Skip to main content

Interview for the post of Chairperson: చైర్‌ పర్సన్‌ పదవికి మౌఖిక పరీక్ష!.. 15 ప్రశ్నలకు 12 సరైన జవాబులు.. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అనుకోకుండా లభించిన అవకాశాన్ని ఓ మహిళ సద్వినియోగం చేసుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మెప్పించేలా సమాధానం ఇచ్చారు. ఏకంగా మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పదవిని చేజిక్కించుకున్నారు.
Kamareddy woman leadership   Madnoor Market Committee Chairman Saujanya is a role model for all

మార్కెట్‌ కమిటీ పదవికి ప్రశ్నలేంటి? జవాబులేంటి? చైర్‌ పర్సన్‌ను ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది కదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయా? అలాంటి సందేహాలు నిజమే..అలాగే ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం ద్వారా చైర్‌ పర్సన్‌ పదవికి ఎంపికైంది కూడా వాస్తవమే.

కామారెడ్డి జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ వినూత్న ప్రయోగం చేశారు. మద్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఎంపికకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన యువతిని పదవికి ఎంపిక చేశారు.  

చదవండి: Nukamalla Indira: ఎంపీటీసీ నుంచి స్కూల్‌ టీచర్‌గా

ప్రశ్నపత్రం రూపొందించి.. పరీక్ష నిర్వహించి.. 

సాధారణంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేరు ను అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఆ పార్టీ ముఖ్య నాయకులో ప్రభుత్వానికి ప్రతిపాదించి నామినేట్‌ చేయిస్తారు. కానీ లక్ష్మీకాంతారావు ఇందుకు భిన్నంగా ఈ పదవికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఎక్కువ మార్కులు సాధించిన వారినే చైర్మన్‌గా నియమిస్తామని ప్రకటించారు. దీనికి మార్కెట్‌ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ మండలాల నాయకులు కూడా సరే అన్నారు.

ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ పదవికి నిర్వహించిన మౌఖిక పరీక్షకు స్థానిక నేతల కుటుంబాలకు చెందిన 15 మంది మహిళలు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక పార్టీ నేతలతో కలిసి ఓ ప్రశ్నపత్రం రూపొందించారు.

చదవండి: Balaji Sucess Story: తోబుట్టువుల స్ఫూర్తితో ‘బాలాజీ’.. ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించాడు

మార్కెట్‌ కమిటీల విధులు, బాధ్యతలు, అభివృద్ధికి సంబంధించిన 15 ప్రశ్నలను పొందుపరిచారు. సెప్టెంబర్‌ 29న నిర్వహించిన ఈ పరీక్షకు ఆ 15 మందీ హాజరయ్యారు. వీరిలో జుక్కల్‌ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అయిల్వార్‌ సౌజన్య అత్యధిక మార్కులు సాధించారు. దీంతో ఆమె పేరును ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వానికి పంపించారు. ఆ మేరకు ప్రభుత్వం తాజాగా సౌజన్యను చైర్‌ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

15 ప్రశ్నలకు 12 సరైన జవాబులిచ్చిన సౌజన్య 

సౌజన్య ఎంఎస్సీ బీఈడీ చదివారు. పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ పరీక్షకు ఆయా మండలాలకు చెందిన పూజా సందే, నమేవార్‌ పద్మ, జి.పార్వతి, వాగ్మారే ప్రియాంక, నమేవార్‌ అనిత, వాగ్మారే సోని, సంగీత తుకారాం, గైక్వాడ్‌ రాజాబాయి, కర్మల్‌కార్‌ సంగీత, అర్పిత అంజనీకర్, ఎడికే రాంబాయితో పాటు మరో ముగ్గురు హాజరయ్యారని సమాచారం. కాగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును, చైర్‌ పర్సన్‌గా నియమితులైన అయిల్వార్‌ సౌజన్యను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు.

బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు మంత్రిని కలిశారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయత్నిస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం: సీఎం 

మద్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం.. పదవుల ఎంపికలో నయా దృక్పథం..ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం..ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మద్నూర్‌ మార్కె ట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం.

తొలిసారిగా ఇంటర్వ్యూ పద్ధతిలో, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల చదువుకు.. ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించింది..’అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక విధానంలో ఈ పదవికి సౌజన్యను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.  

Published date : 21 Nov 2024 11:24AM

Photo Stories