Skip to main content

UPSC: సివిల్స్‌ మెయిన్‌లో రాణించేందుకు నిపుణులు, టాపర్స్‌ సలహాలు...

UPSC Civil Services(Main) Exam
UPSC Civil Services(Main) Exam

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి 19 ప్రతిష్టాత్మక సర్వీసులకు ఎంపిక ప్రక్రియలో.. రెండో దశ పరీక్ష! ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే మొదటి దశ ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు. డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో నిర్వహించే.. మెయిన్‌లోనూ సత్తా చాటితేనే తుది దశ ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది! అందుకే మెయిన్‌కు ఎంపికైన అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా, నిర్దిష్ట వ్యూహాలు అనుసరిస్తూ.. సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది!! సివిల్స్‌–2021 మెయిన్‌ పరీక్షలు జనవరి ఏడో తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అంటే.. అందుబాటులో ఉన్న సమయం నెల కంటే తక్కువే!! ఈ నేపథ్యంలో.. అభ్యర్థులు మెయిన్‌లో రాణించేందుకు నిపుణులు, టాపర్స్‌ సలహాలు...

 

  • జనవరి 7 నుంచి సివిల్స్‌ మెయిన్‌–2021 పరీక్షలు
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయం ఎంతో కీలకం
  • సమయ పాలన, అన్ని సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యం తప్పనిసరి
  • సమాధానాలు రాసే నేర్పు కీలకం అంటున్న నిపుణులు
     
  • 712–సివిల్‌ సర్వీసెస్‌–2021 నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న పోస్ట్‌ల సంఖ్య.
  • 9,214–సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష–2021లో అర్హత సాధించి..మెయిన్‌కు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య.
  •  అంటే.. మెయిన్‌లో ఒక్కో పోస్ట్‌కు దాదాపు 13 మంది పోటీ పడుతున్న పరిస్థితి.

పూర్తిగా భిన్నంగా

సివిల్స్‌ మెయిన్, ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం పూర్తిగా విభిన్నం. ప్రిలిమ్స్‌ రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. మెయిన్‌ పూర్తిగా వ్యాసరూప తరహాలో జరుగుతుంది. ఇందులో ఒక జనరల్‌ ఎస్సేపేపర్, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి. వీటికి అదనంగా ఇంగ్లిష్, రీజనల్‌ లాంగ్వేజ్‌ పేపర్లలోనూ అర్హత సాధించాలి. ప్రిపరేషన్‌లో ఆయా సబ్జెక్ట్‌ల వారీగా ముఖ్యాంశాలను గుర్తించడం.. వచ్చే అవకాశమున్న ప్రశ్నలు.. వాటికి సమాధానాలు సిద్ధం చేసుకోవడం.. రైటింగ్‌ స్కిల్స్‌.. ఇలా అన్ని కోణాల్లో నిర్దిష్ట వ్యూహంతో సన్నద్ధత కొనసాగించాలి. 

Must Check: Civils Mains Study Material

అన్ని సబ్జెక్ట్‌లు చదివేలా

మెయిన్‌ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో.. అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. జనరల్‌ ఎస్సేతోపాటు జనరల్‌ స్టడీస్‌ పేపర్లలో భాగంగా ఉండే సబ్జెక్ట్‌లను ఏ మాత్రం విస్మరించకూడదు. ప్రతిరోజు ప్రతి పేపర్‌కు కనీసం రెండు గంటల సమయం కేటాయించుకోవాలి. వీలుకాని అభ్యర్థులు ఒక రోజు మూడు పేపర్లు, మరో రోజు నాలుగు పేపర్లు చదవాలి. ఇలా రోజు వారీగా సబ్జెక్ట్‌లను చదువుతూ.. పరీక్ష సమయానికి అన్ని సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ పూర్తి చేయగలమా.. లేదా..అని విశ్లేషించుకోవాలి. అందుకు అనుగుణంగా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. 

