Skip to main content

Education Sector: విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు

వనపర్తి విద్యావిభాగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని.. నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చి కాషాయీకరణ చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పచెబుతున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
Governments neglecting the education sector

డిసెంబ‌ర్ 29న‌ జిల్లాకేంద్రంలోని యాదవ సంఘం భవనంలో సంఘం ఉమ్మడి జిల్లా జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కె.పవన్‌కుమార్‌ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలకు విచ్ఛలవిడిగా అనుమతులివ్వడంతో పాటు మతం, కులం పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతున్నాయని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థినులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కేటాయించకుండా పాలన సాగిస్తోందని, విద్యారంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు.

చదవండి: CUET 2025 Key Changes: సీయూఈటీలో కీలక మార్పులివే!.. ప‌రీక్ష విధానం ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా రూ.7,800 కోట్లకుపైగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్లు బకాయి ఉన్నాయని.. విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేగాకుండా సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్‌ సుల్తానా మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస వసతులు, ల్యాబ్స్‌ లేవని, తక్షణమే స్పందించి వసతులు కల్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తయ్యన్న, రాజు, వెంకటేశ్‌గౌడ్‌, యశ్వంత్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 31 Dec 2024 09:36AM

Photo Stories