Skip to main content

స‌రికొత్త వ్యుహం.. విశ్లేష‌ణ‌తో ప్రిప‌రేష‌న్ సాగిస్తే విజ‌యం మీ సొంతం..

సివిల్స్ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ప్రిలిమ్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారి త‌రువాతి ల‌క్ష్యం మెయిన్స్.. ఆ మెట్టు ఎక్కితే సివిల్స్ సాధించాల‌న్న క‌ల దాదాపు ఫ‌లించిన‌ట్టే.

కీలకమైన, రెండో దశ అయిన మెయిన్స్‌లో నెగ్గాలంటే.. సిలబస్‌కు తగ్గట్టు సరికొత్త వ్యూహాలతో విశ్లేషణ కోణంలో ప్రిపరేషన్ కొనసాగిస్తే విజయం ముంగిటకు చేరుకోవడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు...

సివిల్స్ పరీక్షలో మెయిన్స్ అనేది అత్యంత కీలకమైన దశ. ఇది మొత్తం 1750 మార్కులకు, ఏడు పేపర్లుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పేపర్ల వారీగా విశ్లేషణ..

పేపర్ 1
ఈ పేపర్ లో ఎస్సేకు 250 మార్కులు కేటాయించారు. దీనికి సంబంధించిన ప్రిపరేషన్‌లో అభ్యర్థులు తొలుతజనరల్ ఎస్సే విభాగంలో అడిగేందుకు అవకాశమున్న అంశాలను గుర్తించాలి.ఈ క్రమంలో సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు కేదార్‌నాథ్ వరద విపత్తుకు కారణాలను విశ్లేషించి, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచించండి? అనే ప్రశ్న రావొచ్చు. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని రాయాలంటే శక్తి సంక్షోభాన్ని (ఎనర్జీ క్రైసిస్) ఎదుర్కొనేందుకు జల విద్యుత్ ప్రాజెక్టులను అధిక సంఖ్యలో నిర్మించడం.. ఈ క్రమంలో అటవీ నిర్మూలన వంటి పరిణామాలు చోటుచేసుకోవడం.. ఫలితంగా వరదలకు దారితీయడం వంటి వాటిపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఎస్సే ప్రశ్నలకు అభ్యర్థులు తమదైన శైలిలో విశ్లేషణాత్మ క సమాధానాలు రాస్తేనే ఎగ్జామినర్‌ను ఆకట్టుకోగలరు.

పేపర్-2 (జీఎస్-1)
ఈ పేపర్‌లో హిస్టరీకి సంబంధించి సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు-శిల్పకళ, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అనుసంధానిస్తూ చదవాలి.
18వ శతాబ్దం మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల్ని పరిశీలించాలి. దేశ స్వాతంత్య్ర ఉద్యమం గురించి ప్రత్యేకంగా చదవాలి.
రాజ్యాంగం, పంచవర్ష ప్రణాళికలు, భూ సంస్కరణలు, నెహ్రూ విదేశాంగ విధానం, అలీనోద్యమం, హరిత విప్లవం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
ప్రపంచ చరిత్రకు సంబంధించి పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాల ప్రధానంగా చదవాలి.
ప్రపంచ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలకు అన్వయిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి.
భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు, తుపానులు తదితరాల గురించి శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. మానవ జోక్యం కారణంగా భౌగోళిక అంశాల్లో వస్తున్న మార్పులను గుర్తించి, వాటి ప్రభావాన్ని వార్తల్లోని విషయాలతో అనుసంధానిస్తూ చదవాలి.
ఓ ప్రాంత అభివృద్ధిలో అక్కడి సహజ వనరులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూడాలి. అభివృద్ధికి, వనరుల విస్తరణకు సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి అంశాన్ని భారత్‌పై ప్రత్యేక దృష్టితో చదవాలి.
రిఫరెన్స్: ఎన్‌సీఈఆర్‌టీ 9- 12వ తరగతి పుస్తకాలు; మధ్య భారతదేశ చరిత్ర-సతీశ్‌చంద్ర; ఆధునిక భారతదేశ చరిత్ర-బిపిన్‌చంద్ర, నార్మన్ లోవే మాస్టరింగ్ మోడర్న్ వరల్డ్.

