Skip to main content

సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్ ప్రణాళిక

ప్రిలిమ్స్.. మెయిన్స్.. పర్సనాలిటీ టెస్ట్.. ఈ మూడు దశలను విజయవంతంగా అధిగమిస్తే ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత హోదాలు చేతికందుతాయి! 2015 సివిల్స్‌కు సంబంధించి తొలి మెట్టు ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి.

ఇక మలిమెట్టు అయిన మెయిన్స్ పరీక్షలు డిసెంబరు 18న ప్రారంభం కానున్నాయి. ఈ దశలోనూ విజయం సాధించాలంటే ఏలా చదవాలి? ఎలా రాయాలి? తదితర అంశాలపై సబ్జెక్టు నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం...

జీఎస్-1
మెయిన్స్ జీఎస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించిన సిలబస్‌లో ప్రపంచ భౌతిక భూగోళ విశేష అంశాలు, ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ, వివిధ ప్రాంతాల్లో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగ పరిశ్రమల విస్తరణ- దానికి కారణాలు, భూకంపాలు, సునామీలు వంటి ముఖ్య భూభౌతిక దృగ్విషయాలు ఉన్నాయి. ఆయా అంశాల్లో భారత్‌కు ప్రాధాన్యమిస్తూ అధ్యయనం చేయాలి.
జాగ్రఫీతో సంబంధమున్న (పట్టణీకరణ, ప్రాంతీయ అభివృద్ధి-అసమానతలు, శక్తి వనరులు వంటివి) పేపర్-1లోనే కాకుండా ఇతర పేపర్లలోనూ కనిపిస్తాయి. వాటిని గుర్తించి ఒకే సమయంలో అధ్యయనం చేయాలి.

కోర్ జాగ్రఫీకి ప్రాధాన్యం:
కొత్త సిలబస్ ఆధారంగా గతంలో ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే కోర్ జాగ్రఫీ అంశాలపై ప్రశ్నలు వస్తున్నట్లు అర్థమవుతోంది. దీనికి ఉదాహరణగా Continental drift theoryని చెప్పొచ్చు. ఇకపై కూడా ఇదే ధోరణి కనిపించవచ్చు. అయితే నేరుగా కాకుండా మరింత లోతుగా ప్రశ్నలు అడిగేందుకు అవకాశముంది. ఉదాహరణకు వొల్కానిజం అంటే ఏమిటి? అని ప్రశ్న నేరుగా రాకుండా.. వొల్కానిజం ప్రభావాలు (పాజిటివ్/నెగిటివ్) పై ప్రశ్న రావొచ్చు. సాధారణంగా అగ్నిపర్వత పేలుళ్ల వల్ల కాలుష్యం, రవాణా స్తంభించటం వంటి దుష్ఫలితాల గురించి మనకు అవగాహన ఉంటుంది. అయితే పాజిటివ్ కోణంలో చూస్తే అగ్నిపర్వత పేలుళ్ల ప్రభావానికి గురైన ప్రాంతం దీర్ఘకాలంలో సారవంతంగా మారి, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు దక్కను పీఠభూమి అగ్ని పర్వత సంబంధ భూ స్వరూపమే. ఇందులోని నల్ల నేలలు బసాల్టిక్ లావా కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు వికోషీకరణం చెందటం వల్ల ఏర్పడ్డాయి. అదే విధంగా అగ్ని పర్వత విస్ఫోటన ప్రాంతంలో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడతాయి. ఇవి కాలక్రమంలో సరస్సులుగా మారుతాయి. వీటిని కాల్డెరా లేక్స్‌గా పిలుస్తారు. అభ్యర్థులు ఇలాంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే ప్రశ్న ఏ రూపంలో వచ్చినా సరైన సమాధానం రాసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

