Skip to main content

సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-1 ప్రిపరేషన్ ఇలా..

సివిల్స్ మహా యజ్ఞంలో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు అభ్యర్థులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కంఠస్థం చేయడం, విషయ సేకరణలకు ప్రాధాన్యం లేకుండా ఓ అభ్యర్థి బుద్ధికుశలతను, సామాజిక, సమకాలీన సమస్యలపై అవగాహనను పరీక్షించాలన్న ఉద్దేశంతో మెయిన్స్‌లో మార్పులు చేశారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మెయిన్స్ రాతపరీక్షలో జనరల్‌స్టడీస్ పరిధిని బాగా పెంచారు. మొత్తం వెయ్యి మార్కులతో నాలుగు పేపర్లను అభ్యర్థులు రాయాలి. ఈ నేపథ్యంలో జనరల్ స్టడీస్ పేపర్-1 సిలబస్‌లో ఏయే అంశాలున్నాయి? వాటిపై పట్టుసాధించడమెలా? వంటి అంశాలపై
నిపుణులు అందిస్తున్న విశ్లేషణ...

సివిల్ సర్వీసెస్ మెయిన్స్
పేపర్-2 (జనరల్ స్టడీస్-1)-250 మార్కులు
ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ

చరిత్ర..
సివిల్స్ మెయిన్స్ రెండో పేపర్ (జీఎస్-1)కు సంబంధించిన సిలబస్‌ను విశ్లేషిస్తే ‘చరిత్ర’కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈ సబ్జెక్టు పరిధి విస్తృతమైందని చెప్పొచ్చు. జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో పేర్కొన్న కొత్త అంశాల్లో చాలావరకు ఆప్షనల్ సిలబస్ నుంచి తీసుకున్నవే. ఈ నేపథ్యంలో హిస్టరీ ఆప్షనల్‌తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంది. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను వరుసగా పరిశీలిస్తే...

భారతదేశ సంస్కృతి (ఇండియన్ కల్చర్):
సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు-శిల్పకళ, పెయింటింగ్స్, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అన్వయించుకుంటూ పరీక్షకు సిద్ధమవాలి.
అభ్యర్థులు ప్రామాణిక హిస్టరీ పుస్తకాల ఆధారంగా క్రమ పద్ధతిలో ఒక్కో అంశంపై పట్టు సాధిస్తూ ముందుకెళ్లాలి. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12వ తరగతి పుస్తకాలు అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటాయి. మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించినంతవరకు సతీశ్‌చంద్ర పుస్తకాలు చదవాలి.
భారత సంస్కృతికి చెందిన సంగీతం, సాహిత్యం, నాట్యం, కట్టడాలు, మత ఉద్యమాలు, తత్వాలు ప్రాచీన, మధ్య, ఆధునిక కాలాలకు అన్వయిస్తూ చదవాలి.

ఆధునిక భారతదేశం:
18వ శతాబ్దం మధ్య భాగం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను క్షుణ్నంగా పరిశీలించాలి.

  • భారత దేశానికి ఐరోపా కంపెనీల రాక.
  • దేశంలో ఆంగ్లేయుల కార్యకలాపాలు విస్తరించిన తీరు.
  • ఆంగ్లేయుల ఆర్థిక, పరిపాలనా విధానాలు.
  • 19, 20వ శతాబ్దాల్లో చోటుచేసుకున్న సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు.
  • బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, ఉద్యమాలు.
  • చరిత్రలో కీలకమైన భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. దీనికోసం ఆధునిక భారతదేశంపై బిపిన్‌చంద్ర రాసిన పుస్తకాలు చదవాలి.
  • స్వాతంత్య్రం తర్వాత జరిగిన పరిణామాలను సిలబస్‌లో కొత్తగా చేర్చారు. ఇందులో చరిత్రతో పాలిటీ, ఎకనామిక్స్‌కు సంబంధించిన అంశాలు కూడా కలిసి ఉంటాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ విషయంపై పట్టుసాధించాలి.
  • రాజ్యాంగ సంబంధిత అంశాలు.
  • పంచవర్ష ప్రణాళికలు
  • భూ సంస్కరణలు
  • నెహ్రూ విదేశాంగ విధానం
  • అలీనోద్యమం తీరుతెన్నులు
  • హరిత విప్లవం రూపురేఖలు తదితరాలు..
  • వీటికోసం బిపిన్‌చంద్ర రాసిన ‘ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్’ పుస్తకం చదవాలి.
ప్రపంచ చరిత్ర.. ఆకాశమే హద్దు..
ప్రపంచ చరిత్ర నుంచి ఏ అంశాలపై ప్రశ్నలు వస్తాయో కచ్చితంగా చెప్పడం కష్టం. 18వ శతాబ్దం నుంచి జరిగిన సంఘటనలను సిలబస్‌లో పేర్కొన్నారు కాబట్టి ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు సంబంధించి దేనిపైనైనా అడగడానికి అవకాశముంది.
  • ప్రపంచ ఆర్థికరంగ స్థితిగతుల్నే మార్చేసిన పారిశ్రామిక విప్లవం.
  • మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), రెండో ప్రపంచ యుద్ధం (1939-45)
  • ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం
  • ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాలు.

వీటికోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలు చదవాలి. ఎల్.ముఖర్జీ.. ప్రపంచ చరిత్ర వాల్యూమ్-1, వాల్యూమ్-2లతో పాటు నార్మన్ లోవే రాసిన మాస్టరింగ్ మోడర్న్ వరల్డ్ హిస్టరీ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వీటిని ఆసాంతం చదవనవసరం లేదు. ముఖ్యాంశాలపై విశ్లేషణాత్మక కోణంలో అధ్యయనం చేయాలి.
- క‌రీం, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

జాగ్రఫీ..
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు:
వరల్డ్ జాగ్రఫీ-కీలక అంశాలు.
ప్రపంచ వ్యాప్తంగా (దక్షిణాసియా, భారత ఉపఖండంతో సహా) ప్రధాన సహజ వనరుల విస్తరణ.
ప్రపంచ వ్యాప్తంగా (భారత్ సహా) వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఉనికి.
గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్‌లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు.
జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ ఆప్షనల్‌తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది.

వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ:
వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్‌లో భాగంగా తొలుత బేసిక్ విషయాలపై పట్టుసాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి.

ఇందులోని ముఖ్యాంశాలు: భూ స్వరూపాలు (ల్యాండ్ ఫార్మ్స్), వాతావరణం, మృత్తికలు, సహజ ఉద్భిజాలు(నేచురల్ వెజెటేషన్) వంటి భౌతిక, భౌగోళిక అంశాలు. వీటిని రెండు విధాలుగా విభజించి చదవాలి. అప్పుడే పేపర్‌లో గరిష్టంగా మార్కులు పొందేందుకు వీలుంటుంది.

భౌతిక, భౌగోళిక అంశాలు:
1. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు.
2. ప్రత్యేక లక్షణాలున్న అంశాలు.
ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది.

ఉదా: శీతోష్ణస్థితి అనే అంశంపై చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతోందన్న దానిపై దృష్టి సారించాలి.

ముఖ్యమైన భూభౌతిక దృగ్విషయాలు: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుపానులు తదితరాలు. తొలుత ఈ అంశాలపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత అవి ఎక్కడెక్కడ.. ఎందుకు? సంభవిస్తున్నాయో తెలుసుకోవాలి.

  • మానవ జోక్యం వల్ల ఏ భౌగోళిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి? ఆయా మార్పుల ప్రభావం ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించాలి. క్లుప్తంగా చెప్పాలంటే ‘అభివృద్ధి-పర్యావరణం’ కోణంలో చదవాలి.
  • జాగ్రఫీ సిలబస్‌లోని మరొక కీలకాంశం- ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ. దీనిపై ప్రిపరేషన్‌లో భాగంగా సహజవనరుల్లో ప్రధానమైనవి, సమకాలీన (వివాదాల్లో ఉండటం వంటివి) ప్రాధాన్యం ఉన్నవి ఏమిటో గుర్తించాలి.
  • ఏ రకమైన వనరులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.. అలా ఉండటానికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? తదితర విషయాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి.
  • ఓ ప్రాంత అభివృద్ధిలో అక్కడి సహజ వనరులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూడాలి. అభివృద్ధికి, వనరుల విస్తరణకు సంబంధాన్ని అవగతం చేసుకోవాలి.
  • సహజ వనరుల విస్తరణకు(భూ వనరులు, జల వనరులు, అటవీ వనరులు, ఇంధన వనరులు, సంబంధించి దక్షిణాసియా, భారత ఉపఖండానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.. దానికి గల కారణాలేంటి? వనరుల విస్తరణకు, పరిశ్రమల అభివృద్ధికి మధ్య సంబంధాలను అధ్యయనం చేయాలి. పరిశ్రమలకు సంబంధించి భారత్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • జనరల్ స్టడీస్ పేపర్-1 సిలబస్‌లో సామాజిక అంశాలను కూడా చేర్చారు. ఈ సిలబస్‌లో ఇచ్చిన అంశాలను వేర్వేరుగా చూడకుండా అన్నింటినీ కలిపి చదవాలి. జనాభా, పేదరికం, పట్టణీకరణ-సమస్యలు, పరిష్కారాలు, సమాజంలో మహిళల పాత్ర వంటి అంశాలను ఒకదాంతో మరొకదాన్ని సమన్వయం చేసుకుంటూ చదవాలి. భారతీయ సమాజంలోని వైవిధ్యంపై దృష్టిసారించాలి.
  • భారతదేశ జనాభాపై ప్రపంచీకరణ ప్రభావాన్ని ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర అంశాలపై ప్రపంచీకరణ చూపించిన ప్రభావాలను అధ్యయనం చేయాలి. - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
టిప్స్..
  • ఇచ్చిన ప్రశ్నను క్షుణ్నంగా అర్థంచేసుకొని, దానికి సరైన సమాధానాన్ని బాగా ప్రజెంట్ చేసినపుడే మంచి మార్కులు వస్తాయి. అవసరాన్ని బట్టి టేబుళ్లు, మ్యాప్‌లు, బొమ్మలతో సమాధానాలు రాయాలి.
  • ఈసారి ప్రశ్నలు ఏ రూపంలో ఉంటాయో తెలీదు. అందువల్ల ఓ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు అది ఎన్నిమార్కుల ప్రశ్న, సమయం ఎంత కేటాయించాలి? తదితరాలను బేరీజు వేసుకొని ప్రశ్నకు సమాధానం రాయాలి.
  • ప్రశ్న జనరల్‌గా అడిగితే సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ సమాధానం రాస్తే మంచి మార్కులు వస్తాయి.
  • ఒక టాపిక్‌కు ఒక పుస్తకం అని కాకుండా అన్ని విషయాలూ కవరయ్యే ప్రామాణిక పుస్తకాలతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో వివిధ ప్రాథమిక అంశాలపై పట్టు సాధించవచ్చు.
Published date : 29 May 2020 05:20PM

Photo Stories