Skip to main content

Indian Polity: రాజ్యాంగ వికాసంలో భాగమైన చట్టాలు..

భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్నరాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, ఉద్యమాలు, సంస్కరణలు దోహదం చేశాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ చరిత్రలోని ముఖ్య ఘట్టాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
Indian Polity notes for groups
Indian Polity notes for groups

భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం
భారతదేశంలో 1773–1857 మధ్యకాలంలో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం, ఇతర వ్యవహారాలను నిర్వహించింది. వీటిని నియంత్రిచడానికి బ్రిటిష్‌ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వీటినే ‘చార్టర్‌ చట్టాలు’ అంటారు. వీటి గురించి పరిశీలిద్దాం..

Also read: Indian Polity: రాష్ట్ర విధాన పరిషత్‌ బిల్లును తిరస్కరిస్తే..

రెగ్యులేటింగ్‌ చట్టం–1773
రెగ్యులేటింగ్‌ చట్టానికి రాజ్యాంగ వికాసపరంగా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్‌ పార్లమెంట్‌ చేసిన తొలి చట్టం ఇదే. అందువల్ల దీన్ని భారతదేశానికి సంబంధించి ‘మొట్టమొదటి లిఖిత చట్టం’(ఊజీటట్ట గిటజ్టీ్ట్ఛn ఇజ్చిట్ట్ఛట)గా పేర్కొంటారు. అంతకుముందు వరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్టిండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ పరిపాలన, అధికారాలు సంక్రమించాయి. దీంతో భారతదేశంలో ‘కేంద్రీకృత పాలన’కు బీజం పడిందని చెప్పవచ్చు.
ముఖ్యాంశాలు

 • ఈ చట్టాన్ని 1773 మే 18న నాటి బ్రిటన్‌ ప్రధాని లార్డ్‌ నార్త్‌ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించే ఉద్దేశంతో రూపొందించడం వల్ల దీన్ని ‘రెగ్యులేటింగ్‌ చట్టం’ అంటారు.
 • బెంగాల్‌ గవర్నర్‌ హోదాను ‘గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ బెంగాల్‌’గా మార్చారు. ఇతడికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ‘వారన్‌ హేస్టింగ్స్‌’ను తొలి గవర్నర్‌ జనరల్‌గా నియమించారు.
 • బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల గవర్నర్లను బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌కు ఆధీనులుగా చేశారు.
 • కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ‘ఎలిజా ఇంఫే’.
 • ఈస్టిండియా కంపెనీపై బ్రిటిష్‌ ఆధిపత్యాన్ని మరింతగా పెంచడానికి తమ రెవెన్యూ, పౌర, సైనిక వ్యవహారాల్లో కంపెనీ కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేశారు.
 • కంపెనీ అధికారుల వ్యాపార లావాదేవీలను నిషేధించారు. వారు ప్రజల నుంచి లంచాలు, బహుమతులను స్వీకరించకుండా కట్టడి చేశారు.
 • ఇరవై ఏళ్ల వరకు ఈస్టిండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చారు. 

రెగ్యులేటింగ్‌ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీని ఆశించినంతగా నియంత్రించలేకపోయారు. కేంద్రీకృత పాలనను నిరోధించడం, అధికార సమతౌల్యం లాంటి ప్రయోజనాలు నెరవేరలేదు. అదేవిధంగా గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక పరిధిపై స్పష్టత ఏర్పడలేదు.

Also read: Indian Polity Study Material: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?

పిట్‌–ఇండియా చట్టం–1784
రెగ్యులేటింగ్‌ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్‌ పార్లమెంటు ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. నాటి బ్రిటన్‌ ప్రధాని ‘విలియం పిట్‌’ ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. అందువల్ల∙దీన్ని ‘పిట్‌ ఇండియా చట్టం’గా వ్యవహరిస్తారు.
ముఖ్యాంశాలు

 • ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించారు.
 • ‘బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి కంపెనీ రాజకీయ వ్యవహారాలను దీనికి అప్పగించారు. అప్పటికే ఉన్న కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు.
 • గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలోనూ కొన్ని మార్పులు చేశారు.
 • కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గించారు.
 • ఈ చట్టం వల్ల కంపెనీ పాలనపై ఒక విధమైన అదుపు ఏర్పడింది. కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్, బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అనే రెండు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల పిట్‌ ఇండియా చట్టాన్ని ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టంగా చెప్పవచ్చు. ‘పార్లమెంటేతర నియంత్రణకు తొలి అడుగు’గా ఈ చట్టాన్ని ప్రస్తావిస్తారు. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా మార్క్స్, ఎంగిల్స్‌ అభివర్ణించారు.

Also read: Fundamental Rights of India: ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?

చార్టర్‌ చట్టం–1793

 • ఈ చట్టం ద్వారా గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అధికారాలను విస్తృతం చేశారు.
 • కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరో 20 ఏళ్లకు పొడిగించారు.
 • బోర్డు కార్యదర్శిని పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతించారు.

చార్టర్‌ చట్టం–1813

 • ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో ఇరవై ఏళ్లు పొడిగించారు.
 • భారతదేశ వర్తకంపై కంపెనీ గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పాలనాపరమైన సంస్థగా మార్చారు.
 • పన్నులు విధించడం, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
 • భారతీయులకు మత, విద్యాపరమైన అధ్యయనం కోసం లక్ష రూపాయలతో నిధి ఏర్పాటు చేశారు. సివిల్‌ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు.
 • చట్టం ద్వారా భారత్‌లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు. భారత్‌లో మిషనరీలు ప్రవేశించి చర్చిలు, ఆసుపత్రులు, విద్యాలయాలు స్థాపించడం వల్ల మతమార్పిడులకు వెసులుబాటు కలిగింది.

