Skip to main content

APPSC Jobs 2023: గ్రూప్‌2.. కీలక మార్పులు ఇవే!

ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 సర్వీసులు.. ప్రభుత్వ ఉద్యోగార్థులు ఎంతో ఆసక్తి చూపే ఉద్యోగాలు! గ్రూప్‌–2 ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేందుకు లక్షల మంది అహర్నిశలు కృషి చేస్తున్న పరిస్థితి! నోటిఫికేషన్‌ కోసం వేచి చూడకుండా.. పరీక్ష ఎప్పుడు జరిగినా జాబ్‌ కొట్టాలనే లక్ష్యంతో రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు! ఇలాంటి వారికి మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా గ్రూప్‌ 2 పరీక్ష విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. అన్ని నేపథ్యాల అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా .. గ్రూప్‌–2 మెయిన్‌ విధానంలో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 పరీక్ష విధానంలో తాజా మార్పులు, సిలబస్‌ అంశాలు, వాటిపై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం...
Group 2.. These are the key changes!
Group 2.. These are the key changes!

‘గ్రూప్‌–2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఒకే సబ్జెక్ట్‌ను స్క్రీనింగ్, మెయిన్స్‌ రెండింటికీ చదవాల్సి వస్తోంది. దీంతో వారికి విలువైన సమయం వృథా అవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అభ్యర్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా.. వారు ప్రిపరేషన్‌కు సరైన సమయం కేటాయించుకునే ఆస్కారం లభిస్తుంది’ –ఇది ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలో మార్పులపై నిపుణుల అభిప్రాయం.

నిపుణుల కమిటీ సిఫార్సులు
గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్ష సిలబస్, టాపిక్స్, పేపర్ల విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ.. ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం–గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Also read: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

గ్రూప్‌–2 మెయిన్‌.. ఇక రెండు పేపర్లే

  • ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం–గ్రూప్‌–2 ఎంపిక ప్రక్రియలో రెండో దశ అయిన మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో కీలక మార్పులు చేశారు. 
  • ఇంతకాలం మూడు పేపర్లుగా నిర్వహిస్తున్న మెయిన్‌ పరీక్షలో ఇక నుంచి రెండు పేపర్లే ఉంటాయి. 
  • కొత్త విధానం ప్రకారం–ప్రతి పేపర్‌కు 150 మార్కులు చొప్పున మొత్తం 300 మార్కులకు మెయిన్‌ నిర్వహిస్తారు. అంటే ఇకపై రెండు పేపర్లు పేపర్‌1, పేపర్‌2 మాత్రమే ఉంటాయి.
  • మెయిన్‌ పరీక్ష పేపర్‌–1లో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక చరిత్ర, సాంస్కృతిక ఉద్యమాలు; రెండో సెక్షన్‌లో భారత రాజ్యాంగ సమీక్ష సబ్జెక్ట్‌లు ఉంటాయి. 
  • అదేవిధంగా పేపర్‌–2 మొదటి విభాగంలో..భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ; రెండో విభాగంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్ట్‌లు ఉంటాయి.
  • ఇలా రెండు పేపర్ల నేపథ్యంలో.. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు చొప్పున మొత్తం 300 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు.

మూడో పేపర్‌ తొలగింపు
గ్రూప్‌–2 మెయిన్‌ తాజా మార్పుల కోణంలో కీలకమైన అంశం.. ఇప్పటి వరకు ఉన్న మూడో పేపర్‌ను తొలగించడం. ఈ పేపర్‌లో ప్లానింగ్‌ ఇన్‌ ఇండియా, ఇండియన్‌ ఎకానమీ, సమకాలీన సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వంటి అంశాలున్నాయి. ఈ పేపర్‌ పూర్తిగా అకడమిక్‌గా ఎకనామిక్స్‌ నేపథ్యం ఉన్న వారికి అనుకూలంగా ఉందని.. దీని వల్ల ఇతర నేపథ్యాల విద్యార్థులకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీ.. మూడో పేపర్‌ అవసరం లేదని పేర్కొంది. ఈ పేపర్‌ను తొలగించొచ్చని సిఫార్సు చేసింది. దీంతో ఈ మూడో పేపర్‌ను పూర్తిగా తొలగించారు. అయితే దీనికి బదులుగా కొత్తగా పేర్కొన్న పేపర్‌–2లో భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థలను చేర్చారు.

Also read: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

స్క్రీనింగ్‌ టెస్ట్‌.. యధాతథం
గ్రూప్‌–2 ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేర్కొనే స్క్రీనింగ్‌ టెస్ట్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతమున్న విధానంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఒక పేపర్‌గా జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ సబ్జెక్ట్‌లలో 150 మార్కులకు ఉంటుంది. 

