Skip to main content

Indian Polity Partition of India Notes: దేశ విభజనకు దారి తీసిన చట్టం ఏది?

‘సైమన్‌ కమిషన్‌ మొదటిసారిగా సమాఖ్య పద్ధతిని సూచించింది’. సైమన్‌ కమిషన్‌ అనేది భారత సమస్యలపై ఒక సమగ్ర అధ్యయనమని కూప్లాండ్‌ అనే రచయిత పేర్కొన్నారు. బ్రిటన్‌లోని అధికార లేబర్‌ పార్టీ ఈ కమిషన్‌ సమర్పించిన నివేదికలోని అంశాలపై సరిగా దృష్టిపెట్టలేదు. కానీ, ఆ తర్వాత రూపొందించిన భారత ప్రభుత్వ చట్టం–1935లో సైమన్‌ కమిషన్‌ ప్రతిపాదించిన అంశాలను పొందుపరిచారు.
Partition of India
Partition of India

భారత కౌన్సిల్‌ చట్టాలు 
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలో పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టడానికి, భారతీయుల సహకారాన్ని పొందడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించింది. వీటినే కౌన్సిల్‌ చట్టాలు లేదా శాసన చట్టాలు అంటారు.

కౌన్సిల్‌ చట్టం–1861

  • భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతిని«ధ్యం కల్పించారు.
  • ఈ చట్టం ప్రకారం కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా కౌన్సిల్‌లోకి వైస్రాయ్‌ నామినేట్‌ చేస్తారు. ఇలా నామినేట్‌ అయిన వారిలో బెనారస్‌ రాజు, పాటియాలా మహారాజు, శ్రీ దినకర్‌రావు ఉన్నారు.
  • 1773 చట్టం ద్వారా రద్దయిన బాంబే,మద్రాస్‌ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. ఆ విధంగా ఈ చట్టాన్ని ‘వికేంద్రీకరణ ప్రక్రియ’కు నాందిగా చెప్పొచ్చు. బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.
  • కౌన్సిల్‌లో కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన సూత్రాలు, నియమాలను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్‌కి ఇచ్చారు. 1859లో లార్డ్‌ కానింగ్‌ ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియో (మంత్రిత్వ శాఖలుగా విధుల కేటాయింపు) పద్ధతిని గుర్తించి కొనసాగించారు. తద్వారా వైస్రాయ్‌ కౌన్సిల్‌ మరిన్ని శాఖలను నిర్వహించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. శాసన కౌన్సిళ్ల సమ్మతి లేకుండానే ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్‌కు కల్పించారు.1860 లో బడ్జెట్‌ పద్ధతి ప్రవేశపెట్టారు.


Also read: Fundamental Rights (Article 28-32): ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త ఎవ‌రు?

కౌన్సిల్‌ చట్టం–1892
కౌన్సిల్‌ చట్టం–1861లోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టం చేశారు. ముఖ్యంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడటం, విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్‌ పాలనలోని లోపాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుండటంతో ఈ చట్టాన్ని రూపొందించారు. కేంద్ర శాసనసభలో అనధికార సభ్యుల సంఖ్య 10కి తగ్గకుండా 16 కంటే మించకుండా.. రాష్ట్ర శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు. కేంద్రశాసన మండలికి ఎంపికైన భారతీయ ప్రముఖులు.. గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్‌ షా మెహతా, సురేంద్రనాథ్‌ బెనర్జీ, రాస్‌ బిహారీ ఘోష్‌. 
ఈ చట్టం ద్వారా శాసన మండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్‌పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ఈ ప్రశ్నలు అడిగేందుకు గవర్నర్, గవర్నర్‌ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభల్లో తమ స్థానం నామమాత్రమేనని గ్రహించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.

Also read: Fundamental Rights of India: ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?


భారత కౌన్సిల్‌ చట్టం–1909  లేదా మార్లే–మింటో సంస్కరణలు
1892 చట్టంలోని లోపాలను సవరించాలని, దేశంలో తీవ్రవాద జాతీయవాదంతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనాలనే ఉద్దేశంతో ఈ చట్టానికి రూపకల్పన చేశారు. భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ మార్లే, భారత వైస్రాయ్‌ మింటో పేర్లతో ఈ చట్టాన్ని సూచించారు. అందువల్ల దీన్ని మార్లే–మింటో సంస్కరణ చట్టం అంటారు. కాంగ్రెస్‌లోని మితవాదులను మచ్చిక చేసుకోవడానికి బ్రిటిష్‌వారు ఈ చట్టం ద్వారా ప్రయత్నించారని చెప్పవచ్చు.

ముఖ్యాంశాలు:

  • కేంద్ర, రాష్ట్ర శాసన మండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.
  • శాసన ప్రక్రియ కోసం వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారు. అదేవిధంగా మద్రాస్, బెంగాల్, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల శాసన మండళ్లలో సభ్యుల సంఖ్యను 50కి, పంజాబ్, అస్సాం, బర్మాల్లో 30కి పెంచారు.
  • గవర్నర్‌ జనరల్‌ ఆధీనంలోని శాసన మండలిలో 4 రకాల సభ్యులు ఉంటారు.