సహజ వనరులు, భూభౌతిక అంశాలు:
ఏ అంశాన్ని చదువుతున్నా ఎందుకు? అనే ప్రశ్న వేసుకుంటూ, అధ్యయనం చేయాలి. ఉదాహరణకు భూకంపాలు తీవ్ర స్థాయిలో వచ్చే భారత ప్రాంతాలు (జోన్-5) ఏవన్నది తెలుసుకోవటంతో పాటు ఆయా ప్రాంతాల్లోనే అధిక తీవ్రత గల భూకంపాలు ఎందుకు వస్తున్నాయనే దాన్ని గుర్తించటం ప్రధానం. హిమాలయ పర్వత ప్రాంతం జోన్-5లోకి వస్తుంది. ఈ అంశాలను చదివేటప్పుడు భ్రంశాలు (faults), విరూపకారక బలాలు (tectonic forces) వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇదే విధంగా తుఫాన్లు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటివాటిని చదవాలి.
మానవ సమాజంలో సుస్థిర అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాల్లోని వనరుల సక్రమ/సముచిత సద్వినియోగంపై ఆధారపడుతుంది. సహజ వనరుల గణాంకాలపైనే కాకుండా వాటి విచక్షణ సహిత వినియోగం, సంరక్షణపై దృష్టిసారించాలి. ప్రస్తుతం కీలకంగా ఉన్న జల వనరులు, శక్తి వనరులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటి విస్తరణ, వినియోగంలో సమస్యలు, సంరక్షణ చర్యలు కీలకాంశాలు.

పారిశ్రామిక ప్రాంతాలు
ఆర్థిక ప్రక్రియ అనేది సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి దోహదం చేయాలి. ఉపాధిని కల్పించి, ఆర్థిక అసమానతలను తగ్గించాలి. అప్పుడే పెరుగుదల (growth) అనేది అభివృద్ధి (Development)కి దారితీస్తుంది. ప్రస్తుతం సేవా రంగం లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధిని కల్పించలేకపోతోంది. అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ (మేకిన్ ఇండియా)పై భారత్ దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులు పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రాంతాలు, ముడి పదార్థాల లభ్యత, మౌలిక వసతులు, శక్తి వనరులు, మానవ వనరుల లభ్యతను అధ్యయనం చేయాలి.

చరిత్ర, సామాజిక అంశాలు
భారతదేశ సంస్కృతికి సంబంధించి సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు-శిల్పకళ, పెయింటింగ్స్, మత ఉద్యమాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అన్వయించుకుంటూ పరీక్షకు సిద్ధమవాలి.
ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి 18వ శతాబ్దం మధ్య భాగం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను క్షుణ్నంగా పరిశీలించాలి. భారత దేశానికి ఐరోపా కంపెనీల రాక, దేశంలో ఆంగ్లేయుల కార్యకలాపాలు విస్తరించిన తీరు, ఆంగ్లేయుల ఆర్థిక, పరిపాలనా విధానాలు, 19, 20వ శతాబ్దాల్లో చోటుచేసుకున్న సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు. బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, ఉద్యమాలు. చరిత్రలో కీలకమైన భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. దీనికోసం ఆధునిక భారతదేశంపై బిపిన్‌చంద్ర రాసిన పుస్తకాలు చదవాలి.
ప్రపంచ చరిత్రకు సంబంధించి ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు సంబంధించి దేన్నుంచైనా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ప్రపంచ ఆర్థికరంగ స్థితిగతులను మార్చిన పారిశ్రామిక విప్లవం, మొదటి ప్రపంచ యుద్ధం(1914-18), రెండో ప్రపంచ యుద్ధం (1939-45), ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి.
సామాజిక అంశాలకు సంబంధించి ముఖ్యంగా యువత జీవనశైలి, ప్రపంచీకరణ అనంతరం భారతీయ సంస్కృతిలో మార్పులను అధ్యయనం చేయాలి.

జీఎస్-2
పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించిన సిలబస్‌లో పరిపాలన, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలున్నాయి. చట్టాలను అమలుచేసే క్రమంలో రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాల ఉల్లంఘనకు అవి ఎలా కారణమవుతున్నాయనే దానిపై విశ్లేషణాత్మక అధ్యయనం అవసరం. వీటికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశముంది.అందువల్ల ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన వివిధ చట్టాలు, వాటి అమలు తీరును రాజ్యాంగ ప్రకరణలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి.
నేడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి రాజ్యాంగ అమలుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల నిర్ణయాలు.. రాజ్యాంగ బద్ధమా.. కాదా? అనే దానిపై కోర్టుల్లో విచారణలు జరిగి, తీర్పులు వెలువడుతున్నాయి. వీటిపై అవగాహన పెంపొందించుకోవాలి.
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వాల ప్రాధాన్యం తగ్గి, నియంత్రణ వ్యవస్థల కార్యకలాపాలు కీలకమయ్యాయి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నియంత్రణ సంస్థలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ తదితర రంగాల్లో సమకాలీన పరిణామాలు, నియంత్రణ వ్యవస్థల పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి.