పేపర్ 3 (జీఎస్-2)
ఈ పేపర్‌లో సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తే భారత దేశానికి సంబంధించిన ప్రజా పరిపాలన, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల సమ్మేళనంగా ఉంది.
భారత రాజ్యాంగం గురించి చదివే క్రమంలో 1858 భారత ప్రభుత్వ చట్టం దగ్గరి నుంచి 1947 స్వాతంత్య్ర చట్టం వరకు చదవాలి.
1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలపై అభ్యర్థులు ఎక్కువ దృష్టిసారించాలి. రాజ్యాంగం మూల నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసులను పరిశీలించాలి.
కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థలోని అర్ధ సమాఖ్య స్వభావంపై దృష్టిపెట్టాలి. రాష్ట్రాల నుంచి స్థానిక సంస్థలకు అధికారాల సంక్రమణపై 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి.
పార్లమెంటు తరహా ప్రభుత్వాలున్న భారత్ వంటి దేశాలకు సంబంధించి మాంటెస్క్యూ అధికార విభజన సిద్ధాంత అనువర్తిత అంశాలను చదవాలి.
భారత పార్లమెంటు, కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ద్విసభా స్వభావాన్ని అధ్యయనం చేయాలి. దిగువ, ఎగువ సభల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోవాలి.
అభివృద్ధి విషయంలో జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల పాత్రతో పాటు వివిధ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో ఎదురవుతున్న సమస్యలు గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం విజయాలు-వైఫల్యాల గురించి చదవాలి.
ఆధునిక రాజ్యంలో సివిల్ సర్వీస్ ప్రాముఖ్యత; భారత్-పాక్ సంబంధాలు; భారత్-చైనా సంబంధాలను సమకాలీనంగా అనుసంధానిస్తూ అధ్యయనం చేయాలి.
ప్రపంచ బ్యాంకు; ఐఎంఎఫ్ తదితర అంతర్జాతీయ సంస్థల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
రిఫరెన్స్: Introduction to the Constitution of India, 20th edition, D.D.Basu, Indian Adminis-tration, Fadia and Fadia, Development Admin-istration, R.K.Sapru.


పేపర్ 4 (జీఎస్-3)
ఈ పేపర్‌లో టెక్నాలజీ; ఆర్థికాభివృద్ధి; బయో డైవర్సిటీ; ఎన్విరాన్‌మెంట్; సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లను సిలబస్‌లో పేర్కొన్నారు.
ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికా పెట్టుబడుల్లో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను ఫోకస్డ్‌గా చదవాలి.
భారత్‌లో సమ్మిళిత వృద్ధి పాత్ర, ఆహార భద్రత, బడ్జెటింగ్ తీరుతెన్నులతో పాటు స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను చదవాలి.
ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రతకు సంబంధించి లఘు సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అభివృద్ధితో పాటు దైనందిన జీవితంలో దాని అనువర్తనాలపై దృష్టిపెట్టాలి.
జీవ వైవిధ్యం; పర్యావరణం; విపత్తు నిర్వహణ; దేశ ఆంతరంగిక భద్రతకు రాజ్యాలు, రాజ్యాంగేతర శక్తులు విసురుతున్న సవాళ్లకు సంబంధించి సమకాలీన అంశాలను అధ్యయనం చేయాలి.
రిఫరెన్స్: Indian Economy: Mishra & Puri, 3rd Edition; Science Reporter; Discovery; India Year book; Hindu Environmental survey.

పేపర్ 5 (జీఎస్-4)
ప్రజా పాలనలో కీలకంగా వ్యవహరించే ఉన్నతాధికారులు నైతిక విలువలు కలిగి ఉండటం అతి ప్రధానం. ఈ నేపథ్యంలో కొత్తగా సివిల్స్ మెయిన్స్ సిలబస్‌లో Ethics (నీతిశాస్త్రం), Integrity (నిజాయితీ), Aptitude (అభిరుచి) అంశాలను చేర్చారు. వీటికి సంబంధించిన సిలబస్‌లోని ఎక్కువ అంశాలు ప్రభుత్వ పాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)కు సంబంధించినవి కాగా మరికొన్ని ఫిలాసఫీ, సైకాలజీకి చెందినవి. సిలబస్‌లోని కొన్ని అంశాలను పరిశీలిస్తే..

