TSPSC Group-3 Jobs: గ్రూప్‌–3కి పేపర్‌ వారీగా నిర్దిష్ట వ్యూహంతో ముందుకు సాగాలి!!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. మొత్తం 1,363 గ్రూప్‌ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాచిలర్‌ డిగ్రీతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. పోటీ తీవ్రంగా ఉండే గ్రూప్‌ 3 వంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే.. ప్రణాళికాబద్ద ప్రిపరేషన్‌ తప్పనిసరి. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–3 పోస్ట్‌ల వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
Group 3 Exam preparation tips 2023

ప్రభుత్వ ఉద్యోగాలంటే.. పోటీ తీవ్రం. గ్రూప్‌–3 అందుకు మినహాయింపు ఏమీ కాదు. అంతేకాకుండా 1300 పైగా ఉన్న పోస్ట్‌లకు గ్రూప్‌–1, గ్రూప్‌2, సివిల్స్‌ అభ్యర్థులు సైతం పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ పరీక్షలో విజయానికి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి అంటున్నారు నిపుణులు. 

Also read: Indian Polity Partition of India Notes: దేశ విభజనకు దారి తీసిన చట్టం ఏది?

     మొత్తం పోస్టులు 1,363:
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకారం–మొత్తం 1,363 గ్రూప్‌ 3 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఏడు విభాగాల్లో మినహా, మిగతా అన్ని విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లను పేర్కొన్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెచ్‌ఓడీ, పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ హెచ్‌ఓడీ, ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ హెచ్‌ఓడీ, స్టేట్‌ ఆడిట్‌ హెచ్‌ఓడీ పరిధుల్లో మాత్రం సీనియర్‌ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్‌ ఆడిటర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్ట్‌లు, శాఖలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆర్థిక శాఖలోనే ఎక్కువ పోస్ట్‌లు ఉన్నాయి. ఈ శాఖ పరిధిలోని పలు విభాగాల్లో 712 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.

అర్హతలు
ఒకట్రెండ్‌ పోస్టులకు తప్ప మిగతా అన్ని పోస్టులకు బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా పోటీ పడే అవకాశముంది. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

Also read: వరుసగా గ్రూప్‌–1 పరీక్షలా!

రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా
అన్ని పోస్ట్‌లకు రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా.. నియామకాలు ఖరారు చేస్తారు. రాత పరీక్షను ఓఎంఆర్‌ షీట్‌ విధానంలోనే నిర్వహించే అవకాశం ఉంది.

రాత పరీక్ష మూడు పేపర్లుగా

  • గ్రూప్‌–3 సర్వీసులకు నిర్వహించే రాత పరీక్ష మూడు పేపర్లుగా మొత్తం 450 మార్కులకు ఉంటుంది.
  • పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌–150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు.
  • పేపర్‌ 2 హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ అంశాలపై 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది.  
  • పేపర్‌ 3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెం ట్‌పై 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • పేపర్‌–2,3లలో ప్రతి పేపర్‌లోనూ మూడు అం శాలు ఉంటాయి. ఒక్కో అంశం నుంచి 50 ప్రశ్నలు చొప్పున 150 ప్రశ్నలతో పేపర్‌ ఉంటుంది. 


Also read: TSPSC: ఒక్కో పోస్టుకు ఇంత మంది పోటీ

విజయం సాధించాలంటే
గ్రూప్‌–3 పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు పేపర్‌ వారీగా నిర్దిష్ట వ్యూహంతో ముందుకు సాగాలి.
పేపర్‌–1: జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్‌
ఈ పేపర్‌కు సంబంధించి.. కరెంట్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ ఈవెంట్స్‌ కు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతదేశ ప్రమేయం, అదే విధంగా భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో ఆయా సంఘటనలు,అవి చోటు చేసుకున్న సంవత్సరాలపై పట్టు సాధించాలి. అదే విధంగా చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలకు దారితీసిన యుద్ధాలు, పరిస్థితులపై ప్రత్యేక అవగాహన పెంచుకోవాలి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ముఖ్యమైన ఉద్యమాల గురించి తెలుసుకోవాలి. పాలిటీకి సంబంధించి.. రాజ్యాంగం, రాజ్యాంగ పీఠిక, ముఖ్యమైన ఆర్టికల్స్, సవరణలను అధ్యయనం చేయాలి. ఎకానమీ కోసం బేసిక్‌ అంశాలతోపాటు ఇటీవల కాలంలో ఆర్థిక విధానాలు, అభివృద్ధి కారక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధి్దదారులు, పథకాల లక్ష్యం వంటి అంశాలను అధ్యయనం చేయాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి బేసిక్‌ సైన్స్‌ అంశాలతోపాటు నిజ జీవితంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర, ఇటీవల కాలంలో ఈ రంగంలో తాజా పరిణామాలు, వాటి వల్ల ప్రయోజనాలు వంటి వాటిపై పట్టు సాధించాలి. జాగ్రఫీలో భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రాంతాలు, ఖనిజ వనరులు, సహజ వనరులు, నదీ తీర ప్రాంతాలు, అడవులు–రకాలు, పంటలు–అవి ఎక్కువగా పండే ప్రాంతాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్‌ ఎబిలిటీలో రాణించేందుకు దత్తాంశాల విశ్లేషణ, టేబుల్స్, గ్రాఫ్స్‌ను పరిశీలించి.. వాటిలోని ముఖ్యాంశాలను గుర్తించే విధంగా అధ్యయనం చేయాలి. 