రెండుసార్లు చదవాల్సిన శ్రమ లేకుండా

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలో మార్పులు తీసుకోవడానికి ప్రధాన కారణం.. పలు అంశాలు.. తొలి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌తోపాటు, మెయిన్‌ ఎగ్జామ్‌లోనూ పునరావృతం అవుతుండడమే. అభ్యర్థులు కూడా ఆయా టాపిక్స్‌ను స్క్రీనింగ్‌ టెస్ట్‌కు, మెయిన్‌ ఎగ్జామ్‌కు రెండుసార్లు చదవాల్సి వస్తోంది. దీంతో సమయం సరిపోక ఇబ్బంది పడుతున్నారు. 
  • పాత విధానంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌లో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌.. మెయిన్‌ పరీక్షలోనూ ఉంది. సిలబస్‌ అంశాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి.
  • దీంతో అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ను రెండుసార్లు అధ్యయనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల సమయం వృథా అవడమే కాకుండా.. అప్పటికే స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ఈ అంశాలపై నిర్వహించిన పరీక్షలో విజయం సాధించిన వారికి.. రెండో దశలో మళ్లీ ఇవే టాపిక్స్‌ పరీక్ష అవసరం లేదనే ఉద్దేశంతో జనరల్‌ స్టడీస్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.

Also read: APPSC Group 1 Preparation Tips: గ్రూప్‌-1.. గురి పెట్టండిలా!

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చోటు

  • గ్రూప్‌–2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌ మార్పుల్లో మరో ముఖ్యమైన అంశం.. రెండో పేపర్‌లో సెక్షన్‌–2గా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాన్ని కొత్తగా చేర్చడం. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై అవగాహన తప్పనిసరిగా మారింది. దీంతో కొత్తగా ఈ అంశాన్ని చేర్చారు. ఇప్పటివరకు ఉన్న విధానంలో ఏ పేపర్‌లోనూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ టాపిక్‌కు చోటు లేదు. తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఇక సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 
  • మొత్తంగా చూస్తే.. గ్రూప్‌–2 పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభ్యర్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. పరీక్షకు సన్నద్ధమయ్యే వారు తమ సమయాన్ని సమర్థంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే టాపిక్‌ను మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం లేకుండా.. ఆ సమయాన్ని వేరే టాపిక్‌కు కేటాయించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రూప్‌–2 కొత్త ఎంపిక విధానం

  • మొదటి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌: గ్రూప్‌–2లో మొదటి దశగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిటిటీ అంశాలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 
  • రెండో దశ మెయిన్‌ ఇలా: స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పొందిన మార్కులు, ప్రతిభ ఆధారంగా.. 1:50 నిష్పత్తిలో రెండో దశ మెయిన్‌క ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష రెండు పేపర్లుగా 300 మార్కులకే ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది. 

Also read: 730 Posts: సిలబస్‌ + సమకాలీనంతో... సక్సెస్‌

పేపర్‌   సబ్జెక్ట్‌                                              మార్కులు
1          సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ 
            ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని 
            సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు)
            సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్ష      150
2          సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ
            సెక్షన్‌–2: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ        150
            మొత్తం                                               300

పట్టు సాధించడానికి మార్గాలివే
హిస్టరీ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా.. భారత జాతీయోద్యమంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యమాలకు సంబంధించి ఆంధ్ర జనసంఘం, ఆంధ్రమహాసభల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. వారి ఆధ్వర్యంలో జరిగిన సభలు, సమావేశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. విశాలాంధ్ర ఉద్యమానికి సంబంధించి పెద్దమనుషుల ఒప్పందంలోని కీలక అంశాలు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రాచీన చరిత్రకు సంబంధించి శాతవాహనుల కాలం నుంచి తూర్పు చాళుక్యుల వరకు.. అన్ని రాజ వంశాల కాలంలో ముఖ్య ఘట్టాలు, కళలు, సాహిత్యాభివృద్ధికి చేసిన కృషి, ముఖ్యమైన నిర్మాణాలు–వాటి విశిష్టత (ఉదా: బౌద్ధ స్థూపాలు) గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. 

Also read: APPSC Group 1, 2 Preparation Tips : గ్రూప్‌–1, 2 పోస్టుల పూర్తి వివరాలు ఇవే.. గ్రూప్స్ కొట్టాలంటే.. ఇలా చ‌ద‌వాల్సిందే..

