Skip to main content

UPSC Preparation Without Coaching: కోచింగ్‌ లేకున్నా.. సక్సెస్‌ ఇలా!

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర ప్రతిష్టాత్మక సర్వీసుల్లోకి ప్రతిభావంతులను ఎంపిక చేసే పరీక్ష! దీన్ని జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన పరీక్షగా పరిగణిస్తుంటారు. సివిల్స్‌కు ఏటా లక్షల మంది పోటీపడుతుంటారు. కాని విజయం సాధించేది చాలా కొద్దిమంది మాత్రమే!! మరోవైపు ఏళ్ల తరబడి కోచింగ్‌ తీసుకున్న వారికే విజయావకాశాలు దక్కుతాయనే అభిప్రాయం నెలకొంది! దీంతో.. శిక్షణ లేకుండా సివిల్స్‌లో నెగ్గలేమా? అనే సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 తేదీలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో శిక్షణ లేకుండానే విజయం సాధించడానికి మార్గాలపై విశ్లేషణాత్మక కథనం..
How To Prepare For UPSC Without Coaching
 • శిక్షణ లేకుండానే సివిల్స్‌లో విజయం సాధిస్తున్న వైనం 
 • నిర్దిష్ట వ్యూహాలతో.. స్వీయ అభ్యసనంతో గెలుపు బాట
 • ఫిబ్రవరి 14న సివిల్స్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల 
 • మే 26న ప్రిలిమ్స్‌కు దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ మేలు

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు శిక్షణ అనేది అభ్యర్థులకు మార్గం చూపే ఒక సాధనం మాత్రమే. అంతిమంగా అభ్యర్థుల పరిశ్రమ, వారి సన్నద్ధతలే విజయంలో కీలకంగా నిలుస్తాయి అంటున్నారు నిపుణులు! అంటే.. సివిల్స్‌కు హాజరయ్యే అభ్యర్థులకు కోచింగ్‌ అనేది కేవలం మార్గ నిర్దేశం చేస్తుంది. గెలుపు అభ్యర్థుల ప్రిపరేషన్‌ శైలిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది. శిక్షణ లేకుండానే ప్రతి ఏటా ఎంతోమంది సివిల్స్‌లో సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

పరీక్ష విధానం
కోచింగ్‌ తీసుకోకుండా.. సివిల్స్‌కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ప్రిపరేషన్‌ ప్రారంభానికి ముందే పరీక్ష విధానంపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. సివిల్స్‌ పరీక్షలో మూడు దశలు ఉంటాయి. అవి.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రతి దశ అత్యంత కీలకమే! పరీక్ష విధానం, పేపర్లు, సిలబస్‌ టాపిక్స్‌ గురించి సమగ్రంగా తెలుసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకునేందుకు వీలవుతుంది. 

సిలబస్‌ అవలోకనం
సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలోని రెండు దశ­ల రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్‌)ల్లో విస్తృతమైన సిలబస్‌ ఉంది. అభ్యర్థులు రాత పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించా­లి. తమ అకడమిక్‌ నేపథ్యానికి అనుగుణంగా ఉండే అంశాలు గుర్తించాలి. సివిల్స్‌ సిలబస్‌లో ప్రధానంగా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీలు విస్తృతంగా ఉంటాయి. వీటితోపాటు కరెంట్‌ అఫైర్స్‌ సైతం పరీక్షలో విజయానికి కీలకంగా మారుతుంది.

చ‌ద‌వండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

ప్రీవియస్‌ పేపర్స్‌
కోచింగ్‌ లేకుండా ప్రిపరేషన్‌కు ఉపక్రమించే అభ్యర్థులు పరీక్ష తీరుతెన్నులపై అవగాహన పెంచుకునేందుకు పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. గత ఐదేళ్ల ప్రిలిమ్స్, మెయిన్స్‌ ప్రీవియస్‌ పేపర్లను ఒకటికి నాలుగుసార్లు విశ్లేషించాలి. ఇలా ప్రశ్న పత్రాలను విశ్లేషించడం వల్ల ప్రశ్నలు అడుగుతున్న తీరు, పరీక్షలో సదరు సిలబస్‌ టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన వస్తుంది. తద్వారా పరీక్ష కోణంలో ఏ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుస్తుంది. దీంతో ఎలా చదవాలో స్పష్టమైన అవగాహన లభిస్తుంది.

మెటీరియల్‌.. అత్యంత కీలకం
సివిల్స్‌ పరీక్షల విజయంలో చదివే పుస్తకాలు సైతం నిర్ణయాత్మకంగా నిలుస్తాయి. అందుకే ప్రా­మాణిక పుస్తకాలను సేకరించుకొని అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత ఆరు నుంచి పదో తరగతి వరకూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఆ తర్వాత పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. ఇందుకోసం గత విజేతలు లేదా సబ్జెక్ట్‌ నిపుణుల సలహాలు ఉపకరిస్తాయి. 

