Indian Polity: రాష్ట్ర విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే..
రాష్ట్ర శాసనసభ
శాసనసభ్యుల అనర్హతలు
ఆర్టికల్ 191 ప్రకారం రాష్ట్ర శాసనసభ్యుల సభ్యత్వం ఈ కింది సందర్భాల్లో రద్దవుతుంది.
- ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలోని లాభదాయక పదవుల్లో కొనసాగినప్పుడు.
- మానసిక స్థిమితం కోల్పోయినట్లు సంబంధిత కోర్టు ధ్రువీకరించినప్పుడు.
- దివాలా తీసినట్లు కోర్టు ధ్రువీకరిస్తే.
- విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు లేదా ఇతర దేశాలపట్ల విధేయత ప్రకటించిన సందర్భంలో.
- పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు
- సభా«ధ్యక్షుల అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు శాసనసభా సమావేశాలకు గైర్హాజరు అయినప్పుడు.
- పార్లమెంటు నిర్ణయించిన ఇతర సందర్భాల్లోనూ సభ్యత్వం రద్దవుతుంది.
ఆర్టికల్ 192 ప్రకారం శాసనసభ్యుల అనర్హతను గవర్నర్ నిర్ణయిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. గవర్నర్‌దే తుది నిర్ణయం. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయా సభాధ్యక్షులు సంబంధిత పార్టీ అధ్యక్షుడి సలహా మేరకు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. శాసనసభ్యులు తమ రాజీనామాను లిఖిత పూర్వకంగా ఆయా సభాధ్యక్షులకు వ్యక్తిగతంగా సమర్పించాలి.
Also read: Success Story : ఇంటర్‌లో పెళ్లి.. సెలవుల్లో కూలీ .. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు
పదవీ ప్రమాణ స్వీకారం
శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం గురించి ఆర్టికల్ 188 తెలుపుతుంది. విధాన సభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులతో రాష్ట్ర గవర్నర్ లేదా ఆయన నియమించిన ప్రతిని«ధి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ వివరాలను మూడో షెడ్యూల్‌లో పొందుపరిచారు.
జీతభత్యాలు
శాసనసభ్యుల జీతభత్యాలను శాసనసభ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వీరి జీతాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది.
శాసన నిర్మాణ ప్రక్రియ
శాసన నిర్మాణ ప్రక్రియ పార్లమెంటు శాసన నిర్మాణ ప్రక్రియను పోలి ఉంటుంది. సాధారణ బిల్లుల విషయంలో పార్లమెంటులో రాజ్యసభకు లోక్‌సభతో సమానమైన అధికారాలు ఉంటాయి. కానీ రాష్ట్ర శాసనసభలో దిగువ సభ అయిన విధానసభకు ఆధిపత్యం ఉంటుంది. విధానసభ నిర్ణయమే అంతిమంగా చెల్లుబాటు అవుతుంది. ఆర్టికల్ 196 ప్రకారం సాధారణ బిల్లులను ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
Also read: APPSC Jobs 2023: గ్రూప్2.. కీలక మార్పులు ఇవే!
ఎగువసభ ఒక సాధారణ బిల్లును గరిష్టంగా నాలుగు నెలల వరకు వాయిదా వేయవచ్చు. కానీ అంతిమంగా విధాన సభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఉభయ సభల మధ్య బిల్లు విషయంలో వివాదం తలెత్తితే సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు.
ఒకవేళ బిల్లు ఎగువ సభలో ప్రవేశపెట్టి, ఆమోదించిన తరువాత దాన్ని దిగువ సభ ఆమోదానికి పంపితే, విధాన సభ ఆ బిల్లును తిరస్కరిస్తే బిల్లు వీగిపోతుంది. దీన్నిబట్టి విధాన పరిషత్‌కు సాధారణ బిల్లు విషయంలో కూడా విధాన సభతో సమాన అధికారాలు లేవని అర్థమవుతోంది. ఎగువ సభ బిల్లును వాయిదా వేస్తుందే కానీ అడ్డుకోలేదు. ఆర్థిక, ద్రవ్య బిల్లుల విషయంలో కూడా విధాన సభదే అంతిమ అధికారం.
సభాధ్యక్షులు
(స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్)
శాసనసభలో ఉభయ సభలకు వేర్వేరుగా సభాధ్యక్షులు ఉంటారు. సభా కార్యక్రమాల నిర్వహణలో వీరు కీలక పాత్ర వహిస్తారు.
