పోటీపరీక్షల్లో ఇండియన్ ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
- ఆర్.వినయ్‌కుమార్, హైదరాబాద్.
Question
పోటీపరీక్షల్లో ఇండియన్ ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
- పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, వివిధ రంగాలకు జరిపిన కేటాయింపులు, సాధించిన వృద్ధి, ప్రణాళికా వ్యూహాలు, విజయాలు, వైఫల్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికా అంశాలపై దృష్టిసారించాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థిక సంస్కరణల అమలుకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి సడలింపు, వస్తు-సేవల పన్ను (GST) గురించి తెలుసుకోవాలి.
- సమ్మిళిత వృద్ధి, పేదరికం, నిరుద్యోగ నిర్మూలన పథకాలు; వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల స్థితిగతులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో సాంకేతికపరమైన సంస్కరణ విధానాలు, సంస్థాపరమైన సంస్కరణలు, మార్కెటింగ్, ధరలకు సంబంధించిన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పారిశ్రామిక తీర్మానాల్లోని ముఖ్యాంశాలను పరిశీలించాలి. మానవాభివృద్ధి సూచీ రూపకల్పనలో వినియోగించే సూచికలు, ఆయా సూచికల విషయంలో భారతదేశానికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేయాలి.
- ద్రవ్యం, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణ రకాలు, ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం, ప్రతి ద్రవ్యోల్బణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలను గమనించాలి. మూలధన కల్పనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు (కార్పొరేటు) రంగం, కుటుంబ రంగాల్లో వృద్ధిని పరిశీలించాలి.
- జాతీయాదాయ భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. జాతీయాదాయాన్ని మదించే పద్ధతులైన ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- ఆర్థిక సర్వే, బడ్జెట్ అంశాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. దినపత్రికలను చదువుతూ ఆర్థిక రంగంలో రోజువారీ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యం.