జనరల్‌ ఎస్సే

జనరల్‌ ఎస్సేలో.. రెండు సెక్షన్ల నుంచి రెండు ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్ల ప్రశ్నల తీరును పరిశీలిస్తే.. కోర్‌ అంశాలతోపాటు, సమకాలీన పరిణామాలపైనా ఎస్సే రాయమని అడుగుతున్నారు. కోర్‌ టాపిక్స్‌ నుంచి అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే ఆస్కారముంది. కాబట్టి సమకాలీన, వర్తమాన అంశాలపై అడిగే వ్యాసాల్ని పరిపూర్ణంగా రాసే నైపుణ్యం సాధించాలి. సమాధానాలు రాసేందుకు అందుబాటులో ఉండే సమయం, సమాధానం నిడివి(పదాల సంఖ్య)ని గుర్తించి... దానికి అనుగుణంగా ఆయా టాపిక్‌పై ముఖ్యమైన సమాచారం పొందుపరుస్తూ.. విశ్లేషణాత్మకంగా రాసేలా ప్రాక్టీస్‌ చేయాలి.

జీఎస్‌ పేపర్‌–1కు ఇలా

మెయిన్‌ జీఎస్‌ పేపర్‌–1లో.. చరిత్ర, జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు విస్తృతంగా ఉండే హిస్టరీ సిలబస్‌ను పూర్తిచేయడంలో కొంత ఇబ్బంది పడతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి అభ్యర్థులు ముందుగా జాగ్రఫీ ప్రిపరేషన్‌ పూర్తిచేసుకోవాలి. ఇందులోని అంశాలు కోర్, కాంటెంపరరీ కలయికగా ఉంటాయి. ఇది స్కోరింగ్‌కు మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జాగ్రఫీ ప్రిపరేషన్‌ పూర్తయ్యాక.. హిస్టరీకి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. ప్రపంచ చరిత్రకు సంబంధించి.. పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాలను ప్రధానంగా చదవాలి.

జీఎస్‌ పేపర్‌ 2

పాలిటీ అంశాలుండే జీఎస్‌ పేపర్‌ 2లో రాణించాలంటే..రాజ్యాంగ పీఠిక మొదలు తాజా సవరణల వరకూ.. అనేక అంశాలు చదవాల్సి ఉంటుంది. పస్తుత సమయంలో అభ్యర్థులు కోర్‌ టాపిక్స్‌లో ప్రజా పాలన, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలపై దృష్టిపెట్టాలి. 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి 1947 స్వాతంత్య్ర చట్టం దాకా.. అన్నింటినీ అధ్యయనం చేయాలి. సమకాలీన, కోర్‌ అంశాలను అనుసంధానం చేసుకుంటూ అభ్యసనం సాగించాలి. ఒక సమకాలీన అంశానికి సంబంధించి, దాని మూల భావనలు వెంటనే స్ఫురించేలా.. కాన్సెప్ట్స్‌తో నోట్స్‌ రాసుకోవాలి.

జీఎస్‌ పేపర్‌–3

ఈ పేపర్‌లో.. టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి గణాంకాలు, వాస్తవ పరిస్థితులపై సమాచారం తెలుసుకోవాలి. ఎకనామీలో.. ప్రణాళికా పెట్టుబడుల్లో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, తాజా ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. భారత్‌లో సమ్మిళిత వృద్ధి పాత్ర, ఆహార భద్రత, బడ్జెటింగ్‌ తీరుతెన్నులతోపాటు స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను చదవాలి. సమాధానాలు రాసేటప్పుడు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా.. విశ్లేషణ చేసే నేర్పు సొంతం చేసుకోవాలి.