స్పీకర్/డిప్యూటీ స్పీకర్
రాష్ట్ర విధాన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల గురించి ఆర్టికల్ 178 తెలుపుతుంది. విధాన సభ సభ్యులే వీరిని ఎన్నుకుంటారు, తొలగిస్తారు. స్పీకర్‌గా, డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి విధాన సభలో సభ్యుడై ఉండాలి. ఆర్టికల్ 179 ప్రకారం స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి. రాష్ట్ర విధాన సభ రద్దయినా, తిరిగి నూతన విధాన సభ ఏర్పడే వరకు స్పీకర్ తన పదవిలో కొనసాగుతాడు.
ఆర్టికల్ 186 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన సభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల జీతభత్యాలను శాసనసభ నిర్ణయిస్తుంది. ఈ అంశాలను రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్నారు. వీరి జీతభత్యాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
Also read: Groups Preparation Tips: గ్రూప్స్..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!
స్పీకర్ అధికారాలు, విధులు
లోక్‌సభ స్పీకర్‌కు ఉన్న అధికారాలు, విధులే రాష్ట్ర శాసనసభ స్పీకర్‌కు కూడా ఉంటాయి. ఆర్టికల్ 181 ప్రకారం స్పీకర్ శాసనసభకు అధ్యక్షత వహించి, సభా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. సభలో సభ్యుల ప్రవర్తన, ఇతర ప్రక్రియలను నియంత్రిస్తాడు. సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు. వివిధ కమిటీలకు చైర్మన్‌లను నియమిస్తాడు. సభావ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీల చైర్మన్‌గా వ్యవహరిస్తాడు. ఒక బిల్లు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అనే అంశాన్ని స్పీకర్ ధ్రువీకరిస్తారు. ఈ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం.
స్పీకర్‌కు నిర్ణయాత్మక ఓటు ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంది. సభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.
విధాన పరిషత్ చైర్మన్/డిప్యూటీ చైర్మన్
విధాన పరిషత్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల గురించి ఆర్టికల్ 182 తెలుపుతుంది. వీరిని విధాన పరిషత్ సభ్యులే ఎన్నుకుంటారు, తొలగిస్తారు. చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ చైర్మన్‌కు, డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను చైర్మన్‌కు సమర్పించాలి.
Also read: Indian Polity Study Material: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?
అధికారాలు, విధులు
విధానసభ స్పీకర్‌కు ఉండే అధికారాలు, విధులే పరిషత్ చైర్మన్‌కు ఉంటాయి. సభకు అధ్యక్షత వహించడం, కార్యక్రమాల నిర్వహణ, సభ్యుల క్రమశిక్షణ నియంత్రణ, కార్యక్రమాల వాయిదా, నిర్ణయాత్మక ఓటు హక్కు కలిగి ఉండటం మొదలైనవాటిని ఉదాహరణగా పేర్కొనవచ్చు. ద్రవ్యబిల్లు విషయంలో విధాన సభ స్పీకర్‌కు ప్రత్యేక అధికారం ఉంటుంది. పరిషత్ చైర్మన్‌కు అలాంటి అధికారాలు లేవు.
వివరణ: రాష్ట్ర శాసనసభలోని ప్రక్రియలు, పద్ధతులు, ఇతర వ్యవహారాలు పార్లమెంటు ప్రక్రియతో సమానంగా ఉంటాయి. కోరం, ప్రశ్నోత్తరాలు, తీర్మానాలు, ప్రతిపాదనలు, తదితర విషయాల్లో శాసనసభకు, పార్లమెంటుకు తేడాల్లేవు.
శాసనసభలో అధికార భాష
ఆర్టికల్ 210 ప్రకారం శాసనసభ కార్యక్రమాలను హిందీ లేదా ఆంగ్ల భాష మాధ్యమంలో నిర్వహిస్తారు. అయితే సభాధ్యక్షుల అనుమతితో సభ్యులు మాతృభాషలో కూడా మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రసంగించవచ్చు.
శాసనసభ కమిటీలు: కమిటీల గురించి రాజ్యాంగంలో ప్రత్యక్ష ప్రస్తావన లేదు. అయితే ఆర్టికల్æ 194లో పరోక్షంగా ప్రస్తావించారు. పార్లమెంటులో మాదిరిగానే రాష్ట్ర శాసనసభలో కూడా కమిటీలు ఉంటాయి. కమిటీల నిర్మాణం, సభ్యుల సంఖ్య, విధులను రాష్ట్ర శాసన సభ ఒక చట్టం ప్రకారం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కమిటీల విధులకు సంబంధించి సవరణ చేయాలని ప్రతిపాదించారు.
