Skip to main content

Investment for Child Education: ప్రణాళికతోనే కెరీర్‌ బంగారం

మనీష్‌ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్‌ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు. ఆద్య చదివే కోర్స్‌ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్‌ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది.
Higher Education Abroad , Successful Education Planning , Essential for Educational Success,Career is golden with planning, Education Planning, Investment Strategy,

బోలెడు ఆప్షన్లు 

గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్‌ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి.

ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్‌ ఎకనామిక్స్, కాగ్నిటివ్‌ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్‌ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్‌ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్‌ డిజైనింగ్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)కు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ శాతం కెరీర్‌ ఆప్షన్లు సోషల్‌ మీడియా నుంచి ఉంటున్నాయి.

చదవండి: International Funds: మీ పిల్ల‌ల ఉన్న‌త విద్యకోసం ఈ ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ గురించి తెలుసుకోండి..!

వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్‌ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఓవర్‌సీస్‌ అడ్మిషన్స్‌ సంస్థ అధినేత శిరీష్‌ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్‌ ఎనర్జీ, కంటెంట్‌ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి.  

 ‘‘వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించి 85 శాతం ఉద్యోగాలు ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉంది. సంప్రదాయ ఉద్యోగాల నుంచి నిరంతరం మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగం దాదాపు ఉండకపోవచ్చు. అది రిటైల్‌ అయినా లేక ఈ కామర్స్‌ అయినా కృత్రిమ మేథ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుంది’’అని టీమ్‌లీజ్‌ ఎడ్యుటెక్‌ సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ తెలిపారు. అంటే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగై పోతాయని అనుకోవద్దు.

అస్థిరతలు వద్దనుకునే వారు ఇంజనీరింగ్, మెడిసిన్‌ వైపు వెళుతుండడాన్ని గమనించొచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, చరిత్రకారుల అవసరం భవిష్యత్తులోనూ ఉంటుంది. కానీ, ఆటోమేషన్, ఏఐ కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పుగా మారడం ఖాయం. లోగో, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ పనులు ఆటోమేషన్‌కు మారుతున్నాయి. ట్రాన్స్‌లేటర్లు, టెలీ మార్కెటర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది.

యంత్రాలు అంత సులభంగా చేయలేని నైపుణ్యాలు, కోర్సులను చేసే దిశగా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గుప్తా సూచించారు. విద్య, ఉపాధిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండడం, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాయంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మెరుగైన విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించడాన్ని కూడా పరిశీలించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.   

పెరిగిపోతున్న వ్యయాలు 

అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకమైన కోర్సులకు డిమాండ్, ఇందుకు మెరుగైన వసతుల కల్పన కారణంగా దేశ, విదేశాల్లో కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.50వేలకే పూర్తయ్యే ఎంబీఏ కోర్స్‌ నేడు రూ.5 లక్షలకు చేరడం ఇందుకు ఓ నిదర్శనం.

ఐఐఎంలలో ఫీజులు రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నాయి. గతంలో ఇవి రూ.6 లక్షల స్థాయిలోనే ఉండేవి. ఐఐటీలోనూ కోర్సు ఫీజు రూ.6–10 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో ఫీజుల పెరుగుదల 100 శాతానికి పైనే ఉంటోంది. విదేశాల్లోనూ ఫీజుల పెరుగుదల ఇదే మాదిరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా డాలర్‌ మారకం రేటు అధికంగా ఉండడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది.

‘‘దశాబ్దం క్రితం విదేశాల్లో ఏడాది విద్యా వ్యయాలు రూ.25–30 లక్షల మధ్య ఉండేవి. ఇప్పుడు రూ.50 లక్షలకు చేరాయి’’అని గుప్తా తెలిపారు. అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ ఫీజు దశాబ్దం క్రితం రూ.కోటి స్థాయిలో ఉంటే, ఇప్పుడు అది రెట్టింపైంది. కేవలం ట్యూషన్‌ ఫీజుల వల్లే కాకుండా, జీవన వ్యయాలు కూడా పెరిగిపోవడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది.  

కాకపోతే విదేశీ విద్యకు సంబంధించి నూరు శాతం స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సొంతం చేసుకోవాలంటే విదేశీ విద్యా ప్రవేశానికి మూడేళ్ల ముందు నుంచే తమ ప్రొఫైల్‌పై పని చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

‘‘నూతనతరం కోర్సులు అయితే సాధారణంగా ఏటా రూ.5–10 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఢిల్లీలోని పెర్ల్‌ అకాడమీలో బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ యూఐ/యూఎక్స్‌ (యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌/యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌) కు ఏటా రూ.7 లక్షల ఫీజు ఉంది’’అని గుప్తా వెల్లడించారు. కోర్సుకు సంబంధించి ట్యూషన్‌ ఫీజు కేవలం ఒక భాగమే. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు అదనంగా ఖర్చు చేయక తప్పదు.