విదేశాలతో భారత్ సంబంధాలు:
దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశం కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వల్ప వ్యవధిలోనే విదేశాల్లో పర్యటిస్తున్నారు. గతంలో ఏ ప్రధానీ వెళ్లని దేశాలను సైతం చుట్టివస్తున్నారు.ఈ క్రమంలో పొరుగు దేశాలతో పాటు అమెరికా, జపాన్, రష్యా వంటి దేశాలతో భారత్ సంబంధాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. చైనాతో సంబంధాలు ముఖ్యమైనవి. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలకు సంబంధించి భారత్ వినిపించిన వాణితో పాటు ఐరాస ఆమోదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను, వీటి సాధనకు భారత్ అనుసరించాల్సిన వ్యూహాలపై అవగాహన అవసరం.

కూటములకు ప్రాధాన్యం:
గతంతో పోల్చితే ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్.. తదితర అంతర్జాతీయ సంస్థల కంటే ప్రస్తుతం ప్రాంతీయ కూటములకు ప్రాధాన్యం పెరిగింది. జీ-8, జీ-20, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) తదితర కూటములు సమకాలీన ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశాలు ప్రపంచ ప్రయోజనాలు కాకుండా స్వీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే కూటములకు ప్రాధాన్యం ఏర్పడింది. వీటిపై అధ్యయనం అవసరం.

జీఎస్-3
జనరల్ స్టడీస్ పేపర్-3 సిలబస్‌లోని ఎకానమీలో ప్రణాళికలు, సమ్మిళిత వృద్ధి, ప్రభుత్వ బడ్జెటింగ్, ఆహారశుద్ధి, సంబంధిత పరిశ్రమలు, భూసంస్కరణలు, ఆర్థిక వ్యవస్థపై సరళీకరణ ప్రభావాలు, అవస్థాపనా సౌకర్యాలు వంటి అంశాలున్నాయి. తొలుత ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఉపయోగించుకొని, బేసిక్స్‌పై పట్టు సాధించాలి. తర్వాత సిలబస్‌లోని అంశాలను వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రతి అంశానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి ఉన్న పరిమితులు, అవరోధాలను అధిగమించేందుకు చర్యలను పరిశీలించాలి.
1991 తర్వాత సరళీకరణ విధానాల నేపథ్యంలో అనేక ప్రాజెక్టులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రాల వారీగా జాప్యానికి కారణాలను విశ్లేషించాలి. దేశంలో అమల్లో ఉన్న పెట్టుబడి నమూనాలను అధ్యయనం చేయాలి.
పారిశ్రామిక సంస్కరణలు, పన్నుల సంస్కరణలు, మూలధన మార్కెట్లో సంస్కరణల అమలు ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావంపై అవగాహన పెంపొందించుకోవాలి.

ముఖ్యమైన అంశాలు:
ప్రభుత్వ రంగ ప్రణాళికా వ్యయంలో భాగంగా వనరుల సమీకరణ.
పంటల తీరు- నిర్ణయించే అంశాలు- పంటల తీరును మెరుగుపరచటంలో ఎదురవుతున్న అవరోధాలు, అధిగమించేందుకు చర్యలు.
వ్యవసాయ రంగంలో సబ్సిడీల ఆవశ్యకత, వ్యవసాయ రంగ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ‘వాణిజ్య సదుపాయ ఒప్పందం’ ప్రభావం.
భూసంస్కరణలు ఇప్పటికీ పరిష్కృతం కాని సమస్యగానే మిగిలిపోయింది-చర్చించండి! అనే ప్రశ్న రావొచ్చు.
11వ ప్రణాళిక ప్రారంభం నుంచి (2007, ఏప్రిల్ 1) సమ్మిళిత వృద్ధి లక్ష్య సాధనపై దృష్టికేంద్రీకరించినప్పటికీ ఇప్పటికీ వృద్ధి సమ్మిళితంగా ఉండకపోవటానికి కారణాలు.
అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాకపోవటానికి కారణాలు.
భారత్‌లో వృద్ధి.. ఉపాధి రహిత వృద్ధి- వ్యాఖ్యానించండి.
రిఫరెన్స్: ఇండియన్ ఎకానమీ- ఉమా కపిల; యోజన; కురుక్షేత్ర; ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ; ఎకనమిక్ సర్వే; ఇండియా డెవలప్‌మెంట్ రిపోర్టు.