పాలిటీ
గ్రూప్‌–2 మెయిన్‌ పేపర్‌–2లో సెక్షన్‌–2గా పేర్కొన్న భారత రాజ్యాంగ సమీక్ష విషయంలో పాలిటీపై పట్టు సాధించాలి.భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు; ప్రవేశిక; ప్రాథమిక విధులు; ప్రాథమిక హక్కులు; ఆదేశిక సూత్రాలు; భారత సమాఖ్య; విశిష్ట లక్షణాలు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన; శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రలపై నిర్దేశిత సిలబస్‌ ప్రకారం–లోతుగా అధ్యయనం చేయాలి. పంచాయతీరాజ్‌ వ్యవస్థ; 73,74 రాజ్యాంగ సవరణలు; వాటి ప్రాముఖ్యత; తేదీలు వంటి వాటిపై దృష్టి సారించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక విధుల విభజన, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు గురించి రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణలను అధ్యయనం చేయాలి. కేంద్ర–రాష్ట్ర సంబంధాల విషయంలో అవసరమైన సంస్కరణలు, ఆయా కమిషన్ల సిఫార్సులు(ఉదా: రాజ్‌మన్నార్‌ కమిటీ, సర్కారియా కమిషన్‌ తదితర)అధ్యయనం చేయాలి. ఆయా రాజ్యాంగ పదవులు (రాష్ట్రపతి, గవర్నర్‌),నియామకం తీరుతెన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తాజాగా రాజ్యాంగ సవరణల ద్వారా రూపొందిన కొత్త చట్టాలపై అవగాహన మేలు చేస్తుంది. 

భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ
గ్రూప్‌–2 మెయిన్‌ పేపర్‌–2లో సెక్షన్‌–1గా ఉన్న ఈ అంశానికి సంబంధించి భారత్‌లో పంచవర్ష ప్రణాళికల నుంచి ప్రారంభించి తాజా ఆర్థిక పరిణామాల వరకు.. అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. 1956 నుంచి అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ఆర్‌బీఐ ఏర్పాటు, నూతన విదేశీ వాణిజ్య విధానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి దేశంలో సహజ వనరుల లభ్యత, ఆర్థికాభివృద్ధి దిశగా అవి దోహదపడుతున్న తీరుపై అధ్యయనం చేయాలి. కోర్‌ ఎకానమీకి సంబంధించి ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్‌ ఫైనాన్స్‌ల నిర్వచనాలు–సిద్ధాంతాలు తెలుసుకోవాలి. అదే విధంగా జాతీయాదాయ భావనలు, జీడీపీ, తలసరి ఆదాయం వంటి బేసిక్‌ కాన్సెప్ట్‌లపై పరిపూర్ణ అవగాహన అవసరం. వీటికితోడు ఆర్థిక రంగంలో తాజా పరిణామాల గురించి కూడా చదవాలి. ఆర్థిక సంఘం సిఫార్సులు, తాజా బడ్జెట్‌ గణాంకాలు వంటి వాటిపై అవగాహన పొందాలి.

Also read: APPSC Group 2 Notification 2022 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..


ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీకి సంబంధించి సహజ వనరుల లభ్యత మొదలు సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాల వరకూ.. అన్నింటినీ అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలోని ముఖ్యమైన వనరులు, అవి లభించే ప్రాంతాలు, పంటలు–దిగుబడి కారకాల గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో పంచవర్ష ప్రణాళికల అమలు తీరుతెన్నులపై అధ్యయనం చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ–లక్ష్యాలు– లోపాలు–నివారణ మార్గాల గురించి అవగాహన ఉండాలి. విద్యుత్, రవాణా –కమ్యూనికేషన్, పర్యాటక రంగం, ఇన్ఫర్మేషన్‌ రంగం వంటి సర్వీస్‌ సెక్టార్‌ సంస్థల గురించి క్షుణ్నంగా చదవాలి. ఎకానమీలో పట్టు సాధించడం కోసం అభ్యర్థులు మానవాభివృద్ధి సూచీలలోని వివిధ ఇండికేటర్స్‌ పరిశీలించాలి. రాష్ట్ర ఆర్థిక సర్వే గణాంకాలు, కేంద్ర ఆర్థిక సర్వే గణాంకాల్లో రాష్ట్రాల వారీగా పేర్కొన్న గణాంకాలు సేకరించి ఔపోసన పట్టాలి. అదే విధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు, బడ్జెట్‌ కేటాయింపులపై అవగాహన ఏర్పరచుకోవాలి. 

Also read: TSPSC&APPSC Groups: 'ఇండియన్ పాలిటీ'ని ఎలా ప్రిపేర‌వ్వాలి? ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారు?

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
గ్రూప్‌–2 మెయిన్‌లో పేపర్‌2లో కొత్తగా చేర్చిన టాపిక్‌.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. దీనిపై పట్టు సాధించడం కోసం అభ్యర్థులు భారత అభివృద్ధిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర; మోడ్రన్‌ ట్రెండ్స్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌; అభివృద్ధి, వాతావరణ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. కోర్‌ సైన్స్‌ అంశాలపైనా పట్టు సాధించాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్‌లో ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలు, వాటి అనువర్తనాలు, ప్రమాణాల గురించి తెలుసుకోవాలి. దేశ శాస్త్ర సాంకేతిత రంగంలో తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఇస్రో ప్రయోగాలు, డీఆర్‌డీఓ , క్షిపణి వ్యవస్థ, ఆయుధ వ్యవస్థల గురించి తెలుసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.

Also read: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి

Published date : 26 Jan 2023 02:30PM

Photo Stories