జీఎస్‌ పేపర్‌–4

  • అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా, సునిశిత దృష్టితో సమాధానాలు రాయగలిగే నేర్పు సొంతం చేసుకుంటే.. ఈ పేపర్‌లో మంచి మార్కులు పొందొచ్చు. ముఖ్యంగా పరిపాలనలో నైతిక విలువల ఆవశ్యకతకు సంబంధించిన అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో విలువలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో తెలుసుకోవాలి. నైతిక శాస్త్రంలో ప్రధానంగా అప్లయిడ్‌ ఎథిక్స్‌(అనువర్తిత నైతిక శాస్త్రం)పై దృష్టిపెట్టాలి. ప్రభుత్వ విధానాల అమలు, నిధుల ఖర్చు, విధుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతలో నైతికత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి. 
  • మతం–నైతికత, వర్ణ వ్యవస్థ–నైతికత, కుటుంబం–నైతికత.. ఇలా వివిధ సామాజిక అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవాలి. ఈ పేపర్‌లో అభ్యర్థులు అవగాహన పెంచుకోవాల్సిన మరో ప్రధాన అంశం..అటిట్యూడ్‌(వైఖరి). లక్ష్య సాధనలో, విధి నిర్వహణలో వైఖరి ఎంతో కీలకంగా నిలుస్తుంది. కాబట్టి దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. 

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌.. రెండు పేపర్లు

సివిల్స్‌ మెయిన్‌లో.. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన రెండు పేపర్లు అత్యంత కీలకం. అభ్యర్థులు తాము ఆప్షనల్‌గా ఎంచుకున్న సబ్జెక్ట్‌పై గట్టి పట్టు సాధించాలి. ఆప్షనల్‌ ఏదైనా సరే.. దాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేయాలి. ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలను గుర్తించి..వాటిపై మరింత పట్టు సాధించాలి. గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రాక్టీస్‌ చేయడం మేలు.

క్వాలిఫయింగ్‌ పేపర్లు.. కానీ!

మెయిన్‌లో క్వాలిఫయింగ్‌ పేపర్లుగా పేర్కొనే.. ఇండియన్‌ లాంగ్వేజ్‌(పేపర్‌–ఎ), ఇంగ్లిష్‌(పేపర్‌ బి) పేపర్లలోనూ విజయం సాధించాలి. చాలా మంది అభ్యర్థులు ఈ పేపర్లపై అంతగా శ్రద్ధ చూపరు. కాని ఈ పేపర్లలోనూ కనీసం 25శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన సిలబస్‌ అధ్యయనానికి కూడా కొంత సమయం కేటాయించాలి. 


చ‌ద‌వండి: Civils Prelims Previous Papers

పునశ్చరణ

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు పునశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సీరియస్‌ అభ్యర్థులందరూ ఇప్పటికే ప్రిపరేషన్‌ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో ముఖ్యమైన అంశాలతోపాటు రివిజన్‌కు, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. 

రాసే  నైపుణ్యం

అభ్యర్థులు ప్రస్తుత సమయంలో సమాధానాలు రాసే నేర్పుపైనా దృష్టిపెట్టాలి. ఎందుకంటే.. ఎంత సమాచారం ఉన్నా.. దాన్ని పొందికగా రాయలేకపోతే.. చేసిన ప్రయత్నం అంతా వృథా అవుతుంది. కాబట్టి పాత ప్రశ్న పత్రాలు, నమూనా ప్రశ్న పత్రాలను పరిశీలించి.. వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. పూర్తి వ్యాసం మాదిరిగా కాకుండా.. పాయింట్లు, ఫ్లో చార్ట్‌ల రూపంలో రాయాలి. తద్వారా ఎగ్జామినర్‌ను ఆకట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయంలో ఒక్కో ప్రశ్నకు సగటున ఎంత సమయం లభిస్తుందో అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రతి ప్రశ్నకు నిర్దిష్ట సమయం కేటాయించి సమాధానం రాయాలి. 

అభిప్రాయ వ్యక్తీకరణ

అభ్యర్థులు సమాధానాలు రాసేటప్పుడు తమ అభిప్రాయాలను సమర్థంగా వ్యక్తం చేయాలి. భావ వ్యక్తీకరణ ఎదుటి వారిని ఆకట్టుకునేలా ఉండాలి. అందుకోసం సులువైన పదజాలం ఉపయోగిస్తూ సమాధానాలు రాయాలి. 