సైన్స్ అండ్ టెక్నాలజీ
జీఎస్ పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, జీవవైవిధ్యం, విపత్తు నిర్వహణ, మేధో సంపత్తి హక్కులు, భద్రత వంటి అంశాలున్నాయి. సిలబస్‌లోని అంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకోవడంతో పాటు వాటి పరిధిని తెలుసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి.
సమకాలీన, కాన్సెప్టుల ఆధారిత ప్రశ్నలు వస్తున్నాయి. అంతరిక్ష రంగానికి సంబంధించి పీఎస్‌ఎల్‌వీ ప్రాధాన్యత, మంగళ్‌యాన్, హబుల్ స్పేస్ టెలిస్కోప్, రొసెట్ట వంటి అంశాలపై దృష్టిసారించాలి.
బయోటెక్నాలజీలో జన్యు ఎడిటింగ్, జన్యు థెరఫీ, మూలకణాల పరిశోధన, చికిత్స, ఆర్గానిక్ ఫార్మింగ్, బయోరెమిడియేషన్, జన్యుమార్పిడి మొక్కలు, జంతువులు వంటి అంశాలు ముఖ్యమైనవి.
రోబోటిక్స్‌లో మెడికల్ రోబోటిక్స్, రోబోటిక్ సర్జరీ, రోబోటిక్స్ ఇంజనీరింగ్; నానో టెక్నాలజీలో భారత్ సాధించిన అభివృద్ధి, నానో మిషన్, క్వాంటం డాట్స్ అంశాలపై అవగాహన అవసరం.
శీతోష్ణస్థితి మార్పు అంశంలో ఓషన్ అసిడిఫికేషన్, ఐఎన్‌డీసీ (Intended Nationally Determined Contributions), జీవ వైవిధ్యంలో బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్, వాటి పరిరక్షణ పద్ధతులు, టైగర్ సెన్సస్ విధానాల గురించి తెలుసుకోవాలి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భాగంగా డిజిటల్ ఇండియా ప్రయోజనాలు, ఈ-గవర్నెన్స్, భారత్‌లో ఈ-కామర్స్ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణలో ఐటీ, బిగ్ డేటా ప్రాధాన్యం వంటి అంశాలు ముఖ్యమైనవి.
అదనంగా న్యూట్రినో అబ్జర్వేటరీ, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టం, సైబర్ ముప్పులు, భారత్ సైబర్ సెక్యూరిటీ విధానం అంశాలను కూడా అధ్యయనం చేయాలి.
ప్రశ్నకు తగినట్లు స్పష్టంగా సమాధానం రాయటం ముఖ్యం. దీనికోసం మాక్ టెస్ట్‌లు రాసి, తప్పులను సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం.

జీఎస్-4
ఇటీవల కాలంలో సామాజిక విలువలు క్షీణించడాన్ని గమనిస్తున్నాం. దీని ప్రభావం పరిపాలనపై కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడటం, పక్షపాతంగా వ్యవహరించడం, అవినీతి కార్యకలాపాలకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. జవాబుదారీతనం లోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో పనిచేసే వారికి ఉండాల్సిన కనీస విలువలు, నైతిక ఆవశ్యకత అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవాభావం ఏ మేరకు ప్రస్ఫుటమవుతోంది? పాలనలో నీతి, నిజాయితీ లోపిస్తోందా? వంటి వాటిపై అభ్యర్థులు ఆలోచించగలగాలి. సమాచార మార్పిడి ద్వారా పారదర్శకంగా విధులను నిర్వర్తించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించవచ్చు. పాలనను సమాచార హక్కు ఏ విధంగా మెరుగుపరుస్తుందో, అవినీతి నివారణకు ఎలా దోహదం చేస్తుందో అధ్యయనం చేయాలి.
మెయిన్స్ పరీక్ష విధానం
 
పేపర్ మార్కులు    
అర్హత పేపర్లు:
పేపర్-ఎ:    
రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లోని భాషల నుంచిఎంపిక చేసుకున్న భాష 300   
పేపర్-బి:    
ఇంగ్లిష్ 300 

మెరిట్‌కు పరిగణనలోకి తీసుకునే పేపర్లు
పేపర్-1 ఎస్సే 250   
పేపర్ 2 (జీఎస్-1) 250   
పేపర్ 3 (జీఎస్-2) 250   
పేపర్ 4 (జీఎస్-3) 250   
పేపర్ 5 (జీఎస్-4) 250   
పేపర్ 6 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-1) 250   
పేపర్ 7 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-2) 250   
మొత్తం మార్కులు 1750 
Published date : 01 Jul 2020 03:10PM

Photo Stories