Skip to main content

Top Architecture Courses: ఈ కోర్సు చేసిన వారికి.. నెల‌కు రూ. 60 వేల జీతంతో ఉద్యోగం

వ్యక్తిగత గృహాల నుంచి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల వరకు.. నిరంతరం నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆయా నిర్మాణాలు తమ అభిరుచికి, ఆసక్తికి అనుగుణంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు! ఫలితంగా నిపుణులైన ఆర్కిటెక్ట్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది! ఈ కోర్సులను అందించడంలో పేరొందిన విద్యాసంస్థ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌. దీన్నే సంక్షిప్తంగా ‘స్పా’! అని పిలుస్తారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ 2022–23 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌పీఏ కోర్సులు, ప్రవేశ విధానాలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం...
Top Architecture Courses
Top Architecture Courses
  • స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌–న్యూఢిల్లీ నోటిఫికేషన్‌ 
  • బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • బ్యాచిలర్‌ కోర్సులకు జేఈఈ–మెయిన్‌ పేపర్‌–2లో ర్యాంకుతో ప్రవేశం

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌.. నిర్మాణ రంగానికి అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌. న్యూఢిల్లీలో ప్రధాన క్యాంపస్‌తోపాటు, భోపాల్, విజయవాడల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. 

బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌

  • ఎస్‌పీఏలో బ్యాచిలర్‌ స్థాయిలో.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో మొత్తం మూడు క్యాంపస్‌లలో కలిపి 439 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • జేఈఈ–మెయిన్‌ పేపర్‌–2లో ర్యాంకు ఆధారంగా.. నిర్వహించే జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ సీట్ల భర్తీ చేస్తారు.


చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది


పీజీ.. స్పెషలైజేషన్లు

  • ఎస్‌పీఏ–ఢిల్లీలో పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి..
    • మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(ఆర్కిటెక్చరల్‌ కన్వర్జేషన్‌)
    • మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (అర్బన్‌ డిజైన్‌) 
    • మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌) 
    • మాస్టర్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 
    • మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇండస్ట్రియల్‌ డిజైన్‌) 
    • మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌(ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌) 
    • మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (హౌసింగ్‌) 
    • మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (రీజనల్‌ ప్లానింగ్‌) 
    • మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌) 
    • మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (అర్బన్‌ ప్లానింగ్‌).
  • అన్ని స్పెషలైజేషన్లలో కలిపి 276 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి ఆర్కిటెక్చర్‌/సివిల్‌/కన్‌స్ట్రక్షన్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి 
  • మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుకు పీజీ(జాగ్రఫీ/ఎకనామిక్స్‌/సోషియాలజీ/ ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌/ఆపరేషన్స్‌ రిసెర్చ్‌) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

గేట్, సీడ్‌ ర్యాంకుల ఆధారంగా

పీజీ కోర్సులకు సంబంధించి సీట్ల భర్తీని గేట్, సీడ్‌(కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌)లో ర్యాంకు ఆధారంగా చేపడతారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనల మేరకు ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఇందులో నిలిచిన వారికి తదుపరి దశలో గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్‌ మెరిట్‌ జాబితా రూపొందించి సీట్లు ఖరారు చేస్తారు.

స్కాలర్‌షిప్‌ సదుపాయం

గేట్, సీడ్‌ స్కోర్ల ఆధారంగా పీజీ స్పెషలైజేషన్లలో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులకు నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు. అదే విధంగా సీడ్‌ ర్యాంకు ఆధారంగా ఇండస్ట్రియల్‌ డిజైన్‌ కోర్సు అభ్యర్థులకు కూడా ఈ స్కాలర్‌షిప్‌ మొత్తం లభిస్తుంది.

చ‌ద‌వండి: Cyber Security: ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్న ఈ తరుణంలో.. సైబర్‌ సెక్యూరిటీకి పెరుగుతున్న అవ‌కాశాలు..!

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు

  • ఎస్‌పీఏ–ఢిల్లీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు కూడా ఉన్నాయి. వీటిని ప్రధానంగా రెండు విధానాల్లో(పార్ట్‌ టైమ్, ఫుల్‌ టైమ్‌) బోధిస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు.
  • అర్హత: ప్లానింగ్‌/ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్‌/సీడ్‌ స్కోర్‌ లేదా జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉండాలి.
  • పీహెచ్‌డీలో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి కూడా నెలకు రూ.31వేల చొప్పున జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పేరిట ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. మూడేళ్ల తర్వాత నెలకు రూ.35 వేలు చొప్పున సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ లభిస్తుంది. 

