Skip to main content

Civils Mains 2022 Preparation Strategy: మెయిన్‌లో విజయం సాధించేందుకు మార్గాలు...

civils mains 2022 preparation strategy and syllabus
civils mains 2022 preparation strategy and syllabus

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌.. అత్యున్నత సర్వీసులుగా భావించే... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌స్‌ సహా.. 19 కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి.. నిర్వహించే ఎంపిక ప్రక్రియలో.. కీలమైన రెండో దశ ఇందులో విజయం సాధిస్తే.. అంతిమ లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచినట్లే! ఎంతో పకడ్బందీగా జరిగే మెయిన్‌లో రాణించాలంటే.. పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ప్రిపరేషన్‌ నుంచి పరీక్ష హాల్లో సమాధానాలు రాసే వరకు.. అడుగడుగునా స్పష్టమైన అవగాహనతో మెలగాలి. తాజాగా సివిల్స్‌–2022 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. మెయిన్‌లో విజయం సాధించేందుకు మార్గాలు...

  • తాజాగా విడుదలైన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు
  • మొత్తం 13,090 మందికి మెయిన్స్‌కు అర్హత
  • సెప్టెంబర్‌ 16 నుంచి మెయిన్‌ పరీక్షలు

మొత్తం 861 పోస్టులకు 13,090 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా.. వీరిలో 1720 నుంచి 2300 లోపు మందికి మాత్రమే చివరి దశ పర్సనాలిటీ టెస్ట్‌గా పిలిచే ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. కాబట్టి సివిల్స్‌లో విజయానికి సెప్టెంబర్‌ 16 నుంచి అయిదు రోజుల పాటు జరిగే మెయిన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపడం తప్పనిసరి అని గుర్తించాలి.

UPSC: సివిల్స్‌ మెయిన్‌లో రాణించేందుకు నిపుణులు, టాపర్స్‌ సలహాలు...

ఏడు పేపర్లు.. అప్రమత్తంగా

సివిల్స్‌ మెయిన్‌.. ఒక జనరల్‌ ఎస్సే, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, మరో రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్లలో మొత్తం ఏడు పేపర్లుగా జరుగుతుంది. వీటికి అదనంగా అర్హత పేపర్లుగా పేర్కొనే ఇంగ్లిష్, రీజనల్‌ లాంగ్వేజ్‌ పేపర్లు ఉంటాయి. అంటే.. అభ్యర్థులు మొత్తంగా తొమ్మిది పేపర్లకు ప్రిపరేషన్‌ సాగించాల్సిన పరిస్థితి.

తులనాత్మక అధ్యయనం

మెయిన్స్‌ అభ్యర్థులు పేపర్‌ వారీగా సిలబస్‌ అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఇతర పేపర్లలో ఉన్న టాపిక్స్‌తో పోల్చి చూసుకుని అనుసంధాన విధానంలో ప్రిపరేషన్‌ సాగించేలా ప్రణాళిక రూపొందించాలి. జనరల్‌ ఎస్సే పేపర్‌ను మిగతా అన్ని పేపర్లతో అనుసంధానం చేసుకునే వీలుంది. అదే విధంగా పాలిటీ–ఎకానమీ,ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకలాజీ అంశాలను కూడా అనుసంధానం చేసుకుంటూ చదవొచ్చు. ఫలితంగా ఏకకాలంలో రెండు పేపర్లలోని సిలబస్‌ అంశాలపై అవగాహనతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.

సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్ ప్రణాళిక

పేపర్‌ 1.. జనరల్‌ ఎస్సే

పేపర్‌–1.. జనరల్‌ ఎస్సేలో వ్యాస రూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్లో అడుగుతున్న ప్రశ్నలు సమకాలీన అంశాల సమ్మిళితంగా ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు తొలుత జనరల్‌ ఎస్సేలో అడిగేందుకు అవకాశమున్న ముఖ్యమైన టాపిక్స్‌ గుర్తించాలి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా–ప్రభావాలు, పర్యావరణ అంశాలు, జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశాలను అభ్యసించాలి. వీటికి విశ్లేషణాత్మక సమాధానాలు రాసేలా ప్రాక్టీస్‌ చేయాలి.

పేపర్‌–2 .. చరిత్ర, భౌగోళిక అంశాలు

ఈ పేపర్‌లో రాణించడానికి అభ్యర్థులు ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రలకు అనుసంధానిస్తూ చదవాలి. సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు–శిల్పకళ, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. స్వాతంత్య్రద్యమం గురించి ప్రత్యేకంగా చదవాలి. అదే విధంగా రాజ్యాంగం, పంచవర్ష ప్రణాళికలు, భూ సంస్కరణలు, నెహ్రూ విదేశాంగ విధానం, అలీనోద్యమం, హరిత విప్లవం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రపంచ చరిత్రకు సంబంధించి.. పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం,ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాలను ప్రధానంగా చదవాలి. భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు, తుపానులు తదితరాల గురించి శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. ప్రాంతీయ అభివృద్ధికి దోహద పడే సహజ వనరుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-1 ప్రిపరేషన్ ఇలా..

