Wipro Elite Test: ఇంజనీరింగ్ విద్యార్థులకు చక్కటి అవకాశం.. రూ.3.5 లక్షల ప్యాకేజీ
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో.. బీఈ/బీటెక్ అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ఎలైట్ పేరుతో అర్హత పరీక్షలు నిర్వహించి.. ఎంపికైన వారికి రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగావకాశాలను కల్పించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు విప్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి.ఇంజనీరింగ్ విద్యార్థుల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకునేందుకు విప్రో సంస్థ నిర్వహిస్తున్న పరీక్ష.. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్(ఎన్‌టీహెచ్). ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ పూర్తిచేసిన అత్యంత ప్రతిభావంతులను విప్రో ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. అలా ఎంపికైన వారిని ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదాతో సంస్థలో విధుల్లోకి తీసుకుంటారు.
వేతనం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.3.5లక్షల వరకు అందుతుంది. అలాగే ఈ విధానంలో విప్రోలో ప్రవేశం పొందిన వారు ఏడాది పాటు సంస్థలో పనిచేయడం తప్పనిసరి. ఇందుకోసం రూ.75 వేలు విలువ చేసే అగ్రిమెంట్ బాండ్ రాసి ఇవ్వాలి. నిర్ణీత కాలం పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఏటా ఇంక్రిమెంట్లు, బోనస్ లభిస్తాయి.
After BTech: బీటెక్ తర్వాత ఉన్నత విద్యా లేక ఉద్యోగమా.. మీ దారెటు?
అర్హతలు
టెన్త్, ఇంటర్మీడియట్ స్థాయిలో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. అలాగే బీఈ/బీటెక్/ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులు తప్పనిసరి. 2021, 2022లో అర్హత కోర్సులు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదివిన వారు మినహయించి.. మిగతా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల వారికి అవకాశం ఉంది. పదోతరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకూ.. అకడమిక్ గ్యాప్ మూడేళ్లకు మించరాదు. దూరవిద్య, పార్ట్‌టైమ్ విధానంలో పదోతరగతి/ఇంటర్మీడియట్ చదివిన వారికి అవకాశం లేదు. అసెస్‌మెంట్ స్టేజ్ సమయానికి ఒక బ్యాక్‌లాగ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఉద్యోగంలో చేరే సమయం నాటికి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- గత ఆరు నెలల్లో విప్రో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న వారికి దరఖాస్తుకు అవకాశంలేదు.
ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను 128 నిమిషాల కాలవ్యవధితో 3 సెక్షన్‌లుగా నిర్వహిస్తారు. అప్టిట్యూడ్, రిటెన్ కమ్యూనికేషన్, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి టెక్నికల్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండింటిలో చూపిన ప్రతిభ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు.
విభాగాల వారీగా
- అప్టిట్యూడ్: ఈ విభాగంలో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ (వెర్బల్) ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 48 నిమిషాలు.
- రిటెన్ కమ్యూనికేషన్: ఈ విభాగానికి సంబంధించి ఎస్సే రైటింగ్ రాయాల్సి ఉంటుంది. దీనికి 20 నిమిషాల సమయం కేటాయిస్తారు.
- ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్: 2 ప్రోగ్రామ్‌లకు కోడ్ రాయాలి. ఇందుకోసం జావా, సీ, సీ++, పైథాన్ వీటిలో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. సమయం 60 నిమిషాలు ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 22.05. 2022
- ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలు: మే 21–జూన్ 5, 2022
- వెబ్‌సైట్: https://careers.wipro.com/elite
Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!