నీతిశాస్త్రం, మానవునితో సంబంధం:
వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే మంచి ప్రవర్తన అలవడాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. ఈ సూత్రాలనే నైతిక విలువలు లేదా నీతిశాస్త్ర విలువలని అంటారు. ఈ విలువలు ఓ వ్యక్తి కార్యాచరణలో, నిర్ణయాలు తీసుకోవడంలో, విశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తాయి.
అభ్యర్థులు పరిపాలనలో నైతిక విలువల ఆవశ్యకతకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి. వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో ఈ విలువలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో తెలుసుకోవాలి.
నైతిక శాస్త్రంలో ప్రధానంగా అప్లయిడ్ ఎథిక్స్ (అనువర్తిత నైతిక శాస్త్రం)పై అభ్యర్థులు దృష్టిసారించాలి.
నైతిక శాస్త్రంలోని అంశాలను నిజ జీవితంలోని పరిస్థితులతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయన్న దానిపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ఈ క్రమంలో ప్రధానంగా అభ్యర్థులు ‘పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్’కు సంబంధించిన అంశాలను చదవాలి. ప్రభుత్వ విధానాల అమలు, నిధుల ఖర్చు, విధుల నిర్వహణలో జావాబుదారీతనం, పారదర్శకతలో నైతికత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి.
మతం-నైతికత, వర్ణ వ్యవస్థ-నైతికత, కుటుంబం-నైతికత.. ఇలా వివిధ సామాజిక అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవాలి.
నైతిక విలువలు పెంపొందించడంలో కుటుంబం, సమాజం, విద్యా సంస్థల పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. కుటుంబ వ్యవస్థకు సంబంధించి పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థల గురించి తెలుసుకోవాలి.
సాంఘిక శాస్త్రాల బోధన, సహపాఠ్య కార్యక్రమాలు, నీతి కథలు, దేశభక్తి గీతాలు, గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలు, సామాజిక సేవ తదితరాల ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించొచ్చు.
వైఖరి (Attitude): ఓ వ్యక్తికి ఇతర మనుషులు, వస్తువులు, సిద్ధాంతాలు, దేశాలు తదితరాలపై ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలనే వైఖరులు అంటారు. వైఖరి అనేది ఓ వ్యక్తి మానసిక ధోరణిని తెలియజేస్తుంది.
జీవితంలో ఒకరి విజయాలకు, అపజయాలకు వైఖరులే కారణం. ఇవి లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషిస్తాయి. మానసిక శక్తులను ఉపయోగించడానికి, ప్రేరణను కలగజేయడానికి సహకరిస్తాయి. ఈ నేపథ్యంలో ఓ ఉన్నతాధికారి విధుల్లో వైఖరులు ఎలాంటి పాత్ర పోషిస్తాయన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి.
రిఫరెన్స్: An Invitation to Psychology, నీల్ కమల్ పబ్లికేషన్స్.

ప్రముఖ తత్వవేత్తల సేవలు:
దీనికి సంబంధించి చదివేటప్పుడు అభ్యర్థులు ప్రముఖ పాశ్చాత్య తత్వవేత్తలైన కాంట్ (Kant) దగ్గరి నుంచి జీఈ మూర్ (G.E.Moore) వరకు చదవాలి. కాంట్.. ఎథిక్స్, మెటా ఫిజిక్స్ భావనలకు పేరుగాంచారు.
భారత్‌కు సంబంధించి చార్వాక, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రాజారాం మోహన్‌రాయ్, మహాత్మాగాంధీ, అంబేద్కర్ తదితరుల తాత్విక సేవల గురించి ప్రత్యేకంగా చదవాలి.
సివిల్స్ మెయిన్స్ పేపర్ 5 (జీఎస్-4) సిలబస్, ఇతర అంశాలు, వాటి ప్రిపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు www.sakshieducation.com చూడొచ్చు.

