Skip to main content

Social Sector Jobs: కార్పొరేట్‌ జాబ్స్‌ వదిలి.. సోషల్‌ సెక్టార్‌ వైపు అడుగులు వేస్తున్న యువత!

మన దేశంలో.. నేటికీ సామాజిక అభివృద్ధి పరంగా ఎన్నో సమస్యలు! కనీస అవసరాలుగా భావించే విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు అందడంలో అనేక ఆటంకాలు!! ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నా.. వాటిని క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేసే నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది! కార్పొరేట్‌ కంపెనీలు.. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా సామాజిక ప్రగతికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆయా సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల అమలులోనూ మానవ వనరుల కొరత వెంటాడుతోంది! ఈ నేపథ్యంలో.. సామాజిక రంగంలో అవకాశాలు, అందుకునేందుకు మార్గాలు, అందుబాటులో ఉన్న కోర్సుల గురించి తెలుసుకుందాం...
social sector job opportunities
social sector job opportunities

కార్పొరేట్‌ జాబ్స్‌ వదిలి..

 • ఉన్నత స్థాయి పదవులు సైతం వదులుకుని స్వచ్ఛంద సంస్థల్లో చేరుతున్న టాప్‌ కంపెనీల ఉన్నతాధికారులు.. ఇవీ.. ఇటీవల కాలంలో వినిపిస్తున్న వార్తలు! సోషల్‌ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ ప్రాధాన్యత, అదేవిధంగా ఈ రంగంలో సేవల వల్ల వ్యక్తిగతంగా, వృత్తి పరంగా సంతృప్తి లభిస్తుందనడానికి ఇవే నిదర్శనాలు!!
 • దేశంలో సోషల్‌ సెక్టార్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో వేల సంఖ్యలో మానవ వనరుల కొరత నెలకొందని ఐఎల్‌ఓ, యునెస్కో వంటి సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌–19 కారణంగా గ్రామీణ భారతం కుదేలైన పరిస్థితుల్లో, వారికి ప్రభుత్వ పథకాలు చేరేలా చూసే నిపుణుల అవసరం ఏర్పడింది. అవస్థలకు గురవుతున్న పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే.. క్షేత్ర స్థాయిలో అమలుచేసే సిబ్బంది కావాలి.దీంతో ఇప్పుడు సోషల్‌ సెక్టార్,రూరల్‌ డెవలప్‌మెంట్‌..యువతకు చక్కటి ఉపాధి వేదికలుగా మారాయని నిపుణులు అంటున్నారు.


చ‌ద‌వండి: Technology Jobs: బ్లాక్‌చైన్‌ డెవలపర్‌.. ఐబీఎం, అసెంచర్ వంటి కంపెనీల్లో ఉద్యోగం.. ల‌క్షల్లో వేత‌నం..


కార్యక్రమాలు.. అవకాశాలు
దేశంలో సామాజిక రంగం అభివృద్ధికి, సామాజిక సేవకు సంబంధించి పలు వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్‌ పరిస్థితులు.. ఎన్‌జీవోల కార్యకలాపాలు.. సీఎస్‌ఆర్‌ అమలు వంటి వాటి కారణంగా ఈ రంగంలో వేల సంఖ్యలో కొలువులు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్‌ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు(ఎన్‌జీవోలు)..తాము చేపడుతున్న సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసే నిపుణులైన మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. తగిన అర్హతలున్న వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

ఎన్‌జీఓలు..
సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, అందుకు సంబంధించిన వేదికలు అనగానే మనకు గుర్తొచ్చేవి.. స్వచ్ఛంద సంస్థలే(ఎన్‌జీఓ). వీటితోపాటు సోషల్‌ సెక్టార్‌లో లభిస్తున్న ఉద్యోగాలు...» ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ » కౌన్సెలర్, ట్రైనర్స్, ప్రోగ్రామ్‌ మేనేజర్‌/ఎగ్జిక్యూటివ్, ఫండ్‌ రైజర్, మానిటరింగ్‌/ఎవాల్యుయేషన్‌ ఆఫీసర్, రీసెర్చర్, ప్రోగ్రా మ్‌ డైరెక్టర్‌ వంటివి.

ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌..
ఏదైనా ఒక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంస్థ.. వాటిని ప్రాథమిక స్థాయిలో పర్యవేక్షించే విధంగా ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించుకుంటోంది. ఇంటర్మీడియెట్, లేదా డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలు అందుకోవచ్చు.

కౌన్సెలర్‌..
ఏదైనా ఒక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం అమలు చేయాలంటే.. ముందుగా ఆ ప్రాంత ప్రజలను మెప్పించడం, ఒప్పించడం ఎంతో ప్రధానం. ఇందుకోసం సంస్థలు కౌన్సెలర్స్‌ను నియమిస్తున్నాయి. ఆయా సంస్థలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, అందులో సంబంధిత ప్రాంత ప్రజలు పాల్పంచుకోవాల్సిన తీరుపై కౌన్సెలర్స్‌ అవగాహన కల్పిస్తారు. వాస్తవానికి ఇది అత్యంత కీలకమైన ఉద్యోగంగా పేర్కొనొచ్చు. సంస్థలు ఈ ఉద్యోగాలకు సోషల్‌ వర్క్, సోషియాలజీ, సైకాలజీ వంటి కోర్సులు పూర్తిచేసిన వారినే ఎక్కువగా నియమించుకుంటున్నాయి. వేతనాలు నెలకు సగటున రూ.20 వేల వరకు లభిస్తున్నాయి.

ట్రైనర్స్‌..
సోషల్‌ డెవలప్‌మెంట్‌ సెక్టార్‌లో మరో కీలకమైన ఉద్యోగం.. ట్రైనర్స్‌. ముఖ్యంగా వ్యవసాయం, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల పరంగా..లక్షిత వర్గాల ప్రజలకు సంబంధిత అంశాల గురించి శిక్షణనివ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ రంగంలో ఆధునిక సాగు పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించే విధానాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించడం వంటివి. సంస్థలు, ఆయా విభాగాల్లో పీజీ పూర్తిచేసిన వారిని(ఉదాహరణకు ఎమ్మెస్సీ అగ్రికల్చర్, ఎంఏ ఎకనామిక్స్‌ తదితర) నియమిస్తున్నాయి. వీరికి నెలకు సగటున రూ.30వేల వరకు వేతనం అందిస్తున్నాయి.

ప్రోగ్రామ్‌ మేనేజర్‌/ఎగ్జిక్యూటివ్‌..
అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణ దిశగా నిర్దిష్టంగా ఒక ప్రాంత పరిధిలో వాటిని సమర్థంగా నిర్వహించేందుకు ప్రోగ్రామ్‌ మేనేజర్స్‌ను సంస్థలు నియమిస్తున్నాయి. వీరు సంబంధిత క్లస్టర్లలో అమలవుతున్న ప్రోగ్రామ్స్‌ను, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వహిస్తున్న తీరును పరిశీలిస్తారు. అవసరమైతే మార్పులు,చేర్పులు సూచిస్తారు. వీరికి నెలకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు వేతనం లభిస్తుంది.

ఫండ్‌ రైజర్‌..
సామాజిక అభివృద్ధి దిశగా కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు ప్రధానంగా ఎదురయ్యే సమస్య.. నిధులు. దాంతో ఫండ్‌ రైజర్స్‌ పాత్ర కీలకంగా మారుతోంది. తమ సంస్థ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇతర వ్యాపార సంస్థలకు,వ్యక్తులకు వివరించి..వారి నుంచి నిధులు సమీకరించే బాధ్యతలను ఫండ్‌ రైజర్‌ నిర్వర్తిస్తుంటారు.

మానిటరింగ్‌/ఎవాల్యుయేషన్‌ ఆఫీసర్‌..
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను నిరంతరం సమీక్షించడం, వాటికి సంబంధించిన నివేదికలను సంస్థ ఉన్నతా ధికారులకు అందించడం వీరి ప్రధాన విధులు.