చ‌ద‌వండి: UPSC Career

సివిల్స్‌–2021 మెయిన్‌ తేదీలు

  • జనవరి 7: పేపర్‌–1(జనరల్‌ ఎస్సే)
  • జనవరి 8: పేపర్‌–2(జీఎస్‌–1), పేపర్‌–3(జీఎస్‌–2)
  • జనవరి 9: పేపర్‌–4(జీఎస్‌–3), పేపర్‌–5 (జీఎస్‌–4)
  • జనవరి 15: ఇండియన్‌ లాంగ్వేజ్, ఇంగ్లిష్‌
  • జనవరి 16: పేపర్‌–6(ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌–1), పేపర్‌ –7(ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌–2)

మెయిన్‌ పరీక్ష స్వరూపం
క్వాలిఫైయింగ్‌ సబ్జెక్టులు

 

  • పేపర్‌–ఎ రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూల్‌లోని ఏదైనా భారతీయ భాష –300 మార్కులు
  • పేపర్‌–బి 300 మార్కులు–ఇంగ్లిష్‌

కంపల్సరీ పేపర్స్‌

పేపర్‌ పేపర్‌ పేరు మార్కులు
1. ఎస్సే 250
2. జనరల్‌ స్టడీస్‌–1 (ఇండియన్‌ హెరిటేజ్‌ అండ్‌ కల్చర్, హిస్టరీ అండ్‌ జాగ్రఫీ ఆఫ్‌ ద వరల్డ్‌ అండ్‌ సొసైటీ) 250
3. జనరల్‌ స్టడీస్‌–2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌) 250
4. జనరల్‌ స్టడీస్‌–3 (టెక్నాలజీ, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) 250
5. జనరల్‌ స్టడీస్‌–4 (ఎథిక్స్, ఇంటిగ్రిటీ,ఆప్టిట్యూడ్‌) 250
6. ఆప్షనల్‌ పేపర్‌–1 250
7. ఆప్షనల్‌ పేపర్‌–2 250
  మెయిన్స్‌ మార్కులు 1750
  పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) 275
  మొత్తం మార్కులు 2025

                                   

పరిశీలన, విశ్లేషణ

మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ప్రధానంగా అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలు రెండు. అవి.. పరిశీలన, విశ్లేషణ. ప్రతి అంశానికి సంబంధించి ముందుగా దాని గురించి పూర్తిగా పరిశీలన చేయాలి. ఆ తర్వాత సదరు టాపిక్‌ ఉద్దేశం, లక్ష్యం, సారాంశం.. వీటిని విశ్లేషించుకోవాలి. ఈ రెండిటీ ఆధారంగా సొంత అభిప్రాయం వ్యక్తం చేసే సామర్థ్యం అలవరచుకోవాలి. వేగంతోపాటు కచ్చితత్వంతో కూడిన సమాధానాలు ఇవ్వాలి. ప్రస్తుత సమయంలో మోడల్‌ టెస్ట్‌లు రాయడం ఉపయుక్తంగా ఉంటుంది.
–పి.శ్రీజ, సివిల్స్‌ విజేత (సివిల్స్‌–2020లో 20వ ర్యాంకు)

ఒత్తిడికి దూరంగా

మెయిన్‌ అభ్యర్థులు ముందుగా మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని ఏ మాత్రం దరి చేరనీయొద్దు. పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం చదువుకుంటూ పోతే.. సమాధానాలు రాసేటప్పుడు అడిగిన ప్రశ్నకు అనుగుణంగా ఏఏ అంశాలను పొందుపర్చాలనే విషయంలో తడబాటుకు గురయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రిపరేషన్‌ సమయంలోనే నమూనా ప్రశ్నలకు సమాధానాలిచ్చే వ్యూహాన్ని అమలు చేయాలి.
–వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ ఐఏఎస్‌ అకాడమీ


చ‌ద‌వండి: Civils Guidance

Published date : 13 Dec 2021 06:26PM

Photo Stories