పేపర్‌–3.. రాజ్యాంగం, సుపరిపాలన

పాలన, రాజ్యాంగం సంబంధిత అంశాలు ఈ పేపర్‌లో ఉంటాయి. ముఖ్యంగా∙దేశానికి సంబంధించిన ప్రజా పరిపాలన, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల సమ్మేళనంగా ఉంది. భారత రాజ్యాంగం గురించి చదివే క్రమంలో 1858 భారత ప్రభుత్వ చట్టం దగ్గరి నుంచి 1947 స్వాతంత్య్ర చట్టం వరకు చదవాలి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలపై దృష్టి సారించాలి. రాజ్యాంగం మూల నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు కేశవానంద భారతి, మినర్వా మిల్స్‌ కేసులను పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థలోని అర్ధ సమాఖ్య స్వభావంపై దృష్టిపెట్టాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి. అంతేకాకుండా ఆయా పథకాల పనితీరు, ఉద్దేశం, లక్ష్యం, ఫలితాలను అధ్యయనం చేయాలి. 

పేపర్‌ 4(జీఎస్‌–3).. ఎస్‌ అండ్‌ టీ

ఈ పేపర్‌లో టెక్నాలజీ; ఆర్థికాభివృద్ధి; బయో డైవర్సిటీ; ఎన్విరాన్‌మెంట్‌; సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లను అధ్యయనం చేయాలి. ప్రణాళికా పెట్టుబడుల్లో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను క్షణ్నంగా చదవాలి. భారత్‌లో సమ్మిళిత వృద్ధి పాత్ర, ఆహార భద్రత, బడ్జెటింగ్‌ తీరుతెన్నులతో పాటు స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను చదవాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అభివృద్ధితోపాటు దైనందిన జీవితంలో దాని అనువర్తనాలపై దృష్టిపెట్టాలి. 

పేపర్‌ 5 .. పాలన, నైతిక విలువలు

  • సిలబస్‌లోని ఎక్కువ అంశాలు ప్రభుత్వ పాలన(పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు సంబంధించినవి కాగా మరికొన్ని ఫిలాసఫీ, సైకాలజీకి చెందినవి. అభ్యర్థులు పరిపాలనలో నైతిక విలువల ఆవశ్యకతకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి. వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో ఈ విలువలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో తెలుసుకోవాలి. నైతిక శాస్త్రంలో ప్రధానంగా అప్లయిడ్‌ ఎథిక్స్‌ (అనువర్తిత నైతిక శాస్త్రం)పై దృష్టి పెట్టాలి. ప్రధానంగా అభ్యర్థులు ‘పబ్లిక్‌ సర్వీస్‌ ఎథిక్స్‌’కు సంబంధించిన అంశాలను చదవాలి. ప్రభుత్వ విధానాల అమలు, నిధుల ఖర్చు,విధుల నిర్వహణలో జావాబుదారీతనం, పార దర్శకతలో నైతికత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి. 

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌.. రెండు పేపర్లు ఇలా

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఫిలాసఫీ, సైకాలజీ తదితర ఆప్షనల్స్‌ జనరల్‌ స్టడీస్‌కు కలిసొచ్చే విధంగా ఉన్నాయి. ఆప్షనల్‌ ఏదైనా సరే వాటిని ఆమూలాగ్రం అధ్యయనం చేయాలి. ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి. అదే విధంగా గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి, ప్రాక్టీస్‌ చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

స‌రికొత్త వ్యుహం.. విశ్లేష‌ణ‌తో ప్రిప‌రేష‌న్ సాగిస్తే విజ‌యం మీ సొంతం..

వేయి మార్కుల లక్ష్యంగా

  • మెయిన్స్‌ రాసే అభ్యర్థులు మొత్తం 1750 మార్కులకు గాను వేయి మార్కుల లక్ష్యంగా అడుగులు వేయాలి. సివిల్స్‌–2021 తుది ఫలితాల్లో.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థిని మెయిన్‌ ఎగ్జామ్‌లో 932 మార్కులు పొందారు. చివరి అభ్యర్థికి 557 మార్కులు వచ్చాయి.
Published date : 06 Jul 2022 04:07PM

Photo Stories