ఇంటిగ్రేటెడ్‌ కోర్సు కూడా

ఎస్‌పీఏ–ఢిల్లీ.. ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సును అందిస్తోంది. అయిదేళ్ల వ్యవధిలోని ఈ కోర్సులో చేరేందుకు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌లో ఏడు సెమిస్టర్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు చూపిన ప్రతిభ ఆధారంగా ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 15 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఉజ్వల భవిత

ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉజ్వల అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే ట్రైనీ ఆర్కిటెక్ట్‌ లేదా జూనియర్‌ ఆర్కిటెక్చర్‌ ఇంజనీర్‌గా నెలకు రూ.50వేల నుంచి రూ.60 వేల వేతనం లభిస్తుంది. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.70 వేల జీతం అందుకునే అవకాశం ఉంది. వీటితోపాటు సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు(క్యాడ్, క్యామ్‌ తదితర) సొంతం చేసుకుంటే అవకాశాలు, ఆదాయం ఇంకా ఎక్కువ లభిస్తుంది.

ఉపాధి వేదికలివే

ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ సంస్థలు, ఆర్కిటెక్చర్‌ కన్సల్టెన్సీలు ముఖ్యమైన ఉపాధి వేదికలు. ప్రభుత్వ రంగంలో పురాతత్వ శాఖ, పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, రైల్వే శాఖ, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అసోసియేషన్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ వంటి పలు విభాగాల్లో ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. సొంతంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చు.

ఈ నైపుణ్యాలు తప్పనిసరి

ఈ రంగంలో రాణించేందుకు సృజనాత్మకత, పరిశీలన, విశ్లేషణ, మ్యాథమెటికల్‌ నైపుణ్యాలు, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ అవసరం. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే కెరీర్‌ అంత ఉన్నతంగా ఉంటుంది. సెల్ఫ్‌ ప్రాక్టీస్‌ చేయాలనుకునే వారికి ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ ఎంతో ప్రధానం.

చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!

ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ అకడమిక్‌ – ముఖ్యాంశాలు

  • ఆర్కిటెక్చర్, ప్లానింగ్‌కు బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌గా ఎస్‌పీఏ క్యాంపస్‌లు.
  • బ్యాచిలర్‌ స్థాయిలో జేఈఈ–మెయిన్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు.
  • పీజీ స్థాయిలో గేట్, సీడ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు.
  • పీజీ ప్రవేశాలు ఖరారు చేసుకున్న వారికి గేట్‌ స్కాలర్‌షిప్‌.
  • పీహెచ్‌డీలో అడుగు పెడితే జేఆర్‌ఎఫ్‌ పేరిట ఆర్థిక ప్రోత్సాహకం.
  • నెలకు రూ.40 వేల నుంచి రూ. 60 వేల వరకు ప్రారంభ వేతనం.

ఎస్‌పీఏ–ఢిల్లీ 2022 ప్రవేశాలు ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • పీజీ కోర్సులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 28, 2022
  • అర్హత పొందిన విద్యార్థుల జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 11, 2022
  • ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: మే 10, 2022
  • ఆయా విభాగాల్లో రిజిస్ట్రేషన్‌: ఆగస్ట్‌ 5, 2022
  • ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌: ఆగస్ట్‌ 5, 2022
  • అకడమిక్‌ సెషన్‌ ప్రారంభం: ఆగస్ట్‌ 10, 2022
  • ప్రవేశ ప్రక్రియ ముగింపు: ఆగస్ట్‌ 15, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.spa.in

ఉజ్వల కెరీర్‌కు సోపానం

దేశంలో అర్బన్‌ కల్చర్‌ పెరుగుతోంది. ఫలితంగా ఉజ్వల భవిష్యత్తును అందించే కోర్సుగా ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌ నిలుస్తోంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా వేల సంఖ్యలో నిపుణుల అవసరం ఉంది. కానీ మానవ వనరుల డిమాండ్‌–సప్లయ్‌లో వ్యత్యాసం భారీగా నెలకొంది. విద్యార్థులు అకడెమిక్‌ స్థాయిలో నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాలి. అప్పుడే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. 
 – ప్రొ‘‘ ఎన్‌.వి. రమణరావు, ఇంచార్జ్‌ డైరెక్టర్, ఎస్‌పీఏ–విజయవాడ

చ‌ద‌వండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

Published date : 21 Mar 2022 06:06PM

Photo Stories