Job Trends 2022: ఆ రెండు రంగాల్లో.. కొలువుల పండగే!
జాబ్ మార్కెట్లో.. కొలువుల అన్వేషణ సాగిస్తున్న వారికి.. శుభవార్త! ఈ ఏడాది.. ఈ–కామర్స్, స్టార్టప్ విభాగాల్లో.. భారీ స్థాయిలో నియామకాలు జరుగుతాయని.. నాస్కామ్ సహా పలు సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి!! చదివిన డిగ్రీతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ ఉద్యోగం దక్కించుకునే అవకాశం ఉంది. జాబ్ మార్కెట్లో అడుగుపెడుతున్న యువత.. ఈ రంగాలకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఇట్టే కొలువులు దక్కించుకోవచ్చు. 2022లో ఈ–కామర్స్, స్టార్టప్ విభాగాల్లో నియామకాలపై ఇటీవల పలు సర్వేల అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఈ కామర్స్, స్టార్టప్ రంగాల్లో హైరింగ్ ట్రెండ్స్, హోదాలు, అర్హతలు, నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ..
- ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థల్లో భారీగా నియామకాలు
- గత ఏడాదితో పోల్చితే పెరగనున్న ఉద్యోగాల సంఖ్య
- డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ నుంచి డేటా ఇంజనీర్స్ వరకు..
స్టేషనరీ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు.. గ్రాసరీస్ నుంచి హైఎండ్ గ్యాడ్జెట్స్ దాకా.. అంతా ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ కాలంలో.. ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాలు విస్తరించాయి. దీంతో ఈ–కామర్స్ సంస్థలు పురోగతి సాధిస్తూ.. ఉద్యోగావకాశాల కల్పనలోనూ ముందుంటున్నాయి. మరోవైపు దేశంలో ఎడ్యుకేషన్ నుంచి ఇంధనం వరకూ.. అనేక రంగాల్లో స్టార్టప్ సంస్థలు ఏర్పడుతున్నాయి. వాటికి ఫండింగ్ కూడా పెరుగుతోంది. దీంతో.. ఈ విభాగంలోనూ కొత్త కొలువులు యువతకు స్వాగతం పలుకుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థల నియామక ప్రణాళికలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, ఈ–కామర్స్, ఆన్‌లైన్ గ్రాసరీ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి.
Social Sector Jobs: కార్పొరేట్ జాబ్స్ వదిలి.. సోషల్ సెక్టార్ వైపు అడుగులు వేస్తున్న యువత!
ఈ–కామర్స్.. షైనింగ్
- ఈ–కామర్స్ రంగంలో 2022లో భారీగా నియామకాలు జరగడం ఖాయమని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ స్టాఫింగ్ అండ్ రిక్రూట్‌మెంట్ సంస్థ టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం–2022లో ఈ రంగంలో నియామకాలు 32 శాతం మేర పెరగనున్నాయి. గత ఏడాది కొత్త నియామకాలు 21 శాతం మేర జరిగాయని సదరు నివేదిక స్పష్టం చేసింది. ఈ–కామర్స్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవడానికి.. ఈ రంగం గత రెండేళ్లుగా గణనీయ వృద్ధి నమోదు చేసుకోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్, వినియోగదారుల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు మక్కువ పెరుగుతున్న కారణంగా.. ఈ–కామర్స్ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి.
- 2020లో 8 శాతం వృద్ధి రేటు సాధించిన ఈ–కామర్స్ రంగం.. 2021లో దాదాపు నాలుగింతల వృద్ధి (30 శాతం) నమోదు చేసుకుంది. దీంతో.. ఒకవైపు పెరుగుతున్న కార్యకలాపాలు, మరోవైపు వినియోగదారులకు సమర్థవంతంగా సేవలందించే క్రమంలో.. కొత్త నియామకాలకు ఈ–కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నాయి.
- ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, వేదాంతు వంటి యూనికార్న్ హోదా పొందిన ఈ–కామర్స్ సంస్థలు.. తమ నియామక ప్రణాళికలు ప్రకటించాయి. వీటి ప్రకారం–ఈ ఏడాది ఆయా సంస్థల్లో దాదాపు లక్షన్నర కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
- దేశంలో ఉన్న ఇతర ఈ–కామర్స్ కంపెనీలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
స్టార్టప్‌లదీ ఇదే తీరు
స్టార్టప్ సంస్థలు సైతం నూతన నియామకాల విషయంలో దూకుడుగా ముందుకు సాగుతున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నాస్కామ్–జిన్నోవ్ నివేదిక ప్రకారం–గత ఏడాది(2021) దేశ వ్యాప్తంగా కొత్తగా 2,250 స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. కోవిడ్ ముందు పరిస్థితులతో పోల్చితే రెండింతలు ఎక్కువగా రూ.1.78 లక్షల కోట్ల మేర నిధులను సమీకరించాయి. ఉపాధి విషయానికొస్తే.. గత దశాబ్దంలో స్టార్టప్స్ పరిశ్రమ.. ప్రత్యక్షంగా 6.6 లక్షలు, పరోక్షంగా 34.1 లక్షల మందికి ఉపాధి కల్పించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఎడ్‌టెక్, రిటైల్, రిటైల్ టెక్, ఫుడ్‌టెక్, సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, మొబిలిటీ విభాగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఇదే తీరు 2022లోనూ కొనసాగుతుందని.. సగటున 15 శాతంతో స్టార్టప్ సంస్థల్లో వృద్ధి కనిపిస్తుందని.. ఆ మేరకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది కొత్తగా స్టార్టప్ రంగంలో దాదాపు లక్ష కొలువులు లభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
స్టార్టప్‌లకు టాలెంట్ కొరత
దేశంలోని పలు స్టార్టప్ సంస్థలు ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన స్టార్టప్ ఆఫర్లను తిరస్కరించడమే. ఏయాన్ సంస్థ నివేదిక ప్రకారం– స్టార్టప్ ఆఫర్లు తిరస్కరిస్తున్న వారి సంఖ్య సగటున 25 శాతంగా ఉంటోంది. దీంతో సదరు సంస్థలు టాలెంట్‌ను ఆకర్షించేందుకు వేతనంతోపాటు బోనస్, జీతాల్లో పెంపుదలపై ముందస్తు హామీ ఇస్తున్నాయి. అందుకే కొద్దిపాటి నైపుణ్యాలుంటే.. స్టార్టప్ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
డెలివరీ టు.. డేటా మైనింగ్
- ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థల్లో లభించనున్న హోదాల విషయానికొస్తే.. కింది స్థాయిలో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ నుంచి కీలకమైన డైటా మైనింగ్, డేటా సైన్స్ వరకు దాదాపు వివిధ జాబ్ ప్రొఫైల్స్‌లో నియామకాలు జరగనున్నాయి.
- ఈ–కామర్స్ సంస్థల్లో.. వేర్‌హౌస్ ఆపరేషన్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సపోర్ట్ సర్వీస్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్‌మెంట్, బ్లాక్‌చైన్ వంటి విభాగాల్లో అధిక శాతం కొలువులు లభించనున్నాయి.
- స్టార్టప్ సంస్థల్లోనూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలు దక్కనున్నాయి.
- ఈ రెండు రంగాల్లోనూ ఫుల్‌స్టాక్ డెవలపర్స్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, ప్రిన్సిపల్ ఇంజనీర్స్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.
Wipro Elite Test: ఇంజనీరింగ్ విద్యార్థులకు చక్కటి అవకాశం.. రూ.3.5 లక్షల ప్యాకేజీ
వేతనాలు ఆకర్షణీయం
- ఫ్రెషర్స్‌కు టెక్నికల్ డొమైన్స్‌లో సగటున రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ వేతనం ఇచ్చేందుకు ఈ–కామర్స్ సంస్థలు సిద్ధంగా ఉండగా.. స్టార్టప్ సంస్థల్లో సగటున రూ.అయిదు లక్షల వేతనం లభించనుంది.
- మూడు నుంచి నాలుగేళ్ల అనుభవం, టెక్ నైపుణ్యాలున్న వారికి కీలక హోదాల్లో నియమించి రూ.పది లక్షలకుపైగా ప్రారంభ వేతనం అందించేందుకు యూనికార్న్ ఈ–కామర్స్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
ఫ్రెషర్స్ కోసం.. క్యాంపస్‌లవైపు
భారీ నియామక ప్రణాళికలతో అడుగులు వేస్తున్న ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు.. తమ అవసరాలకు సరితూగే నైపుణ్యాలున్న యువత కోసం క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు రానున్న ఆరు నెలల్లో మొత్తం నియామకాల్లో 41 శాతం మేరకు క్యాంపస్ డ్రైవ్స్ ద్వారానే చేపట్టనున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యూనికార్న్ సంస్థలుగా గుర్తింపు పొందిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, అప్‌గ్రాడ్, రుపీక్, క్రెడ్‌ఎవెన్యూ వంటి సంస్థలు గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం రెట్టింపు స్థాయిలో క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నాయి. ఇవి ముందుగా ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లోని విద్యార్థుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ గత ఏడాది కంటే 2.5 రెట్లు, అప్‌గ్రాడ్ సంస్థ 4 రెట్లు, మీషో సంస్థ రెండు రెట్లు అధికంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేయనున్నాయి.