Also read: Indian Polity Study Material: ప్రజా పదవుల దుర్వినియోగాన్ని ప్రశ్నించే కోవారంటో ఏది?

చార్టర్‌ చట్టం–1833

 • ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లకు పొడిగించారు.
 • బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ హోదాను ఈ చట్టం ద్వారా ‘ఇండియన్‌ గవర్నర్‌ జనరల్‌’గా మార్చారు. ఈ హోదాలో మొదటి భారత గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటింగ్‌.
 • రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలు రద్దయ్యాయి. కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్‌ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలు లభించాయి.
 • కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
 • సివిల్‌ సర్వీసుల నియామకాల్లో సార్వజనిక పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
 • భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ ‘లా’ కమిషన్‌ను నియమించారు. దీనికి తొలి అధ్యక్షుడు లార్డ్‌ మెకాలే.
 • ఈ చట్టాన్ని భారతదేశంలో ‘కేంద్రీకృత పాలనకు తుదిమెట్టు’గా అభివర్ణిస్తారు.

Also read: Fundamental Rights (Article 28-32): ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త ఎవ‌రు?

చార్టర్‌ చట్టం–1853
చార్టర్‌ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్‌ చట్టం ఇదే. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి చార్టర్‌ చట్టాలను పొడిగించడం అనే ఆనవాయితీ ప్రకారం దీన్ని రూపొందించారు. కానీ దీని ద్వారా కంపెనీ పాలనను పొడిగించలేదు. దీంతో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయింది.

 • ముఖ్యాంశాలు
 • గవర్నర్‌ జనరల్‌ సాధారణ మండలి అధికారాలను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు. శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ‘ఇండియన్‌ సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ పార్లమెంటులా విధులు నిర్వర్తిస్తుంది. అందువల్ల దీన్ని ‘మినీ పార్లమెంట్‌’గా పేర్కొంటారు.
 • కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యుల్లో.. మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరి చొప్పున నలుగురిని తీసుకున్నారు.
 • సివిల్‌ సర్వీసు నియామకాల్లో ‘సార్వజనిక పోటీ విధానం’ ప్రవేశపెట్టారు. దీనికోసం 1854లో లార్డ్‌ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
 • వివిధ ‘లా కమిషన్‌’ల సిఫారసుల ద్వారా సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (1859), ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (1860), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (1861)ను రూపొందించారు.
 • కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధి పేర్కొనకపోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి చార్టర్‌ చట్టం మార్గం సుగమం చేసిందని భావిస్తారు. భారతీయులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల తర్వాత జరిగిన పరిణామాలు సిపాయిలు తిరుగుబాటుకు దారితీశాయి.

బ్రిటిష్‌ రాణి లేదా రాజు పాలన (1858 –1947)

1858 నుంచి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల ఆ తర్వాత చేసిన చట్టాలను/సవరణలను ‘భారత ప్రభుత్వ చట్టాలు’ లేదా ‘కౌన్సిల్‌ చట్టాలు’ అంటారు.

Also read: Indian Geography Bit Bank: అరిచే జింకలు ఉన్న జాతీయ పార్కు ఏది?

భారత రాజ్యాంగ చట్టం–1858
1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పాలన అంతమై చక్రవర్తి (బ్రిటిష్‌ రాజు/రాణి) పరిపాలన వచ్చింది. ఇది భారత రాజ్యంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. బ్రిటిష్‌ రాణి 1858 నవంబర్‌ 1న భారత పరిపాలనా అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేసింది. 
ముఖ్యాంశాలు
గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా హోదాను వైస్రాయ్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్‌ చార్లెస్‌ కానింగ్‌.

 • దేశంలో బ్రిటిష్‌ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి వైస్రాయ్‌. ఇతడు బ్రిటిష్‌ రాణి పేరుపై దేశ పాలన నిర్వహిస్తాడు.
 • 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్, కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అనే ద్వంద్వ పాలన రద్దయింది.
 • భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్‌ని రాజ ప్రతినిధిగా 5 ఏళ్ల కాలానికి నియమించారు. ఇతడికి సహాయంగా ఒక కార్యనిర్వాహక మండలి ఉండేది.
 • ‘భారత రాజ్య కార్యదర్శి’ అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతడు బ్రిటిష్‌ మంత్రివర్గానికి చెందిన వ్యక్తి. అన్ని విషయాల్లో ఇతడిదే తుది నిర్ణయం. ఇతడికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి చార్లెస్‌ వుడ్‌.

Also read: Telangana History Bit Bank: ‘నిజాం కాలేజీ’ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

ప్రత్యేక వివరణ:
వైస్రాయ్, గవర్నర్‌ జనరల్‌ అనే రెండు హోదాలు ఒకరికే ఉంటాయి. బ్రిటిష్‌ రాజు/రాణి ప్రతినిధిగా ఉంటే వైస్రాయ్‌గా, భారతదేశ పాలనాపరంగా అధిపతిగా ఉంటే గవర్నర్‌ జనరల్‌గా వ్యవహరిస్తారు. దేశంలో పాలనాపరమైన అంశాలను.. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నియంత్రించడానికి 1858 చట్టాన్ని చేశారని, వీటికి సంబంధించిన మార్పులను ఇంగ్లండులో చేశారేగానీ, భారత్‌లోని పాలనా వ్యవస్థలకు ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శకుల అభిప్రాయం.
–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు


చ‌ద‌వండి: Indian Polity Practice Test

గతంలో అడిగిన ప్రశ్నలు


చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

 

Published date : 31 Jan 2023 02:32PM

Photo Stories