Skip to main content

UPSC Civils: ఈ వ్యక్తిత్వ ల‌క్షణాలు ఉంటే.. సివిల్‌ సర్వీసెస్‌లో చేరొచ్చు..

What are the personality traits of a candidate who wants to join the Civil Services
What are the personality traits of a candidate who wants to join the Civil Services

సివిల్‌ సర్వీసెస్‌.. ప్రభుత్వ విధానాలను, ప్రణాళికలను.. క్షేత్ర స్థాయిలో అమలు చేసే పరిపాలన వ్యవస్థ. నిత్యం ప్రజలతో మమేకం అవడం.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవడం.. సివిల్‌ సర్వెంట్ల ప్రధాన వి«ధులు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధి సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు! ఇంతటి బాధ్యతాయుతమైన సర్వీస్‌ను లక్ష్యంగా ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థులు ముందుగా స్వీయ విశ్లేషణ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. అప్పుడే.. భవిష్యత్తులో సమర్థవంతంగా విధులు నిర్వహించి..సమాజంలో గుర్తింపు, గౌరవం పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనుకునే అభ్యర్థికి ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఉండాలి.. సేవాదృక్పథం ఉంటేనే రాణిస్తారా.. తదితర అంశాలపై విశ్లేషణ...

  • అకడమిక్‌ అర్హతలు ఒక్కటే కొలమానం కాదు
  • వ్యక్తిగత దృక్పథమూ ముఖ్యమే అంటున్న నిపుణులు

ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి సివిల్‌ సర్వీసులే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌ సాగిస్తూ.. పరీక్షకు హాజరవుతున్నారు. ప్రిపరేషన్‌తో విజయం సాధించొచ్చు. కానీ.. సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యం, ఉద్దేశాలకు తగిన వ్యక్తిగత దృక్పథం ఉంటేనే.. ఐఏఎస్‌ సాధించినా, ఐపీఎస్‌గా కొలువుదీరినా..సేవ, సంతృప్తి అనే భావన కలుగుతుందంటున్నారు.

చ‌ద‌వండి: Krishna Bhaskar, IAS : లక్షల జీతం కాద‌ని.. ల‌క్ష్యం కోసం..

అందుకే సివిల్స్‌వైపు

బ్యాచిలర్‌ డిగ్రీ మొదలు ఇంజనీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్, పీహెచ్‌డీ స్కాలర్స్‌ వరకూ.. అన్ని అకడమిక్‌ నేపథ్యాల విద్యార్థులు సివిల్‌ సర్వీసెస్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఐఐఎంలు, ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి పట్టాలు పొందిన వారితోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ కళాశాలల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన వారు కూడా ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సివిల్‌ సర్వీసెస్‌ కొలువుతో సమాజంలో గౌరవం,ఉన్నత హోదా, ఉద్యోగ భద్రత, ఉజ్వల కెరీర్‌ లభిస్తుందని ఆలోచించి ఇటువైపు అడుగులు వేస్తుంటారు. వాస్తవానికి ఈ సర్వీసుల్లో చేరే వారు దేశభక్తి, సమాజసేవ తమ ప్రథమ లక్ష్యాలుగా కలిగి ఉంటేనే.. సక్సెస్‌ఫుల్‌ సివిల్‌ సర్వెంట్‌గా రాణిస్తారని చెబుతున్నారు. దాంతోపాటు నిండైన ఆత్మవిశ్వాసం, స్థిత ప్రజ్ఞత, సమయస్ఫూర్తి, సవాళ్లను ఎదుర్కొనే వైఖరి వంటి లక్షణాలు ఉంటే.. ఎంపిక పరీక్షల్లో విజయంతోపాటు కెరీర్‌లోనూ రాణించేందుకు ఆస్కారం ఉంటుంది.

సేవా దృక్పథం
సివిల్‌ సర్వీసెస్‌కు ముఖ్యమైంది..సేవా దృక్పథం! ఈ సర్వీసుల ఉద్దేశం కూడా అదే. సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా తమ పరిధిలోని అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు రూపొందించే పథకాలు, అవి లక్షిత వర్గాలకు చేరేలా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలను సేవా భావనతో పరిష్కరించే నేర్పు అవసరం. అందుకే సివిల్స్‌ అభ్యర్థులు ముందుగా తమకు ఆ లక్షణం ఉందో, లేదో పరిశీలించుకోవాలి.