    1. నామినేటెడ్‌ అధికార సభ్యులు
    2. నామినేటెడ్‌ అనధికార సభ్యులు
    3. హోదా రీత్యా సభ్యులు
    4. ఎన్నికైన సభ్యులు
మెజారిటీ సభ్యులు అధికార సభ్యులు కావడం వల్ల బిల్లుల ఆమోదం ప్రభుత్వానికి సులభమయ్యేది. వైస్రాయ్, గవర్నర్ల కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించారు. ఇలా సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా.

Also read: Indian Polity: రాష్ట్ర విధాన పరిషత్‌ బిల్లును తిరస్కరిస్తే..

ముస్లింలు, వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ముస్లిం జనాభాకు మించిన ప్రాధాన్యాన్ని ఈ చట్టం కల్పించింది. ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునే వీలు కల్పించింది. దీని కోసం ప్రత్యేక మతపరమైన నియోజక గణాలను ఏర్పాటు చేశారు.

ఈ చట్టం మతతత్వానికి చట్టబద్ధత కల్పించింది. అందుకే లార్డ్‌ మింటోను ‘మత నియోజక గణాల పితామహుడి’గా పేర్కొంటారు.
ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, భూస్వాములు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు. కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో సభ్యులు సైనిక, దౌత్య, మతపరమైన విషయాలు మినహా ఇతర ఏ అంశంపైనైనా ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడగడానికి అధికారం లభించింది. కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో పోటీచేసే అభ్యర్థులకు ఈ చట్టం కచ్చితమైన అర్హతలను నిర్ణయించింది.

విమర్శ: ఈ చట్టంలోని అంశాలు ‘అసలైన స్వరూపానికి బదులు కేవలం నీడ లాంటి ఆకారా’న్ని మాత్రమే అందించడం వల్ల 1909 చట్టాన్ని చంద్రకాంతితో పోల్చారు. ఈ చట్టం హిందూ, ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి అడ్డుగోడలు సృష్టించిందని, దేశవిభజనకు దారి తీసిందని నెహ్రూ అభిప్రాయపడ్డారు.

Also read: Indian Polity Study Material: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?


భారత ప్రభుత్వ చట్టం–1919 లేదా మాంటెగు–ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు

భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం 1917 ఆగస్టు 20న ఒక ప్రకటన చేసింది. అందులో భాగంగా భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ మాంటెగు 1917 నవంబర్‌లో భారతదేశాన్ని సందర్శించాడు. వైస్రాయ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌తోపాటు భారతీయ నాయకులతో ఆయన చర్చలు జరిపి ఈ సంస్కరణలను ప్రకటించాడు. అందువల్ల వీటిని మాంటెంగు–ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు అంటారు.

Also read: Right to Freedom (Article 19-22): వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు... పత్రికా స్వేచ్ఛ గురించి తెలిపే ఆర్టికల్‌ ఏది?


ముఖ్యాంశాలు:

  • భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారత ఆదాయం నుంచి కాకుండా బ్రిటిష్‌ నిధి నుంచి చెల్లిస్తారు.
  • రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అధికారాలను రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్‌గా విభజించారు. రిజర్వ్‌డ్‌ విభాగంలో 28 పాలనా అంశాలను చేర్చారు. విత్తం, భూమి శిస్తు, న్యాయం, నీటి పారుదల, పరిశ్రమలు, మొదలైన వాటిని ఇందులో పేర్కొన్నారు.
  • ఈ అంశాలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను బ్రిటిష్‌ కౌన్సిలర్ల సహాయంతో ఆయా రాష్ట్ర గవర్నర్లు నిర్వహిస్తారు. అయితే బ్రిటిష్‌ కౌన్సిలర్లు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించరు.
  • ట్రాన్స్‌ఫర్డ్‌ విభాగంలో 22 అంశాలను పేర్కొన్నారు. స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజా ఆరోగ్యం, విద్య, సహకారం, మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి.
  • రాష్ట్ర గవర్నర్‌ ఈ అంశాల పాలనా వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు. తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.
  • దేశంలో మొదటిసారి కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎగువసభను రాష్ట్రాల మండలి(కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌), దిగువసభను కేంద్ర శాసనసభ(సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ)గా వ్యవహరిస్తారు.
  • ఎగువసభ అయిన కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌లో 60 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 34 మంది ఎన్నికైనవారు, 26 మందిని గవర్నర్‌ జనరల్‌ నియమిస్తారు. వీరి పదవీకాలం అయిదేళ్లు. అధ్యక్షుడిని వైస్రాయ్‌ నియమిస్తారు. దిగువసభ అయిన సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో 145 మంది సభ్యులుంటారు. ఇందులో 104 మంది ఎన్నికైనవారు, 41 మంది నియమితులైనవారు ఉంటారు. ఈ సభ పదవీకాలం మూడేళ్లు.
  • మత ప్రాతిని«ధ్యాన్ని సిక్కులు,క్రిస్టియన్లు, ఆంగ్లో –ఇండియన్లు, ఐరోపా వారికి కూడా వర్తింపజేశారు.
  • ఆస్తి పన్ను చెల్లింపు ప్రాతిపదికపై పరిమిత ఓటు హక్కును కల్పించారు. లండన్‌లో భారత వ్యవహారాలను, ముఖ్యంగా రెవెన్యూ, పరిపాలన మొదలైన అంశాలను పర్యవేక్షించడానికి భారత హై కమిషనర్‌ పదవిని సృష్టించారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లను వేరు చేశారు.
  • లీ కమిషన్‌ (1923–24) సూచన మేరకు భారతదేశానికి విడిగా ఒక ఆడిటర్‌ జనరల్‌ను,1926లో ఒక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
  • కేంద్ర, రాష్ట్రాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయ్‌కి ఇచ్చారు. ఈ చట్టం అమలు తీరును సమీక్షించడానికి పదేళ్ల తర్వాత చట్టబద్ధత ఉన్న కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Also read: Indian Polity: రాజ్యాంగ వికాసంలో భాగమైన చట్టాలు..