Tech Skills: ఎథికల్ హ్యాకింగ్‌లో పెరుగుతున్న డిమాండ్.. అర్హతలు, నైపుణ్యాలు..
టెక్ స్కిల్స్‌కు ప్రాధాన్యం
ఈ–కామర్స్, స్టారప్ సంస్థలు అన్ని విభాగాల్లోనూ నియామకాలు చేపడుతున్నప్పటికీ.. టెక్ స్కిల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్ అండ్ వీఆర్ స్కిల్స్ ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నాయి. అదే విధంగా మేనేజ్‌మెంట్‌కు సంబంధించి సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, బిజినెస్ ఫైనాన్స్ నైపుణ్యాలున్న వారికి పెద్ద పీట వేస్తున్నాయి.
డొమైన్‌తోపాటు.. ఇవి తప్పనిసరి
ఆయా హోదాలకు తగినట్లుగా డొమైన్, టెక్ స్కిల్స్‌ను నిర్దేశిస్తూ నియామకాలు చేపడుతున్న సంస్థలు.. అభ్యర్థుల్లోని ఇతర నైపుణ్యాలపైనా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. అనలిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పాజిటివ్ అటిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలున్న వారి కోసం అన్వేషిస్తున్నాయి.
Banking, Financial Services and Insurance Sectors: బీఎఫ్‌ఎస్‌ఐ.. నియామకాల జోరు!
సంప్రదాయ డిగ్రీతో కొలువు
సంప్రదాయ డిగ్రీ అర్హత ఉన్న యువతకు.. ఈ–కామర్స్ సంస్థల్లో ఆన్‌లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్; ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం; డెలివరీ అసోసియేట్స్; ప్యాకర్స్; లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్; ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్; కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్; వేర్‌హౌస్ సూపర్‌వైజర్స్/మేనేజర్స్, డెలివరీ హబ్ మేనేజర్స్ వంటి హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ హోదాల్లో.. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్యాకర్స్, ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్/కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలను పదో తరగతి మొదలు సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు సైతం సొంతం చేసుకోవచ్చు.
ఆఫ్–క్యాంపస్ నియామకాలు
- ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు ఆఫ్–క్యాంపస్ విధానంలోనూ నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ను ఇందుకు మార్గంగా చేసుకోనున్నాయి. జాబ్ పోర్టల్స్, సంస్థల వెబ్‌సైట్స్ ద్వారా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి.. ఆఫ్–క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేపట్టే విధంగా అడుగులు వేస్తున్నాయి.
- మొత్తంగా చూస్తే.. 2022 సంవత్సరంలో ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు యువతకు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తాయని.. వీటిని యువత అందిపుచ్చుకునేలా నైపుణ్యాలు పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ–కామర్స్, స్టార్టప్.. రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్
- ఈ ఏడాది ఈ–కామర్స్‌లో 32 శాతం మేరకు పెరగనున్న నియామకాలు.
- స్టార్టప్ సంస్థల్లోనూ పది లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు.
- మొత్తం నియామకాల్లో టెక్ ప్రొఫైల్స్‌లోనే 60 శాతంపైగా ఉద్యోగాలు.
- సగటున రూ.ఆరు లక్షల నుంచి రూ.10 లక్షల వేతనం ఆఫర్ చేస్తున్న యూనికార్న్ స్టార్టప్స్.
- స్టార్టప్ సంస్థల్లో సగటున రూ.అయిదు లక్షల వేతనం.
అర్హతలు, నైపుణ్యాలు
- డొమైన్ నాలెడ్జ్.
- డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ఏఆర్ అండ్ వీఆర్, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నికల్ స్కిల్స్.
- సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు.
- కమ్యూనికేషన్ స్కిల్స్,ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్.
- అనలిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పాజిటివ్ అటిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి వ్యక్తిగత నైపుణ్యాలు ఉండాలి.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్