చ‌ద‌వండి: Sreedhanya Suresh,IAS: మా అమ్మ‌,నాన్న రోజువారీ కూలీలే.. ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లాడానికి డ‌బ్చు లేక‌.. 

ఆత్మవిశ్వాసం
సివిల్స్‌ అభ్యర్థులకు ఆత్మవిశ్వాసం తప్పనిసరి. ఇది పోటీ పరీక్షలో రాణించడానికి.. ఆ తర్వాత విధుల నిర్వహణలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ నుంచే ‘నేను సాధించగలను’,‘నేను చేయగలను’అనే సానుకూల దృక్పథంతో అడుగులు వేయాలి. లక్షల్లో ఉండే పోటీని చూసి ఆందోళన చెందకుండా.. ఆత్మవిశ్వాసంతో నేను సాధించగలను అనే ఆలోచనతో ముందుకు సాగాలి. అప్పుడే ప్రిపరేషన్‌ సాఫీగా సాగుతుంది. విధుల నిర్వహణ క్రమంలోనూ.. బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. ఎందుకంటే.. సివిల్‌ సర్వీస్‌ అధికారిగా ఐఏఎస్, ఐపీఎస్‌ హోదాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తొందరపాటుకు గురికాకుండా నిబ్బరంతో పనిచేయాల్సి ఉంటుంది.

స్థిత ప్రజ్ఞత
సివిల్‌ సర్వీసెస్‌ అధికారికి ఉండాల్సిన మరో ముఖ్య లక్షణం.. స్థిత ప్రజ్ఞత. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే లక్షణం, భావోద్వేగాలకు లోను కాని రీతిలో వ్యక్తిత్వాన్ని మలచుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే.. విధులు నిర్వర్తించే క్రమంలో పలు సందర్భాల్లో స్థిత ప్రజ్ఞతను పాటించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆవేశానికి గురి కాకుండా.. ఎదుటి వారి వాదనను సమభావంతో వినగలగాలి. భావోద్వేగాల నియంత్రణ కలిగుండాలి. ఈ లక్షణం.. పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే సమయంలోనూ ఎంతో మేలు చేస్తుంది. దాదాపు ఏడాదిన్నరపాటు సుదీర్ఘంగా సాగే ఎంపిక ప్రక్రియలో.. ఏ సందర్భంలోనైనా.. స్వీయ నియంత్రణ కోల్పోవడం, ప్రతికూల ఆలోచనలకు చోటు కల్పిస్తే.. అప్పటి వరకు చేసిన కృషి అంతా వృథా ప్రయాసగా మారుతుంది.

చ‌ద‌వండి: Tina Dabi, IAS : న‌వ్వేవాళ్ల‌ని న‌వ్వ‌నీ.. ఏడ్చేవాళ్లను ఏడవ‌నీ.. ఐ డోంట్ కేర్‌..

సమయస్ఫూర్తి
సివిల్‌ సర్వీసెస్‌కు అవసరమయ్యే మరో లక్షణం.. సమయస్ఫూర్తి. ఒక అధికారిగా కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు విధానాలకు లోబడి.. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని.. సమస్య పరిష్కారమయ్యేలా చూడాల్సి ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు.. అందరినీ మెప్పించేలా, ఒప్పించేలా ఉండాలి.

సవాళ్లకు దీటుగా
సివిల్స్‌ అధికారికి సవాళ్లను దీటుగా ఎదుర్కొనే వైఖరి ఉండాలి. ఎందుకంటే.. ప్రభుత్వ విధానాలను అమలు చేసే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు వంటివి చేపట్టినప్పుడు వాటితో సామాజిక ప్రయోజనంతోపాటు నిర్వాసితులు కూడా ఉంటారు. అలాంటి వారి నుంచి నిరసనలు, ఆందోళనలు ఎదురవుతాయి. వారికి నచ్చజెప్పాల్సి ఉంటుంది.  మరికొన్ని సందర్భాల్లో అప్పటివరకు ఒక విధానానికి అలవాటు పడిన ప్రజలు.. కొత్త విధానానికి మళ్లడానికి ఇష్టపడరు. అలాంటి వారిని ఒప్పించి సదరు కొత్త విధానానికి అలవాటుపడేలా చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇలా ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. వాటన్నింటినీ చాకచక్యంగా ఎదుర్కొని.. ఎక్కువ మందికి మేలు చేసే ప్రభుత్వ విధానాలు, పథకాలు, ప్రాజెక్టులు అమలయ్యేలా చూడాల్సి ఉంటుంది. అందుకే సివిల్‌ సర్వీస్‌ అధికారులకు సవాళ్లను ఎదుర్కొనే వైఖరి అత్యంత కీలక లక్షణమని చెబుతున్నారు. 