విమర్శ: ఈ చట్టం ప్రతిపాదించిన అంశాలపై అనేక విమర్శలు వచ్చాయి. 
1919 సంస్కరణలు అసంతృప్తి, నిరాశతోపాటు ‘సూర్యుడు లేని ఉదయం’లా ఉన్నాయని బాలగంగాధర్‌ తిలక్‌ అభిప్రాయపడ్డారు.

  • ఈ సంస్కరణలను బ్రిటిష్‌వారు ప్రకటించి ఉండాల్సింది కాదని, ఈ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని అనిబిసెంట్‌ వ్యాఖ్యానించారు.
  • భారతదేశంలో ద్వంద్వ పాలన దాదాపు దూషణ పదంగా మారింది. ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తిని నీవు ‘డైయార్కి’వి అని అరవడం విన్నానని సర్‌ బట్లర్‌ అనే రచయిత తెలిపాడు.
  • ద్వంద్వ పాలనను ఎప్పటికీ ఆదర్శంగా భావించలేం. మరో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఓ  మెట్టు మాత్రమే. ఆ ఉత్తమ ప్రయోజనమే ‘పరిపూర్ణ స్వపరిపాలిత భారతదేశం’ అని పలాండే అనే రచయిత పేర్కొన్నారు.
  • ఈ సంస్కరణలు స్వపరిపాలన దిశగా చెప్పుకోదగ్గ ముందంజ కాబట్టి భారత రాజ్యాంగ చరిత్రలో ముఖ్య పరిణామంగా పరిగణిస్తారు. ప్రేరణను, భవితవ్యం కోసం అనుభవం సంపాదించడానికి ఈ చట్టం తగిన అవకాశం ఇచ్చిందని కూడా చెప్పవచ్చు.

Also read: Indian Polity Study Material: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?

సైమన్‌ కమిషన్‌ – నవంబర్‌ 1927
భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి నిర్ణీత సమయం కంటే రెండేళ్ల ముందే బ్రిటన్‌ ప్రధాని స్టాన్లీ బాల్డ్‌విన్‌ 1927 నవంబర్‌లో సర్‌ జాన్‌ సైమన్‌ నాయకత్వంలో ఆరుగురు సభ్యులతో ఒక రాయల్‌ కమిషన్‌ను నియమించారు. ఇందులోని సభ్యుడైన క్లిమెంట్‌ అట్లీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇంగ్లండ్‌ ప్రధానిగా ఉన్నారు. ఈ కమిషన్‌లో సభ్యులందరూ ఆంగ్లేయులు కావడం వల్ల భారతీయులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కమిషన్‌ భారతదేశంలో రెండు సార్లు పర్యటించింది.1928 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు తొలిసారి, 1928 అక్టోబర్‌ 11 నుంచి 1929 ఏప్రిల్‌ 6 వరకు రెండోసారి పర్యటించింది. ఈ కమిషన్‌ 1930లో నివేదికను సమర్పించింది.

ముఖ్యాంశాలు:

  • రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయడం, మంత్రులు శాసనసభకు బాధ్యత వహించేలా చేయడం.
  • ప్రభుత్వ నిర్వహణలో భారతీయులకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించడం.
  • రాష్ట్ర శాసన మండళ్లలో సభ్యత్వ సంఖ్యను పెంచడం.
  • ఏక కేంద్ర వ్యవస్థ భారతదేశానికి సరిపడదు కాబట్టి సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం.
  • హైకోర్టుపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణ ఏర్పాటు.
  • సార్వజనీన వయోజన ఓటు హక్కు వెంటనే సాధ్యం కాదు కాబట్టి దీన్ని కాలానుగుణంగా విస్తృతం చేయడం.
  • కమ్యునల్‌ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా, దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్ట్యా కొనసాగించడం.

–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు 

Also read: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు

Published date : 07 Feb 2023 07:05PM

Photo Stories