కాలం చెల్లిన కరిక్యులమ్‌ నేపథ్యంలో, పిల్లలకు సమాంతరంగా నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని గుప్తా అంటున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశానికి దూరంగా, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తే అప్పుడు వారి జీవనం కోసం మరింత వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక విదేశాలకు పంపించే వారిపై ఈ భారం మరింత పెరుగుతుంది.

వసతి, ఆహారం, లాండ్రీ, ఇంటర్నెట్, మొబైల్, వస్త్రాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీవనం, రవాణా వ్యయాలు, యుటిలిటీలు (విద్యుత్, టెలిఫోన్‌), ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ అరిజిత్‌ సేన్‌ పేర్కొన్నారు.          

అనుసరణీయ మార్గాలు.. 

ఖరీదుగా మారుతున్న ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కాలేజీ ప్రవేశానికి రెండేళ్ల ముందు నుంచే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. విదేశాలకు పంపించేట్టు అయితే అక్కడి జీవన పరిస్థితులు, సంస్కృతి, దరఖాస్తు ప్రక్రియ, ఎదురయ్యే సవాళ్లపై అవగాహన తెచ్చుకోవాలి. కనుక ఈ విషయంలో నిపుణుల సాయం తప్పనిసరి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చదువులకు సంబంధించి ప్రస్తుత వ్యయాలు.

తమ పిల్లల ఉన్నత విద్యకు ఇంకా ఎన్నేళ్ల కాల వ్యవధి మిగిలి ఉంది? ఎలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలి, అక్కడి ప్రస్తుత ఫీజులు, తమ పిల్లలు కాలేజీ ప్రవేశం పొందే నాటికి ఎంత మేర పెరగొచ్చనే విషయాలపై స్పష్టత అవసరం. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కోర్స్‌ వ్యయం, ట్యూషన్‌ ఫీజు, జీవన వ్యయాలు, రవాణా వ్యయాలు, స్కాలర్‌షిప్‌ ఉన్న అవకాశాలు, మెరుగైన విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను వారి నుంచి తెలుసుకోవచ్చు.

మరీ ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వచ్చే నాటికి వారి ఆసక్తులు ఎలా ఉంటాయన్నది ముందే గుర్తించడం అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారు ఏ కోర్స్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తారన్నది ముందుగా తెలియదు. అందుకని ఖరీదైన కోర్స్‌కు సంబంధించి సన్నద్ధం కావడం మంచిది.  

భయపెట్టే అంచనాలు 

చారిత్రకంగా చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో కోర్సుల ఫీజులు నూరు శాతానికి పైగా పెరిగాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘కోర్సుల ఫీజుల పెరుగుదల వచ్చే దశాబ్దం పాటు ఇదే మాదిరిగా ఉంటుంది. జీడీపీ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వెళితే, దీనికి అనుగుణంగా సగటున పెరిగే కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, విద్యా వ్యయం 10 శాతం చొప్పున పెరుగుతూ వెళ్లినా.. ఫీజులు, విద్యా రుణాలు భారంగా మారతాయి’’అని నీతి శర్మ పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ వంటి ప్రత్యామ్నాయాల రూపంలో రవాణా, జీవన వ్యయాల వంటివి ఆదా చేసుకునే అవకాశం ఉందని శర్మ వివరించారు. ‘‘ప్రతిష్టాత్మక కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌ డిగ్రీ చేసేందుకు ఇప్పుడు ఏటా రూ.12–15 లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యా ద్రవ్యోల్బణం 10–12 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే పదేళ్లలో ఇది రూ.40 లక్షలకు చేరొచ్చు.

ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్‌ డిగ్రీకి నేడు రూ.కోటి అవుతుంటే పదేళ్ల తర్వాత రూ.3 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చు’’అని అరిజిత్‌ సేన్‌ తెలిపారు. 

మొదటి పుట్టిన రోజు నుంచే..

పిల్లల ఉన్నత విద్యకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు ఉన్న సులభ మార్గం వారి మొదటి పుట్టిన రోజు నుంచి ఆరంభించడమే. దీనివల్ల పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం మిగిలి ఉంటుంది. నెలవారీ పరిమిత మొత్తంతో పెద్ద నిధిని సమకూర్చుకోగలరు. ఇందుకు గాను ఫైనాన్షియల్‌ అడ్వైజర్, ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌ను ముందే సంప్రదించి తమకు అనుకూలమైన (తగిన) ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

కేవలం ఉన్నత విద్య అనే కాకుండా వారి వివాహాలకు సంబంధించి కూడా విడిగా ప్రణాళిక అవసరం. భారీ ఖర్చులకు సంబంధించి ముందు నుంచే ఇన్వెస్ట్‌ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై పెద్ద భారం పడదు. పెట్టుబడుల్లో అధిక శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. 10–15 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కొంత మొత్తాన్ని హైబ్రిడ్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలకు) వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.