చ‌ద‌వండి: Civils Preliminary Examination Preparation: ముప్ఫై రోజుల్లో.. మెరిసేలా!

స్టడీ ప్లాన్‌
సిలబస్‌ కాపీతోపాటు ప్రామాణిక పుస్తకాలను సిద్ధం చేసుకున్న తర్వాత ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. ప్రిపరేషన్‌ శాస్త్రీయంగా, నిర్దిష్ట ప్రణాళికతో ఉండేలా చూసుకోవాలి. అన్ని సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా సమయ విభజన చేసుకోవాలి. క్లిష్టమైన అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి.

రన్నింగ్‌ నోట్స్‌
ప్రిపరేషన్‌ సమయంలో ప్రతి సబ్జెక్ట్‌ను చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలతో రన్నింగ్‌ నోట్స్‌ రాసుకోవాలి. ఇలా నోట్స్‌ రాసుకునే క్రమంలో ఆయా టాపిక్‌కు సంబంధించి సినాప్సిస్, నేప­థ్యం, సమకాలీన పరిణామాలు ఉండేలా చూసుకోవాలి. ఈ షార్ట్‌ నోట్స్‌ పరీక్ష సమయంలో రివిజన్‌కు ఉపయుక్తంగా నిలుస్తుంది. వేగంగా పదే పదే పునశ్చరణ చేసుకునేందుకు రన్నింగ్‌ నోట్స్‌ ఉపయోగపడుతుంది.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

కరెంట్‌ అఫైర్స్‌
ప్రస్తుతం సివిల్స్‌ పరీక్షల శైలిని పరిశీలిస్తే..అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇందుకోసం ప్రతి రోజు ప్రామాణిక దినపత్రికలు చదవడం, ట్రెండింగ్‌ టాపిక్స్‌కు సంబంధించి టీవీ డిబేట్స్, న్యూస్‌ పేపర్‌ అనాలిసిస్‌లను అనుసరించడం వంటివి చేయాలి. తద్వారా ఆయా తాజా పరిణామాలపై లోతైన అవగాహన ఏర్పడుతుంది.

రైటింగ్‌ ప్రాక్టీస్‌
అభ్యర్థులు ప్రతి రోజూ కొంత సమయం సమాధానాల రైటింగ్‌ ప్రాక్టీస్‌కు కేటాయించాలి. తాము చదివిన అంశాలకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలు లేదా నమూనా ప్రశ్న పత్రాల ఆధారంగా సమాధానాలు రాసుకోవడం, వాటిని విశ్లేషించుకోవడం చేయాలి. ఫలితంగా తమ ప్రిపరేషన్‌ స్థాయి తెలుసుకోవడమే కాకుండా.. రైటింగ్‌ స్కిల్స్, ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ మెరుగవుతాయి. పదిసార్లు చదవడం కంటే ఒకసారి రాసిన విషయం ఎక్కువకాలం గుర్తుంటుందనే శాస్త్రీయ విశ్లేషణను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాకుండా రైటింగ్‌ ప్రాక్టీస్‌ మెయిన్‌ పరీక్షలో వ్యాసరూప సమాధానాలు రాయడంలో ఉపయోగపడుతుంది.

మెంటారింగ్‌తో మేలు
సివిల్స్‌కు కోచింగ్‌ లేకుండా సొంతంగా సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. మెంటారింగ్‌ సదుపాయం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత విజేతలు, సబ్జెక్ట్‌ నిపుణలతో ఆన్‌లైన్‌లో సంప్రదింపులు సాగించడం సందేహాల నివృత్తికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. ప్రిపరేషన్‌ సమయంలో గత విజేతలు, నిపుణులతో సందేహాలు నివృత్తి చేసుకోవాలని,తమ ప్రిపరేషన్‌ స్థాయిపై కచ్చితమైన విశ్లేషణ, అవగాహన పొందేందుకు ఈ మెంటారింగ్‌ సౌకర్యం ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌ సాధనాలు
సివిల్స్‌ స్వీయ ప్రిపరేషన్‌ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ సాధనాలు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. యూ ట్యూబ్‌తోపాటు పలు సంస్థల ఆధ్వర్యంలో మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అభ్యర్థులు ఆయా మోడల్‌ లేదా మాక్‌ టె స్ట్‌ల ద్వారా తమ ప్రతిభను తెలుసుకోవడమే కాకుండా.. అవసరమైన సలహాలు, సూచనలు పొందే అవకాశం కూడా ఉంది. కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ ఎస్సే తదితర విభాగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కూడా సదరు ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ అందిస్తున్నాయి. ఫలితంగా అభ్యర్థులు అప్‌డేటెడ్‌ నాలెడ్జ్‌తో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

చ‌ద‌వండి: Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!

