Skip to main content

Indian Navy: పదితోనే నేవీ కొలువు... సెయిలర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

ndian Navy Sailor 2022 Batch Notification Released, Apply Here
ndian Navy Sailor 2022 Batch Notification Released, Apply Here

చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలను అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.. భారత నావికా దళం. పదోతరగతి పూర్తయిన అవివాహిత పురుష అభ్యర్థుల కోసం సెయిలర్‌(మెట్రిక్‌ రిక్రూట్‌)–2022 బ్యాచ్‌కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 300
  • పోస్టుల వివరాలు: చెఫ్, స్టీవార్డ్, హైజినిస్ట్‌.

విద్యార్హతలు

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఇండియన్‌ నేవీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • వయసు: 01 ఏప్రిల్‌ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.

చ‌ద‌వండి: డిగ్రీతో డిఫెన్స్‌ కొలువు.. శిక్షణ‌లోనే రూ.56 వేల‌కు పైగా స్టయిఫండ్‌..

ఎంపిక విధానం

రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష

రాత పరీక్షను రెండు సెక్షన్‌లుగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 50 మార్కులకు–50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్ష సమయం 30 నిమిషాలు. హిందీ, ఇంగ్లిష్‌ల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో ఎంపికైన వారికి ఫిజికల్‌ టెస్టులు ఉంటాయి. ఇందులోనూ విజయం సాధిస్తే.. మెడికల్‌ టెస్టులను నిర్వహించి.. శిక్షణకు పంపుతారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 12 వారాల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం బ్రాంచ్‌/ట్రేడు వారీగా విధుల్లోకి తీసుకుంటారు.

చ‌ద‌వండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

ఫిజికల్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ)

అభ్యర్థులు కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే 7 నిమిషాల్లో 1.6కిలో మీటర్ల పరుగు పూర్తిచేయాలి. 20 స్క్వేట్స్‌ అప్స్, 10 పుష్‌ అప్స్‌ తీయగలగాలి.

జాబ్‌ ప్రొఫైల్‌

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చెఫ్, హైజినిస్ట్, స్టీవార్డ్‌ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటిలో చెఫ్‌ పోస్టులకు ఎంపికైన వారు ఆహారాన్ని వండాలి. సంబంధిత ఆహార పదార్థాల స్టోర్‌ నిర్వహణ కూడా చూసుకోవాలి. స్టీవార్డుగా ఎంపికైన వారు భోజన వడ్డన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే భోజన తయారీలో పనిచేయాలి. హైజినిస్టు పోస్టులకు ఎంపికైన వారు గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి చేయాలి. ఈ ఉద్యోగం చేస్తూనే.. వివిధ రకాల ప్రొఫెషనల్‌ కోర్సులను అభ్యసించే అవకాశం కూడా లభిస్తుంది.

వేతనాలు

సెయిలర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి డిఫెన్స్‌ పే మాట్రిక్స్‌ ఆధారంగా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనంగా చెల్లిస్తారు. 

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాసులకు చివరి తేది: 02.11.2021
  • వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

చ‌ద‌వండి: Indian Army: 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌.. అర్హతలు ఇవే..

Published date : 02 Nov 2021 06:20PM

Photo Stories