పిల్లల ఉన్నత విద్యకు మిగిలి ఉన్న కాల వ్యవధి, ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలి, ఎంత రాబడులు అనే అంశాల ఆధారంగా నిపుణులు వివిధ సాధనాలను సూచిస్తుంటారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్య ఆగిపోకూడదు. అందుకని మెరుగైన కవరేజీతో టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. అలాగే, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో పిల్లలను కూడా భాగం చేయడం, లేదంటే వారి పేరిట ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం ఎంతో అవసరం.  

స్కాలర్‌ షిప్‌/విద్యారుణం 

దేశ, విదేశీ యూనివర్సిటీలు చాలా వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఆఫర్‌ చేస్తున్నాయి. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లను సందర్శించి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. విదేశాల్లోనూ చాలా యూనివర్సిటీలు స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పేరొందిన ట్రస్ట్‌లు కూడా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఒకవైపు తమ వంతు ఇన్వెస్ట్‌ చేస్తూనే, మరోవైపు స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఉన్న మార్గాలను తెలుసుకుని ఉండడం మంచిది.

కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెషనల్‌ డిగ్రీలకు అనుబంధంగా అప్రెంటిషిప్‌ అవకాశం కల్పిస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష అనుభవంతోపాటు కొంత ఆర్థిక మద్దతు లభించినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు యూనివర్సిటీ కోర్సులకు అప్రెంటిషిప్‌ ప్రోగ్రామ్‌లు అనుబంధంగా ఉన్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సరిపడా సమకూర్చుకోలేని వారు విద్యా రుణాన్ని కూడా పరిశీలించొచ్చు.

చిన్న మొత్తం అయితే ఎలాంటి ష్యూరిటీ అవసరం పడదు. పెద్ద మొత్తంలో రుణం తీసుకునేట్టు అయితే ఆస్తుల తనఖా, గ్యారంటీలను బ్యాంకులు కోరొచ్చు. ఇందుకు కూడా ముందుగానే సిద్ధమవ్వాలి. విద్యా రుణాలపై వడ్డీ రేటు 9–15 శాతం మధ్య ఉంది. పిల్లల విద్య పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు చేసే ఆప్షన్‌ ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు కోర్సు ఫీజులో 80–90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. పిల్లలు చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ అవకాశాలను వినియోగించుకోవడం మరొక మార్గం.  

ఎంత మొత్తం కావాలి..? 

కోర్స్‌ పేరు

2023లో వ్యయం

2038లో అంచనా వ్యయం (రూ.లలో)

నెలవారీ చేయాల్సిన పెట్టుబడి?

ఇంజనీరింగ్‌

5లక్షలు

20.88 లక్షలు

4,181

ప్రముఖ కాలేజీల్లో ఇంజనీరింగ్‌

10 లక్షలు

41.77లక్షలు

రూ.8,362

వైద్యవిద్య (ప్రభుత్వ)

4లక్షలు

16.70లక్షలు

3,345

వైద్య విద్య (ప్రైవేటు)

50లక్షలు

2.08కోట్లు

41,808

మేనేజ్‌మెంట్‌ కోర్స్‌

20 లక్షలు

83.54లక్షలు

16,273

మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ (యూఎస్‌లో)

2కోట్లు

8.35కోట్లు

1,67,230

నోట్‌: ఇవి అవగాహన కోసం ఇచ్చిన గణాంకాలు

ఇవి గుర్తు పెట్టుకోవాలి

కాలేజీ ఎంపిక సమయంలో

  • పిల్లల ఆసక్తులను తెలుసుకోవాలి
  •      కొత్తగా వస్తున్న టెక్నాలజీలకు అనుగుణంగా, మెరుగైన అవకాశాలున్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  •      యూనివర్సిటీలు, కోర్సులు, ఫైనాన్షియల్‌ స్కీముల గురించి లోతైన అధ్యయనం చేయాలి.
  •      అడ్మిషన్ల ప్రక్రియ, అక్కడి విద్యా కాలం గురించి తెలుసుకోవాలి

పొదుపు విషయంలో

  • భవిష్యత్తులో కోర్సుల ఫీజులపై అంచనాకు రావాలి 
  •      ముందు నుంచే ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టాలి 
  •      ఈక్విటీ ఫండ్స్‌ సహా పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి 
  •      తగినంత కవరేజీతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి   
Published date : 20 Nov 2023 03:23PM

Photo Stories