ఆప్షనల్ పేపర్:
కొత్త మార్పుల్లో ఆప్షనల్‌ను ఒక సబ్జెక్టుకే పరిమితం చేశారు. దీనికి సంబంధించి రెండు పేపర్లు రాయాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఫిలాసఫీ, సైకాలజీ తదితర ఆప్షనల్స్ జనరల్ స్టడీస్‌కు కలిసొచ్చే విధంగా ఉన్నాయి.

మెయిన్స్ ఎగ్జామినేషన్:

క్వాలిఫైయింగ్ సబ్జెక్టులు
పేపర్-1 300 మార్కులు - ఏదైనా భారతీయ భాష
పేపర్-2 300 మార్కులు - ఇంగ్లిష్

తప్పనిసరి సబ్జెక్టులు

పేపర్ సంఖ్య పేపర్ పేరు మార్కులు సమయం
1 ఎస్సే 250 3 గంటలు
2 జనరల్ స్టడీస్-1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ 250 3 గంటలు
3 జనరల్ స్టడీస్-2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్) 250 3 గంటలు
4 జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) 250 3 గంటలు
5 జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్) 250 3 గంటలు
6 ఆప్షనల్ పేపర్-1 250 3 గంటలు
7 ఆప్షనల్ పేపర్-2 250 3 గంటలు
మెయిన్స్ మార్కులు 1750
పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) 275
మొత్తం మార్కులు 2025

విశ్లేషణే విజయ మంత్రం!

సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు మొదట సిలబస్‌ను నిశితంగా పరిశీలించాలి. వాటిలో కోర్ అంశాలను గుర్తించాలి. సిలబస్‌ను చూస్తే ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్‌మెంట్, అగ్రికల్చర్ వంటి కోర్ అంశాలు కనిపిస్తాయి. వీటిని సమకాలీన అంశాలతో అనుసంధానించి విశ్లేషణాత్మక కోణంలో చదవాలి. ఉదాహరణకు ఇంధన సంక్షోభాన్ని తీసుకుంటే దానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేంటి? వాటి అమల్లో ఎదురవుతున్న సమస్యలు ఏంటి? పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలా వివిధ కోణాల్లో అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. కొత్త సిలబస్‌ను పరిశీలిస్తే సంప్రదాయ ప్రిపరేషన్ వల్ల లాభం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మెరుగైన విశ్లేషణ సామర్థ్యం ఉన్న వారినే విజయం వరిస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు. టెక్స్ట్‌బుక్స్ కేవలం సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాలు తెలుసుకోవడానికే ఉపయోగపడతాయి. ఆయా ప్రాథమిక అంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలను ప్రసార సాధనాలు, వివిధ మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవాలి. వాటిపై దినపత్రికలు, మేగజైన్లలో నిపుణుల విశ్లేషణను పరిశీలించాలి. అన్నింటినీ అనుసంధానిస్తూ చదవాలి. ఇలా చేస్తే ప్రశ్న ఏ విధంగా వచ్చినా విశ్లేషణాత్మకంగా రాయగలిగే సామర్థ్యం సొంతమవుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి జనరల్ స్టడీస్ పరిధిని విస్తరించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టు, జనరల్ స్టడీస్ పేపర్ల సిలబస్‌లోని ఉమ్మడి అంశాలను గుర్తించి, వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. ఇలా చేస్తే ఎస్సే, జీఎస్, ఆప్షన్స్.. మూడు పేపర్లకూ ఉపయోగపడుతుంది. ఈసారి 10 మార్కులు, 15 మార్కుల ప్రశ్నలు (చిన్న, మధ్యస్థాయి) అడిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కోర్ అంశాలపై ఫోకస్డ్‌గా ప్రిపరేషన్ సాగిస్తే మంచి స్కోర్ సొంతమవుతుంది.
 - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ.
Published date : 27 May 2020 05:20PM

Photo Stories