Also read: TSPSC: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష తేదీలు ఇవే..

పేపర్‌–2 కోసం ఇలా

  • హిస్టరీ, పాలిటీ, అండ్‌ సొసైటీ అంశాలున్న పేపర్‌–2 కోసం ప్రత్యేకంగా చదవాలి. ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ కోసం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కవులు, కళలు; ముఖ్యంగా మధ్యయుగ చరిత్ర, శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌ షాహీలు, అసఫ్‌జాహీలు, సాయుధ రైతాంగ పోరాటం తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి.
  • పాలిటీ విభాగానికి సంబంధించి.. భారత రాజ్యాంగం, ప్రధాన చట్టాలపై పట్టు సాధించాలి. అధికరణలు, సవరణల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు రాజ్యాంగ పరమైన సంస్థలు(ఉదా: యూపీఎస్సీ, ఎలక్షన్‌ కమిషన్, కాగ్, ఆర్థిక సంఘం తదితర), వాటి విధుల గురించి తెలుసుకోవాలి. గ్రూప్‌–3 అభ్యర్థులు వీలైనంత ఎక్కువగా రాజ్యాంగంపై పట్టు సాధించాలి. 
  • సమాజ నిర్మాణం, సమస్యలు,ప్రజా విధానాలకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో సమస్యలు, ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకోవాలి. ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందిస్తున్న నూతన పాలసీలపై పట్టు సాధించాలి.


Also read: TSPSC Group-1 2023: మెయిన్‌లో మార్పులు.. మెరిసే మార్గాలు ఇవే!!

పేపర్‌–3 కోసం
ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అంశాలుండే పేపర్‌–3 కోసం దేశ, రాష్ట్ర ఆర్థిక విధానాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ పాలసీలపై పట్టు పెంచుకోవాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించి తెచ్చిన పథకాల గురించి తెలుసుకోవాలి. జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కోర్‌ ఎకానమీ అంశాలు మొదలు.. తాజా ఆర్థిక విధానాల వరకూ.. అన్నింటినీ క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.బడ్జెట్‌ గణాంకాలు, ఆర్థిక సర్వే గణాంకాలపై పట్టు సాధించాలి.

అనుసంధానం
గ్రూప్‌–3 అభ్యర్థులు గ్రూప్‌–1, 2, 4లతో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగించొచ్చు. ముఖ్యంగా గ్రూప్‌–3 అభ్యర్థుల్లో ఎక్కువ మంది గ్రూప్‌–2కు కూడా పోటీ పడుతున్నారు. వీరికి కలిసొచ్చే అంశం రెండు పరీక్షలకు సంబంధించి సిలబస్‌ ఒకే విధంగా ఉండడం. గ్రూప్‌–2లోని నాలుగో పేపర్‌ను మినహాయిస్తే.. మిగతా అన్ని పేపర్లు రెండు సర్వీసుల్లోనూ ఒకే రకంగా ఉన్నాయి. దీంతో ఆయా అంశాలను సమ్మిళితం చేసుకుంటూ..ఒకే సమయంలో గ్రూప్‌–3తోపాటు గ్రూప్‌–2కు కూడా పోటీ పడే అవకాశం ఉంది.

Also read: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు


మెటీరియల్‌ ముఖ్యం
గ్రూప్‌–3 అభ్యర్థులు పుస్తకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను చదివే ప్రయత్నం చేయాలి. సిలబస్‌పై స్పష్టత తెచ్చుకున్నాక.. అన్ని అంశాలున్న పుస్తకాలను అన్వేషించి.. వాటి ద్వారా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించి ప్రత్యేక దృష్టితో ప్రిపరేషన్‌ సాగించాలి. అకాడమీ పుస్తకాలు, బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి చరిత్ర పుస్తకాలను చదవాలి.

విశ్లేషణాత్మక అధ్యయనం
గ్రూప్‌–3 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కాని ప్రిపరేషన్‌లో మాత్రం అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనం సాగించాలి. ఆయా అంశాలను డిస్క్రిప్టివ్‌ విధానంలో చదువుతూ.. సిలబస్‌ అంశాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా సమయ పాలన పాటించాలి. 

Also read: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

కోర్‌ టు కాంటెంపరరీ
ఆయా సిలబస్‌ అంశాలను చదివేటప్పుడు.. వాటికి సంబంధించి కోర్‌ అంశాలతోపాటు కాంటెంపరరీ పరిణామాలను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాల వరకూ..సమగ్ర అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా పరీక్షలో విజయం కోసం నిర్ణయాత్మక సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం పెంచుకోవాలి. దీనివల్ల ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్‌ విధానంపైగా అవగాహన పొందే అవకాశం లభిస్తుంది. అదే విధంగా నిర్దిష్టంగా ఒక టాపిక్‌ను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా చదవాలి.

సొంత నోట్స్‌
అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలను పాయింట్ల వారీగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.

Also read: పోటీపరీక్షల్లో ఇండియన్ ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానం ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 23, 2023 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.tspsc.gov.in

#Tags