగన్‌
ఆదేశాలు జారీ చేశారు. 

అలాగే.. ‘‘అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ(AI)లో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్‌ అకడమిక్‌ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. పైలట్‌ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలి.ఏఐలో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశం. అందుబాటులో ఉన్న ఏఐని వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వినియోగించుకోవాలి. ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి కూడా ఏఐని వినియోగించుకోవాలి. కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని వినియోగించుకోవాలి. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ వినియోగపడుతుంది. పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలి. విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాల‌న్నారు. 

వీటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైందిగా ఉండాలన్నదే లక్ష్యం..
ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్‌ తీసుకున్నా, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైందిగా ఉండాలన్నదే లక్ష్యం అని సీఎం జగన్‌ విద్యాశాఖకు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Published date : 16 Aug 2023 12:09PM

Photo Stories