శాసన నిర్మాణం– పార్లమెంట్, రాష్ట్ర శాసన సభ–పోలికలు, తేడాలు
పార్లమెంటు
- సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
- ఒక బిల్లు చట్టంగా మారడానికి మూడు దశలుంటాయి.
- సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.
- ఒక సభ ఆమోదం పొందిన బిల్లు మరో సభకు వచ్చినప్పుడు, ఆ సభ ఆరు నెలల వరకు ఆ బిల్లును వాయిదా వేయవచ్చు.
- సాధారణ బిల్లు విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారాలు ఉంటాయి.
- ద్రవ్య బిల్లు విషయంలో లోక్ సభదే అంతిమ నిర్ణయం.
- ద్రవ్య బిల్లుపై రాజ్యసభలో చర్చించవచ్చు. ఓటింగ్ అధికారం లేదు. రాజ్యసభ 14 రోజుల్లోగా ద్రవ్య బిల్లుపై తన నిర్ణయాన్ని తెలపాలి.
- రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు.
రాష్ట్ర శాసన సభ
- సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
- ఒక బిల్లు చట్టంగా మారడానికి మూడు దశలు ఉంటాయి.
- ఈ విషయంలో ఉభయసభల మధ్య సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. దిగువ సభ నిర్ణయమే చెల్లుబాటవుతుంది.
- విధాన సభ ఆమోదం పొందిన బిల్లు పరిషత్ ఆమోదానికి వచ్చినప్పుడు, ఆ బిల్లును గరిష్టంగా నాలుగు నెలల వరకు వాయిదా వేయవచ్చు.
- సాధారణ బిల్లు విషయంలోనూ విధాన సభ నిర్ణయమే అంతిమంగా చెల్లుబాటు
- అవుతుంది.
- ద్రవ్యబిల్లు విషయంలో విధాన సభదే అంతిమ నిర్ణయం.
- ద్రవ్యబిల్లుపై విధాన పరిషత్‌లో చర్చించవచ్చు, ఓటింగ్ అధికారం లేదు. విధాన పరిషత్ 14 రోజుల్లోగా ద్రవ్యబిల్లుపై తన నిర్ణయాన్ని తెలపాలి.
- రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపాదించే అధికారం శాసన సభకు లేదు. కానీ పార్లమెంటు ఆమోదించిన కొన్ని రాజ్యాంగ సవరణలను శాసనసభల అంగీకారం కోసం నివేదిస్తారు.
–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు
చదవండి: Indian Polity Practice Test
గతంలో అడిగిన ప్రశ్నలు
1. గవర్నర్‌ను అభిశంసించే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) పార్లమెంట్
బి) రాష్ట్ర అసెంబ్లీ
సి) సుప్రీంకోర్టు
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: డి
2. కింది ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు మహిళ ముఖ్యమంత్రిగా పని చేయలేదు?
ఎ) కర్ణాటక
బి) కేరళ
సి) ఏపీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు?
ఎ) గవర్నర్
బి) ముఖ్యమంత్రి
సి) రాష్ట్రపతి
డి) యూపీఎస్సీ
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో సరైంది?
ఎ) విధాన సభ్యుల సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌కు 10వ స్థానం
బి) విధాన సభ్యుల సంఖ్యాపరంగా తెలంగాణకు 14వ స్థానం
సి) విధాన పరిషత్ సభ్యుల çసంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌కు 5వ స్థానం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీకాలాన్ని ఎన్ని పర్యాయాలు పొడిగించారు?
ఎ) ఒక పర్యాయం
బి) రెండు పర్యాయాలు
సి) మూడు పర్యాయాలు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
3. రాష్ట్ర విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే జరిగే పరిణామం?
ఎ) బిల్లు వీగిపోతుంది
బి) సంయుక్త సమావేశం ఉంటుంది
సి) విధాన సభ నిర్ణయం నెగ్గుతుంది
డి) గవర్నర్ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుంది.
- View Answer
- సమాధానం: సి
4. రాష్ట్ర ఎగువ సభ ఉనికి ఎవరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది?
ఎ) పార్లమెంట్
బి) రాష్ట్రపతి
సి) రాష్ట్ర దిగువ సభ
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
5. దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి?
ఎ) జగ్జీవన్‌రామ్–ఉత్తరప్రదేశ్
బి) కాన్షీరామ్–బిహార్
సి) దామోదరం సంజీవయ్య–ఆంధ్రప్రదేశ్
డి) మాయావతి–ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
6. రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి అందజేయాలి?
ఎ) రాష్ట్రపతి
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) డిప్యూటీ స్పీకర్
- View Answer
- సమాధానం: డి