ఆప్షనల్స్‌పై స్పష్టత
మెయిన్‌ ఎగ్జామ్‌లో ఒక సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రెండు పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ దశ నుంచే దీనిపై అవగాహన పొందాలి. సిలబస్‌ను పరిశీలించి తమ అకడమిక్‌ నేపథ్యానికి అనుగుణంగా ఉన్న ఆప్షనల్‌ను ఎంచుకోవాలి. ఇలా ఆప్షనల్‌ విషయంలో స్పష్టత పొందిన అభ్యర్థులు.. దానికి సంబంధించిన ప్రిపరేషన్‌ను కూడా ముందు నుంచే ప్రారంభించాలి.

వ్యక్తిగత దృక్పథం
సివిల్స్‌కు సొంతంగా ప్రిపరేషన్‌ సాగించాలనుకునే అభ్యర్థులకు ఓర్పు, సహనం చాలా అవసరం. సివిల్స్‌ ఎంపిక అనేది నోటిఫికేషన్‌ నుంచి చివరి దశ ఇంటర్వ్యూ వరకు.. ఏడాదికి పైగా సాగే ప్రక్రియ. ఈ మొత్తం వ్యవధిలో అభ్యర్థులు తమ లక్ష్య సాధన దిశగా ఏకాగ్రత కోల్పోకుండా అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మానసిక సమతుల్యత పాటించడం ఎంతో అవసరం. ఓర్పుగా, సహనంతో ప్రిపరేషన్‌ సాగించాలి. ఒకవేళ తొలి ప్రయత్నంలో విజయం లభించకపోయినా.. నిరాశకు, ఒత్తిడికి గురి కాకుండా ముందుకు సాగాలి.

సివిల్స్‌-2024
యూపీఎస్సీ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను నిర్వహిస్తుంది. ముందుగానే ఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదల చేసి కచ్చితంగా పాటిస్తుంది. సివిల్స్‌-2024కు సంబంధించి నోటిఫికేషన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వెలువడనుంది. మూడంచెల ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరుగనుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ కొనసాగిస్తే.. 2024 సివిల్స్‌లో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

స్వీయ సన్నద్ధత.. ముఖ్యాంశాలు

 • పరీక్ష తీరు, సిలబస్‌పై అవగాహనతో స్వీయ ప్రిపరేషన్‌కు అవకాశం.
 • అకడమిక్‌ నేపథ్యానికి అనుగుణంగా ఆప్షనల్స్‌ను ఎంచుకోవడం మేలు. 
 • నిరంతర స్వీయ విశ్లేషణ, సమీక్షతో విజయ సాధనలో ముందడుగు. 
 • మెంటారింగ్‌ సదుపాయంతో బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు. 
 • కీలక పాత్ర పోషిస్తున్న ప్రామాణిక పుస్తకాలు, రిఫరెన్స్‌ బుక్స్, దినపత్రికలు.

సివిల్స్‌ పరీక్ష విధానం

 • సివిల్స్‌ పరీక్ష రెండు దశలు(ప్రిలిమ్స్, మెయిన్స్‌)గా ఉంటుంది. 
 • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం నాలుగు వందల మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు.
 • పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ కాగా, పేపర్‌-2 ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. 
 • రెండో దశ మెయిన్‌లో.. రెండు అర్హత పేపర్లు, ఒక జనరల్‌ ఎస్సే పేపర్, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు(జీఎస్‌-1, 2, 3, 4), ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు పేపర్లు (ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-1, పేపర్‌-2) ఉంటాయి. అర్హత పేపర్లను 600 మార్కులకు.. మిగతా పేపర్లను ఒక్కో పేపర్‌కు 250 చొప్పున మొత్తం 1750 మార్కులకు నిర్వహిస్తారు.
 • మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత చివరగా 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్‌ పేరుతో ఇంటర్వ్యూ ఉంటుంది.

సివిల్స్‌-2024 షెడ్యూల్‌ ఇలా

 • నోటిఫికేషన్‌ విడుదల: 2024, ఫిబ్రవరి 14
 • ప్రిలిమ్స్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 5
 • ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: 2024, మే 26
 • మెయిన్స్‌ పరీక్ష తేదీలు: 2024,సెప్టెంబర్‌ 20 నుంచి అయిదు రోజులు
Published date : 02 Nov 2023 05:49PM

Photo Stories