రీసెర్చర్‌..
సంస్థలో ఉన్నత స్థాయిలో కీలకమైన హోదా.. రీసెర్చర్‌. నిర్ణీత ప్రాంతంలో ఏదైనా విభాగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే.. అక్కడి వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడం.. నిర్దిష్టంగా ప్రణాళికలు రూపొందించడం.. లక్షిత వర్గాలను గుర్తించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సోషల్‌ వర్క్, సోషియాలజీలలో మాస్టర్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి సంస్థలు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. నెలకు సగటున రూ.35 వేల వరకు వేతనం లభిస్తుంది.


ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌..
ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి సంస్థ ప్రధాన కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ.. వారు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, కార్యక్రమం అమలుపై ప్రోగ్రామ్‌ డైరెక్టర్స్‌ దిశా నిర్దేశం చేస్తారు. వీరికి ప్రోగ్రామ్‌ ఆఫీసర్, ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ సహకరిస్తుంటారు. ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌కు సంస్థ స్థాయిని బట్టి నెలకు రూ.50వేల వరకు... ప్రోగ్రామ్‌ ఆఫీసర్, ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్లకు రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం లభిస్తోంది. ఈ హోదాల్లోనూ సోషల్‌ వర్క్, సోషియాలజీలో నిపుణులకే సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి.
 
చ‌ద‌వండి: Career Opportunities: సైబర్‌ సెక్యూరిటీ.. భవితకు భరోసా!

అకడమిక్‌ నైపుణ్యాలు..
సోషల్‌ సెక్టార్‌లో పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను అకడమిక్‌గానే సొంతం చేసుకునేందుకు ప్రస్తుతం పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అన్ని యూనివర్సిటీలు, ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాచిలర్,పీజీ,పీహెచ్‌డీ స్థాయిలో సోషల్‌ వర్క్, సోషల్‌ సైన్స్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి.

సోషల్‌ వర్క్‌ కోర్సులు.. ఇన్‌స్టిట్యూట్స్‌..
 • టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌
 • ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ
 • ఎం.ఎస్‌.యూనివర్సిటీ బరోడా
 • మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌
 • శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
 • ఆంధ్రా యూనివర్సిటీ
 • దేవి అహల్య విశ్వవిద్యాలయం
 • బెనారస్‌ హిందూ యూనివర్సిటీ
 • అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ.

అవసరమైన నైపుణ్యాలు..
 • సోషియాలజీ, సోషల్‌ వర్క్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
 • ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు రూపొందించే నైపుణ్యం.
 • ప్రాజెక్ట్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించే స్కిల్‌.
 • రిపోర్ట్‌ రైటింగ్‌ అండ్‌ ప్రజెంటేషన్‌ నైపుణ్యాలు.

వ్యక్తిగత లక్షణాలు..
 • ఇంటర్‌ కల్చరల్‌ స్కిల్స్‌.
 • ప్రజలతో మమేకం అయ్యే నేర్పు.
 • ఎదుటి వారిని ఒప్పించే విధంగా వ్యవహరించడం.
 • పని వేళల పరిమితి లేకుండా పని చేయగల ఓర్పు.
 • లైజనింగ్‌ స్కిల్స్‌.

సేవ, సంతృప్తి, ఆదాయం..
సోషల్‌ సెక్టార్‌లో అడుగుపెట్టడం వల్ల మంచి కెరీర్‌ సొంతమవుతుంది. అంతేకాకుండా సామాజిక సేవకు దోహద పడుతున్నామనే సంతృప్తి, సామాజిక ప్రగతిలో పాల్పంచుకుంటున్నామనే సానుకూల భావన కలుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు మొదలు కార్పొరేట్‌ సంస్థల్లో సైతం ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. యువత మూస ధోరణికి భిన్నంగా..విశాల దృక్పథంతో ఆలోచిస్తే సామాజిక రంగంలో ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. సోషల్‌ సెక్టార్‌లో వేతనాలు తక్కువ అనే అభిప్రాయం సరికాదు. ఇప్పుడు పలు సంస్థలు ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి.

– షహీన్‌ మిస్త్రీ, సీఈఓ, టీచ్‌ ఫర్‌ ఇండియా


చ‌ద‌వండి: Tech Skills: జావాస్క్రిప్ట్‌.. అవకాశాల జోరు!

Published date : 04 Feb 2022 03:04PM

Photo Stories