చ‌ద‌వండి: Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

సంతృప్తి
సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా తమ విధుల నిర్వహణతో ప్రజలకు ప్రయోజనం కలిగితే చాలు..అనే భావన ఉంటే సివిల్‌ సర్వీసెస్‌లో సుదీర్ఘ కాలం మనగలుగుతారు. దీనికి భిన్నంగా.. వేతనం, హోదాకు మార్గంగా సివిల్‌ సర్వీసెస్‌ను ఎంచుకుంటే.. పరీక్షలో విజయం సాధించి సర్వీస్‌ సొంతం చేసుకోసుకున్నా.. అంతా యాంత్రికంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మంచి అధికారిగా గుర్తింపు పొందడం కష్టమవుతుంది. ఇలాంటి వారు సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యాన్ని నెరవేర్చలేరని.. ఇది అంతిమంగా కెరీర్‌పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

ఎంపిక నుంచే
వాస్తవానికి సివిల్‌ సర్వీసులకు సదరు అభ్యర్థులు సరితూగుతారా.. లేదా.. అనే విషయాన్ని ఎంపిక ప్రక్రియ నుంచే పరిశీలిస్తున్నారు. సివిల్‌ సర్వీస్‌ ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామ్‌లో.. జనరల్‌ స్టడీస్‌–4 పేరుతో ప్రత్యేకంగా ఒక పేపర్‌నే పొందుపరిచారు. ఈ పేపర్‌లో అడిగే ప్రశ్నల ద్వారా.. అభ్యర్థుల్లోని పాలన దక్షత, నైతిక విలువలు, చిత్తశుద్ధి, వైఖరిలను పరీక్షించే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంటర్వ్యూలో సైతం సివిల్‌ సర్వీసులకు సరితూగే లక్షణాలను అభ్యర్థులు కలిగి ఉన్నారా లేదా అన్ని నిశితంగా పరీక్షిస్తున్నారు. ప్రధానంగా భావోద్వేగాల అదుపు, సమస్యలను పరిష్కరించే వైఖరి, నైపుణ్యం, సమస్యలపై స్పందించే లక్షణాలను పరిశీలిస్తున్నారు. ఇలా.. ప్రిపరేషన్‌ దశ నుంచి పరీక్ష హాల్లో ప్రతిభ చూపే వరకూ.. అన్ని రకాలుగా స్వీయ విశ్లేషణ చేసుకుంటూ.. తమ దృక్పథాన్ని, వైఖరిని సివిల్స్‌కు ఆపాదించుకుని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి.

స్వీయ విశ్లేషణ
సివిల్స్‌ అభ్యర్థులు స్వీయ విశ్లేషణ చేసుకోవడం పరీక్షలో విజయంతోపాటు కెరీర్‌లో మంచి అధికారిగా గుర్తింపు పొందేందుకు సైతం ఉపకరిస్తుంది. కాబట్టి కేవలం పుస్తకాలు, ప్రిపరేషన్‌తో పరీక్షలో విజయం సాధించొచ్చు అనే భావన వీడాలి. ముందుగా తమకు ఈ సర్వీసులు సరితూగుతాయా, లేదా.. అదే విధంగా పరీక్షలో విజయానికి అవసరమైన లక్షణాలు తమలో ఉన్నాయా.. లేదా.. అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. పుస్తకాలు విజయానికి మార్గదర్శకాలు మాత్రమే. కానీ అంతిమ విజయంలో వ్యక్తిగత దృక్పథం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించాలి.
–శ్రీరామ్,డైరెక్టర్, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌ అకాడమీ

చ‌ద‌వండి: Swetha Reddy, IPS: రెండుసార్లు ఇంటర్వ్యూ ఫెయిల్‌...చివ‌రికి..

Published date : 06 Jan 2022 07:05PM

Photo Stories