Success Story : ట్యూషన్ చెబుతూ... సివిల్స్‌లో టాపర్‌గా
ట్యూషన్లు చెబుతూ డిగ్రీ పూర్తిచేశారు. 1995 సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఏపీలోనే టాపర్‌గా నిలిచారు. తను అనుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించారు. ఆయనే జనగామ జిల్లాలోని ఓబుల్ కేశవాపురంలో జన్మించిన బుర్రా వెంకటేశం. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఉద్యోగార్థుల కోసం ఆయన సలహాలు, సూచనలు..
10వ తరగతి, ఇంటర్‌పై పట్టుంటే చాలు...
పోటీపరీక్షలకు, అకడమిక్ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అకడమిక్ ఒక సబ్జెక్టుకు పరిమితమవుతుంది. పోటీపరీక్షలు అనేక సబ్జెక్టుల సమాహారం. చాలా మంది అభ్యర్థులు పోటీపరీక్షలను సైతం అకడమిక్ చదువులాగానే భావిస్తున్నారు. అకడమిక్స్‌లో టాప్‌లో ఉన్న వారు కూడా ఉద్యోగాలను సాధించక లేకపోవడానికి కారణం ఇదే. 10, ఇంటర్మీడియట్ సబ్జెక్టులపై పూర్తిస్థాయి పట్టు ఉంటే సివిల్స్ సర్వీస్ ఎగ్జామ్స్‌ను ఈజీగా సాధించవచ్చు. 1990–95 మధ్యలో చదువుకున్నవారు చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మొదట ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్‌లో పేర్లు నమోదు చేసుకునేవారు. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవారు. ఎందుకంటే క్లరికల్, టైపిస్ట్, గ్రూప్–3, 4 ఉద్యోగాలు వచ్చేవి. కానీ, నేను అలా చేయలేదు. పదో తరగతిలోనే ఐఏఎస్ కావాలని నోట్స్‌లో రాసిపెట్టుకున్నా. ఆ ఆత్మవిశ్వాసంతోనే చదివి ఆలిండియా స్థాయిలో ర్యాంకు సాధించా.
గాలివాటంలా ప్రయత్నిస్తే సమయం వృథా
పోటీ పరీక్షలపై స్పష్టత లేకుండా, గాలివాటంలా ప్రయత్నిస్తే లాభం ఉండదు. రాజమండ్రిలో సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో అటెండర్ ఉండేవారు. అప్పుడు నా జీతం రూ.15 వేలు మించి ఉండేది కాదు. కానీ, అటెండర్‌కు తోటలు, ఇంటి అద్దెల ద్వారా నెలకు రూ.50 వేలు వచ్చేవి. దీంతో ఎందుకు ఈ ఉద్యోగం, డిగ్రీ పూర్తి చేస్తే రికార్డ్ అసిస్టెంట్ అవ్వొచ్చు కదా అని చెప్పా. దానికి అతడు సబ్‌కలెక్టర్ దగ్గర పనిచేస్తున్నానంటే ఊర్లో ఎంతో గౌరవం. దానిని ఎందుకు పోగొట్టుకోను. డిగ్రీ పూర్తి చేసి క్లర్క్, రికార్డ్ అసిస్టెంట్ అయితే ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతారో తెలియదు. నానా తల్నొప్పులు పడాలి అని చెప్పాడు. తనకు ఏ పని అయితే సరిపోతుందో అదే స్పష్టంగా చెప్పాడు. ఉద్యోగార్థులకు కూడా ఆ స్పష్టత ఉండాలి. మొదట్లో ఇష్టం లేని రంగంలోకి వెళ్లినా... ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ చదివినా ఒరిగే ప్రయోజనం శూన్యం. అందుకే ఒక లక్ష్యం నిర్దేశించకుని ఆ దిశగా ప్రయత్నిస్తే విజయం వరిస్తుంది.
అప్పటికీ.. ఇప్పటికీ చాలా మారింది...
ఇలానే చదవాలి. అప్పుడే జాబ్ వస్తుందని ఏదీ లేదు. కాకపోతే పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగార్థులు ఇదే చివరి అవకాశం అన్నంత దీక్షతో చదవాలి. అప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తారు. అవసరమనేది మనలో ఉండే శక్తిని కూడా బయటకు తీసుకొస్తుంది. అప్పటి మా రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు పోటీ పరీక్షలంటే పట్నం వచ్చేవాళ్లు. ఇక్కడ ఉండే స్థోమత లేని వాళ్లు వారానికో, నెలకో ఒకసారి వచ్చి కావాల్సిన సమాచారాన్ని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లేవారు. అందుకు నేనే ఒక ఉదాహరణ. ఇప్పుడు ప్రతి ఊరికీ టీవీలు, ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల మెటీరియల్స్ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇంటి వద్దనే ఉంటూ సిద్ధం కావచ్చు.
జోనల్ వ్యవస్థతో తగ్గనున్న పోటీ
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా కాంపిటీషన్ చాలా తగ్గుతుంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌కు డీఎస్సీ రాస్తే లక్షల మందితో పోటీ పడాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్వ వరంగల్ ఇప్పుడు ఆరు జిల్లాలుగా మారింది. ఇప్పుడు ఆ పోటీ తగ్గనుంది. ఇప్పుడు 1:4 లేదంటే 1:5 మాత్రమే పోటీ ఉండవచ్చు. అబ్దుల్ కలాం ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నం చేసినా రాలేదు. అయినా నిరాశ పడలేదు. అక్కడితో ఆగిపోలేదు ఏరోనాటిక్ సబ్జెక్టు తీసుకుని ఎవరూ ఊహించని శాస్త్రవేత్తగా ఎదిగారు. అబ్రహం లింకన్ అన్ని ఎన్నికల్లో, వ్యాపారాల్లో నష్టపోయాడు. ఎప్పుడూ నిరాశ పడలేదు. డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటే వారు ఆ స్థాయికి చేరుకునే వాళ్లు కాదు.
అపోహలను దరిచేయనీయవద్దు
ఉద్యోగార్థులు అన్నింటికంటే ముఖ్యంగా అవకాశాన్ని గుర్తించగలగాలి. 80 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇలాంటి అవకాశం. అంటే భవిష్యత్తులో తక్కువగా పోస్టులను భర్తీ చేయవచ్చు. ఉన్నతస్థానాలకు ఎదగడానికి, నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా మారడానికి ఇదొక మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. యూట్యూబ్ వీడియోలు, సినిమా వ్యామోహంలో పడి కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఎక్కువ కాంపిటీషన్ ఉందని, పేపర్ లీకయిందని, రికమండేషన్లు, డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందనే రకరకాల వార్తలు వస్తుంటాయి. అవన్నీ పుకార్లే. వాటిని నమ్మితే చదువు మీద ధ్యాస పెట్టలేరు. దీక్షతో చదవండి. ఈ పోటీ ద్వారా చాలా నేర్చుకుంటారు. ఉద్యోగం రాకున్నా మిమ్మల్ని మీరు జయించిన వ్యక్తిగా మారి.. ఉద్యోగాన్ని మించిన ఉన్నతస్థాయి శిఖరాలకు చేరుకుంటారు.